Dec 18, 2018


ఆడపిల్లని హైలెట్ చేసిన ‘చేనేత బతుకు’
           
  ప్రముఖ కథ, నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు సందుపట్ల భూపతి ఆడపిల్లని హైలెట్ చేస్తూ కథలు రాశారు. ఆడపిల్లలు కుటుంబానికి ఎంత అండగా ఉంటారో తెలియజెప్పారు. చేనేత దేశ వారసత్వ సంపద. భారతీయ సంస్కృతితో ముడిపడినది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఇప్పటికీ అత్యధికమంది ఆదారపడి జీవించేది చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత రంగం వడిదుడుకులు, చేనేత కార్మికుల దుస్థితితోపాటు నడుస్తున్న చరిత్రలోని అనేక సామాజిక అంశాలను స్పృశించుతూ రాసిన కథలు, వ్యాసాలు, గీతాల సంపుటే ‘చేనేత బతుకు’ పుస్తకం. ఇందులో వివిధ పత్రికలలో ప్రచురితమైన 12 కథలు, 8 వ్యాసాలు, 12 గీతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యత గల చేనేత కార్మికులు మన దేశంలో ఉన్నారు. అగ్గిపెట్టెలో పెట్టేంత సన్నటి చీరని నేయల కళాకారులు వారు. వారి బతుకుదెరువుని మెరుగుపరచడంతోపాటు ఆ కళని కాపాడుకోవలసిన అవరసరాన్ని భూపతి గుర్తు చేశారు. చేనేత రంగం, అభ్యుదయ భావాలు, ప్రేమానుబంధాలు, మానవ సంబంధాలు, హేతువాద దృక్పదం, యువతుల ధైర్యసాహసాలు, యువత చెడు వ్యసనాలు, కుల రహిత సమాజం వంటి విభిన్న అంశాలపై ఈ 12 కథలు రాశారు.
   ముఖ్యంగా ‘మగ్గం బతుకు’ అనే కథలో చేనేత కార్మికుని దుస్థితితోపాటు ఆడపిల్ల కుటుంబానికి ఎంత చేదోడువాదోడుగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ఆడపిల్ల అయితే తల్లికి, మగ పిల్లవాడైతే తండ్రికి సహాయపడతారనేది నానుడి. ఆడపిల్ల పుడితే భయపడే రోజులు పోయాయి. వారు కూడా, వారు కూడా ఏంటి కొన్ని కుటుంబాలలో మగపిల్లల కంటే ఆడపిల్లలే చదువులో ప్రతిభ చూపుతున్నారు. కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటున్నారు. ఈ కథలో మల్లేశ్వరి పాత్ర కూడా అటువంటిదే. లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అబార్షన్లు చేయించుకోవాలనేవారికి కనువిప్పు కలిగించే రీతిలో రాసిన  ఈ చిన్న కథలో జీవితంలోని అనేక అంశాలను కళ్లకు కట్టారు. మనిషి ఔన్నత్యాన్ని చాటే చెప్పారు. ఓ చేనేత కార్మికుడు ఆత్మాభిమానంతో బతికే తీరుని వివరించిన గొప్ప కథ ఇది. అలాగే ‘ఉపాధి’ కథలో కూడా ఓ ఆడపిల్ల కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడుతుందో తెలియజెప్పారు.
                 సమాజ క్షేత్రంలో మానవ సంబంధాలు రిక్తమవుతున్న వేళ ఓ రచయిత, ఓ కవి వాస్తవాలవైపు దృష్టిపెట్టి తన కలాన్ని ఎలా ఝుళిపించాలో ‘కథనం దొరికింది’ కథలో వివరించారు. సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే మోసాలను తెలియజెబుతూ ‘కనువిప్పు’, ‘ఇదోరకం విద్య’  కథల ద్వారా హెచ్చరించారు.  ఆడపిల్లలు ఝాన్సిరాణీ, రుద్రమదేవి, ఆదిశక్తిలా ఉండాలని ‘భలే అమ్మాయిలు’ కథలో సూచించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన ‘హేతువు’ కథలో భూతాలు, దెయ్యాలు లేవని, నిజమైన దెయ్యాలు భూతవైద్యులేనని, వారి మోసపూరిత కటనని కూడా వివరించారు. ‘ఆదర్శమా వర్థిల్లు’, ‘ఉపాధి’ కథలు కుల రహిత సమాజం, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తూ రాశారు. దురలవాట్లకు బానిసైతే బతుకు దుర్బరమవుతుందని ‘మారిన మనసు’ కథలో హెచ్చరించారు. ఒక రచయిత తన రచనను అచ్చు రూపంలో చూసుకోవడానికి ఎంత తపన పడతాడో ‘చిత్తగించవలెను’ కథ ద్వారా వివరించారు. మనిషి కేంద్రంగా సమాజ జీవన వాస్తవికత సంఘర్షణల నుంచి వస్తువుని స్వీకరిస్తూ రచయిత దృక్పదం నుంచి  కథ వెనుక గల లక్ష్యాన్ని స్థానీయత, నాటకీయత, క్లుప్తత, భావసరళత, శిల్పపరంగా అక్షర శరాలను సంధిస్తూ..కథను చివరికంటా చదివించే కొసమెరుపు ముగింపు రచయిత సృజించగలిగితే అలాంటి కథల్ని పాఠకలోకం తప్పక ఆస్వాదిస్తుందని యువ రచయితల భుజంతట్టి మరీ చెప్పారు.
             ఇక తన వ్యాసాలలో దేశంలో చేనేత రంగం దుస్థితి, చేనేత కార్మికుల బతుకు, ఈ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మొత్తం మీద మనిషితనాన్ని  తన రచనలలో చేనేత కార్మికుల దయనీయ స్థితితోపాటు సముద్ర తీర అందాలను కూడా వర్ణించారు. అన్నదాత రైతైతే వస్త్రదాత చేతన్న అంటూ కదలవోయి నేతన్నా, కదలిరా నేత కార్మిక వంటి గీతాలు ఇందులో ఉన్నాయి.
ఎప్పుడూ ప్రేమ గీతాలు రాసే ఆచార్య ఆత్రేయ
‘‘ గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు.... అని సందేశాత్మక లలిత గీతాలు రాసినట్లు  అభ్యుదయ కథలు, నాటికలు, గీతాలు రాసే భూపతి సన్నజాజీ పూసేవేళ ..., నీ చెదరని చిరునవ్వు..... వంటి భావ గీతాలు కూడా రాశారు. అన్నిటికంటే ముఖ్యం కేవలం రెండవ తరగతి మాత్రమే చదువుకున్న  చేనేత కార్మికుడైన భూపతి తన జీవితానుభవంతో  కులమతాలు లేని సమసమాజం కోరుకుంటూ ఇంతటి గొప్ప కథలు రాయడం విశేషం.

