Jan 30, 2018

సమయం ఎక్కువలేదు-నిధులు ఖర్చు చేయండి


నోడల్ ఏజన్సీ సాంఘీఖ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు
          
           సచివాలయం, జనవరి 30: ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చేశామని, ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉందని, పనుల వేగం పెంచి ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయాలని సాంఘీఖ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం  జరిగిన ఎస్సీసీ, ఎస్టీసీ 19వ నోడల్ ఏజన్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చితే నిధుల వినియోగంలో కొంత మెరుగు కనిపిస్తోందన్నారు. ఎస్టీ, ఎస్సీ నిధులు 70 నుంచి 75 శాతం మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన వాటిని కూడా చివరి త్రైమాసికంలో ఖర్చు చేయాలని చెప్పారు. గేదెలు కొనుగోలుకు సంబంధించి అధికారులు చెప్పే ధరలకు, రైతులు మార్కెట్ లో కొనుగోలు చేసే ధరలకు వ్యత్యాసం ఉందన్నారు.  వచ్చే బడ్జెట్ లో ఎస్టీ, ఎస్సీలకు ఉపయోగపడే, ఆర్థికంగా భరించగలిగే పథకాలు రూపొందించమన్నారు. ట్రాక్టర్లు కొనుగోలు వంటి పథకాలలో లబ్దిదారుల భాగం ఎక్కువగా ఉన్నందున కొన్ని మండలాల్లో వారు ముందుకు రావడంలేదన్నారు. ఇతరులకు ఇచ్చేవిధంగా గిరిజన రైతులకు కూడా సబ్సిడీ ఇస్తున్నారని, అలా కాకుండా వారికి సబ్ ప్లాన్ నుంచి అదనంగా సబ్సిడీ ఇవ్వాలన్నారు.  అటువంటి పథకాలకు ఎక్కువ సబ్సిడీ ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించమని మంత్రి ఆదేశించారు.
        ఎస్సీ కాంపొనెంట్ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,847.13 కోట్లు కేటాయించగా, నోడల్ ఏజన్సీలకు చెందిన 44 ప్రభుత్వ శాఖలు జనవరి 25 వరకు రూ.7,469.36 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ ప్రకారం రూ.10,916.34 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎస్టీ కాంపొనెంట్ కింద ఈ ఏడాది రూ.3,528.78 కోట్లు కేటాయించగా, నోడల్ ఏజన్సీకి చెందిన 45 శాఖలు జనవరి 25 వరకు రూ.2,610.37 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. సవరించిన బడ్జెట్ ప్రకారం రూ. 4,025.97 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

         సాంఘీక సంక్షేమ శాఖ  ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్  ఎస్సీసీ, ఎస్టీసీ నిధుల వినియోగానికి సంబంధించి అన్ని శాఖల పనితీరుని సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఉపాధికి అవకాశం ఉన్న కోర్సులు ప్రవేశపెట్టడానికి తగిన ప్రణాళికలు రూపొందించమని ఆదేశించారు. చేపల చెరువులు, ట్రాక్టర్లు కొనుగోలు వంటి పథకాలలో లబ్దిదారులకు బీనామీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆధార్ నెంబర్ తో సహా లబ్దిదారుల పేర్లు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.  సివిల్ సప్లైస్, యూత్ సర్వీసెస్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్య శాఖ, సెర్ప్, సర్వశిక్ష అభియాన్, హార్టీ కల్చర్, మన బడి, అంగన్ వాడీ భవనాలు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు తదితర అన్ని విభాగాల్లో నిధుల వినియోగాన్ని సమీక్షించారు. మిగిలిన నిధులను వచ్చే రెండు నెలల్లో ఖర్చు చేయాలని చెప్పారు. గిరిజనులకు ప్రయోజనం కలిగిలా, వారికి ఏవి అవసరమో వాటికి సంబంధించిన కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి, బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమ కమిషనర్ కాంతిలాల్ దండే, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ సుజాతాశర్మ,  మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత,  ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి కల్నల్ వి.రాములు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు, పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...