Jan 10, 2018

అనుత్పాధక సబ్సిడీలతో వ్యవస్థకు ముప్పు


                      
 ఏ ప్రభుత్వమైనా అనుత్పాధక (ఉత్పత్తి ఏమీ జరగని) సబ్సిడీలు అధికంగా ఇవ్వడం మంచిదికాదు. ఆ రకమైన సబ్సిడీల వల్ల భవిష్యత్ లో సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలుగుతుంది. రాష్ట్రంలోని పేద ప్రజలకు తిండి, గుడ్డ, గూడు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వివిధ పథకాల ద్వారా ఓటర్లను ఆకర్షించడానికి ఒక స్థాయి వరకు ఇటువంటి పథకాలను అనుమతించవచ్చు. సంక్షేమ పథకాల పేరిట స్థాయికి మించి అశాస్త్రీయంగా వస్తువులు, నగదు పంపిణీ చేయడం ప్రభుత్వ ఆర్థిక స్థితిని దెబ్బతీయడమేకాక సమాజానికి చెడు సంకేతాలను అందిస్తుంది. ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడంలో తమిళనాడు ముందుంటుంది.   రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు పేదలకు ఉపాధి అవకాశాలు, వారి జీవనం మెరుగుపడటం కోసం  ఉత్పత్తితో కూడిన సబ్సిడీలు ఇవ్వడం అన్ని విధాల మంచిది.  వారికి వివిధ రకాల పనులు కల్పించి వస్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టపడటంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఆ విధంగా చేస్తే వారికి పని లభిస్తుంది. శ్రమ విలువ తెలుస్తుంది. వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. ఈ రకమైన పథకాలు గతంలో అమలు చేశారు.  ఇప్పుడూ అమలు చేస్తున్నారు. అటువంటి పథకాలనే విస్తృత స్థాయిలో మరిన్ని ప్రవేశపెట్టాలి గానీ, ప్రజాకర్షణ, ఓట్ల కోసం తక్కువ వయసుకే పెన్షన్ లాంటి హామీలు ఇవ్వడం మంచి పద్దతికాదు. తగిన కారణాలు చూపకుండా అందరినీ ఒకేగాటన కట్టివేసి ఏదో ఒక పేరుతో ప్రభుత్వం  ప్రజలకు  డబ్బు ఇవ్వడం అంటే వారికి సోమరితనం నేర్పినట్లే అవుతుంది.  కష్టపడి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే తత్వం వారికి నేర్పాలి. ఉపాధికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉపాధి కల్పించే అంశాలలో, వారికి సంపాదన మార్గాలు చూపించడంలో  ప్రభుత్వం సహాయపడాలేగానీ, వేలం వెర్రిగా, విచ్చలవిడిగా సంక్షేమం పేరుతో అధికంగా పథకాలు, కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. కొన్ని సందర్భాలలో వాటి పేర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పలేనన్ని ప్రవేశపెడుతుంటారు.
                    ఉదాహరణకు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం, సబ్సిడీ ఇవ్వడం వంటి చర్యల వల్ల వాటి అమ్మకాలతోపాటు డిమాండ్ పెరుగుతుంది.  ఆ విధంగా ఉత్పత్తి ప్రకియ జరగడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. చేనేత అంటే దానికి అనుబంధంగా 10-15 రకాల వృత్తుల వారు ఉపాధి పొందే అవకాశం ఉంది. పత్తి పంట ద్వారా వ్యవసాయదారులు, నూలు వడకడం, ఆసు తోడటం, పడుగులు చేయడం, రంగుల అద్దకం, కుంచెలు, లాకలు  తయారు చేసేవారుమగ్గాలు, రాట్నాలు వంటివి తయారుచేసే వడ్రంగులు, చివరకు వస్త్రాల అమ్మకం ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది.  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రోడ్లు, అంగన్ వాడీ భవనాల వంటి వాటి నిర్మాణం, పాఠశాలలు, శ్మశానాలు, చెరువులు, కాలువలు వంటి వాటి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా ఒక పక్క గ్రామీణ ప్రాంతాల్లో  మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. మరో పక్క ఉపాధి లభిస్తోంది. గ్రామీణ చిన్నతరహా పరిశ్రమలతోపాటు బుట్టలకు, తట్టలకు, చీపుర్లకు, కొవ్వొత్తులకు, చాక్ పీస్ లకు సబ్సిడీ ఇచ్చినా అక్కడ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. ఉపాధి లభిస్తుంది.  