పుస్తకం పేరు: చేనేత బతుకు
రచయిత పేరు: సందుపట్ల భూపతి,
పుస్తకం ధర: రూ.80/- పేజీలు : 90
ప్రతులకు : ఇంటి నెంబర్ 3/03(74ఏ), గండాలయ పేట, మంగళగిరి-522503,
సెల్ నెంబర్: 9603569889
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Dec 17, 2018


ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను 
సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
                సచివాలయం, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్ పరిస్థితులను తాను ఆశించిన విధంగా  సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, అన్ని శాఖల సిబ్బందిని, ప్రత్యేకంగా ఆర్టీజీ సిబ్బందిని అభినందించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని ఆర్టీజీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం రాత్రి ఫెథాయ్ తుఫాన్ ముందు, తరువాత తీసుకున్న చర్యలను సమీక్షించారు. అత్యవసర సమయాల్లో అన్ని శాఖల్లోనూ టాప్ కేడర్ అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మంత్రులు డాక్టర్ పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్ర, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇస్రో అధికారి రాజశేఖర్, ఇతర అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తమై తుఫాన్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారని,  చురుగ్గా వ్యవహరించి క్షేత్రస్థాయిలో అందరినీ సిద్దంచేశారన్నారు. హుద్‌హుద్, తిత్లీ తుఫాను అనుభవాలతో ఫెథాయ్ తుఫాన్‌కు ముందు నుంచే అప్రమత్తం అయ్యామని చెప్పారు. తుఫానుకు ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, తరువాత రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం, పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించడం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందిలేకుండా చేయగలిగామన్నారు. ఈ తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ముందుజాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మానవ వనరులు అందుబాటులో ఉంచామని, ఇలాంటి విపత్తులకు ముందుగా సిద్ధం కావడమే ముఖ్యమని చెప్పారు. మాక్ డ్రిల్ వంటి కసరత్తులు చేయడం వల్ల ప్రజలకు భరోసా ఇచ్చినవారమైయ్యామన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వంపై వారికి నమ్మకం వస్తుందని చెప్పారు. ప్రాణనష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యుత్ సౌకర్యం ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలని  కాన్ఫరెన్స్ లో సీఎం అధికారులను ఆదేశించారు.  
 డిజాస్టర్ మేనేజ్ మెన్ట్ ఎలా చేసిందీ డాక్యుమెంటరీ చేసి ఉంచాలన్నారు.  అది రానున్న కాలంలో విపత్తులను ఎదుర్కోవడానికి  ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి విద్యుత్ స్థంభాన్ని జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఇలాంటి విపత్తుల్లో వాటి పునరుద్ధరణ సులభం అవుతుందని చెప్పారు. జరిగిన నష్టాన్ని తక్షణం అంచనా వేసి గంటల వ్యవధిలో పునరుద్ధరణ పనులు జరపాలని, ఇది మనకు ఒక రిహార్సల్స్ లాంటిదన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఈ కసరత్తు మనకు నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పారు. మాక్ డ్రిల్లింగ్ వల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా సమాయత్తమయ్యారన్నారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉన్నాయా లేవా అని ఫీడ్ బ్యాక్ తీసుకుంటే 95 శాతానికి పైగా ప్రజలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇలాంటి విపత్తుల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని అనుకున్నామని, అలాగే చేశామని చెప్పారు. ప్రజలు చొరవ తీసుకుంటే దాని ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఇది చిన్న తుఫాను అయినప్పటికీ ఈ అనుభవాన్నిడాక్యుమెంట్ చేసి రేపటి అవసరాలకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పెనుగాలుల వేగాన్ని బట్టి జరిగే నష్టాన్ని అంచనా వేయగలగాలన్నారు. గాలి వేగం ఆధారంగా  ఎన్ని విద్యుత్ స్థంభాలు నేలకొరుగుతాయో సరిగ్గా తెలుసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేయాలని చెప్పారు. సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకోగలిగితే విపత్తులకు ముందు మాక్ డ్రిల్ చేయడానికి వీలవుతుందని, ప్రజలు మానసికంగా సమాయత్తం అవుతారని చెప్పారు. గాలి వేగం, గాలిలో కాలుష్యం స్థాయిని అంచనా వేసే సాంకేతికతను వెంటనే అభివృద్ధి చేయండని ఆదేశించారు.  సంబంధిత అంచనా కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ప్రతిపాదనలు ఇవ్వమని అధికారులకు చెప్పారు. తుఫాన్లు, వాయుగుండం వంటివి వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎంత వర్షపాతం వుంటుందో అంచనా వేసి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలని, దానివల్ల వరద నిర్వహణ సులభం అవుతుందని సీఎం చెప్పారు. మత్స్యకారులకు తిత్లీ తుఫాను సందర్భంగా ఇచ్చినట్లుగా నిత్యావసరాల ప్యాకేజ్ ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటికీ, మత్స్యకారులకు, ఇతరులకు కూడా సమానంగా ఈ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పారు. పంట నష్టాన్ని రెండు రోజుల్లో అంచనావేసి 20వ తేదీ కల్లా పరిహారాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,  అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు.
