Jun 19, 2018


అవినీతిలేని రవాణా శాఖ
మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంస

Ø మీ ముంగిట్లో రవాణా శాఖ
Ø గ్రామాల్లో ఎల్ఎల్ఆర్ మేళా
Ø 3 నెలల్లో లక్ష లైసెన్సులు
  
            సచివాలయం, జూన్ 19: ప్రజలకు కావలసిన అన్ని పనులు ఆన్ లైన్ లో చేయడం ద్వారా రవాణా శాఖలో అవినీతిని పూర్తిగా రూపుమాపినట్లు రవాణా, బీసీ సంక్షేమ, చేనేత శాఖల మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు చెప్పారు. అందుకు కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘మీ ముంగిట్లో రవాణా శాఖ’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్ లైసెన్స్)మేళా కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజల వద్దకు పరిపాలన తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. జన్మభూమి వంటి అనేక కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రజలు నానా అవస్థలు పడేవారన్నారు.  బ్రోకర్లు, లంచాలు, రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవని చెప్పారు. గ్రామాలలో వాహనాలు నడిపేవారందరికీ డ్రైవింగ్ వచ్చని, అయితే వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లడానికి భయపడి లైసెన్సులు తీసుకోరని చెప్పారు. ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ చేయడం ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించామన్నారు. రవాణా శాఖ అవినీతిలేని శాఖగా తాను గర్వంగా చెబుతున్నానన్నారు. ఇప్పుడు ప్రజల ముంగిట్లోకే రవాణా శాఖ వచ్చి లైసెన్సులు అందజేస్తుందని చెప్పారు. తొలి దశలో కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఇచ్చినట్లు తెలిపారు. రెండవ దశలో గ్రామాల్లోకి వెళ్లి టెస్ట్ లు పెట్టి ఎల్ఎల్ఆర్ లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్ఎల్ఆర్ అందజేయడం తమ లక్ష్యం అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రజలలో చైతన్య కలిగిస్తున్నట్లు చెప్పారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అన్ని జిల్లాల్లో కమిటీలను నియమించామని, ఆ కమిటీ ప్రమాదాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటుందని  వివరించారు. కలెక్టర్లు శ్రమ వత్తిడితో ఉన్నప్పటికీ ఈ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదాలు మైనస్ 11 శాతానికి తగ్గాయని, మైనస్ 50 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించాని చెప్పారు. పోలీసుల సహకారం, ప్రజా భాగస్వామ్యంతో ప్రమాదాలు తగ్గిస్తామన్నారు. తాము చేపట్టిన అన్ని చర్యలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అచ్చన్నాయుడు  చెప్పారు. ఆటోలకు కూడా లైఫ్ టాక్స్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. త్వరలో దానికి సంబంధించిన జీవో విడుదలవుతుందన్నారు.

