Jul 18, 2017

అవినీతి నిర్మూలనే సంతృప్తి


  • సంక్షేమశాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం
  • యువత స్థిరపడేందుకు కార్యాచరణ విధానం
  • సాయం కాదు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు
  • ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా వెయ్యి గ్రూపులకు రుణం
  • 352 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో విద్య
  • 3.3 లక్షల మంది కాపు విద్యార్ధులకు ఉపకార వేతనాలు
  •  పీపీపీ పద్ధతిలో వృద్ధాశ్రమాల నిర్మాణం       


 ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఎన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవినీతిని నిర్మూలించిన నాడే ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుందిఅందువల్ల ఎక్కడా అవినీతి జరగకుండా లబ్దిదారునికి వందశాతం ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థలో సాంకేతికతను విస్తృతస్థాయిలో వినియోగిస్తోంది.  అధికారులు-ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతోంది2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంతృప్తికరమైన రాష్ట్రం(హ్యాపీ స్టేట్‌)గా చేసేందుకు అవినీతి నిర్మూలనతోపాటు కుటుంబ వికాసం, సమాజ వికాసం, జీవీఏ(రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ), ముఖ్యమైన పనితీరు సూచిక, సమ్మిళిత వృద్ధి లక్ష్యాల సాధనే ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందిఅన్నిటా రాయితీలు కాకుండా ప్రజల  తల రాతలు మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడిన అందరినీ మిగిలినవారితో సమానంగా అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఉచిత పథకాలు, రాయితీలు సరిపోవు. ప్రతి ఒక్కరు కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయమైనా ఆర్జించేలా మార్గాలు రూపొందిస్తోంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా దళిత, గిరిజన ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసి వారికి చేయూతను ఇచ్చేందుకు సూక్ష్మ, విస్తృత స్థాయి ప్రణాళికలు అమలు చేయనుంది.  గత విద్యా సంవత్సరంలో 14,69,321 మంది ఎస్సీ విద్యార్ధులకు రూ. 3,031 కోట్ల ఉపకార వేతనాలు అందించింది.  జ్ఞానభుమి వెబ్‌సైట్‌ లో నమోదు చేసిన తరువాత విద్యార్ధులకు ప్రతి నెలా ఉపకార వేతనాలు అందే ఏర్పాటు చేస్తోందిజాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు తీసుకువెళ్లివారి విజయగాధలను విద్యార్ధులకు తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాపు, బ్రాహ్మణ కార్పోరేషన్‌లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సంక్షేమ పథకాలలో సారూప్యత తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉందియువత జీవితంలో స్థిరపడేలా అధికారులు, బ్యాంకర్లు కార్యాచరణ విధానం రూపొందించి అమలు చేయాలని, నెలనెలా నివేదికలు రూపొందించి లోపాలను సరిదిద్దే ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్పటివరకు ప్రభుత్వ సాయంతో యువత నెలకొల్పదలచిన స్వయం ఉపాధి యూనిట్లు వచ్చే ఆగస్ట్ 31 నాటికి వంద శాతం కార్యరూపం దాల్చాలని  లక్ష్యంగా  నిర్దేశించారు. ప్రభుత్వం అందించే సాయం వారికి జీవితాంతం ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారుస్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారి నైపుణ్యాలు గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించిన అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ బయోమెట్రిక్ విధానం తప్పనిసరి చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా అవకాశాలు కల్పించడంతో పాటు అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన కాపులు, బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాపులకు రూ. వెయ్యి కోట్లు, బ్రాహ్మణులకు రూ. 75 కోట్లు కేటాయించింది. గతేడాది 58,685 మంది కాపు యువతకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్ధిక సాయం చేయాలని లక్ష్యం పెట్టుకోగా, 52,776 మందికి సాయం అందించింది. అలాగే చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడే వారికి ఎంఎస్‌ఎంఈ పథకం కింద రూ. 250 కోట్లను కనీసం వెయ్యి గ్రూపులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గ్రూపులన్నీ ఈ నెలాఖరులోపల  యూనిట్లు నెలకొల్పనున్నాయి. 2016-17లో విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదివేందుకు 398 మంది కాపు విద్యార్దులు అర్హత సాధించగా, 352 మంది ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 34.30 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకానికి ఈ విద్యాసంవత్సరం మరింత స్పందన వచ్చింది510 మంది విద్యార్ధులు విదేశాల్లో చదివేందుకు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు సమర్పించారు.