              వర్ష ప్రభావం ఉన్న అన్ని గ్రామాల్లో వెంటనే క్లోరినేషన్ చేయించమని ఆదేశించారు. అంటురోగాలు వ్యాపించకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈ వర్షపు నీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నారు. వాన నీరు వృధాగా సముద్రంలో కలవకుండా చెరువులకు మళ్లించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఫెథాయ్ తుఫాన్ ముందు జాగ్రత్తలు, సహాయ చర్యల్లో పాల్గొన్న 15 మంది మంత్రులను, 51 మంది ఐఎఎస్ అధికారులను, వివిధ శాఖల సిబ్బందిని ప్రభుత్వం తరపున అభినందిస్తున్నట్లు  ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పని ఎక్కువగా లేనందున అందర్నీ వెనక్కి రప్పిస్తున్నామని,  రేపటి నుంచి జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొ్ంటుందని చెప్పారు. విపత్తుల్లో ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంటోందని, ఇదే స్పూర్థి నిరంతరం కొనసాగాలన్నారు. 12వ తేదీన ఇది తుఫానుగా మారుతుందని అంచనా వేసి అప్పటి నుంచి సంసిద్ధంగా ఉన్నామని,  సమర్ధంగా, వాస్తవ సమయంలో ఎదుర్కొన్నామని తెలిపారు. ఏరోజు ఈ తుఫాన్ తీరం దాటుతుందో విశ్లేషించుకున్నట్లు తెలిపారు. తీరాన్ని తాకే సరైన సమయం, కదలికలు, ప్రదేశాల్ని సరిగ్గా అంచనా వేయగలిగినట్లు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం తుఫాన్ తుని-యానాం మధ్యలో తీరాన్ని తాకుతుందని తెలుసుకోగలిగామని, ప్రకాశం జిల్లాలో 50 మంది జాలర్లు సముద్రంలోకి వెళ్లి రాలేదని తెలిసి వెంటనే అప్రమత్తమయ్యామని చెప్పారు. వినూత్న సాంకేతిక విధానాలను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. తుఫాన్ సంసిద్ధతపై ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి దాదాపు నూరు శాతం సంతృప్తి ఫలితాలు వచ్చాయని చెప్పారు. తుఫాన్ సమాచారం అందరికీ అందిందా అని అడిగితే 99.28 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. తాగునీరు, ఆహారం సక్రమంగా అందిందా అని అడిగితే 99.36 శాతం మంది, సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై 93 శాతం మంది, వైద్య సదుపాయాల కల్పనపై 98.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం వివరించారు.
                      1400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఫెథాయ్ తుఫాన్‌ను అంచనావేయగలిగామని ఆర్టీజీ సీఈవో అహ్మద్ బాబు సీఎంకు వివరించారు. దాన్ని చిన్న డిప్రెషన్‌గా ఉండగానే గుర్తించగలిగామన్నారు. యానాం నుంచి తుని లోపల ఉండగా తుఫాన్ కదలికల్ని సరిగ్గా అంచనా వేశామని చెప్పారు. 57 వేల మందికి పైగా ఈరోజు మధ్యాహ్న భోజనం అందించామన్నారు.  14 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా అని తెలిపారు. 300 గొర్రెలు శీతల గాలులకు చనిపోయాయని చెప్పారు. తుఫాన్ వేగం కంటే ముందుగానే అధికార యంత్రాగం కదిలి ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్ అవంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మి.మి. అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పారు.  297 టెలికామ్ టవర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
తుఫాన్ సహాయక చర్యల్లో 2 వేల మంది సిబ్బందిని భాగస్వాముల్ని చేశామని తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేకాధికారి, కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ సీఎంకు తెలిపారు. ఎక్కడా మత్స్యకారులు ఇబ్బంది పడలేదన్నారు. చేపల పడవల్ని సురక్షితంగా వెనక్కి తెప్పించామని చెప్పారు. ఈ తుఫాన్‌లో ప్రజల భాగస్వామ్యం బాగా పెరిగిందన్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం దెబ్బతిని రోజుల తరబడి అంథకారంలో ఉండే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 460 డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసి ఉంచామని, తాత్కాలిక విద్యుత్ దీపాలను సిద్ధం చేశామని వివరించారు. 538 తుపాన్ సహాయక శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇస్రో అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ యానాం-కాకినాడ మద్య తీరాన్ని తాకుతుందని ముందురోజే అంచనా వేయగలిగామని చెప్పారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిశా దిశగా కదులుతున్న ఫెథాయ్ క్రమేణ బలహీన పడుతూ పయనిస్తోందని తెలిపారు. రానున్న 24 గంటల్లో విశాఖ-శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయన్నారు. రేపు ఉదయానికి 60, 70 డ్రోన్లు పంపించి నష్టం వివరాలు తెలుసుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఎక్కడ అవసరమో అక్కడికే డ్రోన్లను పంపించమని సీఎం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రులు పి. నారాయణ, చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. అమలాపురం ప్రాంతంలో కొబ్బరిచెట్టు విరిగిపడటంతో ఒకరికి గాయాలయ్యాయని,  వెంటనే అసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ శాఖకు ఈ తుఫాన్ పెద్ద రిలీఫ్ ఇచ్చిందని మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్  చెప్పారు. 89 సబ్ స్టేషన్లు (33 కేవి) తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతింటే, 84 సబ్ స్టేషన్లను వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. 379 విద్యుత్ స్థంభాలు దెబ్బతింటే అందులో 146 స్థంభాలను పునరుద్దరించినట్లు తెలిపారు. తుఫాన్ సహాయక శిబిరాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి ఈరోజంతా పర్యవేక్షించామని, గంటల వ్యవధిలోనే యథాతధ స్థితికి తీసుకురాగలిగామని మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. విశాఖలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ ఆచూకీ గల్లంతయ్యిందని మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై అధికారులు నావికా సిబ్బందితో మాట్లాడినట్లు సీఎం చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారన్నారు.
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి
హైదరాబాద్ నుంచి రాజధానికి వస్తున్న సచివాలయ ఉద్యోగులు ఇద్దరు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించారని,  వారి ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతూ ఆ ఉద్యోగుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.  రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఇలా జరగడం దురదృష్టకరమన్నారు.


