Jun 18, 2019

సాధ్యమైనంత త్వరగా రైతులకు పగలు 9 గంటల విద్యుత్



విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి బాలినేని

ప్రయోగాత్మకంగా 60 శాతానికి పైగా సరఫరా

                 
సచివాలయం, జూన్ 18: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం సాధ్యమైనంత త్వరగా రైతులకు వ్యవసాయం కోసం రోజుకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంస్తులోని సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరా, వినియోగం, వ్యయం, బకాయిలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికపరమైన పనులను పూర్తి చేసి వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి అధికారులు, సిబ్బంది శాయశక్తులా కృషి చేయాలన్నారు. నీతివంతమైన పాలన అందించాలన్నది సీఎం ప్రధాన ధ్యేయం అని, అందుకు అనుగుణంగా మంచి ప్రభుత్వం అన్న పేరు తేవాలని, అందులో విద్యుత్ శాఖ ముందుండాలన్నారు. పవర్ కట్ ఫిర్యాదులు రాకుండా చూడాలని మంత్రి  చెప్పారు.
ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, నెడ్ క్యాప్, సోలార్ పవర్ కార్పోరేషన్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సంస్థల పనితీరుని సమీక్షించారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగంతోపాటు ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్ మెంట్ స్కీమ్(ఐపీడీఎస్), దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం, హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పథకం,  పవర్ ఫర్ ఆల్ పథకం, ఉదయ్ పథకం, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్, వ్యవసాయ ఫీడర్స్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్ ఎనర్జీ కారిడార్ .... గురించి అధికారులు మంత్రికి వివరించారు. గాలి, వాన వచ్చినప్పుడు మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వెంటనే పునరుద్దరిస్తున్నామని చెప్పారు. అంతరాయం కలిగినప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా వినియోగదారులకు మెజేస్ పంపుతామని చెప్పారు.  పగటి పూట ప్రస్తుతం 60 శాతానికి పైగా విద్యుత్ ని వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్లు తెలిపారు.  వ్యవసాయ ఫీడర్లను ఏ, బీ రెండు గ్రూపులుగా విభజించి ఈ విద్యుత్ ని సరఫరా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వ్యవసాయ ఫీడర్ల ద్వారా చాలా వరకు అందిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో 70 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 64 శాతం అందిస్తున్నట్లు వివరించారు.  కృష్ణా జిల్లాలో 328 ఫీడర్లకు 228, గుంటూరు జిల్లాలో 364 ఫీడర్లకు 281, ప్రకాశం జిల్లాలలో 664 ఫీడర్లకు 634, నెల్లూరు జిల్లాలో 674 ఫీడర్లకు 390 ఫీడర్ల ద్వారా 9 గంటలు విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. పగటి పూట అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అని వివరించారు. పగటి పూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల పాము కాట్లు, విద్యుత్ ప్రమాదాలు వంటివి చాలా వరకు తగ్గిపోయాయని తెలిపారు. హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ పథకం వల్ల మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల మోటార్లు కాలడం సంఘటనలు లేవని, లో ఓల్టేజ్ సమస్య లేదని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి దశ పనులు పూర్తి అయినట్లు చెప్పారు. విద్యుత్ వాహనాల వాడకం, ఛార్జింగ్ గురించి వివరించారు. టాటా టైజర్, మహీంద్రా సంస్థలు 300 విద్యుత్ వాహనాలు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు వీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఎల్ఈడీ బల్బులు వాడటం వల్ల 14వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్లు వివరించారు. 66వేల సోలార్ పంపుసెట్లు అందజేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఎన్నిసార్లు అంతరాయం కలిగింది, ఎంత సమయం సరఫరా నిలిచిపోయింది తెలుసుకోవడానికి ఉన్న వ్యవస్థ గురించి మంత్రికి వివరించారు. అంతరాయాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
          ధర్మల్, సోలార్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి గురించి వివరించారు. గాలి మర విద్యుత్‌ ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువ భాగం తెలంగాణలోకి వెళ్లినట్లు చెప్పారు. బొగ్గు, రవాణా ఛార్జీలు పెరిగి ఉత్పత్తి వ్యయం పెరిగినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. ప్రభుత్వం నుంచి రావలసిన సబ్సిడీలు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్, వాటర్ వర్క్, నీటి పారుదల శాఖల నుంచి అధికంగా బకాయిలు రావలసి ఉందని చెప్పారు. పట్టిసీమ, ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయినట్లు తెలిపారు. ఆక్వా రైతులకు, ఎస్సీ, ఎస్టీలు వంటి వారికి ఇచ్చే సబ్సిడీలు చాలా ఉన్నట్లు చెప్పారు. సబ్సిడీలు మొత్తం పది వేల కోట్ల రూపాయల వరకు రావలసి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రూ.5వేల కోట్ల బకాయిలు రావలసి ఉందని చెప్పారు.  రాష్ట్ర విభజనకు సంబంధించి 500 మంది ఉద్యోగుల సమస్య ఉందని, అది ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు.

ఏపీ ట్రాన్స్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగులాపల్లి మాట్లాడుతూ వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే విషయంలో అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పని చేస్తారని చెప్పారు. ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిసియన్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఈఓ ఏ.చంద్రశేఖర రెడ్డి, నెడ్‌ క్యాప్‌ ఎండీ కమలాకర్‌ బాబు, ఆయా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...