Jul 10, 2017

సీఆర్డీఏ పరిధిలో పాత లేఅవుట్లకు 25లోపల అనుమతి


మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం

Ø మంత్రి మండలి ఆమోదం తరువాత అమలు
Ø  ఉపసంఘం నిబంధనలు అంగీకరించిన రియల్టర్లు

          సచివాలయం, జూలై 10: ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) పరిధిలోని పాత లేఅవుట్ల సమస్యని మంత్రి మండలి ఉపసంఘం పరిష్కరించింది. మంత్రి మండలి ఉపసంఘం సచివాలయం 2వ బ్లాక్ లో సోమవారం మధ్యాహ్నం  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సీఆర్డీఏ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపరులతో సమావేశమైంది. గతంలో సీఆర్డీఏకు సమర్పించిన 99 లేఅవుట్లను కొన్ని నిబంధనలకు లోబడి అనుమతించాలని ఉపసంఘం నిర్ణయించింది. తమ సిఫారసులను  ఈ నెల 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో ఆమోదించిన  తరువాత ఈనెల 25వ తేదీ లోపల అనుమతులు ఇవ్వాలని అధికారులను ఉప సంఘం ఆదేశించించింది.  తమ లేఅవుట్లు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నందున తాము భారీగా నష్టపోయినట్లు రియల్టర్లు తెలిపారు. వాటిని ఆమోదించవలసిందిగా కోరారు. పాత లేఅవుట్లలో మాస్టర్ ప్లాన్ పరిధిలో 29, వెలుపల 77 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ లేఅవుట్లలో ఉపసంఘం నిర్ణయించిన నిబంధనలకు వ్యాపారులు ఆమోదం తెలిపారు. లేఅవుట్లో 40 శాతం స్థలం సీఆర్డీఏకి వదిలివేయడానికి, అవసరమైతే రోడ్ల విస్తరణకు మరికొంత స్థలం కూడా వదలడానికి, రోడ్ల విస్తరణలో కొన్నవారు ప్లాట్లు కోల్పేతే వారికి మరొకచోట్ల ప్లాట్ కేటాయించడానికి రియల్టర్లు అంగీకరించారు. మౌలిక సదుపాయల కల్పన నిమిత్తం నివాస ప్రాంతాలకు 500 మీటర్ల లోపలి లేఅవుట్లకు ఎకరానికి రూ.80 వేల రూపాయలు, అంతకు మించిన దూరంలో ఉంటే మరో 50 శాతం చెల్లించడానికి వారు ఆమోదం తెలిపారు. మంత్రి మండలి ఆమోదం తరువాత వారం రోజుల్లో లేఅవుట్లు మంజూరు చేస్తారని ఉపసంఘం తెలిపింది. దీర్ఘకాలంగా వారి సమస్య పెండింగ్ లో ఉన్నందున, నిబంధనలకు అంగీకరించినందున అధికారులు కూడా నిబంధనల ప్రకారం వారికి లేఅవుట్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, లోకేష్ బాబు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.

Jul 6, 2017

సమన్వయంతో పథకాలు విజయవంతం

ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్
Ø వనం-మనంపై ప్రత్యేక శ్రద్ధ
Ø బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
Ø పనితీరు ఆధారంగా శాఖలకు ర్యాంకులు
Ø ఖర్చులు తగ్గించుకునే చర్యలు