Dec 16, 2018

ఐక్యత లోపమే బీసీలకు శాపం   
  
       రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం పైగా వెనుకబడిన తరగతుల(బీసీ) జనాభా ఉన్నప్పటికీ వారి మధ్య ఐక్యత లేమి కారణంగా పాలనలో తగిన వాటాను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా విభజన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. ఊహించని విధంగా చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి శాసనసభలో  కాంగ్రెస్, కమ్మూనిస్టు పార్టీల సభ్యులు ఉన్నారు. నవ్యాంధ్రలో ఆ మూడు పార్టీలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా లేరు. దాంతో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. రాజకీయంగా ఇది చాలా దయనీయమైన స్థితి. ఈ క్రమంలో విభజన తరువాత బీసీల ఐక్యత కూడా దెబ్బతింది. నాయకత్వ లోపం  కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐక్యత లేదు. రెండు, మూడు బీసీ సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరి దారి వారిదైంది. బీసీ ఉద్యమాలు బలహీనపడ్డాయి. భారత రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల వల్ల కొంత మేలు జరిగింది. సంతోషం. అయితే వారికీ రాజకీయంగా, అధికార పరంగా తగిన ప్రాధాన్యతలేదు. ఈ వ్యవస్థలో చేసేదేమీలేక వారు దాంతోనే సంతృప్తి చెందుతున్నట్లుంది.  బీసీలకు మాత్రం ఏ రకమైన ప్రయోజనం చేకూరలేదు. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. చట్టపరంగా రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఉద్యోగ రిజర్వేషన్లు ఉన్నా, అనేక  సందర్భాలలో వాటిని ఆ వర్గాలకు చెందకుండా  ఎవరికి అనుకూలమైన రీతిలో వారు చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవాలు వచ్చాయి. కంప్యూటర్ యుగం వచ్చింది. నాలుగవ పారిశ్రామిక విప్లవం రాబోతుంది. అనేక మంది జీవితాలలో మార్పు వచ్చింది. సామాజిక కుల చట్రంలో మార్పు రాకపోవడంతో బీసీల జీవనంలో మార్పులేదు. అన్నదాతలు రైతులు మాదిరిగా వస్త్ర దాతలుగా చేనేత కార్మికులు మిగిలారు. దేవాలయాలు, వివాహాలు, వేడుకలలో సంగీత వాయిద్యకారులు వారే. బంగారానికి రూపం ఇచ్చేది వారే. క్రాఫ్ చేసేది వారే. బట్టలు ఉతికేది వారే. కల్లు గీసేదీ వారే. చేపలు పట్టేది వారే. ప్రపంచం సాంకేతిక పరంగా అనూహ్యంగా మారిపోయింది. రాజ్యాధికారం అతి కొద్ది మంది చేతిలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామ క్రమంలో ఏ మాత్రం మారని బతులు బీసీలవి. అన్ని విధాల బీసీలు నష్టపోతున్నారు. వారి జీవితాలు ఏమీ మెరుగుపడలేదు.  ప్రశ్నించే గొంతు లేదు. ఉద్యమించడానికి నాయకత్వంలేదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజంలో ఎవరికి వారు తమ తమ కులాల పరంగా బలపడటానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  బీసీలుగా ఐక్యం కావడానికి  ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ నేపధ్యంలో కొద్దిమంది బీసీల ఐక్యవేదిక ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడంలేదు. రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు సంఘాలుగా విడిపోయినవారిని ఏకం చేయడం కష్టంగా ఉంది. బీసీ వర్గాలకు చెందిన పెద్దలు, ముఖ్యంగా యువత ప్రస్తుత పరిస్థితులను, ఐక్యత లేమిని, నాయకత్వ లోపాన్ని, తమ వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాజకీయంగా తగిన గుర్తింపు లేని స్థితిని గమనించారు. సగానికిపైగా జనాభా ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ వారిని వేధిస్తోంది.  బీసీ కులాల మధ్య ఐకమత్యంలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారికి స్పష్టమైంది.
