Jun 4, 2018


 ఇంటర్ మొదటి సంవత్సరం
కొత్త భాషా పాఠ్యపుస్తకాలు విడుదల

          సచివాలయం, జూన్ 4: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త భాషా పాఠ్యపుస్తకాలను ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం ఉదయం విడుదల చేశారు. ఆమె విడుదల చేసినవాటిలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాష పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది మొదటి సంవత్సరం చదివేవారి కోసం మాత్రమే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మొదటి ఏడాది భాషా పాఠ్యపుస్తకాలలో సిలబస్ ని పూర్తిగా మార్చినట్లు తెలిపారు. నైతిక విలువలు, ప్రవర్తన, పర్యావరణంకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండవ సంవత్సరం చదివేవారి సిలబస్ ఏమీ మార్చలేదని, ఇప్పుడు మొదటి సంవత్సరం చదివేరు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు వారి సిలబస్ మారుతుందని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు నీట్, జేఈఈ, సీఏ వంటి ఎంట్రన్స్ పరీక్షలకు, బ్యాంకింగ్, ఎల్ఐసీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా సిలబ్ లో మార్పులు, చేర్పులు చేశామని, కొన్ని చాప్టర్లలో అదనంగా చేర్చామని, కొన్ని కొత్త చాప్టర్లు చేర్చామని చెప్పారు. బయట ప్రపంచంతో పోటీపడేవిధంగా, వారిలో కమ్మూనికేషన్ స్కిల్, అవగాహనా శక్తి పెంచేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కావలసిన రీతిలో  సిలబస్ రివ్యూ కమిటీ, కరికులం అప్ గ్రేట్ కమిటీ సూచనల మేరకు సమకాలీన పరిస్థితులకు కావలసి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్ రూపొందించినట్లు తెలిపారు. అధ్యాపకులు అందరూ ఆయా సబ్జక్టులలో మాస్టర్ డిగ్రీలు, పీహెచ్ డీలు చేసినవారని కొత్త సిలబస్ బోధించడంలో ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పారు.  అవసరమైతే కొత్త సిలబస్ కు సంబంధించి  వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు.  జేఈఈకి ఎంకికైనవారిలో 30 వేల మంది ఏపీ విద్యార్థులే ఉన్నారని, 1,2 ర్యాంకులు మన విద్యార్థులకే వచ్చాయని చెప్పారు.
కొత్తగా చేరే విద్యార్థులందరికీ సరిపడ పుస్తకాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బయట మార్కెట్ లో కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటు పబ్లిషర్లు ఇంటర్ బోర్డుకు రాయల్టీ చెల్లించి, వారు కూడా ప్రింట్ చేసి అమ్ముతారని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉచితంగా ఇచ్చే పుస్తకాలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఆన్ లైన్ చదువుకునేవారికి ఈ బుక్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 5 నుంచి 5.5 లక్షల మంది విద్యార్థుల చేరే అవకాశం ఉంటుదని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన 300 కాలేజీలను గత ఏడాది రద్దు చేసినట్లు తెలిపారు. కొన్ని కాలేజీలకు పెనాల్టీలు విధించినట్లు చెప్పారు. నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన కాలేజీలకు అనుమతిస్తామన్నారు.

ఆత్మహత్యల నివారణకు చర్యలు
          ఇంటర్ కాలేజీ, హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి విచారణ జరపడానికి ప్రభుత్వం నీరదా రెడ్డి, చక్రపాణి కమిటీలను నియమించిందని, వారు నివేదికలు ఇచ్చారని, వారి సూచనలు, సలహాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాలేజీలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, మధ్య మధ్యలో వారికి కొద్దిసేపు విరామ సమయం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. హాస్టల్స్ లో టీవీలు ఏర్పాటు చేయమని, తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఫోన్ అందుబాటులో ఉంచాలని, విద్యార్థులు ఫోన్ కోసం క్యూలో నిలబడకుండా ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే మానసిక శాస్త్రం అధ్యయనం చేసిన వారిని నియమించాలని ఆదేశించినట్లు చెప్పారు. రామచంద్రా మిషన్ వారు విద్యార్థుల వత్తిడి తగ్గడానికి మెడిటేషన్ లో శిక్షణ ఇస్తున్నారని, గత ఏడాది 52 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వారు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తే తరువాత విద్యార్థులే తమంతటతాము చేసుకుంటారన్నారు. మెడిటేషన్ లో శిక్షణ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సారి ఎక్కువ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రామచంద్రా మిషన్ వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారన్నారు. కొలకలూరులోని వారి శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపాల్స్ కు, టీచర్లకు కూడా శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. వారి శిక్షణ వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెరిగే అవకాశం ఉంటుందని ఉదయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఆర్టీడబ్లు ప్రొఫెసర్ పి.మురళీధర్, ఇతర అధికారులు సీఓఈ వి.రమేష్, జాయింట్ సెక్రటరీలు పీవీ సుబ్బారెడ్డి, గోపాల్ రెడ్డి, ఇతర అధికారులు సికిందర్, బి.వేదవతి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...