3 నెలల్లో లక్ష లైసెన్సులు
                    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చన్నాయుడుల ఆదేశాల ప్రకారం చేపట్టిన మీ ముంగిట్లో రవాణ శాఖ కార్యక్రమం ద్వారా 3 నెలల్లో లక్ష మందికి ఎల్ఎల్ఆర్ లు అందజేసినట్లు రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. గతంల డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సుదీర్ఘ ప్రక్రియ ఉండేదని, దాంతో చాలా మంది డ్రైవింగ్ చేయగల సామర్ధ్యం ఉన్నా లైసెన్స్ తీసుకునేవారు కాదన్నారు. దాదాపు 33 శాతం మంది లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు చెప్పారు. సర్పంచులు, ఎంపీటీలకు కూడా లైసెన్సులు లేవన్నారు. దాంతో మంత్రి ఆదేశాల ప్రకారం గ్రామాలకు వెళ్లి లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ పరికరాల కొనుగోలులు  మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రూ.10 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు.  స్పీడ్ గన్లు, శ్వాసను పరీక్షించే పరికరాలను, వాహనాలను పైకి లేపే క్రేన్ లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. స్పీడ్ గన్లను మన దేశంలో ఎక్కడా వాడటంలేదని, మన రాష్ట్రంలోనే మొదటిసారిగా వాడనున్నట్లు, వాటిని ఆస్ట్రేలియా, అమెరికాలలో వాడతారని వివరించారు. ఒక్కో స్పీడ్ గన్ ఖరీదు రూ.6 లక్షల రూపాయలని తెలిపారు. ఈ గన్ ద్వారా ఎదురుగా వచ్చే వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలుసుకోవచ్చన్నారు.    మొత్తం 49 స్పీడ్ గన్లు, 420 శ్వాస పరీక్ష పరికరాలు, 13 టోవింగ్ వాహనాలను కొనుగోలు చేసినట్లు వివరించారు. వాటిని పోలీస్, రవాణ శాఖ వారికి అందజేస్తామని చెప్పారు.
విజయవాడ ట్రాఫిక్ డీసీపీ మీరా ప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మోటార్ సైకిల్ వాహనాల వల్లే జరుగుతున్నాయని,  ఆ ప్రమాదాల్లో మృతులు ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రజల్లో హెల్మెట్ ధరించాలన్న అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 3.5 లక్షల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2017లో 4వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, 300 మందికి జైలు శిక్షలు పడ్డాయని తెలిపారు. తాము చేపట్టిన చర్యల ద్వారా ప్రమాదాలు తగ్గినట్లు చెప్పారు. రూరల్ ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడం బాధాకరం అన్నారు. యువకులు వాహనం వేగంతోపాటు మనసు వేగం కూడా తగ్గించాలన్నారు. ఆర్టీఏ అధికారి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ నిన్న ఒక్క రోజు 5వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరకాస్తు చేసినట్లు తెలిపారు. వారిలో 3500 మంది పరీక్ష పాసయ్యారని, వారికి ఎల్ఎల్ఆర్ లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వంద మంది టెస్ట్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
                మంత్రి అచ్చన్నాయుడు పలువురికి ఎల్ఎల్ఆర్ లు అందజేశారు. 13 జిల్లాలలకు చెందిన పోలీస్, ట్రాఫిక్ అధికారులకు స్పీడ్ గన్లు, శ్వాస పరీక్ష పరికరాలు అందజేశారు. జెండా ఊపి టోవింగ్ వాహనాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, అడిషనల్ కమిషనర్ పి.శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Jun 12, 2018


ఎమ్మార్పీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా మార్పు రావాలి
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