సివిల్స్, బ్యాంకింగ్ సహా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇప్పించే విద్యోన్నతి పథకం కింద గతేడాది 5,796 మంది కాపు అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరంతా దాదాపు 50 ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కాపు యువతలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడంతో పాటు విజయవాడ, తిరుపతిలో జాబ్ మేళాలు నిర్వహించింది. ఇంటర్మీడియేట్ చదివే పేద కాపు విద్యార్ధులకు రూ. 6 వేలు, డిగ్రీ ఇంకా ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్లకు రూ. 10 వేల చొప్పున ఉపకార వేతనాలు ఇస్తోంది. గత విద్యా సంవత్సరం 3.3 లక్షల మంది కాపు విద్యార్ధులకు ఉపకార వేతనాల కోసం రూ. 238 కోట్లు కేటాయించింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకొక్కటి రూ. 5 కోట్ల వ్యయంతో కాపు భవనాలను  నిర్మిస్తోంది. కాకినాడ, ఏలూరు, కడప, తిరుపతి, నెల్లూరులో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తికాగా కర్నూలు, గుంటూరు, అనంతపురం, విజయనగరంలో భూమిని గుర్తించారు.    బ్రాహ్మణులకు విజయవాడలో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకును ప్రారంభించారు. అరుంధతి పేరుతో బ్రాహ్మణ మహిళా సంఘాలకు, వశిష్ట పేరుతో బ్రాహ్మణ పురుషుల సంఘాలకు రుణాలు అందిస్తున్నారు. కశ్యప ఆహార-ఆవాస పథకం కింద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 6,500 మంది వృద్ధులు, వితంతువులకు నెల నెలా రూ.1,000 చొప్పున బ్యాంక్ ఖాతాలలో బ్రాహ్మణ కార్పోరేషన్ జమ చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ. 7 కోట్లు వినియోగిస్తోంది
        వికలాంగులకు నెలనెలా రూ. 1,500 పింఛను ఇస్తున్న ప్రభుత్వం వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు సాయం చేస్తోంది. 5,500 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు ఇస్తోంది. వికలాంగుల కోసం విజయవాడలో ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, అంధుల కోసం కాకినాడ, అనంతపురంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీతో పాటు ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణంలో వారికి 3శాతం  రిజర్వేషన్ కల్పించాలని, 2,500 మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు ఈ ఏడాది పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తంమ్మీద వికలాంగుల సంక్షేమానికి ఈ ఏడాది రూ. 89.51 కోట్లు కేటాయించింది. అలాగే ఏ ఆదరణ లేని వయోవృద్ధుల కోసం విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో పీపీపీ పద్ధతిలో వృద్ధాశ్రమాలు నిర్మించనున్నారు

        విద్యార్ధులు, యువతలో నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరిచి ఉద్యోగ-ఉపాధి అవకాశాలను సుగుమం చేస్తోంది. 2016-17 సంవత్సరంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 1,51,311 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వగా, 36,940 మందికి ఉపాధి లభించింది. నైపుణ్యాభివృద్ధి పెంపు కార్యక్రమం కింద మొత్త 13 జిల్లాల్లో 47 జాబ్ మేళాలను నిర్వహించింది. 19 ఐటీఐలను వరల్డ్ బ్యాంక్ నిధులతో అభివృద్ధి పరుస్తోంది. మరో 31 ఐటీఐలను పీపీపీ పద్ధతిలో ఉన్నతీకరిస్తోంది. మైనారిటీ విద్యార్ధుల కోసం నరసరావుపేటలో ప్రత్యేకంగా ఒక ఐటీఐని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంకా మోడల్ ఆర్ఐటీఐలను ప్రత్తిపాడు, తిరుపతిలో ఎస్సీల కోసం, అచ్యుతాపురంలో ఎస్టీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపి  విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల్లో సంతృప్తి కనిపించేవిధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...