          బీసీ కులాలకు చెందిన పెద్దలను, వివిధ సంఘాల నాయకులను కలపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలను అవకాశం ఉన్నమేరకు ఏకం చేసి బీసీల బలాన్ని చూపించాలన్న పట్టుదలతో వారుఉన్నారు.  ఎవరి కులాన్ని వారు బలోపేతం చేసుకుంటూనే అంతర్గతంగా బీసీ అన్న భావనను పెంపొందించాలన్నది వారి ఆలోచన.  వచ్చే ఎన్నికలలో ఎక్కడైనా సరే బీసీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ వ్యక్తి తెలిసినా తెలియకపోయినా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా తప్పనిసరిగా ఓటు వేయాలన్న నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు విస్తృత స్థాయిలో ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.  బీసీ సంఘం ఆధ్వర్యంలో  ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఆ విధంగా  బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసి, రాజకీయ పార్టీలపై వత్తిడి పెంచి  రాజకీయ భాగస్వామ్యం కోసం ఎక్కువ శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అధిక టిక్కెట్లు సాధించుకోవడంతోపాటు ఈ సారి బీసీలను ఎక్కువ మందిని గెలిపించి శాసనసభకు పంపాలని వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీసీ వర్గాలలోని  ఉత్సాహవంతులైన కొందరు యువకులు రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.   మేథావులు,పెద్దలు, ఉద్యోగులు వారిని ప్రోత్సహిస్తున్నారు.  ఆర్థిక స్థోమత అంతగాలేని మంచి నడవడిక గల అభ్యర్థులకు అర్ధిక సహాయం అందించి ప్రోత్సహించాలన్న ఉద్దేశం వారిలో ఉంది.  అంతే కాకుండా బీసీయేతరులపై ఇద్దరు బీసీలు పోటీ చేయకుండా చూడాలన్న ఆలోచనతో కూడా వారు ఉన్నారు. అధిక స్థానాలను గెలుచుకుంటేనే రాజకీయ అధికారం, పాలనలో తగిన భాగస్వామ్యం పొందగలమన్నది వారి  అభిప్రాయం. అయితే బీసీ కులాలను రాజకీయంగా ఏకం చేయడం అంత తేలిక కాదు. ఈ వర్గాలకు చెందిన పెద్దలు, కొంతమంది యువత ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కొంతమంది అంతకు మించిన రీతిలో వ్యవహరించి, వారిని తమకు అనుకూలంగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ఆర్థిక, అంగ బలం దాటికి వీరు తట్టుకొని నిలబడటం కష్టం. ఈ పరిస్థితులలో వివిధ బీసీ, కుల సంఘాల నేతలను కలపడానికి కొందరు పెద్దలు, యువకులు పూనుకున్నారు. బీసీ ఐక్యత కోసం ఇగోని, వారి వారి కులాలపై ఉన్న దురభిమాన్ని పక్కన పెట్టి, బేధాభిప్రాయాలను వదిలి ఐక్యవేదికగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఈ రకంగా బీసీలు బలోపేతమైతే రాజకీయ పార్టీలు కూడా ఈ సారి తమ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.   
-     శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్- 9440222914

Dec 14, 2018

ప్రత్యేక హోదాను వ్యతిరేకించినవారు గెలిస్తే సంబరాలా?

ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్

                 సచివాలయం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ  సంబరాలు చేస్తారా? అని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయంలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలిచినవారికి శుభాకాంక్షలు తెలియజేయడంలో తప్పులేదని, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం, ఫ్లెక్సీలు కట్టి అభినందనలు తెలపడం, కేటీఆర్ తో డిన్నర్ లో పాల్గొనడం వంటి వాటిని ఆయన తప్పుపట్టారు. వారు అలా చేయడంలో అర్ధమేమిటని ఆయన అడిగారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినప్పుడు కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, సెంటిమెంట్ అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో రాజకీయాలు చేయడం, వారు గెలిస్తే ఇక్కడ పండగ చేసుకోవడం ద్వారా వారి నైజం తెలుస్తోందన్నారు. వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి కేటీఆర్ తో డిన్నర్ కు హాజరయ్యారని, మిథున్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి అభినందనలు తెలిపారన్నారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని వారికి సలహా ఇచ్చారు. బీజేపీకి బీ టీమ్, సీ టీమ్ లా వ్యవహరించేవారి చర్యలను ఎండగట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని ఎమ్మెల్సీ డొక్కా ప్రజలకు పిలుపు ఇచ్చారు.
              నాలుగున్నరేళ్లుగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న బీజేపీకి శృంగభంగమైందన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. బీజేపీ పాలనలో రైతులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీలు అనేక బాధలు పడ్డారన్నారు. ఓ పక్క ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపితే, వారు ఇక్కడ ఇంటింటికి బీజేపీ అని ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఆయనకు మంచి సలహాలు ఇవ్వవలసిందిపోయి, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించడం త్పప్పన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రాల అధికారం, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆ నాడు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైందని చెప్పారు. రాజ్యాంగ పరిధిలో రాష్ట్రాల అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు.

సమాచార గని కంటెంట్ కార్పొరేషన్
ఏపీలో సమాచార విప్లవం            
 సమాచార సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.-ప్రగతి ప్రభుత్వంలోని అన్ని శాఖలకు విస్తరిస్తోంది. -ప్రగతిమొదటిదశ కింద ముందుగా 14 శాఖల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారురెండు-మూడు దశల్లో మిగిలిన శాఖలను అనుసంధానిస్తారు. ఇన్నోవేషన్ హ్యాక్‌థాన్, ఆర్టీజీ, ఫైబర్‌గ్రిడ్, ఐవోటీ పురోగతిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫామ్, బిగ్ డేటా ప్లాట్‌ఫామ్  పూర్తయ్యాయి. -ప్రగతిద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పరిపాలన తదితర శాఖలలో ఇ-ప్రగతి ప్రవేశపెట్టడంతో పనులలో వేగం పెరిగిందిప్రజల సంతృప్తిని కొలిచేందుకు కూడా  -ప్రగతిదోహదపడుతుంది. ఇదంతా ఒక ఎత్తయితే సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మరో ఎత్తు. అన్ని శాఖల సమాచారం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమాచార విప్లవానికి స్వాగతం పలుకుతోంది. అన్ని ప్రభుత్వ శాఖలలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం, అభివృద్ధికి దారి తీసిన అంశాలు, అభివృద్ధి క్రమం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలలో నూతన పోకడలకు సంబంధించి సమగ్ర సమాచారం అటు ప్రభుత్వ అధికారులకు, ఇటు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కంటెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.


