Jun 19, 2019

జగన్ ప్రభుత్వం – పదవుల కేటాయింపు - సామాజిక న్యాయం
రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభం
       రాజకీయాల్లో నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తెర తీశారు. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు దగ్గర నుంచి మంత్రి మండలి ఏర్పాటు వరకు సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవులలో కూడా ఇదే పాటిస్తానని ఆయన చెప్పారు. రాజకీయాలలో మాటలు చెప్పేవారే గానీ చేతలలో చూపించేవారు చాలా తక్కువగా ఉంటారు. జగన్ మాత్రం చెప్పిన మాటలను చేసి చూపించారు. పాలనా పరంగా కూడా ఎవరూ ఊహించని రీతిలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించడంలో నిలువెత్తు నిదర్శనంగా జగన్ నిలిచారు.

అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులకు స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ఆ విషయంలో స్పీకర్ కు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నట్లు శాసనసభా నాయకుడుగా సభలో ప్రకటించడంతో ప్రజలకు జగన్ పై గౌరవం ఇంకా పెరిగింది. సమాజంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాలకు స్థానం కల్పించే విధంగా మంత్రి మండలిని చాలా చాకచక్యంగా కూర్చారు. ఈ కూర్పులో ఆయన నైతిక విలువలను కూడా పాటించినట్లు స్పష్టమవుతోంది.   దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని విధంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి, సముచిత స్థానం కల్పించడానికి అయిదుగురిని ఉప ముఖ్య మంత్రులుగా నియమించారు. అన్ని వర్గాల వారికీ ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది తొలిసారి. ఆ విధంగా సామాజిక న్యాయం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాలకు జగన్ ఆదర్శంగా నిలిచారు.
         గత మంత్రి మండలిలో గానీ, ఇప్పుడు గానీ ముఖ్యమంత్రితో సహా 26 మంది సభ్యులే ఉన్నారు. గత మంత్రి మండలిలో  అయిదుగురు కమ్మ, నలుగురు రెడ్డి, ముగ్గురు కాపు, 8 మంది బీసీలు, ఎస్సీ లు ఇద్దరు, వైశ్య, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వెలమ ఒక్కొక్కరు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికే చెందినకోడెల శివప్రసాద రావు స్పీకర్ గా ఉన్నారు. ప్రస్తుత మంత్రి మండలిలో ఏడుగురు బీసీలు, అయిదుగురు ఎస్సీలు, అయిదుగురు రెడ్లు, నలుగురు కాపులు, కమ్మ, మైనార్టీ, వైశ్య, క్షత్రియ, ఎస్టీలు ఒక్కొక్కరు మంత్రులుగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
         గత మంత్రి మండలిలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు(కమ్మ), మంత్రులుగా లోకేష్(కమ్మ), ప్రత్తిపాటి పుల్లారావు(కమ్మ), దేవినేని ఉమామహేశ్వరరావు(కమ్మ), పరిటాల సునీత (కమ్మ), అమరనాథరెడ్డి (రెడ్డి), భూమా అఖిల ప్రియ(రెడ్డి), సీహెచ్.ఆదినారాయణ రెడ్డి(రెడ్డి), సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి(రెడ్డి),  యనమల రామకృష్ణుడు(యాదవ-బీసీ), చింతకాయల అయ్యన్నపాత్రుడు (కొప్పు వెలమ-బీసీ), కింజరాపు అచ్చెన్నాయుడు(కొప్పు వెలమ-బీసీ), పితాని సత్యనారాయణ(శెట్టి బలిజ-బీసీ), కాలువ శ్రీనివాసులు (బోయ-బీసీ), కొల్లు రవీంద్ర(మత్స్యకార-బీసీ), కెఈ కృష్ణమూర్తి (ఈడిగ-బీసీ), కిమిడి కళావెంకట్రావు(తూర్పు కాపు-బీసీ), గంటా శ్రీనివాసరావు(కాపు), డాక్టర్ పొంగూరు నారాయణ(కాపు), నిమ్మకాయల చినరాజప్ప(కాపు), సిద్ధా రాఘవరావు(వైశ్య), సుజయ కృష్ణ రంగారావు(వెలమ-ఓసీ), కొత్తపల్లి జవహర్(మాదిగ-ఎస్సీ), నక్కా ఆనందబాబు(మాల-ఎస్సీ),కిడారి శ్రావణ్ కుమార్(ఎస్టీ), ఎన్.మొహమ్మద్ ఫరూక్ (మైనార్టీ) ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చివరలో స్థానం కల్పించారు. చేనేత, క్షత్రియ, బ్రాహ్మణులకు అసలు స్థానం లేదు.
         ఈ మంత్రి వర్గంలో సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి(రెడ్డి), ఉప ముఖ్యమంత్రులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్(శెట్టి బలిజ-గౌడ్-బీసీ), అంజాద్ బాషా (మైనారిటీ), ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని-కాపు), కలత్తూరు నారాయణ స్వామి(మాల-ఎస్సీ),  పాముల పుష్ప శ్రీవాణి(ఎస్టీ) ఉన్నారు. మంత్రులుగా డాక్టర్  పెద్దిరెడ్డిగారి రామచంద్రారెడ్డి(రెడ్డి), బుగ్గన రాజేంద్రనాథ్ (రెడ్డి), బాలినేని శ్రీనివాసరెడ్డి(రెడ్డి), మేకపాటి గౌతం రెడ్డి(రెడ్డి), కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని-కమ్మ), చెరుకువాడ శ్రీరంగనాథ్ (రాజు), ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు(అవంతి శ్రీనివాస్ - కాపు), కురసాల కన్నబాబు (కాపు), పేర్ని వెంకట్రామయ్య(నాని-కాపు), వెలంపల్లి శ్రీనివాసరావు(కోమటి), మేకతోటి సుచరిత (మాల-ఎస్సీ), పినిపే విశ్వరూప్ (మాల-ఎస్సీ), తానేటి వనిత (మాదిగ-ఎస్సీ) ఆదిమూలపు సురేష్(మాదిగ-ఎస్సీ), బొత్స సత్యన్నారాయణ (తూర్పు కాపు-బీసీ), మోపిదేవి వెంకట రమణ (మత్స్యకార-బీసీ), అనిల్ కుమార్(యాదవ-బీసీ), ధర్మాన కృష్ణదాస్ (పోలినాటి వెలమ), గుమ్మనూరి జయరాం(బోయ-బీసీ), మాలగుండ్ల శంకర నారాయణ(కురుమ-బీసీ) మంత్రులుగా ఉన్నారు. గత మంత్రి మండలిలో స్థానం లభించని కొన్ని సామాజిక వర్గాలకు ఇందులో స్థానం లభించింది. గత మంత్రి మండలిలో ఎస్సీలు ఇద్దరు ఉంటే, ఈ మంత్రి మండలిలో అయిదుగురు ఉన్నారు. అంతేకాకుండా చివరిదాక ఆగకుండా మొదటి నుంచే అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించి గౌరవించారు. ఎంత చేసినా ఈ వ్యవస్థలో కొందరికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా వ్యవసాయం రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడి జీవించేది చేనేత రంగం. గడచిన మంత్రి వర్గంలో గానీ, ఈ మంత్రి వర్గంలో గానీ చేనేత సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వలేదు.  రాజకీయంగా, పరిపాలనా పరంగా జగన్ వ్యవహార శైలిని, అనుసరించే విధానాన్ని పరిశీలిస్తే మంత్రి వర్గంలో స్థానం కల్పించలేని ఇటువంటి సామాజిక వర్గాల వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తప్పనిసరిగా  ప్రధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...