Jun 1, 2018


ఎవరు ఎక్కడ ఉన్నా ఉదయం 9 గంటలకు దీక్ష
జన్మభూమి కోసం పురంకితం కావాలని సీఎం చంద్రబాబు పిలుపు

కేంద్రం సహకారం  అందించకపోయినా అభివృద్ధి పనులు ఆగవు
7 రోజుల పాటు అభివృద్ధిపై సమీక్ష, చర్చ

           సచివాలయం, జూన్ 1: రాష్ట్ర ప్రజలు ఎవరు ఎక్కడ ఉన్నా జూన్ 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు నవనిర్మాణ దీక్ష చేపట్టాలని, జన్మభూమి కోసం పురంకితం కావాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని, నవ్యాంధ్రప్రదేశ్ జూన్ 2న ఏర్పడినా ఆ రోజుని ఉత్సాహంగా జరుపుకోలేమని అన్నారు. అలా అని బాధపడి ప్రయోజనం లేదన్నారు. మహా సంకల్పంతో, కసితో 5 కోట్ల మంది ఆంధ్రులు కలిసి మహాసంకల్సంతో నవనిర్మాణ దీక్ష చేపట్టాలని చెప్పారు. పుట్టిన గడ్డ, తెలుగు జాతి, భావితరాల భవిష్యత్ కోసం పునరంకితమై ముందుకు సాగాలన్నారు. రాష్ట్రం ఏర్పడి రేపటికి 4 ఏళ్లు పూర్తి అవుతుందని, 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు సమీక్షించుకోవాలని, అందుకే ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

       మొదటిరోజైన జూన్ 2న నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయాలన్నారు.  ఏపి పునర్వవస్థీకరణ చట్టం, పార్లమెంట్ హామీలు అమలు తీరుపై చర్చించాలని చెప్పారు. జూన్ 3న నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం, తాగునీరు-సాగునీరు-పారిశ్రామిక నీరు-పోలవరం-ప్రాధాన్య ప్రాజెక్టులు-జలవనరులపై చర్చించాలని చెప్పారు.  4వ తేదీన రైతు సంక్షేమం-ఆహార భద్రత, వ్యవసాయ, అనుబంధ రంగాలు-పౌరసరఫరాలపై చర్చించాలన్నరు.  5న సంక్షేమం-సాధికారత, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, వర్చువల్ క్లాసులు, ఫైబర్ గ్రిడ్,   వైద్య, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసంపై చర్చించాలని చెప్పారు. 6న జ్ఞానభూమి-ఉపాధి కల్పన, పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించాలన్నారు.  7న మౌలిక సదుపాయాలు-మెరుగైన జీవనం, అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. 8వ తేదీన మహా సంకల్పం, సుపరిపాలన-అవినీతి రహితపాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌, ఈ-ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌరసేవలు, సుస్థిర వృద్ధి, విజన్‌ పై చర్చలు నిర్వహించాలన్నారు. అనంతరం మహా సంకల్పం తీసుకోవాలని, ఉత్తమ సేవలు అందించినవారిని సత్కరించాలని చెప్పారు. నాలుగేళ్ల ప్రగతిపై విశ్లేషణ, అభివృద్ధి, సంక్షేమంపై అధ్యయనం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఈ వారం రోజులు అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించాలని చెప్పారు. ఈ వారం రోజులూ అందరూ ఇవే విషయాలు మాట్లాడాలన్నారు. అవతలివారు ఆశ్చర్యం, అసూయపడేవిధంగా మనం అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనేక అంశాల్లో రాష్ట్రం 1, 2 స్థానాల్లో ఉందని తెలిపారు. కేంద్రం సహాయం చేసి ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్లి ఉండేవారమన్నారు.

        విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆనాడు బీజేపీ కూడా పార్లమెంటులో గట్టిగా అడిగిందని, ఆ విధంగా  నమ్మకాన్ని ఇచ్చిన బిజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అయితే ఆ పార్టీ నమ్మకం ద్రోహం చేసిందన్నారు. కేంద్రం సహాయ సహకారాలు అందించకపోయినా అభివృద్ధి పనులు ఆగవన్నారు. నిలదీస్తే కుట్రలు చేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ద్రోహం చేశారని విమర్శించారు. గ్రామీణ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అననుకూల వాతావరణంలో కూడా ఉద్యోగులు బాగా పని చేసి ఫలితాలను సాధించారని చెప్పారు. పార్టీ నాయకులు కూడా అంకితభావంతో పని చేశారన్నారు. అభివృద్ధిపై  ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా కూడా స్పందించాలని హితవు పలికారు.

               కేంద్రాన్ని వదిలిపెట్టం అని, ధర్మపోరాటం, న్యాయపోరాలం చేస్తామన్నారు. ప్రజలు కూడా పరిస్థితులను గమనించాలని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ కు కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, ఏడిబీ ఇచ్చిన డబ్బుతోనే పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో అవినీతి తగ్గిందని చెప్పారు. జాతీయ రాజకీయాలు తనకు కొత్తకాదని, 1984 నుంచి ఆ రాజకీయాలతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. 1994,95లో థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉంటుదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఎంతో అనుభవం గఢించిన తాను హుందాగా వ్యవహరిస్తానని చెప్పారు. ఈ సారి బీజేసీకి రాదని, ప్రాంతీయ పార్టీలకు అవకాశం వస్తుందన్నారు. నాయకుడు సరిగాలేకపోతే ప్రజలకు వరిగేది ఏమీ ఉండదన్నారు. అపార్ధాలకు తావివ్వకూడదని చెప్పారు. అందరూ కలిసి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. తాను ఎవరికీ పోటీదారుని కాదని చెప్పారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మమత బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ అందరితో బాగుంటానని వివరించారు. నరేంద్ర మోదీతో గానీ, సోనియా గాంధీతోగానీ తనకు వ్యక్తిగత వైరం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ సైనికునిలా పని చేస్తానని చెప్పారు. తనకు గాని, తమ పార్టీకి గాని పదవులు ముఖ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ప్లానింగ్ విభాగం కార్యదర్శి వై. మధుసూధన రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...