                 సచివాలయం, జూన్ 12: ధరల నియంత్రణకు తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని,  అయితే వ్యాపారులు ఎమ్మార్పీ(గరిష్ట చిల్లర ధర) పెంచేస్తున్నారని, అందువల్ల దేశవ్యాప్తంగా ఎమ్మార్పీ వ్యవస్థలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో అర లీటర్ మంచినీరు బాటిల్ పై ఎమ్మార్పీ రూ.40ల ధర ఉందని, తూర్పుగోదావరి జిల్లాలో ఓ మారు మూల గ్రామంలో కూడా లీటర్ మంచినీటి బాటిల్ పైన రూ.100 ధర ఉందని తెలిపారు. వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు 13 మందికి ఫ్రీ బస్ పాస్ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అయిదున్నర ఏళ్ల తరువాత ఈ మండలి సమావేశం ఏర్పాటు చేసినందుకు సభ్యులు అభినందనలు తెలిపారు.  సభ్యులు కొన్ని ప్రధానమైన అంశాలను లేవనెత్తారు. బస్టాండ్లలో యూరినల్స్ కు వెళ్లడానికి రూ.5లు వసూలు చేస్తున్నారని, దానిని ఉచితం చేయాలని, లేదా ఒక రూపాయి మాత్రమే వసూలు చేయాలని కోరారు. మచిలీపట్నంలో ఒక ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్ కట్ చేస్తున్నారని చెప్పారు. చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ లలో తూనికలు తక్కువగా తూస్తున్నారని, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కర్ర కాటాలు వాడుతున్నారని తెలిపారు. జనరిక్ మందుల ధరలు ఎక్కువగా తీసుకుంటున్నారని, బస్టాండ్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటున్నారని చెప్పారు. మందులకు సంబంధించి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రతి జిల్లాకు ఓ వినియోగదారుల అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీవారు పండుగల సందర్భంగా ఛార్జీలు పెంచి, బస్సులు మాత్రం పల్లె వెలుగు బస్సులు నడుపుతున్నారని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద కొన్ని ప్రాంతాల్లో కోడి గుడ్డు ఇవ్వడంలేదని చెప్పారు. డాక్టర్లు మందుల పేర్లు స్పష్టంగా రాయడంలేదని, జనరిక్ మందుల పేర్లు రాయడంలేదని తెలిపారు. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులపై ఫిర్యాదు చేశారు.  స్టెమ్ సెల్ బ్యాంక్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారని, సెల్స్ ని నిల్వ చేయడానికి తగిన రక్షణ కేంద్రాలు లేవని చెప్పారు. కొన్ని చోట్ల జీఎస్టీ నెంబర్ లేకుండా అదనంగా జీఎస్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. నర్సరీలలో నకిలీ మొక్కలు అమ్ముతున్నారని, రైతులు నష్టపోతున్నారని తెలిపారు. చీరలు, రెడీమేడ్ దుస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు జరపడానికి డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ పైన 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. పట్టణాలలో మంచినీటి పైప్ లైన్లు 40 నుంచి 60 ఏళ్ల క్రితం వేసినవి కావడంతో మధ్యమధ్యలో లీకై మురుగు నీరు వస్తుందని చెప్పారు. అనుమతి లేకుండా ప్రతి సందులో, గొందులో మంచినీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల మీ సేవలో అదనంగా రూ.10లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలో ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారని, 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వడంలేదని, కనీస సౌకర్యాలు లేవని, షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నారని, గుర్తింపులేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారని వివరించారు. జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పుల అమలుకు పోలీసు శాఖ సహకారం కావాలని కోరారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, లీగల్ మెట్రాలజీ ఐజీపీ ఈ.దామోదర్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఇన్ చార్జి అధ్యక్షులు డాక్టర్ ఏ.రవి శంకర్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, డాక్టర్ మంజరీ, 13 జిల్లాలకు చెందిన  వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు, తూనికలు, కొలతలు, ఆర్టీసీ, రైల్వే, పంచాయతీరాజ్, మునిసిపల్, పట్టణాభివృద్ధి, ప్రాథమిక విద్య, వాణిజ్య పన్నులు, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన, డ్రగ్ కంట్రోల్ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.

