Jul 4, 2017

విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సచివాలయం, జూలై 4: జిల్లా స్థాయిలో డీఎఫ్ ఓలు సమన్వయ కర్తలుగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటి, సామాజిక వనాలను పెంచే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ లోని తన చాంబర్ లో మంగళవారం సాయంత్రం అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో నవంబర్ వరకు ప్లాంటేషన్ యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా  మొక్కలు నాటడం, వాటి భద్రత, పెంపకం, సామాజిక వనాలు పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)నిధులను సరైన రీతిలో వినియోగించుకొని 13 జిల్లాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రభుత సంస్థలు, పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థలు, రైతులు, పాఠశాలలు, గురుకుల విద్యార్థులు, స్వయంసహాయక బృందాల, స్వచ్ఛంద సంస్థల సహాయసహకారాలు పొందాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, గ్రామాల్లో పంచాయతీ సెక్రెటరీలు, వీఏఓలు, వీఆర్ఓలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సీఎస్ దినేష్ కుమార్  చెప్పారు. అలాగే ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎన్ని మొక్కలు నాటారో పూర్తి వివరాలు సేకరించాలన్నారు.
జూలై 1న రాష్ట్రా వ్యాప్తంగా 68వ వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి శనివారం ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నివాస కాలనీల్లో, పాఠశాలల్లో, దేవాదాయ శాఖ భూముల్లో, ప్రభుత్వానికి చెందిన బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, మొక్కల పెంపకంపై అవగాన కల్పించడానికి పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో నర్సరీలు పెంచుతున్నట్లు,అడవుల సంరక్షణపై సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వనం-మనం కార్యక్రమ నిర్వహణలో అటవీ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. జిల్లా యాక్షన్ ప్లాన్ ను అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లకు డీఎఫ్ఓలు సహకరిస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ఓ, జిల్లా సోషల్ ఫారెస్టరీ విభాగం ద్వారా విత్తనాలు చల్లడం, మొక్కల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచారంతో కరపత్రాలు, బుక్ లెట్స్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అధికారులు చెప్పారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వనం-మనం గ్రామస్థాయి, మండల స్థాయి, డివిజన్ స్థాయి కమిటీలు చురుకుగా పని చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ అందజేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 22.47 శాతం అటవీ ప్రాంతం ఉందని, పచ్చదనం నింపడానికి ఇంకా 25.84 శాతం ప్రాంతం అందుబాటులో ఉందని తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...