ప్రజాకర్షణ పేరుతో ఒకరికొకరు పోటీపడి ప్రజలకు డబ్బు ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టడం ఎంతమాత్రం మంచిదికాదు. దానికి బదులు ఓ పలుగు, పార ఇవ్వండి. మట్టి తవ్వే పని చేసుకొని బతుకుతారు. గతంలో ఆదరణ పేరుతో కుల వృత్తులు, చేతి వృత్తి పనులకు సంబంధించిన పరికరాలు ఇచ్చారు. ఇస్త్రీ పెట్టె, బార్బర్ షాపు సామాగ్రి, సన్నాయి, డోలు, చేపలు పట్టే వలలు, కొలివి సామాను, కుండలు, బొమ్మలు తయాలరు చేసే సామాగ్రి లాంటి వాటిని ఇచ్చారు. ఇప్పుడు సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. డ్రైక్లీనర్, బార్బర్, గాజులు, ఫ్యాన్సీ షాపులు, బ్యూటీ పార్లర్,  హోటళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, కుటీర పరిశ్రమలకు విస్తృత స్థాయిలో రుణాలు ఇవ్వవచ్చు. చేసే వ్యాపారం, ఉత్పత్తి ఆధారంగా రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.  ఆ ఇచ్చే రుణాలు ప్రచారార్భాటంగా కాకుండా ఆచరలో సాధ్యమయ్యే విధంగా ఉండాలి. బ్యాంకుల ఇష్టానికి వదిలివేస్తే మంజూరు చేసినవాటిలో సగం కూడా ఇవ్వరు. కొన్ని బ్యాంకులు 30 శాతం కూడా ఇవ్వవు. అలా కాకుండా ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి పేదలు పడే పాట్లు తగ్గించవలసిన అవసరం ఉంది.  వృత్తుల పరమైనవాటికి అతి తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
       భూస్వాములు, వ్యాపారవేత్తలు, అప్పులుపాలైన పేద రైతులను ఒకే గాటన కట్టి రుణమాఫీ చేయడం కూడా సరైన చర్య కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ (ప్రజల) ధనం అధికంగా వ్యయమై పేద రైతులతోపాటు ధనవంతులు కూడా లబ్దిపొందుతారు. ఇటువంటి చర్యలు సమసమాజ నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వ ఏ ఆశయం తో ఆ పథకం ప్రవేశపెట్టిందో అది నెరవేదరుఇటువంటి పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు పేదలకు, అట్టడుగు వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగేవిధంగా విధివిధానాలు రూపొందించాలి. దానికంటే వ్యవసాయ ఉత్పత్తులకు  గిట్టుబాటు ధరలు లభించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేసినవారవుతారు. వ్యవసాయ ఉత్సత్తుల దిగుబడి సమయంలో ధరలు పూర్తిగా పడిపోవడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఉదాహరణకు టమోటాలు ప్రస్తుతం కిలో రూ.3 లకు రైతులు అమ్ముకోవలసి వస్తోంది. కోత కూలి పోతే రైతుకు ఎంత మిగులుతుందో అందరికీ తెలిసిందే. ఆదే టమోటాను ప్రాసెసింగ్ కు మళ్లిస్తే ధరలు అంతగా పడిపోవు.  ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధ్యానత ఇస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక రాయితీలు ఇస్తోంది. ఇటువంటి చర్యల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.  పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా గతంలో కారుల్లో తిరిగే ధనవంతుల పిల్లలు  కూడా లబ్ది పొందారు. ఇటువంటి వాటికి అడ్డుకట్టవేయవలసిన అవసరం ఉంది. పండుగల సందర్భంలో పలురకాల వస్తువులతో ఓ సంచి ఇస్తున్నారు. సంక్రాంతికి కూడా అలాంటి సంచే ఇచ్చారు. దీనిని దృష్టిలోపెట్టుకొని మరో పార్టీ వారు సరుకులతో కూడిన సంచులు కాకుండా సంక్రాతికి ఇంటింటికి ఏకంగా అరిశల ప్యాకెట్ ఇస్తామని హామీ ఇచ్చే ప్రమాదం ఉంది. ఇవి అంత అవసరమా? ఆలోచించడం. మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 32 కులాలలో యాచక వృత్తి చేసుకునేవారు కూడా ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఆ కులాల వారి బతుకు దుర్భరంగా ఉంది. తమకు  రూ.25 వేల నుంచి రూ.లక్షల వరకు అప్పు ఇప్పిస్తే చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని బతుకుతామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలోనే వారు అధికారులను అడిగారుఈ కులాల వారితోపాటు అలా బతకాడానికి ముందుకు వచ్చేవారికి చిన్ని చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల ద్వారా జీవించడానికి ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా అవకాశం కల్పించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు వారి జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అశాస్త్రీయ రుణ మాఫీలను, ఉచితంగా ఇచ్చేవాటిని తగ్గించవలసిన అవసరాన్ని అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.  

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...