Jul 5, 2019


‘ఏక భారత్’ దిశగా సమాయత్తం!
ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే పన్ను- ఒకే ఎన్నికలు-ఒకే కార్డు
          
       

  ఒకే దేశం – ఒకే చట్టం అన్న దిశగా భారత సమాజాన్ని సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది.  విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు సమ్మిళితమైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది వినడానికి ఇంపుగా ఉంటుంది. అందులో గాఢతలేదు. బలీయమైన బంధంలేదు. దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే. అయినప్పటికి 29 రాష్ట్రాలలో 29 రకరకాల చట్టాలు ఉన్నాయి. ఏకత్వం అనేది  లోపించింది. దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా ఏర్పడవలసిన అవసరం ఉంది.  భారత సమాజంలో అందుకు తగిన నేపధ్యాన్ని కేంద్రం ఏర్పరచవలసిన అవసరం ఉంది.  ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు – ఒకే రకమైన రిజర్వేషన్ విధానాలు -  స్త్రీ, పురుషులిద్దరికీ సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను .... వెరసి  ‘ఏక భారత్’ భావన ప్రతి పౌరుడిలో ఏర్పడాలి. ఆధార్ కార్డుతో మొదలైన ఈ కార్యక్రమం ఒక్కక్కటిగా ‘ఏక భారత్’ బలపడే దిశగా సాగుతోంది.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ 'ఏక్తా భారత్' అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. ఆ పార్టీ పరిపాలన ఈ లక్ష్యాలను దృష్టిలోపెట్టుకొని కొనసాగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే చట్టం అమలులో ఉండాలన్నది వారి భావన.    భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు గల భారత దేశం వంటి పెద్ద దేశంలో ఈ 'ఒకే విధానం' సాధ్యం కాదని కొందరు చెబుతారు. మతాలను, సాంప్రదాయాలను, విభిన్న సంస్కృతులను గౌరవిస్తూనే ‘ఏక భారత్’ను సృష్టించడానికి అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉంటాయి. సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అయినా అది సాధించిన నాడే మనం భారతీయులుగా సంపూర్ణత్వాన్ని పొందగలం. మానసికంగా ప్రతి పౌరుడు ఏక భావనతో ఉంటాడు. ఒక్కసారిగా ఈ మార్పు సాధ్యం కాదు. క్రమక్రమంగా ఒక్కో అంశంలో కొద్దికొద్దిగా మార్పులు తీసుకురావాలి. దేశంలో ఒకే కార్డు విధానం, అదే ఆధార్ కార్డు అమలులోకి వచ్చింది. 2009 జనవరి 28న ఆధార్ వ్యవస్థ ఏర్పడింది.
ఆధార్ కార్డు వల్ల అనేక అంశాలలో అటు ప్రభుత్వానికి, ఇటు పౌరుడికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఈ కార్డు దేశమంతటా చెల్లుబాటు అవుతోంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత మార్పులు చేర్పులతో ఆధార్ కార్డు విధానాన్ని మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.  ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదంతో 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో కూడా మార్పులు చేర్పులు చేసి మెరుగైన ఫలితాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
               ఇప్పుడు ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానం వల్ల పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే లక్షలాది మంది కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దేశ వ్యాప్తంగా 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా ప్రజా పంపిణీ విధానంలో మార్పులు తీసుకువచ్చి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది. రేషన్ కార్డు ద్వారా ప్రస్తుతం స్వగ్రామంలోనే రేషన్ సరుకులు తీసుకునే వీలుంది.  ఈ పథకం అమలైతే లబ్దిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళుతుంటారు. బీహార్ నుంచి లక్షల సంఖ్యలో కూలీలు దేశమంతటికి వలస వెళుతుంటారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక మంది పనుల కోసం దక్షిణాది రాష్ట్రాలకు వస్తుంటారు. ఇటువంటి లక్షల మంది ఒకే రేషన్ కార్డు పథకం ద్వారా వారు పని చేసే ప్రాంతాలలోనే ప్రతి నెల రేషన్ పొందగలుగుతారు. ఇది ఓ అద్వితీయమై ఆలోచన. ఉపాధి కోసం వలస వెళ్లే అందరికీ లబ్ది చేకూరుతుంది. ముందుగా ఈ పథకాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అమలు చేస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న యోచనలో కేంద్రం ఉంది.
                దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పరిపాలనకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటర్లు ఎక్కువమంది ఉండటంతో వ్యయం కూడా అధికంగానే అవుతుంది. ఈ నేపధ్యంలో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' అన్న భావనను కేంద్రం ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు దేశమంతటా అదే చర్చ జరుగుతోంది. భవిష్యత్ లో లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. పలు ప్రాంతీయ పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. బీసీలు, మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్లకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం అమలులో ఉంది. రాజ్యాంగ మూల సూత్రాలకు ఇది విరుద్ధం. దీని వల్ల అనేక మంది నష్టపోతున్నారు.  అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన చట్టం ఉండాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో ఒకే చట్టం ఉండాలని తెలంగాణ శాసనసభలో ఒక తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. విస్తృత స్థాయిలో దేశంలో చర్చ జరిగే అంశాలలో ఉమ్మడి పౌర స్మృతి మరొకటి. ప్రస్తుతం  హిందూ, ముస్లిం, క్రైస్తవ.. అన్ని మతాలకు సంబంధించిన 'పర్సనల్ లా'లను సంస్కరించవలసి ఉంది.  ఒకేసారి ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడితే ఛాందసవాదులు అందుకు అంగీకరించరు. అందువల్ల చట్టాలను కొంచెం కొంచెంగా సంస్కరించుకుంటూ పోవాలి. మొదట వివాహ వయస్సును సవరించి,  ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడాకులు, మనోవర్తి అంశాలను,  వివాహ రిజిస్ట్రేషన్ విధానాలను సంస్కరించాలి. అలా చేయడం వల్ల ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం కాదు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఒకే చట్టం, ఒకే ఎన్నికలు, ఒకే రిజర్వేషన్, ఒకే పన్ను, ఒకే కార్డు, ఒకే విధానం అమలు చేయాలి. కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. మార్పు రావాలంటే సమాజం అందుకు సిద్ధంగా ఉండాలి. లేదా సమాజాన్ని అందుకోసం సిద్ధం చేయాలి. ప్రస్తుతం అలా సమాజాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలలో కేంద్రం ఉంది.   అంతర్కగతంగా అటువంటి ఆలోచనలతోనే కేంద్రం ఒక్కొక్కటిగా సంస్కరణలు చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలా చేయడం వల్ల భారత సమాజం కూడా  ‘ఏక భారత్’ దిశగా సమాయత్తమయ్యే అవకాశం ఉంది.
 -     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Jul 4, 2019

