Jun 20, 2019

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Ø ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
Ø నాణ్యమైన, విలువైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత
Ø తొలుత ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఒడి పథకం
Ø ఉపాధ్యాయులకు పదోన్నతులు
Ø సగ భాగం ఉపాధ్యాయుల సమస్యలపైనే దృష్టి
Ø నెలలో ఒక రోజు ఉపాధ్యాయుల ఫిర్యాదుల పరిష్కారం
Ø టెన్త్ లో 20 శాతం ఇంట్రనల్ అసెస్ మెంట్ ఎత్తివేత
Ø త్వరలో వైస్ ఛాన్సలర్ల సమావేశం

           సచివాలయం, జూన్ 20: నాణ్యమైన, విలువైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్ లో గురువారం ఉదయం ఆయన ప్రవేశించారు. ముందుగా సతీసమేతంగా వచ్చిన సురేష్ కు వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఛాంబర్ లోకి ప్రవేశించిన  తరువాత ప్రత్యేక పూజ చేశారు.  ఆ తరువాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ వచ్చే అయిదేళ్లో రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రణాళికా బద్దంగా సంస్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడంతోపాటు వసతులు, మధ్యాహ్న భోజనం పథకాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. తెలుగు భాషతోపాటు ఇంగ్లీషు భాషకు కూడా ప్రధాన్యత ఇస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామన్నారు. వీటన్నిని అధ్యయనం చేసి సంస్కరణలకు సూచనలు చేయడానికి ఒక కమిటీని నియమించామని, దానిపైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల ఫైలుపై రెండవ సంతకం చేశానని చెప్పారు. ఉపాధ్యాయుల స్థితిగతులను పరిశీలించి, రోస్టర్, కాలపరిమితి వంటి వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం కలిగిస్తామన్నారు.  స్కూల్ అసిస్టెంట్స్ నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. దీని వల్ల 19 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. టెన్త్ గ్రేడింగ్ లో 20 శాతం ఇంట్రనల్ అసెస్ మెంట్ ని ఎత్తివేస్తూ మూడవ సంతకం చేసినట్లు తెలిపారు. ఇంట్రనల్ అసెస్ మెంట్ మార్కుల విధానం వల్ల ప్రైవేటు పాఠశాలలు లబ్దిపొందుతున్నట్లు చెప్పారు.
పిల్లలు రాజన్న బడి బాట పట్టేవిధంగా చేస్తామని,  ప్రభుత్వ పాఠశాలలను తలమానికంగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

               నవరత్నాలలో భాగమైన ‘అమ్మ ఒడి’ పథకాన్ని 2020 జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. మొదట ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రవేశపెడతామన్నారు. నిపుణులు, మేథావులతో చర్చించి, మేథోమథనం జరిగిన తరువాత ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టే అంశం పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా చూస్తామన్నారు.  విద్యార్థుల డ్రాప్ అవుట్ ని తగ్గించడానికి, అక్షరాశ్యతను పెంచడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పుకు ఇది అతి పెద్ద అడుగుగా పేర్కొన్నారు.  అయితే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ పథకం పేరు చెప్పి అడ్మిషన్లు జరిపే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

                     ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన సమయాన్ని సగ భాగం కేటాయిస్తానని మంత్రి చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫిర్యాదులు స్వీకరించడానికి నెలలో ఒక రోజు కేటాయిస్తామన్నారు. అధికారుల సమక్షంలో వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాలతో సహా విద్యా వ్యవస్థలోని నియామకాలలో  అవకతవకలకు తావులేకుండా మెరిట్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నిష్ణాతులు, మేథావులను విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తామని చెప్పారు. అన్ని స్థాయిలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి త్వరలో వైస్ ఛాన్సలర్ల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు  పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి జనం సమస్యలు తెలుసని చెప్పారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో పని చేసి విద్యా శాఖకు మంచి పేరు తెస్తానని మంత్రి సురేష్ చెప్పారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఈడీ పాఠశాలల పేర్లు, వివరాలు ఇస్తే వెంటనే విచారణకు ఆదేశిస్తానన్నారు. ప్రమాణాలు పాఠించని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఇతర కాలేజీలపైన, ప్రైవేటు విశ్వవిద్యాలయాలపైన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...