Jul 21, 2017

తూర్పుగోదావరి జిల్లాలో జయ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రతిపాదన


మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఉప ముఖ్యమంత్రి కేఈ సమక్షంలో కేరళ మంత్రితో చర్చలు
సచివాలయం, జూలై 20: జయ ధాన్యం, బియ్యం  కేరళ ప్రభుత్వానికి సరఫరా చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లాలో  ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  ప్రతిపాదించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన  చాంబర్ లో కేరళకు ధాన్యం, బియ్యం, మిర్చి, పసుపు వంటివి సరఫరా చేసే అంశం పై ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు ప్రతిత్తిపాటి, పి.తిలోత్తమన్, అధికారులు, మిల్లర్లు, వ్యాపారులతో ఉప ముఖ్య మంత్రి కె..కృష్ణమూర్తి  చర్చించారు. ఈ సందర్భంగా కేరళ అధికారులు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో పౌరసరఫరాల దుకాణాల ద్వారా 13 రకాల వస్తువులు సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారుతమకు నెలకు 6,500 టన్నుల చొప్పున ఏడాదికి 72 వేల టన్నుల జయ బాయిల్డ్ బియ్యం అవసరమవుతుందని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వండితే రేపు ఉదయం వరకు తినడానికి ఉపయోగపడేవిధంగా ఉండే నాణ్యమైన, స్వచ్ఛమైన జయ బియ్యం కావాలని తెలిపారు. ప్రస్తుతం ఆ బియ్యం రూ.35.55లకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఓనం పండుగ జరుగుతుందని, ఆగస్ట్ నెలలో తమకు బియ్యం సరఫరా చేయాలని వారు కోరారు.

జయ ధాన్యం మన రాష్ట్రంలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పండుతున్నాయని మన రాష్ట్ర అధికారులు, మిల్లర్లు తెలిపారు. మన రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి కావలసిన మొత్తం బియ్యం సరఫరా చేయగలమని, అయితే ప్రస్తుతం ఆ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిపారు. వండిన అన్నం 24 గంటల వరకు నిల్వ ఉండాలంటే డబల్ బాయిలింగ్ కు  ప్రాసెసింగ్ సమయం 15 నుంచి 16 గంటలు పడుతుందని, అందువల్ల నాణ్యమైన జయ బియ్యం రూ.45 నుంచి రూ.47లకు సరఫరా చేయడం సాధ్యమవుతుందని వివరించారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన పంట సమయంలో కొనుగోలు చేస్తే అటు కేరళ వినియోగదారులకు, ఇటు ఇక్కడ రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కేరళకు ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే బియ్యం ఒరిజినల్ జయ రకం కాదని, వాటిని పోలిన కురవ బియ్యం అని తెలిపారు. ఆ ధాన్యం మన రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పండుతాయని, అయితే అవికూడా మంచి రకమేనని, జయ బియ్యం వాటికంటే మంచివని తెలిపారు. అలాగే ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే బియ్యం బాయిల్డ్ ప్రాసెస్ 8 గంటలే ఉంటుందని చెప్పారు. కార్పోరేషన్ ద్వారా సరఫరా చేసే రకం నాణ్యమైనదై, వండిన తరువాత అన్నం నిల్వ ఉండేదై ఉండాలని, అందువల్ల ఆ ధరలకు సరఫరా చేయడం వీలుకాదని తెలిపారు. ఒక ధర నిర్ణయించి, ఏడాది పొడవునా అదే ధరకు సరఫరా చేయడం కూడా సాధ్యం కాదని తెలిపారు. ఇతర రకాలైతే రూ.30 రూపాయలకే సరఫరా చేయగలమని వ్యాపారులు చెప్పారు.
చివరకు మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆ ధాన్యం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే పండుతున్నందున కేరళకు సరఫరా చేయడానికి పౌరసరఫరాల కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. ఆ కేంద్రలో కేరళ, తమ కార్పోరేషన్ సిబ్బంది కూడా ఉండి  పంట సమయం మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోలు చేస్తారని, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధరపై కమిషన్ మాత్రమే తీసుకొని సరఫరా చేయాలన్న ప్రతిపాదన చేశారు. ఆ విధంగా చేస్తే కేరళ వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం లభిస్తాయని, ఇక్కడ రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు. జయ, 1010 రకం ఒరిజినల్  బాయిల్డ్ బియ్యం శాంపిల్ కవర్ ను శుక్రవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. తాము కొనుగోలు చేసే బియ్యం శాంపిల్స్ ను కూడా తాము పంపుతామని కేరళ అధికారులు చెప్పారు. మళ్లీ తరువాత సమావేశమై ఒక నిర్ణయం తీసుకుందామని ఇరు రాష్ట్రాల మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ విధంగా ఇరు ప్రభుత్వాలు రంగంలోకి దిగితే రైతులు కూడా ఆసక్తి చూపుతారని  పలువురు అభిప్రాయపడ్డారు. పంట సమయంలో కొనుగోలు తాము పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కెఈ, మంత్రి ప్రత్తిపాటి కేరళ మంత్రికి హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల మంత్రులతోపాటు కేరళ రాష్ట్ర  పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ అండ్ ఎండి ఏపీఎం మోహ్మద్ హనీషా, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ లోహిత్, మన రాష్ట్ర  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండి కె.రామ్ గోపాల్, మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సెలక్ట్ చానల్ పేరుతో వాటర్ బాటిళ్లను అధిక ధరలకు అమ్ముతూ విదేశీ కంపెనీలు రాష్ట్రంలోని వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నాయని అన్నారు. అటువంటి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు : తమ రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఆహార ధాన్యాల సరఫరాపై చర్చించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తికి కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి తిలోత్తమన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయలు, ప్రజాపంపిణీ వ్యవస్థ, విద్య, సాంఘీక సంక్షేమం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాల్లో  ఇరు రాష్ట్రాల మధ్య సారూప్యత ఉన్నట్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నందున ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తమకు కావలసిన జయ ధాన్యం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పండుతుందన్నారు. అయితే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఒప్పొందం లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరటంలేదనిప్రైవేటు వ్యాపారులు లాభాలు ఘడిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రా మధ్య ఒక ఒప్పొందం జరిగితే అటు కేరళ ప్రజలకు, ఇటు ఇక్కడ రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం జరిగిన చర్చల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...