2018 ఫిబ్రవరి 2న జరిగిన మంత్రి మండలి సమావేశం ఏపీ కంటెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)కు అనుబంధంగా దీనికి ఏర్పాటు చేశారు. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతోపాటు సీఈఓని కూడా ప్రభుత్వం నియమించింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ కంటెంట్ కార్పోరేషన్ కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటారు. ఆర్థిక, విద్యుత్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, విద్య, వైద్య, వ్యవసాయ, సహకార శాఖల అదనపు కార్యదర్శి లేక జాయింట్ సెక్రటరీ లేక డిప్యూటీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ , సమాచార పౌరసంబంధాల శాఖల నుంచి ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. కార్పోరేషన్ సీఈఓ కూడా డైరెక్టర్ గా ఉంటారు.  ప్రతి మనిషికి సమాచారం, విషయ పరిజ్ఞానం ప్రాథమిక అవసరంగా ప్రభుత్వం గుర్తించింది.  నవంబర్ 30న జరిగిన 18వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటెంట్ కార్పొరేషన్ రూపొందించిన పోర్టల్‌ను ప్రారంభించారు. కొద్ది రోజుల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
       ప్రభుత్వ శాఖలు, వివిధ అంశాలకు సంబంధించిన సమస్త విజ్ఞాన సమాచారాన్ని ఈ కార్పొరేషన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఇది ఓ సమాచార గని. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్పోరేషన్ సమాచారాన్ని సేకరిస్తుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో పొలం దున్నే దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు చేతికి రావడం, ఆ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న ప్రాంతాలు, రవాణా, మార్కెటింగ్ వంటి అంశాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు, సాంకేతి వినియోగం, ఎరువులు, పురుగుల మందులు లేని ప్రకృతి వ్యవసాయం, ఉత్పత్తుల నాణ్యత... వంటి సమగ్ర సమాచారం సేకరించి అందుబాటులో ఉంచుతుంది. ఇలాగే చిన్న, పెద్దతరహా పరిశ్రమలు, విద్యుత్, పర్యాటక,  నిర్మాణ, సేవల రంగాలు, రెవెన్యూ, విద్య,వైద్యం, కుటుంబ సంక్షేమం, కార్మిక, ఆర్థిక మొదలైన అన్ని శాఖల సమాచార గనిని  ఒక్క క్లిక్ తో ఓపెన్ చేయవచ్చు. సమాచారం పుస్తకం రూపంలో, మాస, వార, దిన పత్రికలలో, డాక్యుమెంట్ల రూపంలో సమాచార, పౌరసంబంధాల శాఖ వద్ద, ఇంకా ఇతరత్రా ఉంటుంది. అంతేకాకుండా చాలా మందికి తెలియకుండా కూడా వివిధ రూపాలలో రాష్ట్రంలో ఎంతో సమాచారం గుప్తంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల గురించి కూడా చాలా మందికి తెలియదు. అటువంటి మొత్తం సమాచారాన్ని  ఈ కార్పోరేషన్ సేకరిస్తుంది. అన్ని రకాల సమాచారాన్ని సేకరించి, ఒక చోట చేర్చి అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ కార్పోరేషన్ పని,  ఒక్క మాటలో చెప్పాలంటే  సమచార సేకరణకు ఇది సింగిల్ సోర్స్ విజ్ఞాన బాంఢాగారం. ప్రతి ఒక్కరికి తాము పని చేసే రంగాల్లో అభివృద్ధి, సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దేశంలో ఈ తరహాగా విజ్ఞానాన్ని అందించే కార్పోరేషన్  మరెక్కడా లేదు. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షలకు  ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, ఉపాధి అవకాశాల కోసం వివిధ రకాల పోటీ పరిక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సమాచార దాపరికానికి తావుండదు. సమాచార సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ముందడుగుగా దీనిని భావించవచ్చు.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Dec 10, 2018


చేనేత కార్మికుని ఔన్నత్యాన్ని చాటిన ‘చేనేత బతుకు’

