Jul 3, 2017

అమరావతికి ప్రముఖ సంస్థల రాక

        అంతర్జాతీయ నగరాల సరసన చేర్చేవిధంగా అత్యాధునికంగా నిర్మిస్తున్న ప్రజారాజధాని అమరావతి మహానగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు తరలి వస్తున్నాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల అభివృద్ధి చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాలు అమరావతికి మూలస్థంభాలుగా నిలుస్తాయి. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటివి ఒకేసారి 13 ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్‌ అంచనాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రాజధాని పరిధిలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ, విద్య, వైద్యం, నివాస, తాగునీరు, ఆతిధ్యం, రవాణా, విద్యుత్, టెలీఫోన్ వంటి సౌకర్యాలను సమకూరిస్తేనే ఏ సంస్థ అయినా నిర్మాణం మొదలు పెడుతుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఆ పనులలో నిమగ్నమై ఉంది. నగరంలోపల రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  . టార్గెట్‌ 2018’ నినాదంతో ఇతర పనులు కూడా వేగం పుంజుకున్నాయి. దానికితోడు అమరావతి బ్రాండ్ నేమ్ అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి రావడంపరిశ్రమల స్థాపనుకు అన్నివిధాల అనుకూల పరిస్థితులు, సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం  భూములు ఇవ్వడంతోపాటు, మౌలిక వసతులు కల్పంచడంతో అనేక సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.  ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో కూడా ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు చేపడుతోంది. అనంతపురం నుంచి అమరావతి వరకు  ఎక్కడా మలుపులేని 598.830 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూ సేకరణ, సమీకరణ పనులు మొదలయ్యాయి
             విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండవ పార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ. 1.4 కోట్ల పెట్టుబడులతో 2.01 లక్షల మందికి ఉపాధి కల్పించే 65 ఒప్పొందాలను సీఆర్డీఏ చేసుకుంది. వీటిలో 64 శాతం పెట్టుబడులు కొత్త రాజధానిలో మౌలికవసతులు అభివృద్ధికి సంబంధించినవే ఉన్నాయి. జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా), మేటి సంస్థల  సభ్యులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సంస్థలు రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లుగా ఏపీలో కూడా ఇండస్ట్రియల్‌క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఎం ప్రతిపాదించారు. శ్రీసిటీ లేదా కృష్ణపట్నంలో జపాన్‌ ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్త రాజధానిలో రవాణా వ్యవస్థ అభివృద్ధిపై జైకా సంస్థ దీర్ఘ కాలిక, స్వల్పకాలిక, మధ్య తరహా ప్రణాళిక వ్యూహరచనను చేస్తోంది. ఇక్కడ స్పోర్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ సిటీలకు బృహత్తర ప్రణాళికలను తయారు చేస్తోంది. అమరావతిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి ఐటీసీ, లీలా, మహీంద్రా రిసార్ట్స్‌, హిల్టన్ గ్రూపు, హాలిడే ఇన్ వంటి దాదాపు 20 ప్రముఖ  సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

              దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను తీసుకురావల్లన్న ఉద్దేశంతో ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.  భూ కేటాయింపులు కూడా జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారుఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ - ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ - భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. విద్యా సంస్థలన్నింటిని ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడే భూములను కేటాయిస్తోంది.  తాత్కాలిక సచివాలయం నిర్మాణం  తరువాత  ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ఐనవోలు గ్రామంలో తమిళనాడుకు చెందిన  ప్రతిష్టాత్మకమైన విట్‌ విశ్వవిద్యాలయం ఏపీ కేంపస్  భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.  ఈ ఏడాదికి నూతన అడ్మిషన్లు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతానికి  గుంటూరులో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. అమరావతిలో తొలిదశ నిర్మాణం పూర్తికాగానే, ఇక్కడకు మార్చుతారు. అత్యుత్తమ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైఫై బస్సులు, హాస్టళ్లతో జులై 19న ఈ క్యాంపస్ కు ప్రారంభోత్సవం చేస్తారు. స్టార్ స్టూడెంట్ప్రోగ్రామ్ కింద ప్రతి జిల్లా నుంచి  టాపర్ గా నిలిచిన ఒక బాలిక, ఒక బాలుడిని ఎంపిక చేసి వారికి ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో  నిర్మాణం చేపట్టారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతోపాటు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ  తాత్కాలికంగా ఈ విద్యా సంవత్సరం నుంచి చెన్నయ్‌లో అడ్మిషన్లు ప్రారంభిస్తోంది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వంద ఎకరాల స్థలం కేటాయించింది. తరువాత మరో వంద ఎకరాలు కేటాయించే అవకావం ఉంది. అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్శిటీ 2018లో ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. క్లౌడ్ నెట్‌వర్క్ ఆధారంగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే దూర ప్రాంతాల్లోని డివైస్‌లకు సమాచార మార్పిడి జరిపి వందలాది విద్యార్థులకు అమృత విశ్వవిద్యాలయం ద్వారా విద్యాబోధన జరుగుతోంది.  ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఈ యూనివర్సిటీ ముందుకొచ్చింది. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్   కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తారు.

