Jul 12, 2017

చిట్టచివరిపేదవాడి వరకు సంక్షేమ పథకాలు అమలు


Ø ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం
Ø వెనుకబడిన వర్గాలకు బాసట
Ø అన్నిటా భద్రత-అందరికీ చేయూత
Ø రూ.10వేల కోట్లతో బీసీ ఉప ప్రణాళిక
Ø బీసీ గురుకుల పాఠశాలల్లో 96.11 శాతం ఉత్తీర్ణత
Ø ఎస్సీ,ఎస్టీ నిధుల కేటాయింపు, వినియోగంలో దేశానికే ఆదర్శం
Ø మైనారిటీలకు అన్నిటా అండ
Ø ఆదాయంలేని మసీదుల ఇమామ్‌లకు పారితోషికం
Ø అడవి బిడ్డల్లో వెల్లివిరిసిన ఆనందం

           సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించే  క్రమంలో మూడేళ్లుగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ  రాష్ట్రంలో విద్యా, ఆరోగ్య, ఆదాయ, ఉపాధి, వ్యక్తిగత  భద్రత కల్పిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరుద్యోగ యువతతోపాటు ఆర్ధికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరి కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఆర్థికంగా అట్టడుగున ఉన్న చిట్టచివరి పేదవాడివరకు అందించే అనేక  పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న ధ్యేయంతో ప్రణాళికా బద్ధంగా వాటిని అమలు చేస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ను సంక్షేమ - సంతోష ఆంధ్రప్రదేశ్‌గా రూపొందించి, అట్టడుగువర్గాల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. బీసీలకు బాసటగా వుంటూ ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందిరూ. 10 వేల కోట్ల నిధులను బీసీ ఉప ప్రణాళిక కోసం కేటాయించింది. మొత్తం 37 శాఖల నుంచి ఈ నిధుల వినియోగం జరుగుతుంది. గతేడాది రూ. 306 కోట్లతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను 7,32,767 మంది బీసీ విద్యార్ధులకు అందించింది. బీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 1,150 కోట్లు, ఈబీసీలకు రూ. 885 కోట్లు ఖర్చు చేసింది. 16 వేల మంది బీసీ విద్యార్ధులు చదువుకునేందుకు వీలుగా రెసిడెన్సియల్ స్కూళ్లను 32 నుంచి 41కు పెంచింది. ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగా రాష్ట్ర సగటును మించి ఈసారి బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 96.11% ఉత్తీర్ణత నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలను ప్రభుత్వం త్వరలో నెలకొల్పనుంది.    బీసీ, ఎస్సీ, ఎస్టీ, వర్గాల్లో పేద విద్యార్దులు సైతం విదేశాల్లో చదువుకునేలా ఆర్ధిక సాయం చేస్తోంది. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణకింద గత ఆర్ధిక సంవత్సరంలో 321 మంది బీసీ విద్యార్ధులు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లారు. ఈ పథకం కింద ఈ ఏడాది వెయ్యి మంది బీసీ విద్యార్ధులను విదేశాల్లో చదివించేందుకు రూ. 79 కోట్లు కేటాయించింది. ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణకింద 4,845 మంది బీసీ విద్యార్ధులకు గతేడాది రూ. 16.40 కోట్లతో పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించింది. అలాగే బీసీ స్టడీ సర్కిళ్లలో 5,490 మంది విద్యార్ధులు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, గ్రూప్స్ వంటి పరీక్షలకు శిక్షణ పొందారు.   శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బీసీ భవనాలను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. ఒకొక్క భవనాన్ని రూ. 5 కోట్లతో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. బీసీ ఉపకులాల ఫెడరేషన్లు, కార్పొరేషన్ల నుంచి 29,591 మంది లబ్దిదారుల రుణాలకు రూ. 295.91 కోట్ల సబ్సిడీ అందించింది. బీసీ-ఏ కేటగిరీకి చెందిన 32 ఉపకులాలు కలిసి నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ - అభివృద్ధి కార్పొరేషన్కు తొలిసారిగా ఈ బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయించింది. వెనుకబడిన తరగతుల్లో వున్న 139 కులాల అభివృద్ధికి 11 ఫెడరేషన్లు కృషి చేస్తున్నాయి. ఈ ఫెడరేషన్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2017-18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు రూ. 615 కోట్లు, వివిధ బీసీ సంక్షేమ కార్పొరేషన్లకు రూ. 295 కోట్లు కేటాయించింది.