    
     చేనేత దేశ వారసత్వ సంపద. భారతీయ సంస్కృతితో ముడిపడినది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఇప్పటికీ అత్యధికమంది ఆదారపడి జీవించేది చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత రంగం వడిదుడుకులు, చేనేత కార్మికుల దుస్థితితోపాటు నడుస్తున్న చరిత్రలోని అనేక సామాజిక అంశాలను స్పృశించుతూ ప్రముఖ కథ, నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు సందుపట్ల భూపతి రాసిన కథలు, వ్యాసాలు, గీతాల సంపుటే ‘చేనేత బతుకు’ పుస్తకం. ఇందులో వివిధ పత్రికలలో ప్రచురితమైన 12 కథలు, 8 వ్యాసాలు, 12 గీతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యత గల చేనేత కార్మికులు మన దేశంలో ఉన్నారు. అగ్గిపెట్టెలో పెట్టేంత సన్నటి చీరని నేయల కళాకారులు వారు. వారి బతుకుదెరువుని మెరుగుపరచడంతోపాటు ఆ కళని కాపాడుకోవలసిన అవరసరాన్ని భూపతి తెలియజెప్పారు. 12 కథలు చేనేత రంగం, అభ్యుదయ భావాలు, ప్రేమానుబంధాలు, మానవ సంబంధాలు, హేతువాద దృక్పదం, యువతుల ధైర్యసాహసాలు, యువత చెడు వ్యసనాలు, కుల రహిత సమాజం వంటి విభిన్న అంశాలపై రాశారు.
            ముఖ్యంగా ‘మగ్గం బతుకు’ అనే కథలో చేనేత కార్మికుని దుస్థితితోపాటు ఆడపిల్ల కుటుంబానికి ఎంత చేదోడువాదోడుగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. ఆడపిల్ల అయితే తల్లికి, మగ పిల్లవాడైతే తండ్రికి సహాయపడతారనేది నానుడి. ఆడపిల్ల పుడితే భయపడే రోజులు పోయాయి. వారు కూడా, వారు కూడా ఏంటి కొన్ని కుటుంబాలలో మగపిల్లల కంటే ఆడపిల్లలే చదువులో ప్రతిభ చూపుతున్నారు. కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటున్నారు. ఈ కథలో మల్లేశ్వరి పాత్ర కూడా అటువంటిదే. లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని తెలిసిన తరువాత అబార్షన్లు చేయించుకోవాలనేవారికి కనువిప్పు కలిగించే రీతిలో రాసిన  ఈ చిన్న కథలో జీవితంలోని అనేక అంశాలను కళ్లకు కట్టారు. మనిషి ఔన్నత్యాన్ని చాటే చెప్పారు. ఓ చేనేత కార్మికుడు ఆత్మాభిమానంతో బతికే తీరుని వివరించిన గొప్ప కథ ఇది. అలాగే ‘ఉపాధి’ కథలో కూడా ఓ ఆడపిల్ల కుటుంబం కోసం ఏ విధంగా కష్టపడుతుందో తెలియజెప్పారు.
                 సమాజ క్షేత్రంలో మానవ సంబంధాలు రిక్తమవుతున్న వేళ ఓ రచయిత, ఓ కవి వాస్తవాలవైపు దృష్టిపెట్టి తన కలాన్ని ఎలా ఝుళిపించాలో ‘కథనం దొరికింది’ కథలో వివరించారు. సమాజంలోని కొందరు వ్యక్తులు చేసే మోసాలను తెలియజెబుతూ ‘కనువిప్పు’, ‘ఇదోరకం విద్య’  కథల ద్వారా హెచ్చరించారు.  ఆడపిల్లలు ఝాన్సిరాణీ, రుద్రమదేవి, ఆదిశక్తిలా ఉండాలని ‘భలే అమ్మాయిలు’ కథలో సూచించారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా రాసిన ‘హేతువు’ కథలో భూతాలు, దెయ్యాలు లేవని, నిజమైన దెయ్యాలు భూతవైద్యులేనని, వారి మోసపూరిత కటనని కూడా వివరించారు. ‘ఆదర్శమా వర్థిల్లు’, ‘ఉపాధి’ కథలు కుల రహిత సమాజం, కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తూ రాశారు. దురలవాట్లకు బానిసైతే బతుకు దుర్బరమవుతుందని ‘మారిన మనసు’ కథలో హెచ్చరించారు. ఒక రచయిత తన రచనను అచ్చు రూపంలో చూసుకోవడానికి ఎంత తపన పడతాడో ‘చిత్తగించవలెను’ కథ ద్వారా వివరించారు. మనిషి కేంద్రంగా సమాజ జీవన వాస్తవికత సంఘర్షణల నుంచి వస్తువుని స్వీకరిస్తూ రచయిత దృక్పదం నుంచి  కథ వెనుక గల లక్ష్యాన్ని స్థానీయత, నాటకీయత, క్లుప్తత, భావసరళత, శిల్పపరంగా అక్షర శరాలను సంధిస్తూ..కథను చివరికంటా చదివించే కొసమెరుపు ముగింపు రచయిత సృజించగలిగితే అలాంటి కథల్ని పాఠకలోకం తప్పక ఆస్వాదిస్తుందని యువ రచయితల భుజంతట్టి మరీ చెప్పారు.
             ఇక తన వ్యాసాలలో దేశంలో చేనేత రంగం దుస్థితి, చేనేత కార్మికుల బతుకు, ఈ రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. మొత్తం మీద మనిషితనాన్ని  తన రచనలలో చేనేత కార్మికుల దయనీయ స్థితితోపాటు సముద్ర తీర అందాలను కూడా వర్ణించారు. అన్నదాత రైతైతే వస్త్రదాత చేతన్న అంటూ కదలవోయి నేతన్నా, కదలిరా నేత కార్మిక వంటి గీతాలు ఇందులో ఉన్నాయి.
ఎప్పుడూ ప్రేమ గీతాలు రాసే ఆచార్య ఆత్రేయ
‘‘ గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు.... అని సందేశాత్మక లలిత గీతాలు రాసినట్లు  అభ్యుదయ కథలు, నాటికలు, గీతాలు రాసే భూపతి సన్నజాజీ పూసేవేళ ..., నీ చెదరని చిరునవ్వు..... వంటి భావ గీతాలు కూడా రాశారు. అన్నిటికంటే ముఖ్యం కేవలం రెండవ తరగతి మాత్రమే చదువుకున్న  చేనేత కార్మికుడైన భూపతి తన జీవితానుభవంతో  కులమతాలు లేని సమసమాజం కోరుకుంటూ ఇంతటి గొప్ప కథలు రాయడం విశేషం.
ప్రతులకు రచయిత పేరు: సందుపట్ల భూపతి,
ఇంటి నెంబర్ 3/03(74ఏ), గండాలయ పేట, మంగళగిరి-522503,
పుస్తకం ధర: రూ.80/- సెల్ నెంబర్: 9603569889
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914