         సచివాలయం, జూలై 6: అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో వనం-మనం వంటి  ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్  ప్రిన్సిపల్ సెక్రటరీలను కోరారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రమంతా పచ్చదనం నింపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వనం-మనం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, హాస్టళ్లు, పంచాయతీ కార్యాలయాలు, హౌసింగ్ బోర్డు కాలనీలు వంటి చోట్ల, కాలువల గట్లు, చెరువుల గట్లు, రోడ్లకు ఇరువైపుల  వ్యవసాయ, హార్టీకల్చర్ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో విరివిగా మొక్కలు నాటాలన్నారు. నగర వనాలను రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ నర్సరీలను రెట్టింపు చేయాలని ఆదేశించారు.
      ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించేందుకు ప్రతి శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక కోఆర్డినేటర్ ను నియమించాలన్నారు. గుర్తించిన భూముల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమాలను  పర్యవేక్షించేందుకు ప్రతి శాఖ జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని చెప్పారుమండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాటే మొక్కల వివరాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక వెబ్ సైట్ లో నమోదు చేయాలన్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
          రాష్ట్రమంతటా అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఆచరణలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. అలాగే ఆన్ లైన్ ఫైలింగ్, -ఆఫీస్ విధానం అమలు చేసి, ఫైళ్లన పెండింగ్ లో ఉంచకుండా వేగంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పనితీరు, సాధించిన లక్ష్యాలు, పథకాల అమలుతీరు ... వంటి అంశాల ప్రాతిపదికగా ప్రతి శాఖకు ర్యాంకులు నిర్ణయించాలని చెప్పారు. అలాగే అధికారులు, సిబ్బంది పనితీరుని కూడా వివిధ అంశాల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించాలని ఆదేశించారు. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. కొన్ని శాఖల వెబ్ సైట్లు అప్ డేట్ చేయడంలేదని, వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులతో నెల నెలా వీడియో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును సమీక్షించాలని చెప్పారు. ఆ విధంగా ప్రభుత్వ సేవలను మెరుగుపరచాలన్నారు.  బాగా పని చేసినవారికి ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అన్ని శాఖల్లో అనవసర ఖర్చులు తగ్గించాలని, ఆర్థిక నియంత్రణను పాటించాలన్నారు.  ఈ సమావేశాలు ప్రతి నెలా క్రమంతప్పకుండా జరుగుతాయని దినేష్ కుమార్ చెప్పారు.
ఫిజికల్ ఓచర్లను తగ్గిస్తున్నట్లు, బిల్లులన్నీ 100 శాతం ఆన్ లైన్ లో చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ స్సెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.రవిచంద్ర చెప్పారు. ఖర్చులు తగ్గించుకునే కొన్ని మార్గాలను సూచించారు. రాబోయే 12 ఏళ్లలో రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం నింపేందుకు జల్లాల్లో జిల్లా కలెక్టర్లు కోఆర్డినేటర్లుగా  ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీ.అనంత రాము చెప్పారు. అన్ని శాఖల సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రతి శనివారం ప్రత్యేకంగా వనం-మనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెలలో ప్రతి నాలుగవ శనివారం ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
         ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజ్ పాణిగ్రహిస్పెషల్ చీఫ్ సెక్రటరీలు  కె.ఎస్. జవహర్ రెడ్డి, డాక్టర్ డి. సాంబశివరావు, బుదితి రాజశేఖర్, .ఆర్. అనురాధ, కార్యదర్శులు నాగులాపల్లి శ్రీకాంత్, శశిభూషణ్ కుమార్కె.సునీత, కమిషనర్లు రామాంజనేయులు, బి.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Jul 5, 2017

పారిశ్రామిక పార్కులకు మౌలికసదుపాయాల కల్పన


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశం
సచివాలయం, జూలై 5: పరిశ్రమలకు, పారిశ్రామిక పార్కులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇరిగేషన్, సీఆర్డీఏ, ఏపీఐసీసీ, ఏపీఐడీసీ, దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం, 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు
రోడ్లకు, వివిధ పరిశ్రమలకు పరిశ్రమలకు, పారిశ్రామిక పార్కులకు భూముల కేటాయింపు, భూ సేకరణ తదితర అంశలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడమే కాకుండా రోడ్లు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. వాటిని కల్పించినాడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, ఆవిధంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారుపరిశ్రమలకు అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని సీఎస్ చెప్పారు.
పరిశ్రమలకు భూ కేటాయింపు, రోడ్లకు భూ సేకరణ వివరాలు అధికారులు సీఎస్ కు వివరించారు. రూ.5,31,992 కోట్ల పెట్టుబడులతో 13,81,883 మందికి ఉపాధి కల్పించే 445 పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఒప్పొందాలు(ఎంఓయు) జరిగినట్లు తెలిపారు. వాటిలో కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించినట్లు, కొన్ని ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు, మరి కొన్ని నిర్మాణ, మిషనరీ బిగింపు దశలో ఉన్నట్లు, ఇంకొన్నిటికి భూములు కేటాయించవలసి ఉందని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, మైనర్,మీడియం,మేజర్ ఇరిగేష్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధఏపీఐడీసీ వైస్ చైర్మన్ సిద్ధార్థ జైన్, ఏపీ ఐఐసీ వైస్ చైర్మన్ బాబు., ఏపీ సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