Jun 11, 2018


బీసీ,బడుగు,బలహీనవర్గాల పార్టీ టీడీపీ

మంత్రి కాలవ శ్రీనివాసులు

                    సచివాలయం, జూన్ 11: వెనుకబడిన తరగతులు, బడుగు, బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి బీసీల సంక్షేమానికి ఒక డిక్లరేషన్ ప్రకటిస్తానని చెప్పారని, వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే బీసీలకు తీరని అన్యాయం జరిందన్నారు. ఆయన పాలనలో బీసీల అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. 2008లో 8 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. 26 కులాలను బీసీల జాబితాలో చేర్చారని, దామాషా పద్దతిలో వారికి లబ్ది చేకూర్చలేదన్నారు. వారి పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని మండిపడ్డారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని, పార్టీకి వారు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీని దెబ్బతీయడానికి ఆనాడు బీసీల అణచివేతకు పూనుకున్నారని విమర్శించారు. ఆనాడు బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు వేల కోట్లలో పేరుకుపోతే వారు రక్తం అమ్ముకొని ఫీజులు చెల్లించారని చెప్పారు. రాజకీయంగా కూడా వారిని ప్రోత్సహించలేదన్నారు. వారిని దరిదాపులకు కూడా రానివ్వలేదని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం తొలి నుంచి టీడీపీ కృషి చేస్తోందన్నారు. కీలకమైన పదవుల్లో  బీసీలే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రి వర్గంలో 8 మంది మంత్రులు బీసీలే ఉన్నారని, టీటీడీ చైర్మన్ గా కూడా బీసీనే నియమించారని వివరించారు. గతంలో కూడా ఎర్రన్నాయుడు, దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణ మూర్తి వంటి బీసీలే కీలక పదవులు అలంకరించారని చెప్పారు. అత్యంత వెనుకబడిన గాండ్ల సామాజిక వర్గానికి చెందిన గౌనివాని శ్రీనివాసులుకు శాసన మండలి సభ్యుని చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు.
జగన్ వెంట కేసుల్లో, రాజకీయాల్లో ఉన్నది ఆయన సామాజిక వర్గం వారేనని తెలిపారు. ఏ1 ముద్దాయి ఆయన అయితే, ఏ2 ముద్దాయి ఆయన సామాజిక వర్గానికి చెందినవారేనన్నారు. 2014లో ఎంతమంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. అనంతపురంలో రెండు లోక్ సభ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పి చివరికి ఆయన సామాజిక వర్గానికే ఇచ్చారన్నారు. ఆయన కుడి, ఎడమ, ముందు, వెనుక ఉన్నది ఎవరో, మొన్న ఒక్క రాజ్యసభ స్థానం ఎవరికి ఇచ్చారో అందరికి తెలుసన్నారు. ఏ బీసీ నాయకుడినైనా ప్రోత్సహించారా? ఏ బీసీ నాయకుడి భుజం మీదనైనా చేయి వేసి మాట్లాడావా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో 63 కీలకమైన స్థానాల్లో ఆయన సామాజిక వర్గం వారే ఉన్నారని చెప్పారు. జగన్ తాతగారు దగ్గర నుంచి వెంకట సుబ్బయ్య హత్య దగ్గర నుంచి బీసీలకు జరిగిన నష్టాలు ఒక పుస్తకమే రాయవచ్చన్నారు.

బీసీ సబ్ ప్లాన్ ని అమలు చేసింది టీడీపీ అని చెప్పారు. వైఎస్ హయాంలో 5 ఏళ్లో ఫెడరేషన్లకు రూ.152.27 కోట్లు కేటాయిస్తే, గత నాలుగేళ్లలో రూ.1376 కోట్లు ఖర్చు చేయగా, 2 లక్షల 70 వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. 2004-09 మధ్య కాలంలో ఉపకార వేతనాల ద్వారా 19 లక్షల 49వేల మంది లబ్ది పొందితే, తమ హయాంలో ఈ నాలుగేళ్లలో రూ.2,963 కోట్లు ఖర్చు చేయగా, 36 లక్షల 51వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. అంతేకాకుండా విదేవి విద్య పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీల సంక్షేమం, వారి అభివృద్ధి, వారికి రాజకీయ అవకాశాల గురించి జగన్ మాట్లాడకుండా ఉండటమే మంచిదన్నారు. జగన్ రోజుకు 13 కిలో మీటర్లు తలక్రిందలుగా పాదయాత్ర చేసినా బీసీలు ఆయన దగ్గరకు చేరరన్నారు. తెలుగు దేశం పార్టీ ఆనాడు పెట్టకతోపే బీసీలు కనీసం గుర్తింపునకు కూడా నోచుకునేవారు కాదని కాలవ శ్రీనివాసులు అన్నారు.  


తాత్కాలిక ఉద్యోగులకు 2015 పే స్కేల్ కు సిఫారసు
మంత్రుల బృందం సమావేశం
           సచివాలయం, జూన్ 11 : ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పని చేసే తాత్కాలిక ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక మంత్రి పేషీలోని సమావేశమందిరంలో సోమవారం ఉదయం మంత్రుల బృందం చర్చించారు. ఆర్థిక మంత్రి  యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2016 అక్టోబర్ 16వ తేదీ సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలోపెట్టుకొని వారికి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలికి సిఫారసు చేస్తారు. 1993 నవంబర్ 25వ తేదీకి ముందు విధులలో చేరిన వారి 2015 ఆర్ పీఎస్ లో పేర్కొన్న ప్రకారం కనీస వేతనాన్ని పెంచే విషయం చర్చించారు. ఇప్పటికే 2010 పీఆర్ఎస్ ప్రకారం కనీస వేతనం, డీఏ పొందేవారికి  2015 సవరించిన పే స్కేల్ వర్తించే అంశంపై చర్చించారు. ఆ మేరకు వారి వేతనాలు పెంచాలని మంత్రి మండలికి సిఫారసు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదిస్తే 5 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.21 కోట్లు భారం పడుతుంది. ఈ సమావేశంలో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ  వైద్యవిధాన పరిషత్  కమిషనర్ డాక్టర్ పి.దుర్గా ప్రసాదరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి హేమా మునివెంకటప్ప, డీఎంఈ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

