Jun 21, 2018


భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ
              సచివాలయం, జూన్ 21: రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములు, 22, భూధార్ వంటి భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) అనిల్ చంద్ర పునేఠ 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లను, ఆర్డీఓలను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు ఆర్డీఓలతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్కల భూముల, 22ఏ భూములకు సంబంధించి వచ్చిన దరకాస్తులను చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. ఆ తరువాత కూడా ఈ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి మండలంలో రెవెన్యూ సమీక్షలు నిర్వహించాలన్నారు.  ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ప్రచారం చేయడానికి, గ్రామసభలు నిర్వహించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు.   రెవెన్యూ శాఖలో నిన్ననే 138 మందికి ప్రమోషన్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ప్రమోషన్లు పొందిన సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29వేల దరకాస్తులు ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఆయా జిల్లాల అధికారులు ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. కొందరు రెండు నెలలు, కొందరు జూలై 31, ఇంకొందరు జూలై 15లోపల పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే లైన్ల నిర్మాణానికి, జాతీయ రహదారులు, అనంతపురం-అమరావతి హైవే నిర్మాణానికి భూమిని త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రతి వారం జరిగే సమీక్షా సమావేశాలకు హాజరైతే సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
భూ సమస్యల పరిష్కార కార్యక్రమానికి అపూర్వ స్పందన
            భూ సమస్యల పరిష్కారానికి గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి తహశీల్డార్, స్పెషల్ ఆఫీసర్, సర్వేయర్, వీఆర్ఓ, ఆర్ఐలతో కమిటీలు నియమించినట్లు, వారికి తగిన శిక్షణ కూడా ఇచ్చినట్లు వివరించారు. లక్షల సంఖ్యలో కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆడియో, వీడియో క్లిప్పింగ్ లు, ఫ్లెక్సీలు, మీడియా ద్వారా కూడా భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సభలలో ఏఏ సమస్యలు పరిష్కరించేది, ఏఏ సమస్యలు పరిష్కరించినది పూర్తి వివరాలతో మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల  వద్ద బోర్డులు ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా తెలిపామన్నారు. కొన్ని గ్రామ సభలలో స్పీకర్, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నట్లు చెప్పారు.  గ్రామ సభలకు వెళ్లే కమిటీ సభ్యులు ఆయా గ్రామ రికార్డులు, మ్యాప్ లు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. అవకాశం ఉన్నచోట్లకు మొబైల్ మీ సేవా కేంద్రాలను కూడా తరలిస్తున్నట్లు చెప్పారు.  వచ్చిన దరకాస్తులలో అవకాశం ఉన్నవాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. మొబైల్ మీ సేవ ద్వారా అడంగల్ వంటి వాటిలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని గతంలో ఇచ్చిన సమస్యలకు సంబంధించినవే ఉన్నట్లు చెప్పారు. దరకాస్తులను అనుమతించేది, లేనిది అక్కడికక్కడే చెబుతున్నామన్నారు. కొన్నిటి రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో చుక్కల భూముల సమస్యలు ఎక్కువగా ఉంటే, మరి కొన్ని జిల్లాల్లో 22ఏ భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని అంశాలను కంప్యూటర్ లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు.  నాలుగు ఏళ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు రైతులు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు.

                  మొదటి రోజు 20వ తేదీ  శ్రీకాకుళం జిల్లాలో 131 గ్రామ సభలు, విజయనగరం జిల్లాలో 101, తూర్పుగోదావరి జిల్లాలో 168, పశ్చిమగోదావరి జిల్లాలో 103, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 133, కడపలో 69, అనంతపురం జిల్లాలో 97, కర్నూలులో 99 గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.  చిత్తూరు జిల్లాలో 279 దరకాస్తులు, విశాఖ జిల్లాలో 54 దరకాస్తులు, చిత్తూరు జిల్లాలో 59 దరకాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 14 వేల చుక్కల భూములు ఉన్నట్లు, వాటిలో 300 పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలినవి రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కడప జిల్లాలో జేకేసీ భూముల సమస్య ఉన్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వ్యక్తిగతంగా సాగు చేసుకునేవారి వారసులకు పట్టాలు ఇస్తామన్నారు.
నూతన సాఫ్ట్ వేర్
ప్రజలు ఇచ్చిన దరకాస్తులను అధిక సంఖ్యలో ఆమోదించడం లేక తిరస్కరించడం చేయడానికి వీలుగా కొత్త సాఫ్ట్ వేర్ ని ఈ రోజు నుంచే ప్రవేశపెట్టినట్లు సాంకేతిక విభాగానికి చెందిన నవ్య చెప్పారు. దీనిని కలెక్టర్ లాగిన్ అవ్వాలన్నారు. అది పని చేసే విధానం, అందులో ఉన్న ఆప్షన్స్ గురించి వివరిస్తూ అందరికీ వాట్సప్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ దగ్గరగా ఉన్న విజయవాడ, గుంటూరు, ఏలూరు వంటి చోట్లకు వెళ్లి సాంకేతికంగా అక్కడివారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు వారికి వివరించాలని ఆదేశించారు.
అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో  సర్వే పూర్తి అయిందని వివరించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వాటిలో ఈ హైవే కూడా ఉందని, ఆ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో భూధార్ 80 శాతం పూర్తి
కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన భూధార పని దాదాపు 80 శాతం పూర్తి అయినట్లు సంబంధిత అధికారి చెప్పారు. వెబ్ ల్యాండ్ డేటాని భూధార్ లో నింపడానికి చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వారం లోపల అన్ని మండలాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జులై 1 నుంచి అన్ని మండలాల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దీనికి సంబంధించి డీఐఓలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

ఏపీఐఐసీకి సంబంధించి ఈ నెల 25వ తేదీ సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ చెప్పారు. ఆ రోజు కియా మోటార్స్ అంశం చర్చిస్తామన్నారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారులకు భూసేకరణ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా అనిల్ చంద్ర పునేఠ సమీక్షించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...