Jun 12, 2019


మేనిఫెస్టోలోని అంశాలకే  ప్రాధాన్యత
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

       సచివాలయం, జూన్ 12: తమ ప్రథమ ప్రాధాన్యత మేనిఫెస్టోలోని అంశాలకేనని ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక మంత్రి చాంబర్ లో బుధవారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బడ్జెట్ ప్రిపరేషన్ పై మంత్రి మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దువ్వూరి సోమయాజులు 2014 నుంచి  ఆయన కాలం చేసేవరకు ఆర్థిక విషయాలలో తనకు గురువుగా  ఉండి ముందుకు నడిపించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. తను ఈ స్థాయికి చేరడానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డికి, తన డోన్ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ప్రమాణం చేసిన విధంగా మనసుపెట్టి బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి, మంత్రి మండలి నిర్ణయాల ప్రకారం ప్రధాన్యతా క్రమంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తామని వివరించారు. మేనిఫెస్టోనే తమకు ప్రమాణికం అన్నారు. ఆ తరువాత కులం, మతం, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ఒక పద్దతి ప్రకారం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. యువత, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలకు అనుగుణంగా ఒక పద్దతిలో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. ప్రజలకు అవసరం ఉన్న పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బు  ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేదేనని, దానిని పొదుపుగా, ఉపయోగకరంగా ఉండే పనులకు ఖర్చు చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు.

        మంత్రి బుగ్గన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, కార్యదర్శి ముద్దన రవిచంద్ర, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...