Jul 22, 2017

నిర్మాణ రంగంలో భారీ వృద్ధి రేటు


జీఎస్డీపీ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

Ø మొదటి త్రైమాసికం పారిశ్రామిక రంగంలో 11-12 శాతం వృద్ధిరేటుకు అవకాశం
Ø ఎంఎస్ఎంఈ రంగంపై అధ్యయనం
Ø వందకు పైగా కొత్త పరిశ్రమల స్థాపన
Ø టెక్స్ టైల్ రంగంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు
Ø సంతృప్తికరంగా వర్షపాతం
Ø తోళ్ల పరిశ్రమ విస్తరణపై చర్చ

సచివాలయం, జూలై 21: ఈ ఏడాది నిర్మాణ రంగంలో భారీ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన చాంబర్ లో ద్వితీయ రంగమైన పరిశ్రమలు, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)ని శుక్రవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ గృహ నిర్మాణాలతోపాటు ప్రైవేటు రంగంలో గృహ, ఇతర నిర్మాణాలు బాగా జరిగే అవకాశం ఉందన్నారు. ఆ విధంగా ఈ రంగంలో భారీ వృద్ధిరేటు నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ గృహనిర్మాణ పథకం పనులు చురుకుగా సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లో 52 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు.   ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగం క్షీణదశలో ఉందని, జాతీయ స్థాయిలో కూడా వృద్ధి రేటు అంత ఎక్కువగా లేదని, అయితే రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అనుసరిస్తుండటం, భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తుండటం వల్ల పారిశ్రామిక పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధి రేటు 11 నుంచి 12 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాయని, ధరలు కూడా రైతులకు లాభాలు చేకూర్చేవిధంగా ఉన్నాయన్నారు. విధానపరమైన ప్రభుత్వ విధానాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. మైనింగ్ అండ్ మినరల్స్ కు సంబంధించి కొత్త పాలసీని రూపొందించమని సంబంధింత అధికారులను ఆదేశించారు. తద్వారా ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) రంగంలో ప్రోత్సహకాలు ఆపకుండా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగంలో ఉత్పత్తులు, ఉత్పత్తి పరిమాణం, వాటి విలువ, ఉద్యోగ కల్పన, నూతన పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేయమని అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలు, ఏఏ ఉత్పత్తులు ఎంత పరిమాణంలో జరుగుతున్నాయో, ఒక వేళ మూతపడితే ఏ ఉత్పత్తుల పరిశ్రమలు ఎందుకు మూతపడుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గంణాంక శాఖవారు డేటాను అన్ని అంశాలలో సమగ్రంగా, ఖచ్చితంగా సేకరించాలని మంత్రి ఆదేశించారు. స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా ఐటిఐ ఇన్ స్టిట్యూషన్స్ లో సిలబస్ లో మార్పులు చేయవలసిన అవసరం ఉందని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు.

టెక్స్ టైల్ రంగంలో 100 శాతం స్థానికులకే ఉద్యోగాలు
రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ షిప్ లను అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.  టెక్స్ టైల్ రంగంలో 100 శాతం  ఉద్యోగావకాశాలు స్థానికులకే అభిస్తున్నట్లు తెలిపారు. వంద మందికి పైగా ఉద్యోగులున్న కొత్త పరిశ్రమలు ఈ ఏడాది వందకుపైగా ప్రారంభమైనట్లు చెప్పారు. ఇటువంటి పరిశ్రమలు 2016-17లో 729 ఉండగా, ప్రస్తుతం 836 ఉన్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎక్కవ పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు చెప్పారు. గార్మెంట్ పరిశ్రమ ఈ ఏడాది కొత్తగా  11 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల తనిఖీ, పరిశీలన సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను అధికారులు మొబైల్స్ ద్వారా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో వ్యాట్ ని 5 ఏళ్ల వరకు పూర్తిగా రీయింబర్స్ చేసే విధానం అనుసరించారు. ఇప్పడు జీఎస్టీ వచ్చినందుకు రీయింబర్స్ మెంట్ ఎలా ఇవ్వాలన్నదానిపై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఫర్నీచర్ తయారీ రంగం, తోళ్ల పరిశ్రమ విస్తరణ తదితర అంశాలను చర్చించారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో రూ.125 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఒక తోళ్ల  పరిశ్రమను స్థాపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాలమన్ అరోకియా రాజ్, ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి.దక్షిణామూర్తి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓ సంజయ్ గుప్త పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంతృప్తికరంగా వర్షపాతం
అనంతరం ఆర్థిక,గణాంకాలపై జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం సంతృప్తికరంగా ఉన్నట్లు  మంత్రి తెలిపారు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రం సాదారణ స్థాయికంటే తక్కువగా పడినట్లు చెప్పారు.  రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు అథికారులు తెలిపారు. గణాంకాల సేకరణ మెరుగుపడినట్లు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...