దళిత, గిరిజనులకు నిధుల కేటాయింపు, వినియోగంలో దేశానికే ఆదర్శం
           దళిత, గిరిజనులకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ, ఉప ప్రణాళిక నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తోంది. నిధుల కేటాయింపులోనూ, వినియోగంలోనూ మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకుండా దళిత వాడలు, గిరిజన తండాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అవి విద్యుత్ వెలుగులు కూడా కావడం గమనర్హం. గత ఆర్ధిక సంవత్సరంలో పేద దళిత, గిరిజన కుటుంబాలకు నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం ఈ ఏడాది ఆ పరిమితిని 75 యూనిట్లకు పెంచిందిషెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం (ఉప ప్రణాళిక) కోసం ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ. 9,847 కోట్లు కేటాయించింది. ఇందులో 1,09,326 ఎస్సీ కుటుంబాలకు వివిధ ఆర్ధికాభివృద్ధి పథకాల కోసం రూ. 847 కోట్లుషెడ్యూల్ కులాల వారికి వివిధ విద్యా కార్యక్రమాల కోసం రూ. 2,103 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఏడాది పాటు జరిపిన ప్రభుత్వం రాజధాని అమరావతిలో అంబేద్కర్ ఖ్యాతి చిరస్థాయిగా నిలిచేలా రూ. 97.69 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఐనవోలు గ్రామంలో ముఖ్యమంత్రి  శంకుస్థాపన కూడా చేశారు. 125 అడుగుల అంబేద్కర్‌ క్యాంస్య విగ్రహం, గ్రంథాలయాన్ని సైతం ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2018 డిసెంబర్ నాటికి అంబేద్కర్ స్మృతివనం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రూ. 40 కోట్లతో రాష్ట్రంలో 20 అంబేద్కర్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఏడాది అంబేద్కర్ జయంతి రోజున నిరుద్యోగ దళిత యువతకు 125 ఇన్నోవా వాహనాలను 35 శాతం సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేసింది. రూ. 20 లక్షల విలువ చేసే ఈ వాహనాలపై 60 శాతం రుణాలు బ్యాంకుల నుంచి పొందేలా సహకరించింది. మరో 100 ప్యాసింజర్ వాహనాలను, 500 ట్రాక్టర్లను కూడా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి లబ్దిదారులకు అందించింది. 2016-17లో 2,23,667 మంది ఎస్సీ విద్యార్ధులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఇచ్చిన ప్రభుత్వం రూ. 255.80 కోట్లతో కొత్తగా 23 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించింది. మరో 441 గురుకుల పాఠశాల భవనాలను మరమ్మతు చేసింది. ప్రభుత్వ చర్యలతో గురుకుల పాఠశాలల్లో ఫలితాలు ప్రతీ ఏటా మెరుగుపడుతూ వస్తున్నాయి. రాష్ట్ర సగటు కన్నా ఎక్కువుగా ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియేట్‌లో 90.81శాతం, పదో తరగతిలో 93.60 శాతం శాతం ఉత్తీర్ణత సాధించాయి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రూ. 196.25 కోట్లతో 125 మినీ ఆడిటోరియాల నిర్మాణం, రూ. 168.96 కోట్లతో నూతనంగా 8 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 253 మంది దళిత విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఈ ఏడాది ఈ పథకానికి రూ. 33 కోట్లు కేటాయించింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి గ్రాంటును రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచింది. రెండో పీజీ చదివేందుకు, ఇంకా ఒకే కుటుంబంలో ఇద్దరు వరకు చదువుకునేందుకు అనుమతిస్తోంది. టోఫెల్, జీమ్యాట్‌ వంటి పోటీపరీక్షల కోసం శిక్షణ పొందేందుకు ఎస్సీ విద్యార్ధుల కుటుంబ వార్షికాదాయ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచింది
అడవి బిడ్డల్లో వెల్లివిరిసిన ఆనందం
        అడవి బిడ్డల ఉన్నతి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసే విషయంలో ఈ ప్రభుత్వం  వెనకాడడం లేదు. గిరిజన ఉప పథకం కింద ఈ బడ్జెట్‌లో రూ. 3,528 కోట్లు కేటాయించారు. గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ మోదకొండమ్మ జాతర, అల్లూరి జయంతి, ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. అటవీ చట్టాలను సమర్ధవంతంగా అమలు చేస్తోంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో రూ. 15 కోట్లతో శ్రీ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియాన్ని, గ్రంథాలయాన్ని నిర్మిస్తోంది. అలాగే 13 గిరిజన భవన్‌లను ఒక్కొక్కటి రూ. 1.35 కోట్లతో మొత్తం రూ. 17.55 కోట్లతో నిర్మిస్తోంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం సాంస్కృతిక సమావేశాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు ఏడు ఐటీడీఏల్లో ఏడు మినీ ఆడిటోరియాలను రూ. 