Jul 1, 2017

తుది దశలో అమరావతి మాస్టర్ ప్లాన్


v అత్యుత్తమ ఆకృతులు సిద్ధం
v త్వరలో నిర్మాణం ప్రారంభం
v ఉష్ణోగ్రత తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యత
v స్థానిక గ్రామాల అస్థిత్వం కాపాడే ప్రణాళికలు
v ఉద్యోగాల కల్పనకు సీబీడీ ఏర్పాటు
          
            
అంతర్జాతీయ నగరాల సరసన చేర్చేవిధంగా అత్యాధునికంగా నిర్మించనున్న ప్రజారాజధాని అమరావతి మహానగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన తుది దశకు వచ్చింది. మొదటి దశ నిర్మాణాలకు కావలసిన నిధులు కూడా చాలావరకు సమకూరాయి. జల కళ-పచ్చదనం నిండిన అంతర్జాతీయ స్థాయి అద్భుత అమరావతి నగర (బ్లూ-గ్రీన్ సిటీ) నిర్మాణానికి రూ.58 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రధాన నిర్మాణాలు ఈ ఏడాది మొదలుపెట్టి  2019 ఎన్నికల నాటికి 32,463 కోట్లు ఖర్చు చేయాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది. బ్రిటన్ కు చెందిన  నార్మన్ ఫోస్టర్ సంస్థ కొత్త రాజధానిలోని ప్రతి కట్టడం  ఏకరూపత,  ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా(ఐకానిక్‌), ఆకృతులు విలక్షణంగా (యునిక్‌) ఉండేవిధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ సంస్థ పలు దఫాలు, అనేక రకాల ఆకృతులను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించింది. ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సిద్ధం చేసిన 4 ప్రాథమిక డిజైన్లలో ఒకదానిని ప్రభుత్వం అత్యున్నతమైనదిగా భావించి, మళ్లీ దానికి కొద్దిగా మార్పులు చేర్పులు సూచించింది. కొద్ది రోజుల్లో ఆ సంస్థ తుది ప్లాన్ ను అందజేయనుంది. ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేవిధంగా రూపొందించడానికి జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో పాటు స్థానికంగా వుండే గొప్ప అనుభవశీలురైన ఆర్కిటెక్టుల సహాయ సహకారాలను ప్రభుత్వం తీసుకుంటోంది. నార్మన్ ఫోస్టర్ సంస్థ కూడా  సంప్రదాయ నిర్మాణ రీతులకే పెద్దపీట వేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  మండలాలలోని 25 రెవెన్యూ గ్రామల(29 గ్రామాలు)పరిధి 53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది  మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. చారిత్రకంగా నది ఒడ్డున ఉన్న నగరాల్లోనే నాగరికత వెలసిల్లింది. ఆధునిక యుగంలో కూడా నది ఒడ్డునే ఇంతటి విశాల నగర నిర్మాణం జరగబోతోంది.  అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ. అందువల్ల అటు ఆర్టిటెక్ట్ సంస్థ, ప్రభుత్వం ఆ కోణంలో ఎక్కువ దృష్టి పెట్టాయి. అమరావతిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువ ఉండేలా ఇప్పటి నుంచే ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఉష్ణోగ్రతలకు అనుగుణంగా భవన నిర్మాణంలో అనుసరించిన రీతుల్ని అధ్యయనం చేసారు. ఉష్ణోగ్రతల్ని తగ్గించేందుకు సంప్రదాయ భవనాలే అనుకూలమన్న భావనను ఆర్టిటెక్ట్ సంస్థ వ్యక్తం చేసిందివాషింగ్టన్‌, లండన్‌ వంటి ప్రముఖ నగరాల్ని పరిశీలించిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ముఖ్యంగా అక్కడి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? వాటిని తట్టుకునేలా భవన నిర్మాణాల్లో అనుసరించిన విధానాలేంటి? గాలి వీచే తీరు ఎలా ఉంటుంది? వంటివి అధ్యయనం చేసింది. అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు, ఇక్కడి గాలివాటం వంటివి పరిగణనలోకి తీసుకుని ఆకృతుల్ని రూపొందించింది. అబుదాబిలో అద్దాలతో నిర్మించిన భవనాల వెలుపల 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించిన భవనాల వెలుపల 48 డిగ్రీలు, చుట్టూ చెట్లున్న సంప్రదాయ భవనాల వెలుపల 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. సంప్రదాయ పద్ధతుల్లో నిర్మించిన భవనాలే మంచిదని ఆ సంస్థ సూచించింది. ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో ప్రపంచంలో వున్న అన్ని అత్యుత్తమ విధానాలను పరిశీలించి వాటిని ఇక్కడ అనుసరిస్తారు.

