Jun 1, 2018


జూన్ 2న వ్యవసాయ సదస్సు సందర్భంగా
ప్రకృతి  వ్యవసాయంపై ప్రభుత్వ దృష్టి
నేడు లక్ష్యాలు ప్రకటించనున్న సీఎం చంద్రబాబు

Ø నాగార్జునా విశ్వవిద్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు
Ø పరస్పరం రైతుల అనుభవాలు వెల్లడి
Ø ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ - రైతులకు లాభాల పంట
Ø ఖర్చు రూపాయి, ఆదాయం 13 రూపాయలు
Ø వినియోగదారులకు రసాయన రహిత ఆహారం అందించే వ్యవసాయం
Ø 2018-19లో 3 వేల గ్రామాల్లో 1.25 లక్షల హెక్టార్లలో సాగు లక్ష్యం

               వాతావరణ కాలుష్యం తగ్గించి, భూసారం పరిరక్షించి, అటు ప్రజలకు ఇటు రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రకృతి  వ్యవసాయసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రోజురోజుకు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో పక్క రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం క్షీణిస్తోంది. వాతావరణం, నీరుతోపాటు ఆహార ఉత్పత్తులు పురుగుల మందులు, రసాయనాలతో కలుషితమవుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు విషపూరితమైన,  క్రిమి సంహారక మందులు విపరీతంగా చల్లిన ఆహార పదార్ధాలను తింటూ రోగాల బారిన పడుతున్నారు.  ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగిస్తే  పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాసులు అంతరించిపోతున్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ పోతే వచ్చే 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది.  ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ప్రపంచానికి మనుగడ ఉండదు.  2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలో పర్యావరణ పరిరక్షణకు, కలుషితంకాని పౌష్టికాహారం అందించడానికి, రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల సంక్షేమాన్ని దృష్టిపెట్టుకొని తక్కువ వ్యవసాయ ఖర్చులు, ఎక్కువ దిగుబడులు సాధించే జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం(జడ్ బీఎన్ఎఫ్)పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని రైతులు  ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం  పెద్దఎత్తున జడ్ బీఎన్ఎఫ్ కార్యక్రమం చేపట్టింది.  
             రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో దీనిని ప్రవేశపెట్టారు.  2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టారు. రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయం గణనీయంగా విస్తరించింది. 2018 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో 2018ని ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.   జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్  భారత దేశంలో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. 2016 నుంచి  ఆయన రాష్ట్రంలో మూడు సార్లు భారీస్థాయిలో రైతు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. 20వేల మందికి పైగా రైతులకు శిక్షణ ఇచ్చారు. అనేక వేల మంది రైతులు ఈ విధానాన్ని అనుసరించడానికి  ప్రేరణ కలిగించారు. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయంలో చేయడంలో దేశంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
            ఈ విధానంలో వ్యవసాయ ఖర్చులు తక్కువ. రసాయన ఎరువుల వాడకం తక్కువ. భూసారాన్ని పెంచుతుంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతుంది. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా అధికోత్పత్తులు సాధించవచ్చు. వివిధ రకాల పంటల ద్వారా ప్రతికూల వాతావరణాలను తట్టుకుంటుంది. ఒక నెల రోజులపాటు వర్షాలు కురవకపోయినా ఈ వ్యవసాయ పద్దతిలో పంటలకు నష్టం ఉండదు. ఈ విధానంలో రైతు రూపాయి ఖర్చు పెడితే  13 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.  వీటన్నిని దృష్టిలో పెట్టుకొని 2018-19లో మూడు వేల గ్రామాల్లో 5 లక్షల మంది రైతుల చేత 1.25 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్ కెవీవై), పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) పథకాల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తారు. ఈ కార్యక్రమానికి రూ.1250 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన అజీం ప్రేమ్ జీ ఫిలాంథ్రోపిక్ ఇనిషియేటివ్స్ (ఏపీపీఐ) సంస్థ రైతు సాధికార సంస్థకు సహకరించడానికి ముందుకు వచ్చింది. సాంకేతిక సహాకార కేంద్రం ఏర్పాటుకు రూ.100 కోట్ల సహాయం అందించనుంది. భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పద్దతిని ప్రవేశపెడతారు.

నేడు ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల ప్రకటన
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఎదురుగా బైబిల్ గ్రౌండ్స్ లో  జూన్ 2వ తేదీ శనివారం జరిగే ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 నాటికి ప్రకృతి వ్యవసాయ లక్ష్యాలను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సస్టెయినబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీ(ఎస్ఐఎఫ్ఎఫ్) మధ్య ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక ఒప్పందం(ఎంఓయు)పై సంతకాలు చేస్తారు. 2024 నాటికి 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి, 80 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ సాగు పద్దతులను అవలంబించడానికి  ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 నాటికి రాష్ట్రమంతటా ఈ పద్దతిని అవలంభించేట్లు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
              ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డితోపాటు విదేశీ అతిధులు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎరిక్ సోల్హెమ్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నాచుర్ అంతర్జాతీయ అధ్యక్షుడు పవన్ సుఖ్ దేవ్, సమ్మిళిత అభివృద్ధి ప్రపంచ వ్యాపార మండలి (శాశ్విత అభివృద్ధి) అధ్యక్షులు  సన్నీ వర్గీస్ తోపాటు దేశవిదేశాలకు చెందిన వ్యవసాయం, ఆర్థిక రంగ నిపుణులు  హాజరవుతారు. ప్రకృతి వ్యవసాయం, ఆహారభద్రత, పచ్చదనం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రసంగిస్తారు.   ప్రకృతి వ్యవసాయంలో అనుభవం గడించిన 8 వేల మంది రైతులు హాజరవుతారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 వరకు జరిగే ఈ సదస్సులో ఉత్తమ రైతులు తమతమ అనుభవాలను తెలియజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారు. ప్రముఖులతోనూ, రైతులతోనూ ఆయన మాట్లాడతారు. 2.05 గంటలకు ఆయన ప్రసంగిస్తారు.

అనుభవాలు వివరించిన రైతులు
ప్రకృతి వ్యవసాయదారుల సదస్సు సందర్భంగా నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు సందర్భంగా శుక్రవారం రైతుల చర్చా వేదిక నిర్వహించారు. వివిధ పంటల ద్వారా గడించిన అనుభవాలను రైతులు తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు టి. విజయకుమార్ కు పంటలు, దిగుబడుల వివరాలు చెప్పారు. సాగులో వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జీడిపప్పు అధిక దిగుబడి రావడం ద్వారా ఆదాయం పెరిగినట్లు గిరిజన రైతులు చెప్పారు. అన్నపూర్ణ నమూనాలపై పరి నాయుడు, గిరిలక్ష్మి నమూనాలపై కృష్ణారావు, అయిదు పొరల నమూనాలపై అవినాష్, దేశీయ విత్తనాల గురించి దేవుళ్లు, వాసన్, రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంపై డి.వి.రాయుడు ప్రసంగించారు. చంద్రశేఖర్, ప్రభాకర్ లు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జీ.మురళీధర్ 2018 ఐ-సీఆర్ పీలు, సీఆర్పీలు, ఎన్ఎఫ్ఎఫ్ ల అజెండాలు తెలిపారు. రైతులు ఖరీఫ్ లో మిశ్రమ పంటల గురించి, తమ అనుభవాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. ఖరీఫ్ తరువాత తీసుకోవలసిన చర్యల గురించి రైతులు చర్చించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులతో ప్రాంగణంలో పండుగ వాతావరణ నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.   ఎన్ బీఎన్ఎఫ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...