             అబుదాబీకి చెందిన బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య, వైద్య విద్య, పర్యాటక, అతిథ్య, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. ఈ మేరకు ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ షెట్టి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు  మధ్య ఒప్పందం కుదిరింది. ఆ  ఒప్పందం ప్రకారం అమరావతిలో ప్రత్యేక సౌకర్యాలతో 1500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారు. హెల్త్‌కేర్‌ క్లబ్‌గా దీనిని తీర్చిదిద్దనున్నారు. 2018 డిసెంబరు నాటికి ప్రపంచ స్థాయిలో మెడికల్‌ ఎనలిటిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. వైద్య రంగంలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏషియాలోనే క్వాంటమ్‌ కంప్యూటర్‌ సెంటర్  ప్రారంభిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయ వైజ్ఞానిక భాగస్వామిగా వారి సహకారంతో ప్రపంచ స్థాయి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. ఫార్మాస్యూటికల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌, అమరావతి వైద్య విజ్ఞాన ప్రాసెస్‌ ఔట్‌ సోర్సింగ్‌ కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగాల కల్పనలో ఈ సంస్థలు కీలక భూమిక పోషిస్తాయి.

      శాఖమూరులో 300 ఎకరాల స్థలంలో  అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) డిస్నీ వరల్డ్ తరహాలో పార్కుని ఏర్పాటు చేయనుంది.  ఈ పార్కు నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో సాహస క్రీడలు, జల  క్రీడలు, అంతర్జాతీయస్థాయి ఉద్యానవనాలు, మ్యూజిక్ ఫౌంటేన్, వాటర్ ఫాల్స్, బటర్ ఫ్లై పార్క్, రిసార్టులు, హోటళ్లు, షాపింగ్ కేంద్రాలు, ధియేటర్లు... ఇలా అన్నీ ఉంటాయి. అమరావతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, ప్రధాన రహదారులకు ఇరువైపులా, రాజధానిలో 21.3 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగుకు ఇరువైపులా ఉద్యనవనాలు అభివృద్ధి చేయడానికి ఏడీసీ బ్లూప్రింట్ ను కూడా సిద్ధం చేసింది. నగరంలో గ్రీన్-బ్లూ (పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు.
             బ్రిటన్ కు చెందిన ట్రాన్స్ స్టాడియా సంస్థ ఇక్కడ 60 రకాల క్రీడా కార్యకలాపాల నిర్వహణకు అనుకూలంగా ఉండేవిధంగా, 4 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం నిర్మించడానికి ముందకు వచ్చింది. ఇందుకోసం సాధ్యమైనంత త్వరగా భూమి కేటాయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సుమారు రూ.250 కోట్లతో ఒక ఫైవ్‌ స్టార్‌, నాలుగు త్రీస్టార్‌, 6 జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలు, రూ.4000 కోట్ల వ్యయంతో 2 ప్రఖ్యాత ఆస్పత్రులు అమరావతిలో ఏర్పడబోతున్నాయి. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారుల విభాగంతో ఒప్పందం కూడా జరిగింది. మంగళగిరిలో ప్రపంచస్థాయి ఐ.టి.రంగ సంస్థలు కొలువుదీరనున్నాయి. రాబోయే రెండేళ్లలో మంగళగిరి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇక్కడి ఆటోనగర్‌ ప్రాంతం 16వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో  వివిధ పరిశ్రమలు, ఆటోమొబైల్‌, .టి.సంస్థలు నెలకొల్పనున్నారు. ఆటోనగర్‌ పక్కన ఉన్న 30 ఎకరాల భూమిని వివిధ ఐ.టి.కంపెనీలకు కేటాయించారు. ఇప్పటికే పైడేటా ఐ.టి.సంస్థ భవనం నిర్మించారు. ఆరు ఐటీ కంపెనీల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. మరోపక్క రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్, సబార్టేరియల్ రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. నిర్ణిత గడువులోగా వేగంగా పనులు పూర్తిచేయాలని నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...