నియామకాలు

రోజా... APIIC ఛైర్మన్ 8978068888

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసి రెడ్డి పద్మ

 CRDA ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి   9912471247

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మోహన్‌బాబు 91609 99907

ఆర్టీసీ ఛైర్మన్‌గా అంబటి రాంబాబు  9440307999

 కాపు కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా గ్రంధి శ్రీనివాస్
8816234487, 8816234850, 9912104449

బ్రాహ్మణ కార్పొరేష‌న్ ఛైర్మన్ ప‌ద‌విని ద్రోణంరాజు శ్రీనివాస్‌  9848185917

పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా యేసుర‌త్నం  8978681555

సివిల్ స‌ప్లయిస్ క‌మిష‌న్ ఛైర్మన్‌గా ఆమంచి కృష్ణమోహ‌న్  9704046661

ఎస్సీ క‌మిష‌న్ ఛైర్మన్‌గా మోషేన్ రాజు 
వ‌క్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా మ‌హ్మద్ ముస్తఫా  9394152907, 0863-2238223

భూమ‌న క‌రుణాక‌ర రెడ్డిని రాయ‌ల‌సీమ అభివృద్ధి మండలి ఛైర్మన్‌  9393603818

Jun 21, 2019


  జిల్లా కలెక్టర్ల సమావేశ వేదిక మార్పు
         సచివాలయం, జూన్ 21 : ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం స్థలంలో మార్పు జరిగినట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో జరగవలసిన ఈ సమావేశం ఉండవల్లి సమీపంలోని కరకట్ట పక్కన ఉన్న ప్రజావేదిక వద్ద జరుగుతుందని ఆయన  పేర్కొన్నారు.

Jun 20, 2019


మానవేంద్రనాథ్ రాయ్, వెంకట రమణలు
హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం
     అమరావతి, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం చీకటి మానవేంద్రనాథ్ రాయ్, మఠం వెంకట రమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించగా,  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. 

Jun 12, 2019


శాసనసభాపతిగా తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవం
మంత్రి బొత్స సత్యనారాయణ
          సచివాలయం, జూన్ 12: శాసన సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. శాసన సభాపతి పదవికి తమ్మినేని సీతారామ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదించి సుదీర్ఘ  రాజకీయ అనుభవం కలిగిన సీతారామ్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. సీతారామ్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మూడు సార్లు మంత్రిగా పని చేశారని చెప్పారు. సభ విలువలు, గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరొకరు ఎవరూ నామినేషన్ వేయనందున నిబంధనల ప్రకారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లేనని చెప్పారు. మంత్రి బొత్స వెంట ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.  ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీతారామ్ కు మంత్రి బొత్స, చీఫ్ విప్ శ్రీకాంత్ లు  అభినందనలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
      
      సచివాలయం, జూన్ 12:  ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి బుధవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో ని తన ఛాంబర్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆయన బ్లాక్ వద్దకు రాగానే వేద పండితులు, సంబంధిత శాఖల అధికారులు స్వాగతం పలికారు. తన పేషీలో పూజా కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల సంఖ్య పెంపు ఫైల్ పైన, తరువాత కమర్షియల్ టాక్స్ విభాగంలోని ఒక ఉద్యోగి మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు ఫైల్  పైన సంతకాలు చేశారు.  ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు ఆయనకు పుష్ప గచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Jun 11, 2019


సమాచార శాఖ కమిషనర్ గా విజయ కుమార్ రెడ్డి
       
         సచివాలయం, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా తుమ్మా విజయకుమార్ రెడ్డిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 1990 బ్యాచ్ కు చెందిన విజయ కుమార్ రెడ్డి డిప్యుటేషన్ పై రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించడానికి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ అనుమతించింది.  దాంతో ఆయన ఈ నెల 10వ తేదీన సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయడంతో మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఎస్.వెంకటేశ్వర్ స్థానంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ గా, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు.