Jun 12, 2019


ఉపాధి, ఆదాయ మార్గాలున్న పర్యాటక రంగం
మంత్రి అవంతి శ్రీనివాస్

          సచివాలయం, జూన్ 12: యువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలున్న రంగం పర్యాటక రంగం అని పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్)  చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటక, యువజన, పురావస్తు శాఖల పని తీరుని ప్రాధమికంగా సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. మన రాష్ట్రంలో విస్తారంగా సముద్ర తీరం, అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నందున పర్యాటక పరంగా ఆదాయ మార్గాలు పెంచడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచంలో అనేక దేశాల ఆదాయంలో సింహ భాగం పర్యాటక రంగం నుంచే ఉంటుందన్నారు. అలాగే మన దేశంలో కూడా కేరళ, గోవా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కూడా ఈ రంగం నుంచి ఆదాయం బాగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, హిల్, బీచ్ టూరిజం వంటి వాటి అభివృద్ధికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ రంగంలో ఆతిధ్యానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు.  ‘అతిధి దేవోభవ’ అనేది మన దేశ సంస్కృతిలో భాగంగా పేర్కొన్నారు. మంచి ఆతిధ్యం ఇవ్వటం ద్వారా పర్యాటక రంగం నుంచి ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడానికి ఈ రంగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అరకు, బొర్రా గృహల వద్ద దేశవిదేశీ పర్యాటకులకు అర్ధమయ్యే రీతిలో వివరించడానికి ఇంగ్లీష్, హిందీ తెలిసిన గైడ్స్ ని నియమించాలన్న ఆలోచన ఉన్నట్లు చెప్పారు.  రాష్ట్రంలోని 13 జిల్లాలలో భీమిలి, బొర్రా గృహలు, లంబసింగి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, భవానీ ఐల్యాండ్, అహోబిళం, మ్యూజియంలు... వంటి  పర్యాటక ప్రదేశాలను గుర్తించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది  అభివృద్ధి పరుస్తామని చెప్పారు. పర్యాటక ప్రదేశాలలో  పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం ఈ శాఖకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడానికి ప్రయత్నిస్తామన్నారు. రూ.10 కోట్ల వ్యయంతో కొండపల్లి కోటను అభివృద్ధిపరిచారని తెలిపారు. విజయవాడ వచ్చిన వారు ఆ కోటను సందర్శించే విధంగా మీడియా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న శిల్పారామాలను పూర్తి చేయడంతోపాటు ప్రతి జిల్లాలో ఒక శిల్పారామం నిర్మిస్తామని చెప్పారు. గుజరాత్ లో పర్యాటక రంగ అభివృద్ధికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారని, ముఖ్యమంత్రి సలహాతో మన రాష్ట్రానికి కూడా ఆ విధంగా అంబాసిడర్ ని నియమిస్తే బాగుంటుందన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగ సమాచారాన్ని అందరికీ అందించడానికి ఉన్నత అర్హతలు కలిగిన వ్యక్తిని పీఆర్ఓగా నియమించమని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాలలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. వారు ఎవరికీ ఎటువంటి లంచాలు ఇవ్వవలసిన అవసరంలేదని, జాప్యంలేకుండా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులలో ఏపీ భద్రత గల రాష్ట్రం అన్న భావన కలిగిస్తామని చెప్పారు.
     పర్యాటక రంగం పేరుతో  కేటాయించిన భూములలో నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరగకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా, అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే పీకేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి హెచ్చరించినట్లు తెలిపారు.
          క్రీడా, సాంస్కృతిక, పర్యాటక రంగాల మధ్య సమన్వయంతో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి స్పోర్ట్స్ అకాడమీలను సందర్శించి, అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తామని చెప్పారు. అక్కడ సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.  బీసీ,ఎస్సీ,ఎస్టీలలో క్రీడానైపుణ్యం కలిగిన మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సాహమందిస్తామని చెప్పారు. పురావస్తు శాఖ భూములు ఎవరైనా ఆక్రమిస్తే స్వాధీనం చేసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. మంత్రి వెంట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, పురావస్తు శాఖ,  మ్యూజియంల కమిషనర్ డాక్టర్ జీ.వాణిమోహన్ ఉన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...