కన్నా ఆధారాలు చూపి ఆరోపించు

మంత్రి కళా వెంకట్రావు
                    సచివాలయం, జూన్ 11: కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి విమర్శించడం, ఆరోపించడం, టీడీపీని తిట్టడం అలవాటైపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు అన్నారు. సచివాలయం 4వ బ్లాక్  పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు చూపించి ఆరోపణలు చేయాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో కొన్ని పద్దతులు ఉంటాయని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పార్టీ విధానాలు, ఎన్నికల హామీలు, నాలుగేళ్లు ఎవరితో కలిసి ఉన్నారు వంటి విషయాలను తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఏదో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దుమ్ముదులుపుకొని వెళ్లడం సరికాదన్నారు. చట్టపరంగా, రాజ్యాంగపరంగా చేయవలసినవి ఉన్నాయని, వాటిని దృష్ఠిలోపెట్టుకొని మాట్లాడాలన్నారు. 2019లో గెలుస్తామని చెబుతున్నారు, ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తోరో చెప్పగలరా? అని అడిగారు. 2014లో టీడీపీతో కలవడం వల్లే ఆ సీట్లైనా గెలిచారన్నారు. నాలుగు ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ సీపీ నేత జగన్మోహన రెడ్డితో స్నేహం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో ప్రశ్నకు ప్రశ్న ఉండదని, సమాదానం ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ వంటి నేతతో స్నేహం చేస్తూ మీరు అవినీతి గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో ఒకసారి ఆలోచించాలన్నారు. బీజేపీని 4 ఏళ్లు నమ్మామని చెప్పారు.

ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటని ప్రశ్రించారు. చట్టబద్దంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అడిగారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పగటి కలలు కంటున్నారన్నారు.  ప్రస్తుత బీజేపీ ఎమ్యెల్యేలంతా ఎవరి అండతో గెలిచారో మరిచిపోయారా అని ప్రశ్నించారు.  2014 సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తులేకుండా పోటీ చేసిన బీజేపీ ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా గెలవలేదని గుర్తు చేశారు.    కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేంటో ప్రజల్లోకి వెళ్లి చెప్పే దమ్ముందా? ప్రత్యేక హోదా సహా విభజన హామీల గురించి ప్రజలు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించే మీకు నిన్నటి వరకు ఆ అవినీతి కనిపించలేదా?,   అధికారం పంచుకున్నపుడు లేని అవినీతి విడిపోయిన తర్వాత, పదవులు కోల్పోయిన తర్వాతే కనిపిస్తోందా? అని అడిగారు. అవినీతి అవినీతి అంటున్న మీకు.. చిత్తూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, నెలకొల్పుతున్న పరిశ్రమలు కనిపించటంలేదా అని అడిగారు. అవినీతి ఆరోపణలు నిజమైతే అన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు ఎలా  వస్తున్నాయో చెప్పాలన్నారు.    కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందని, 24 గంటలు విద్యుత్ అందించడంతో పరిశ్రమలు స్థాపిస్తున్నారని, వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని, నదుల అనుసందానంతో వ్యవసాయ దిగుబడులు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.5 శాతం ఉందని ఇవి మీకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
 ఎవరి ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు పనిచేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. వైసీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న బీజేపీ ప్రజలను తప్పుదారిపట్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 12 అవినీతి కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్ పై బీజేపీ నాయకులు ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. ఈడీ అటాచ్ మెంట్లను కూడా వెనక్కి తీసుకున్నారని, దీనిని బట్టి వీరి రహస్య బంధం తేటతెల్లమవుతోందన్నారు.    అవినీతి కేసుల విషయంలో సత్వర విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని 2014 ఎన్నికల సమయంలో చెప్పిన బీజేపీ ఆ విషయాన్ని విస్మరించి దోషులతోనే దోస్తీ చేస్తోందన్నారు. ఏ-1, ఏ-2 ముద్దాయిలు జగన్, విజయసాయిరెడ్డిలతో కలిసి ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో చెప్పాలన్నారు.
ప్రధానిని ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు
ప్రధాన మంత్రిని విమర్శించిన ఎమ్మెల్యేలు, మంత్రులపై గవర్నర్ కు కన్నాతో సహా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని 135 కోట్లకు సేవకుడని, సేవలో లోపాలు ఉంటే ప్రశ్నిస్తారన్నారు.  ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని 18 హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పా? అని అడిగారు. న్యాయబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వమని కోరడం మీకు కించపరిచినట్లు కనిపిస్తోందా? అని అడిగారు.  విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన, ప్రత్యేక హోదా ఇస్తానని నమ్మించి మోసం చేసిన ప్రధానిని నిలదీయవద్దంటారా? వైకాపా నాయకుల్లా భయపడాల్సిన అవసరం తమకు లేదన్నారు.  
సంస్కారవంతమైన భాష గురించి, ప్రజాస్వామ్యం గురించి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు   కుటుంబరావు  లేవనెత్తిన అంశాలకు సమాధానమివ్వలేక ఆయన పైన వ్యక్తిగత దూషణలకు దిగజారారన్నారు. కుటుంబరావు లెక్కలు తెలిసిన వ్యక్తని, ఆయన స్పష్టంగా లెక్కలు చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ 1982లో  పుట్టినప్పటి నుంచి శాంతిభద్రతలకు వంద శాతం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిషా వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు గానీ నిరసన ప్రదర్శనలు ఇవ్వమని పార్టీ పిలుపు ఇవ్వలేదని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో బీజేపీ వంచించిందని ప్రజల్లో బాగా ఉందని, ప్రజాస్వామ్యంలో చిన్నచిన్న సంఘటనలు జరుగుతాయని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