         రాజ్ భవన్, శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, సచివాలయం భవంతులు అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేసుకోవడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించడానికి ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కృషి చేస్తోంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయ ఆకృతులు మనిషి నాడీ మండలాన్ని, రాసుల్ని అనుసరించి ఉండాలని వాస్తు సిద్ధాంతి రాఘవయ్య సూచించారు. పుత్రజయ, ఆస్థానా, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రెసీలియా, అబుదాబి, న్యూఢిల్లీ, గాంధీనగర్, నయారాయపూర్, చండీగర్  తదితర నగరాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైనవాటిని తీసుకొని, వాటికంటే అత్యుత్తమంగా బ్లూ, గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఆర్ధిక కార్యకలాపాలకు వేదికగా, ప్రపంచశ్రేణి నగరంగా, ప్రజా రాజధానిగా భాసిల్లేవిధంగా అమరావతిని రూపొందించనున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సీఎం తరచూ సంబంధింత మంత్రులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) అధికారులతో సమావేశమై సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం దాదాపు 3,165 నివాసాలతోపాటు విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి మొత్తం రూ.4,750 కోట్లు ఖర్చు అవుతుందని అచనాలను రూపొందించారుప్రభుత్వ భవనాల సముదాయం 900 ఎకరాల్లో నిర్మిస్తారు.  ఈ ప్రాంతం ఉత్తర-దక్షిణాలుగా నాలుగు కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు ఉంటుంది.  దీని మధ్య భాగంలో సెంట్రల్‌ స్పైన్‌ డిల్లీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు ఉండే రాజ్‌పథ్‌ మాదిరిగా ఉంటుంది. దీనిని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడు నాలుగు రకాలుగా ప్రతిపాదించింది. ఒక దానిలో ఇది రాజ్‌పథ్‌ మాదిరిగా తిన్నగా ఉంటే, మరోదానిలో జిగ్‌జాగ్‌గా ఉంది. ఒక నమూనాలో రహదారికి బదులుగా జలమార్గం ఉంది. ఒక చోట మధ్యలో అంతా పచ్చదనం, చెట్లు ఉంటాయి. ఇలా పలు రకాల నమూనాల్ని ఆ సంస్థ ప్రతిపాదించగా, దీనిలో ఒకదానిని సీఎం ఎంపిక చేసి కొన్ని సూచనలు చేశారు. ఆ ప్రకారం తుది రూపం ఇవ్వవలసి ఉంది.

         రాజధాని ప్రాంతంలో వచ్చే వందేళ్లలో జరిగే మార్పులు, అంచనాల ఆధారంగా అత్యంత కీలకమైన వాణిజ్య సదుపాయాలు, కల్పన, ప్రజల అవసరాలకు సంబంధించి సీఆర్డీఏ పలు ప్రాతిపాదనలు చేసిందిరాజధానిలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగేలా జిల్లా కేంద్ర వాణిజ్య కేంద్రాలు (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్-సీబీడీ) ఏర్పాటు చేయడంతోపాటు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. కృష్ణానదీ సమీపంలో అవకాశాల వెల్లువ సృష్టించేలా కేంద్ర వాణిజ్య జిల్లాను ఆర్థిక రాజధాని తరహాలో నిర్మిస్తారు. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థ రాజధాని మొత్తం విస్తరించేలా మరో మూడు ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలను రాజధాని అంతటా ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రాంతీయ వాణిజ్య కేంద్రంలో 5 లక్షల వరకు జనాభా నివాసం ఉండేలా ప్రణాళికలను రూపొందించారు. మొత్తం 3 ప్రాంతీయ వాణిజ్య కేంద్రాలు, 22 పట్ణణ వాణిజ్య కేంద్రాలు, 53 నేబర్ హుడ్ వాణిజ్య కేంద్రాలతోపాటు, 3 హోల్ సేల్ మార్కెట్ల నిర్మాణానికి సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది.

          అమరావతి నిర్మాణానికి కొన్ని జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించగా, సింగపూర్, చైనా, జపాన్, బ్రిటన్, ఆస్థానా వంటి దేశాలు తమ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి దశలో ఖర్చు చేయాలనుకుంటున్న నిధులను సమకూర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో సీఆర్డీఏ ప్రయత్నించి విజయం సాధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్), ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తున్నాయి. పీపీపీ విధానంలో మౌలిక వసతులు, బాండ్స్ వంటి ఇతర మార్గాల్లో కూడా  సీఆర్డీఏ నిధులను సమకూరుస్తోంది. నిర్మాణంలో అన్నిదశలలో అత్యాధునిక సాంకేతికత అందించడానికి  అనేకమంది ముందుకు వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అందిన వెంటనే టెండర్లు పిలిచి రాజధాని నిర్మాణాలు మొదలుపెట్టడానికి సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...