Jul 6, 2017

సమన్వయంతో పథకాలు విజయవంతం

ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో సీఎస్ దినేష్ కుమార్
Ø వనం-మనంపై ప్రత్యేక శ్రద్ధ
Ø బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
Ø పనితీరు ఆధారంగా శాఖలకు ర్యాంకులు
Ø ఖర్చులు తగ్గించుకునే చర్యలు

         సచివాలయం, జూలై 6: అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో వనం-మనం వంటి  ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్  ప్రిన్సిపల్ సెక్రటరీలను కోరారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రమంతా పచ్చదనం నింపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వనం-మనం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలు, కాలేజీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, హాస్టళ్లు, పంచాయతీ కార్యాలయాలు, హౌసింగ్ బోర్డు కాలనీలు వంటి చోట్ల, కాలువల గట్లు, చెరువుల గట్లు, రోడ్లకు ఇరువైపుల  వ్యవసాయ, హార్టీకల్చర్ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో విరివిగా మొక్కలు నాటాలన్నారు. నగర వనాలను రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ నర్సరీలను రెట్టింపు చేయాలని ఆదేశించారు.
      ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించేందుకు ప్రతి శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక కోఆర్డినేటర్ ను నియమించాలన్నారు. గుర్తించిన భూముల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమాలను  పర్యవేక్షించేందుకు ప్రతి శాఖ జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని చెప్పారుమండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాటే మొక్కల వివరాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక వెబ్ సైట్ లో నమోదు చేయాలన్నారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
          రాష్ట్రమంతటా అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఆచరణలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించుకొని ఈ విధానాన్ని కొనసాగించాలని చెప్పారు. అలాగే ఆన్ లైన్ ఫైలింగ్, -ఆఫీస్ విధానం అమలు చేసి, ఫైళ్లన పెండింగ్ లో ఉంచకుండా వేగంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. పనితీరు, సాధించిన లక్ష్యాలు, పథకాల అమలుతీరు ... వంటి అంశాల ప్రాతిపదికగా ప్రతి శాఖకు ర్యాంకులు నిర్ణయించాలని చెప్పారు. అలాగే అధికారులు, సిబ్బంది పనితీరుని కూడా వివిధ అంశాల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించాలని ఆదేశించారు. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. కొన్ని శాఖల వెబ్ సైట్లు అప్ డేట్ చేయడంలేదని, వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులతో నెల నెలా వీడియో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును సమీక్షించాలని చెప్పారు. ఆ విధంగా ప్రభుత్వ సేవలను మెరుగుపరచాలన్నారు.  బాగా పని చేసినవారికి ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అన్ని శాఖల్లో అనవసర ఖర్చులు తగ్గించాలని, ఆర్థిక నియంత్రణను పాటించాలన్నారు.  ఈ సమావేశాలు ప్రతి నెలా క్రమంతప్పకుండా జరుగుతాయని దినేష్ కుమార్ చెప్పారు.
ఫిజికల్ ఓచర్లను తగ్గిస్తున్నట్లు, బిల్లులన్నీ 100 శాతం ఆన్ లైన్ లో చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ స్సెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.రవిచంద్ర చెప్పారు. ఖర్చులు తగ్గించుకునే కొన్ని మార్గాలను సూచించారు. రాబోయే 12 ఏళ్లలో రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం నింపేందుకు జల్లాల్లో జిల్లా కలెక్టర్లు కోఆర్డినేటర్లుగా  ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీ.అనంత రాము చెప్పారు. అన్ని శాఖల సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రతి శనివారం ప్రత్యేకంగా వనం-మనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెలలో ప్రతి నాలుగవ శనివారం ఏదో ఒక జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
         ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజ్ పాణిగ్రహిస్పెషల్ చీఫ్ సెక్రటరీలు  కె.ఎస్. జవహర్ రెడ్డి, డాక్టర్ డి. సాంబశివరావు, బుదితి రాజశేఖర్, .ఆర్. అనురాధ, కార్యదర్శులు నాగులాపల్లి శ్రీకాంత్, శశిభూషణ్ కుమార్కె.సునీత, కమిషనర్లు రామాంజనేయులు, బి.ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...