Jan 29, 2018

అరకువ్యాలీ కాఫీ రుచి చూడండి-గిరిజనులను ఆదుకోండి

మంత్రి నక్కా ఆనందబాబు

మార్కెట్ లోకి అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ ప్యాకెట్లు విడుదల
కాఫీ బాగుంది, రోజూ తాగుతా: మంత్రి జవహర్
              
          సచివాలయం, జనవరి29: అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ సేవించి, రుచి చూసి, ఆస్వాదించి గిరిజనులను ఆదుకోవాలని సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు పిలుపు ఇచ్చారు. సచివాలయం 3వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశమందిరంలో సోమవారం మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తో కలసి ఆయన అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్ కు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గిరిజన ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి, మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ(జీసీసీ) విధి అని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90 కోట్ల టర్నోవర్ ఉన్న జీసీసీ వ్యాపారం  రూ.247 కోట్లకు చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యం అని తెలిపారు. మూడు ఏళ్ల నుంచి అరకు కాఫీకి ప్రాచుర్యం లభిస్తోందన్నారు. ఈ రోజు అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4 లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనందబాబు చెప్పారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకు కాఫీ రుచిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. పోడు, గంజాయి సాగు చేసుకొనో గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన కుటుంబాలు నెలకు రూ.10వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాఫీ ప్యాకెట్లు విడుదల సందర్భంగా అందించిన కాఫీ రుచి చూసి బాగుందని, ఇక తాను రోజూ ఈ కాఫీనే తాగుతానని చెప్పారు. సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ మాట్లాడుతూ 1993 నుంచి అరకుయ కాఫీ మార్కెటింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, 25 ఏళ్లకు ఆ ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు. భాగస్వామ్య సదస్సులలో దేశవిదేశీయులకు ఆరకు కాఫీ రుచి చూపించినట్లు తెలిపారు. అరకు కాఫీ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.

        జీసీసీ ఎండి రవిప్రకాష్ మాట్లాడుతూ గత మూడేళ్లలో జీసిసి అభివృద్ధి క్రమాన్ని వివరించారు.   గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  ప్రభుత్వ రంగ సంస్థ జీసీసీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 25 లక్షల మంది గిరిజనులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  సేవలందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గిరిజనుల అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పంటలను  వారికి తగు గిట్టుబాటు ధరలను చెల్లించి కొనుగోళ్ళు చేసి, వాటిని ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మకాలు చేయటంలో దేశం మొత్తంలోని  గిరిజన సహకార  సంస్థల్లో జీసీసీ  అగ్రగామిగా ఉందన్నారు. గత 3 ఏళ్లుగా జీసిసి లాభాల్లో నడుస్తున్నట్లు చెప్పారు. ఇన్ స్టంట్ కాఫీని ఏలూరు దగ్గర వున్న వేహాన్ కాఫీ వారి ప్రాసెసింగ్ యూనిట్లో తయారు చేయించినట్లు రవిప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫీ డీలర్లు అరకువ్యాలీ ఇన్ స్టంట్  కాఫీ ప్యాకెట్ల కోసం అడ్వాన్స్ గా రూ.30 లక్షల రూపాయల చెక్ ని మంత్రి ఆనందబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సాంఘీక సంక్షేమ శాఖ  కమిషనర్ర ఎం.రామారావు, వేహాన్ కాఫీ సంస్థ యజమాని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...