Jun 9, 2018


ఏ ఊరికి వెళ్లినా అత్యంత సంతృప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
                   సచివాలయం, జూన్ 9: గడచిన నాలుగేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే ఏ ఊరు వెళ్లినా అత్యంత సంతృప్తిగా ఉందని, ఇది గొప్ప అనుభవం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం తెలియచెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, వారిలో స్పూర్తి నింపేందుకు నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడు రోజులు అన్ని గ్రామాల్లో ఇవే అంశాలు చర్చించుకున్నట్లు చెప్పారు. దాదాపు 16,355 గ్రామాల్లో గ్రామ నోడల్ అధికారులు, మండల, నియోజకవర్గ సమన్వయ అధికారులు ఈ కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహించినట్లు కొనియాడారు. ప్రతి రోజూ 30 నుంచి 35 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల పనితీరుని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందినట్లు తెలిపారు. ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో జరిగిన కార్యక్రమంలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయని, గతంలో గ్రామాల్లో ఎండాకాలం అయితే దుమ్ము, వానా కాలం అయితే బురద కనిపించేవని, ఇప్పుడు దుమ్ము ఏమీ లేదని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 17,500 కిలో మీటర్ల  సిమెంట్ రోడ్లు వేశామని వివరించారు. వీధి లైట్లన్నిటినీ ఎల్ఈడీ బల్బులు అమర్చి చరిత్ర సృష్టించామన్నారు. మరుగుదొడ్ల సమస్య పరిష్కరించామని చెప్పారు. 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా పేదలకు ఇళ్లు, పరిశుభ్రత, ఆరోగ్యం, మంచినీళ్లు, మురుగు కాలువలు, అనేక పనులు చేపట్టి గ్రామాల్లో పెను మార్పులకు నాంది పలికామన్నారు. మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒక మనిషి చనిపోయేంత వరకు జీవిత గమనంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎంతో చక్కగా విశ్లేషించినట్లు తెలిపారు.  సీమంతం, వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, ఆరు వేల రూపాయల నగదు, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ పథకం ద్వారా ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రసవం, తరువాత ఇంటికి చేర్చడం, టీకాలు, అంగన్ వాడీ, పరిశుభ్రత, పచ్చదనం, స్కాలర్ షిప్ లు, విదేశీ విద్య, పెళ్లి కానుక, ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పన, ఇళ్ల నిర్మాణం, పెన్షన్....వంటివి ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. త్వరలో నిరుద్యోగ భృతి కూడా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెంచామని తద్వారా రూ.500 కోట్ల వరకు విద్యుత్ అదా అయినట్లు తెలిపారు. చంద్రన్న బీమాతో అయితే అనేక జీవితాలు వెలుగు నింపుకున్నాయన్నారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా వచ్చిన రూ.5 లక్షలతో అప్పులు తీర్చుకొని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నట్లు తెలిపారు. మానవతా కోణంలో ఆలోచిస్తే ఈ విషయంలో తాను సరైన రీతిలో ఆలోచన చేసినట్లు సంతృప్తిగా ఉందన్నారు. 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంటే ఒక్క ఫిర్యాదు కూడా లేదన్నారు. అవినీతికి తావులేని పాలన అందిస్తున్నట్లు చెప్పారు.  పెన్షన్ దారుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ రకమైన పథకాల ద్వారా తనకు గౌరవం పెరిగిందన్నారు.
రుణ మాఫీ చేయడం, విత్తనాలు, ఎరువులు, ఇతర సామాగ్రి ఇబ్బందుల్లేకుండా అందడం, సాయిల్ టెస్ట్ వంటి వాటి ద్వారా వ్యవసాయ ఖర్చు తగ్గి ఆదాయం పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలు అన్నిరకాలుగా ప్రజలకు సేవలందిస్తున్నారని వారిని కొనియాడారు. కళ్యాణ మిత్ర, బీమా మిత్ర, సాధికార మిత్ర వంటి కార్యక్రమాలకు వారు వేరువేరుగా దుస్తులు ధరించి సేవాభావంతో ఎన్నో పనులు చేపడుతున్నారని చెప్పారు. భర్త వదిలివేసిన ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమాజంలోని అందరి అవసరాలను గుర్తించి అన్ని విధాల సహాయపడే పథకాలు అమలు చేస్తున్నట్ల చెప్పారు. సమాజంలో పౌర సేవలు సులభతరం చేసినట్లు తెలిపారు.  ఈ వారం రోజులు తాను వెళ్లే దారిలో కొందరితో మాట్లాడానని, కొందరి ఇళ్లకు వెళ్లి, లబ్దిదారులతో మాట్లాడానని, నేరుగా వారిని అడిగి పొందిన లబ్ది గురించి తెలుసుకున్నానని చెప్పారు. ప్రతి కుటుంబానికి బాధ్యత గల పెద్దగా పని చేశానని, వారి ఆదాయం పెరిగిందని, వారిలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపిస్తోందన్నారు. సంతృప్తి స్థాయితో అంతకు ముందు ఏడాది దేశం 122వ స్థానంలో ఉంటే, రాష్ట్రం 72వ స్థానంలో ఉందని, గత ఏడాది దేశం 133వ స్థానానికి దిగజారితే, రాష్ట్రం 44 స్థానానికి ఎగబాకిందని వివరించారు. రాష్ట్రంలో ఓడిఎఫ్ పూర్తి చేసి, ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ కు వెళ్లినట్లు తెలిపారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
పోలవరం అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ పూర్తి
                 పోలవరం డయాఫ్రం వాల్ పూర్తి అయిందని, దీంతో  ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ పూర్తి అయిందని సీఎం చెప్పారు. రెండు సీజన్లలో దీనిని పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక వర్షాలు, వరదలు వచ్చినా పనులు ఆగవన్నారు. సోమవారం తాను పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళుతున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి తగ్గించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చెందుతోందని, అక్కడ చెరువులలో నీళ్లు చేరాయని, అంతకంటే ఆనందం ఏంకావాలని అన్నారు. అక్కడ కొండలపై కూడా చెట్లు కనపడుతున్నాయని, వాతావరణంలో కూడా మార్పు వచ్చినట్ల తెలిపారు. అడ్డంకులన్నిటినీ అదిగమించుతూ ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పారు. బిజేబీతో కలిసినా, విబేధించినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనన్నారు. మనకు జరిగిన అన్యాయానికి ప్రత్యేక హాదా ఇచ్చినా తక్కువేనన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య,జెఈఈ, నీట్ లలో మనమే నెంబర్ వన్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.  ప్రభుత్వ యంత్రాంగం పని తీరుని ప్రశంసించారు. అత్యధిక మంది బాగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలలో సంతృప్తి 73 శాతం నుంచి 77 శాతానికి పెరిగినట్లు తెలిపారు. పేదవారి కోసం, సమాజం కోసం సంపద సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవర్, గ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణం, శుభ్రత, నీటి భద్రత వంటి సంక్షేమ కార్యక్రమాలు బిగ్గెస్ట్ హిట్ గా,  తనకు అత్యంత సంతృప్తినిచ్చినవిగా భావిస్తున్నట్ల చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోని గ్రామాలు అన్ని విధాలా చాలా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అవసరమైతే నాలుగు ఇతర రాష్ట్రాలలోని గ్రామాలను పరిశీలించి, అక్కడ అభివృద్ధిని అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోని ఓ నాలుగు గ్రామాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి చూడాలని, ఎక్కడ ఎంత      అభివృద్ధి జరిగిందో మీకే తెలుస్తుందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Jun 6, 2018


