Jan 1, 2018

గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వండి


జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
మార్చి లోపల అన్ని లక్ష్యాలను పూర్తి చేయాలి

            సచివాలయం, డిసెంబర్ 30: గృహ నిర్మాణ పథకాలను ముఖ్యమైనవిగా భావించి లక్ష్యాల మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ పథకాలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా), సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్ వాడీ భవనాల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు, రోడ్ల సౌకర్యం, వ్యర్ధాల నుంచి ఇంధన ఉత్పత్తి, ప్రణాళికా శాఖకు అందించే డేటా,  గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం, వాటర్ షెడ్, మొక్కలు నాటే కార్యక్రమాలు తదితర పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హౌసింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉమ్మడి బాధ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణంలో వెనుకబడిన జిల్లా కలెక్టర్లను గట్టిగా అడిగారు. పనులలో వేగం పెంచాలని చెప్పారు.  గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, పని పట్ల అశ్రద్ధ చూపినా వారిపై నివేదిక ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు మార్చినాటికి పూర్తి చేస్తామని చెప్పారు.  నెల్లూరు జిల్లాలో పనులు బాగా జరుగుతున్నాయని ఆ జిల్లా కలెక్టర్ ని సీఎస్  అభినందించారు. కర్నూలు జిల్లాలో పనులు ఆలస్యంగా మొదలుపెట్టిన విషయం ప్రస్తావిస్తూ బ్యాటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టారేమిటని ఓ ఛలోక్తి విసిరారు. నంద్యాల ఎన్నికల వల్ల అని ఆ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పారు. పట్టణ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఏలూరు, ధర్మవరం వంటి కొన్ని చోట్ల స్థల సమస్యలు ఉన్నాయని, వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని కొందరు కలెక్టర్లు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు వెనుకబడి ఉన్నట్లు తెలుసుకొని పనులలో వేగం పెంచమని ఆదేశించారు.  నరేగాకు సంబంధించి సీసీ రోడ్లు, అంగన్ వాడీ భవనాల నిర్మాణం, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, శ్మశానవాటికల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి పలు పనులను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం నింపడంలో భాగంగా కలెక్టర్లు శ్రద్ధ వహించి బాధ్యతగా మొక్కలు నాటించాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత(ఓపెన్ డెఫెకెషన్ ఫ్రీ-ఓడీఎఫ్)కార్యక్రమాలను కూడా సమీక్షించారు. నరేగా పనులకు సంబంధించి నిబంధనల ప్రకారం ముందుగా డబ్బు చెల్లించడానికి అవకాశం లేదన్న విషయాన్ని సంబంధిత అధికారి కలెక్టర్లకు గుర్తు చేశారు. అంగన్ వాడీ భవనాలకు సంబంధించి పూర్తి అయిన, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లు సీఎస్ కు వివరించారు. కర్నూలు జిల్లాలో 118, శ్రీకాకుళంలో 168, విజయనగరంలో 159, గుంటూరులో 185 భవనాల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన వాటిని మార్చి 31 లోపల పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి అయిందని, మిగిలిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్లు చెప్పారు. రోడ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎస్ ఆర్థిక సంవత్సరం చివరినాటికి లక్ష్యం పూర్తి అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌ జలసిరి-2లో భాగంగా 35 వేల బోర్‌వెల్స్‌ తవ్వాలని లక్ష్యం కాగా, జిల్లాల వారీగా పూర్తి చేసిన బోర్ వెల్స్ వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లు సీఎస్ కు తెలిపారు. కృష్ణా జిల్లాలో 2500 బోర్లకు 389 మాత్రమే పూర్తి చేసినట్లు తెలుసుకొని పనులలో వేగం పెంచాలని ఆదేశించారుముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి చివరికి 17,591 బోర్ వెల్స్ తవ్వించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారువ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తికి సంబంధించి రాజమండ్రి, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు తదితర చోట్ల జిందాల్, ఎస్ ఎల్ గ్రూప్ ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు, కొన్ని పనులు 2018లో, మరి కొన్ని పనులు 2019లో పూర్తి అవుతాయని,   ఏడు మున్సిపాలిటీలలో స్థల సమస్యలు ఉన్నట్లు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కరికాల వలవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ కు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు, రోడ్ల సౌకర్యాల సమీక్ష సందర్భంగా 1057 పనులు మంజూరైనట్లు, వాటిలో 286 పూర్తి చేసినట్లు, 701 పనులు జరుగుతున్నట్లు, 286 నివాస ప్రాంతాలకు త్రాగునీరు అందజేస్తున్నట్లు  గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రామ్ ప్రకాష్ సిసోడియా వివరించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పనులు జరుగుతున్న తీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 33 పనులకు రూ.5.62 కోట్లు, జాతీయ గ్రామీణ త్రాగునీటి కార్యక్రమం(ఎన్ఆర్డీడబ్ల్యూపి) కింద 325 పనులకు రూ.44.62 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద సీఎం నిధుల నుంచి 699 పనులకు రూ. 104.99 కోట్లు మంజూరైనట్లు వివరించారు. 2623 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.808.46 కోట్లతో 1398 పనులు మంజూరైనట్లు, వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు వివిధ దశలలో జరుగుతున్నట్లు తెలిపారు. పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం  గిరిజన ప్రాంత అభివృద్ధి సంస్థల ప్రాజెక్ట్ అధికారులతో కూడా  సీఎస్ మాట్లాడి ఆయా ప్రాంతాల పనులను  సమీక్షించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంజనీర్లతో సమావేశమై నిర్ణయించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో పనులు చేయించాలన్నారు. విశాఖ నగరంతోపాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆ జిల్లా కలెక్టర్ కు చెప్పారు. ప్లానింగ్ విభానికి సంబంధించిన పలు అంశాలను కూడా సమీక్షించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, మీ సేవా కేంద్రాలు, ఇమ్యునైజేషన్, విద్య తదితర అంశాలన్ని ప్రస్తావనకు వచ్చాయి. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు పలు సమస్యలను వివరించగా, వాటికి పరిష్కార మార్గాలను చెప్పారు. చివరిగా సీఎస్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి, గ్రీనరీకి, ఎన్టీఆర్ జలసిరి, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రణాళికా విభాగానికి సంబంధించి డేటా విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సీఎస్ దినేష్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సంజయ్ గుప్తా, గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...