Jan 20, 2018

ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత


Ø నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన జన్మభూమి
Ø మార్చిలో లక్షా 20 వేల కొత్త రేషన్ కార్డుల పంపిణీ

                భారతీయ సమాజంలో ఉత్కృష్టమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతోంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా ప్రభుత్వ పథకాలు అసలైన లబ్దిదారులకు అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందడం కోసం అనేక కుటుంబాలు విడిపోయినట్లు నమోదు చేయించుకుంటున్నారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోవడం బాధాకరం. అందువల్ల  ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడటం కోసం అవసరమైతే ఒకే కుటుంబంలో ఇద్దరికి మించి ప్రయోజనం పొందినా పర్వాలేదన్న నిర్ణయానికి  వచ్చింది. రేషన్ కార్డులే కొలమానంగా కాకుండా  ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అర్హులు ఉన్నా వారికి పింఛన్ సహా ఇతర ప్రభుత్వ  ప్రయోజనాలు అందే విధంగా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  కుటుంబ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.   కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోవడం కోసం ఉన్నతమైన మన కుటుంబ వ్యవస్థ  విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యతను గుర్తించింది. రాష్ట్రంలో ఉన్న కోటీ 38 లక్షల కుటుంబాలలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని అధికారులను ఆదేశించింది. అలా అని రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం సరికాదని,  ఆ ధోరణిని ప్రోత్సహించవద్దని చెప్పింది. అర్హులుగా గుర్తించిన లక్షా 20 వేల మందికి మార్చిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జనవరి 2 నుంచి 11 వరకు పది రోజులపాటు జరిగిన అయిదవ విడత  జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. జన్మభూమి కార్యక్రమాలకు విశేష  స్సందన వచ్చింది.  ప్రజల్లో విశ్వాసం పెరిగింది. పది రోజుల్లో 60 లక్షల మంది జన్మభూమి గ్రామ సభలలో పాల్గొనడం ప్రజావిజయంగా భావించవచ్చు. ఇంతమంది ప్రజల భాగస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి దర్పణం. అధికార యంత్రాంగం కూడా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించింది. అనేకచోట్ల గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణ నెలకొంది. జన్మభూమి దేశంలోనే వినూత్న కార్యక్రమం. ఇతర రాష్ట్రాలకు గొప్ప నమూనా వంటిది. ఇంత పెద్దఎత్తున కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం వహించడం  మరే రాష్ట్రంలోనూ జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో ఇంత పెద్ద  కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగలేదు. సంతృప్తి స్థాయిని అధికం చేసింది. అంతేకాకుండ ఈ జన్మభూమిలో అందిన ఫిర్యాదులు, వినతులు అన్నిటినీ ఆన్ లైన్ లో నమోదు చేయడం విశేషం. పెన్షన్ల పంపిణీ, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా  వంటివాటిపై 60 నుంచి 70 శాతానికి పైగా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాలకు ఈ జన్మభూమి నాంది పలికింది.  ప్రజల సంతృప్తి స్థాయి 80 శాతంకు చేరాలన్నది ప్రభుత్వం లక్ష్యం. గతంలో మాదిరిగా అధికారులపై, ప్రజా ప్రతినిధులపై జనంలో ప్రతికూలత లేదు.  ప్రతికూలతలు అధిగమించి సానుకూలతలు సాధించడం గొప్ప విజయం. ఈ కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా అన్ని స్థాయిల వారిలో ఉత్సాహం నింపేందుకు జన్మభూమిలో విశిష్ట సేవలు అందించినవారిని గుర్తించి అవార్డులు ప్రకటించి  గౌరవించింది. ఉత్తమ గ్రామం, ఉత్తమ వార్డు, ఉత్తమ మండలం, ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ జిల్లా అవార్డులతోపాటు ఉత్తమ సాధికారమిత్ర, ఉత్తమ నోడల్ అధికారి అవార్డులు కూడా అందజేసింది.
                గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అభివృద్ధిపైన, ఆర్ధిక అసమానతల తగ్గింపుపైన దృష్టి  పెట్టింది. అందుకోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు  చేస్తోంది. పేదరికం నిర్మూలన కోసం సమాజ వికాసం, కుటుంబ వికాసం  ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ఆర్ధిక అసమానతలు తగ్గే  అవకాశం ఏర్పడింది.  విద్యార్థులు నెలకోసారి  గ్రామాలను సందర్శించి, గ్రామాభివృద్ధిలో  భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈసారి జన్మభూమి-మా ఊరుకార్యక్రమం ద్వారా పరిపాలన యంత్రాంగంపై  ప్రజలలో సానుకూల ధోరణి రావడం విశేషం.  ఈ కార్యక్రమం ప్రజానీకంలో ప్రభుత్వం  పట్ల విశ్వాసాన్ని మరింత ప్రోదిచేసింది. ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచింది. దీంతో ప్రభుత్వం సంతృప్తి చెందడంలేదు. పింఛన్లు ఎన్ని లక్షలు ఇచ్చామన్నది ముఖ్యం  కాదని, ఎంతమంది అర్హులకు అందిస్తున్నామనేదే అత్యంత ముఖ్యమైన విషయంగా  పరిగణిస్తోంది. అర్హత ఉన్న ఏ ఒక్కరూ పింఛను అందుకోవడం లేదనే అసంతృప్తి  చెందకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. గర్బిణిలకు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించగలిగితే ప్రజలలో వచ్చే  సంతృప్తి వేరుగా ఉంటుంది.  ఈ అంశంపై స్త్రీశిశు సంక్షేమ శాఖ  తగిన కార్యాచరణ  ప్రణాళిక రూపొందించనుంది. క్షేత్రస్థాయిలో పథకాలన్నీ మరింత సక్రమంగా, సమర్ధంగా, వేగంగా ప్రజలకు అందేలా  ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   ఇప్పటికే ఐటీ, ఐవోటీ అంశాలపై పెద్దఎత్తున దృష్టి  పెట్టింది. దీనిని క్షేత్రస్థాయిలో మరింత ఉధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని  గుర్తించింది.   అంగన్‌వాడీ కార్యకర్తలు, సర్పంచ్‌ల స్థాయిలో ఐటీ అంశాలపై త్వరలో  పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్  9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...