7 కోట్లతో ఏర్పాటు చేయనుంది. గత విద్యా సంవత్సరం 56,615 మంది గిరిజన విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్, ఎన్టీఆర్ విద్యాజ్యోతి కింద 39,812 మందికి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం ఇచ్చింది. 18,129 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించింది. శాప్ నేతృత్వంలో రూ. 2.50 కోట్లతో రంపచోడవరంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నిర్మిస్తోంది. రూ. 2.50 కోట్లతో అరకులో ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసింది. ఇందులో 120 మంది విద్యార్ధులకు అవకాశం కల్పించింది. ఏజెన్సీలో పర్యాటకరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. లంబసింగిలో రూ. 5.73 కోట్లతో కాటేజీలను నిర్మిస్తోంది. గిరి గోరుముద్దలతో ఏజెన్సీలో చిన్నారులకు పౌష్టికాహార లోపం అనేదే లేకుండా చేస్తోంది. 28 యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా గిరిజన యువతలో నైపుణ్యాన్ని పెంచి తిరుగులేని మానవవనరుల శక్తిగా తీర్చిదిద్దుతోంది. రూ. 3.50 కోట్లతో మరో 10 యూత్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. గిరిజన యువతుల వివాహానికి గిరిపుత్రిక పథకం కింద రూ. 50 వేలు ఇస్తోంది. గత ఏడాది ఈ పథకం ద్వారా 1,017 మందికి ఒకొక్కరికి రూ. 50 వేలు అందించింది. ఈ ఏడాది 1,500 మంది గిరిజన యువతుల వివాహానికి సాయపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముంపు మండలాల్లో గిరిజనుల కోసం చింతూరులో ఐటీడీఏను ఏర్పాటు చేసింది. గిరిజనులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి సాయం చేస్తోంది. జీసీసీ ద్వారా ఆదివాసీల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ తీసుకురావడమే కాకుండా 13 ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికెట్ సాధించింది.
మైనారిటీలకు అన్నిటా అండ- ఆదాయంలేని మసీదుల ఇమామ్‌లకు పారితోషికం
        ముస్లిం మైనారిటీలకు గత ఆర్ధిక సంవత్సరంలో ఆదరణ, రోషిణి పథకాల కింద 13,022 మంది లబ్దిదారులకు రూ. 180 కోట్ల సాయం అందించింది. దుల్హన్ పథకం కింద పేద ముస్లిం యువతుల వివాహానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 60 కోట్లు కేటాయించింది. 2016-17లో ఇదే పథకం 10,954 మందికి ప్రయోజనం చేకూర్చింది. ఉర్దూ ఘర్-షాదీఖానాల కోసం రూ. 15 కోట్లు కేటాయించింది. మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించడానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి 500 మందిని విదేశాలకు పంపాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇంతవరకు 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దేశంలో తొలిసారి ఎక్కడా ఇవ్వనంతగా ఆదాయంలేని మసీదులకు సంబంధించి ఇమామ్‌లకు రూ. 5 వేలు, మౌజన్లకు రూ. 3 వేలు పారితోషికం ఇస్తోంది. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే పలు ఇమామ్‌లు ఎంతో పేదరికంలో మగ్గుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కడపలో రూ. 12 కోట్లతో అధునాతన హజ్ హౌస్ నిర్మాణంతో పాటు, కర్నూలులో రూ. 3 కోట్లతో మినీ హజ్ హౌస్, విజయవాడలో మరో హజ్ హౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి వుంది. మైనారిటీ విద్యార్ధుల కోసం ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహిస్తోంది. మసీదులు, షాదీఖానాల మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ వస్తోంది. 2015-16లో 51 మసీదులు, 52 షాదీఖానాలను, 2016-17లో 39 మసీదులు, 74 షాదీఖానాలను అభివృద్ధి పరిచింది. ఉర్దూ భాషాభివృద్ధి కోసం రూ. 20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసింది. ఉర్దూ ఘర్ నిర్మాణానికి మరో రూ. 12 కోట్లు ఖర్చు పెడుతోంది. 2,200 ఉర్దూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది. వేల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంది. అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల స్వాధీనానికి వక్ఫ్ యాక్ట్ 1995ను సమర్ధవంతంగా వినియోగిస్తోంది. ముస్లింలు, క్రైస్తవులు మక్కా, జెరూసలెం సందర్శించేందుకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొత్తగా చర్చిలు నిర్మించేందుకు రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ విధంగా ఎస్టీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...