భారీ స్థాయిలో ఉచిత రేడియోలజీ సేవలు

Ø మారుమూల ప్రాంతాలకూ ప్రత్యేక సేవలు
Ø 10 లక్షల మందికి ప్రయోజనం

                    సచివాలయం, జూన్ 6: ఎన్టీఆర్ వైద్య పరిషత్ కార్యక్రమం కింద రాష్ట్రంలో మారు మూల ప్రాంతాలకు కూడా ఉచిత రేడియాలజీ సేవలు భారీ స్థాయిలో అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రజలు, డాక్లర్ల నిష్పత్తి తక్కువ అని, ఉన్న డాక్టర్లలో కూడా స్సెషలిస్టులు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 8 జిల్లా ఆస్సత్రులు, 31 ప్రాంతీయ ఆస్పత్రులు, 132 గ్రామీణ ఆస్పత్రులలో ఎక్స్ రే యూనిట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే కార్డియాలజిస్ట్ లు తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ డైయాగ్నస్టిక్ సెంటర్లకు వెళుతున్నారని, అందువల్ల వారికి వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలోపెట్టుకొని తమ ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ కార్యక్రమం కింద ఉచిత రేడియాలజీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కేంద్రం నుంచి  రేడియాలజీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందిస్తారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్స్ రే ఫిల్మ్, డయాగ్నైజ్ నివేదికను ఆ కేంద్రానికి పంపుతారు. అక్కడ ఉండే నిపుణులైన రేడియాలజిస్ట్ లు  ఎక్స్ రేని పరిశీలించి సవివరమైన నివేదిక రూపొందిస్తారు. దానిని తిరిగి ఆయా ఆస్పత్రులకు పంపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రాంతీయ, గ్రామీణ ఆస్పత్రులలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్, ప్రైవేట్  భాగస్వామ్యం(పీపీప) పద్దతిలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం కింద అన్ని వివరాలు రియల్ టైమ్ విధానంలో సమన్వయం చేస్తుంటారు. అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,61,572 ఎక్స్ రేలు తీసినట్లు, పది లక్షల మంది రోగులు ప్రయోజనం పొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు ఖర్చు తగ్గడమే కాకుండా వారికి సమయం కూడా కలిసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద మార్చి నెలలో 45,973 మంది ప్రయోజనం పొందినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.