Jun 21, 2019


ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం
మంత్రి ఆదిమూలపు సురేష్
          సచివాలయం, జూన్ 21: ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థని ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళతామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు. మౌలిక వసతులు, అత్యాధునిక మౌలిక వసతులు అని రెండుగా వసతులు కల్పిస్తామన్నారు.  పాఠశాలల్లో ప్రహరి గోడలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట శాలలు, మంచినీరు వంటి మౌలిక వసతులు అన్ని  మెరుగుపరుస్తామని వివరించారు.  విద్యాశాఖలోని ఇంజనీర్లతో ఉదయం, విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లతో సాయంత్రం సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యా శాఖలోని దాదాపు 800 మంది ఇంజనీర్లు మూడు విభాగాలుగా పని చేస్తున్నారని, వారి మధ్య సమన్వయ లోపం, పనుల డూప్లికేషన్ వంటి అంశాలను గుర్తించిన్నట్లు చెప్పారు. ఈ రకమైన ఇబ్బందులను తొలగించి విద్యాశాఖలోని ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ పనులకు  ఒకేరకమైన విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అవసరాల మేరకే పనులు చేపడతామన్నారు.
విశ్వవిద్యాలయాలలో నియామకాల విషయంలో నిబంధనల మేరకు పారదర్శికత పాటించాలని వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. మెరిట్ ప్రాతిపధికగానే నియామకాలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు కూడా బ్యాక్ డోర్ నియామకాల ఆలోచన విరమించుకోవాలని సూచించారు. ప్రాథమిక విద్యతోపాటు ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉపాధి అవకాశాలు లభించే విధంగా నూతన కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడతామని చెప్పారు.

             జీఎస్టీ, ఇన్ కమ్ టాక్స్ అంశాలనుయ చర్చించామని, విశ్వవిద్యాలయాలు లాభాపేక్షతో నడిచే సంస్థలు కాదని, అందువల్ల వాటికి మినహాయింపు కోరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల ఫైనాన్స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరి తరపున ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. పద్మావతి విశ్వవిద్యాలయానికి మున్సిపల్ కార్పోరేషన్ వారు కమర్సియల్ టాక్స్ విధించారని చెప్పారని, దానిని కూడా పరిష్కరిస్తామన్నరు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్వహణకు సమాయత్తం చేయవలసిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయాలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన 27 శాతం మధ్యంతర భృతి విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తించడంలేదని తెలిపారని, ఆ అంశాన్ని ఫైనాన్స్ విభాగంతో సంప్రదించి పరిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ నిష్పత్తిని పాటించి గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
          విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయని, నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలన్నారు. బడిలో చేరే విద్యార్థుల సంఖ్య, అక్షరాశ్యతను పెంచడానికే అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలన్న ఆలోచన అందరిలో రావాలన్నారు.  విద్యా హక్కును తప్పనిసరిగా అమలు చేస్తామని మంత్రి సురేష్ చెప్పారు. మంత్రి వెంట దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఉన్నారు.

జవాబుదారీ, పాదర్శకత, అవినీతి రహిత పాలన
             జవాబుదారీతనం, పాదర్శకత, అవినీతి రహిత పాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి  పేర్కొన్నారు. సచివాలయం 4వ బ్లాక్ సమావేశ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలలోని సమస్యలన్నిటినీ పరిష్కరించి, వాటిని బలోపేతం చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాల అటానమస్ కు ఇబ్బంది కలిగించమని, రోజువారీ కార్యకలాపాలలో వేలు పెట్టం అని చెప్పారు. నాణ్యమైన, గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అత్యున్నత విశ్వవిద్యాలయాల వరుసలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం ఉన్న స్థితిని ఫొటోలతో సహా రికార్డు చేయాలని, అయిదేళ్ల తరువాత ఎంత మెరుగుపడిందో స్పష్టంగా తెలియాన్నారు. వీసీలు, రిజిస్ట్రార్లు ఆయా విశ్వవిద్యాలయాలలో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. టీచింగ్ సిబ్బంది కొరత, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, 11 వందలకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఐఆర్ వర్తింపు, జీఎస్టీ, ఇన్ కమ్ టాక్స్, ఇంజనీరింగ్ విభాగాల పనులు.... తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ఆర్థిక విభాగాల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...