Jun 17, 2019


పూర్తిగా అదుపులో శాంతి భద్రతలు
హోమ్ మంత్రి మేకతోటి సుచరిత
          సచివాలయం, జూన్ 17: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. సచివాలయంలో సోమవారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని, ఇదేనా రాజన్న రాజ్యం అని ప్రశ్నిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. దాడులలో వైసీపీ కార్యకర్తలు 57 మంది గాయపడితే, టీడీపీ కార్యకర్తలు 44 మంది గాయపడ్డారని, ఎవరు ఎవరిమీద దాడి చేస్తున్నారో ఈ లెక్కలు చెబుతాయన్నారు. 2014 జూన్ లో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో తమ పార్టీ వారు దాడులు చేస్తే చూసీ చూడనట్లు ఉండమని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిపై ఆ పార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, కాల్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే రోజాను శాసనసభకు రాకుండా అడ్డుకున్నారని, మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయని చెప్పారు. అలాంటి పాలన చేసిన వారా తమ ప్రభుత్వం గురించి ప్రశ్నించేది, వారికి ఆ అర్హత లేదన్నారు. తమ నేత జగన్మోహన రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ‘కోడి కత్తి’ అని అవహేళన చేశారన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను ఆ నాడు ఈ నాడు తొలగిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీ మాట వినలేదని ఒక మహిళను వివస్త్రను చేశారని, ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు పెట్టారని చెప్పారు. వారి అరాచకాలకు తగిన బుద్ది చెప్పి ప్రజలు తమను 151 శాసనసభా స్థానాలలో గెలిపించారని చెప్పారు. ఉనికి కోల్పోతామన్న భయంతో టీడీపీ వారు ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారన్నారని మంత్రి సుచరిత అన్నారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...