సమాజానికి పునాది ప్రాధమిక విద్య


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సచివాలయం, జూలై 5: సమాజానికి పునాది ప్రాధమిక విద్య అని, దానిని మెరుగుపరచవలసిన అవసరం ఆ శాఖమై ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అన్నారు. సచివాలయం ఒకటవ బ్లాక్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన పాఠశాల విద్య సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యలేకుండా సమాజం అభివృద్ధి చెందదని, అందువల్ల విద్యా శాఖ చాలా కీలకమైందని, ఆ శాఖ అధికారులు బాధ్యతతో, అంకితభావంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్య పట్ల, ముఖ్యంగా ప్రాధమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని చెప్పారు. ప్రాధమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాల్లో డ్రాప్ అవుడ్ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ప్రాధమిక విద్యలో మంచి ఫలితాలు సాధించేందుకు, ఉపాధ్యాయుల బోధన మెరుగుపరిచేందుకు, ఉన్నత విద్యను అందించేందు శాస్త్రీయ పద్దతిలో  నెలవారీగా ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించుకొని కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని,  వచ్చే రెండేళ్లలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యా కేంద్రంగా విలసిల్లేట్లు చేయాలని సీఎస్ అన్నారు.
ఆధార్ నెంబర్ ఆధారంగా, సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు ఆ తరువాత ఏఏ కోర్సులలలో చేరుతున్నారో పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వారు రాష్ట్రంలో ఇంజనీరింగ్, వైద్య, ఎంబీఏ వంటి కాలేజీల్లో ఎంత మంది చేరుతున్నారో, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది  ఉన్నత చదువులకు వెళ్లడంలేదో సమగ్రంగా వివరాలు నమోదు చేయాలన్నారు. జూనియర్ కాలేజీల్లో బోధన మెరుగుపరిచి, మంచి ఫతిలు సాధించాలని ఆదేశించారు.
ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి నాక్, ఎంబిఏ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి ఎన్ బీఏ వంటి సంస్థలు ఉన్నాయని, ఇంటర్మీడియట్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి అటువంటి సంస్థ ఏదీ లేదని, వీటికి గుర్తింపు ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. మౌలిక వసతులు, ఇతర నిబంధనలు పాటించని 800 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు, 243 కాలేజీల గుర్తింపును రద్దు చేసినట్లు వివరించారు.
విద్యార్థుల ఆధార్ నెంబర్లను వారి పేర్లతో అనుసందానం చేస్తున్నట్లు అధికారుల తెలిపారు. గిరిజనులు, ముస్లింలలో డ్రాప్ అవుట్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు వారు చెప్పారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో గత సంవత్సరం ఎస్ఎస్ సీలో 96 శాతం, ఇంటర్ లో 97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విభాగం అధికారులు తెలిపారు.  ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ప్రాధమిక విద్యా శాఖ  కమిషనర్‌ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Jul 4, 2017

విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సచివాలయం, జూలై 4: జిల్లా స్థాయిలో డీఎఫ్ ఓలు సమన్వయ కర్తలుగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటి, సామాజిక వనాలను పెంచే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ లోని తన చాంబర్ లో మంగళవారం సాయంత్రం అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో నవంబర్ వరకు ప్లాంటేషన్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా  మొక్కలు నాటడం, వాటి భద్రత, పెంపకం, సామాజిక వనాలు పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)నిధులను సరైన రీతిలో వినియోగించుకొని 13 జిల్లాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రభుత సంస్థలు, పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థలు, రైతులు, పాఠశాలలు, గురుకుల విద్యార్థులు, స్వయంసహాయక బృందాల, స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలు పొందాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు, వీఏఓలు, వీఆర్ఓలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సీఎస్ దినేష్ కుమార్  చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎన్ని మొక్కలు నాటారో పూర్తి వివరాలు సేకరించాలన్నారు.
జూలై 1న రాష్ట్రా వ్యాప్తంగా 68వ వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి శనివారం ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నివాస కాలనీల్లో, పాఠశాలల్లో, దేవాదాయ శాఖ భూముల్లో, ప్రభుత్వానికి చెందిన బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, మొక్కల పెంపకంపై అవగాన కల్పించడానికి పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో నర్సరీలు పెంచుతున్నట్లు,అడవుల సంరక్షణపై సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వనం-మనం కార్యక్రమ నిర్వహణలో అటవీ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. జిల్లా యాక్షన్ ప్లాన్ ను అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లకు డీఎఫ్ఓలు సహకరిస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ఓ, జిల్లా సోషల్ ఫారెస్టరీ విభాగం ద్వారా విత్తనాలు చల్లడం, మొక్కల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కరపత్రాలు, బుక్ లెట్స్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వనం-మనం గ్రామస్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి కమిటీలు చురుకుగా పని చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ అందజేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 22.47 శాతం అటవీ ప్రాంతం ఉందని, పచ్చదనం నింపడానికి ఇంకా 25.84 శాతం ప్రాంతం అందుబాటులో ఉందని తెలిపారు.