Jan 20, 2018

జన్మభూమిలో పోటిపడి పని చేసిన అధికారులు

Ø సీఎం చంద్రబాబు ప్రశంసలు
Ø జీవితంలో ఎప్పుడూ పొందనంతటి ఆనందం

              సచివాలయం, జనవరి 19: రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి 11 వరకు పది రోజులపాటు నిర్వహించిన 5వ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు గ్రామ స్థాయి అధికారుల వరకు  పోటిపడి పని చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అమరావతి సచివాలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపైన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన అధికారులకు  శుక్రవారం రాత్రి రాష్ట్ర స్థాయి అవార్డులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి జన్మభూమి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన  తీరుకు జీవితంలో ఎప్పుడూ పొందనంతటి ఆనందాన్ని పొందినట్లు తెలిపారు. ఇది సమిష్టీ విజయం అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ షంషేర్ సింగ్ రావత్ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రియల్ టైమ్ గవర్నెస్ (ఆర్టీజీ) సీఈఓ బాబు.ఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులుల కృషిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయం వంతం చేసినవారందరికీ ప్రభుత్వం తరపున మన:స్పూర్తిగా అభినందనలు తెలిపారు.  అన్ని శాఖల వారితోపాటు జిల్లా కలెక్టర్లు, నోడల్ ఆఫీసర్లు పోటీపడి పనిచేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 18 సార్లు, నవ్యాంధ్రలో 5 సార్లు మొత్తం 23 సార్లు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. పది రోజులపాటు ఉద్యమ స్పూర్తితో పండుగ వాతావరణంలో జరుపుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి విన్నూతనమైన రీతిలో 16 వేల గ్రామాలకు నోడల్ అధికారులు వెళ్లి 9 రోజులు 9 అంశాలపై చర్చించారని, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారని, పదవ రోజు బాగా కష్టపడి పనిచేసినవారికి అవార్డులు ఇచ్చారన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి  పునాదివేసే దిశగా ఉద్యమ స్పూర్తితో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. చాలా సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. రాజకీయాలతో సంబంధంలేకుండా అర్హులందరికీ పథకాల లబ్ది సమకూర్చాలని, ప్రభుత్వ విశ్వసనీయత పెంచాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. సమస్యలలో ఆర్థిక, ఆర్థికేతర అని రెండు రకాల సమస్యలు ఉంటాయని, వాటిలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్థికపరమైన సమస్యలను ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నమేరకు పరిష్కరించాలని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత జన్మభూమిలో ప్రజల సంతృప్తి స్థాయి 58 శాతం ఉంటే, ఈ జన్నభూమి నాటికి 63 శాతానికి పెరిగిందన్నారు. పరిపాలన, ప్రభుత్వం చేసే పనుల పట్ల 80 శాతం సంతృప్తి ఉండాలన్నారు. ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే పని చేసినవారిని గుర్తించాలని చెప్పారు.

విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, చేయని తప్పుకు తమకు శిక్షపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించినట్లు సీఎం చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరేవరకు ఏపీకి సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు.
ఒక్క పైసా కూడా ఆశించకుండా 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతుకు సీఎం మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కాలువల విస్తరణకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు భూములు ఇస్తున్నారని చెప్పారు. పట్టిసీమ, పోలవరం, గండికోట వంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకునే స్థాయికి వచ్చామన్నారు.
దక్షిణాదిలో అతి తక్కువ తలసరి ఆదాయంతో మన ప్రస్థానం మొదలైందన్నారు. టెక్నాలజీతో మంచి ఫలితాలు సాధించవచ్చని, 2028  దేశంలోని మూడు రాష్ట్రాలలో ఒకటిగా, 2029కి నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఎదుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సమిష్టిగా కష్టపడి తెలివితేటలతో టెక్నాలజీతో పని చేయాన్నారు. టెక్నాలజీతో ఏదైనా సాధించవచ్చన్నారు. ఆర్టీజీ, ఈ ప్రగతి, 1100 ప్రజలే ముందు నినాదంతో ఒక్క ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటివి కలలో కూడా ఊహించలేదన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్  కొరతతో ప్రారంభమవగా దానిని అతి తక్కువ కాలంలో అదిగమించినట్లు తెలిపారు. విద్యుత్ రేట్లు పెంచం అని, తగ్గించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వంద శాతం వంట గ్యాస్ అందిస్తున్నట్లు చెప్పారు. 13.5 శాతం వర్షపాతం తక్కువగా పడినా వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా సాధించినట్లు తెలిపారు. గత సంవత్సరం వ్యవసాయ రంగంలో 14.5 శాతం వృద్ధి సాధించగా, ఈ ఏడాది అర్థ సంవత్సరంలో 25.6 శాతం వృద్ధి సాధించినట్లు వివరించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయని అందుకు కృషి చేసినవారినందరినీ మన:స్పూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కలెక్టర్ల సమావేశం ఉన్నందున సమయానికి రాలేకపోయానని, మంచి భోజనం పెట్టాలని అనుకున్నానని, భోజనం సిద్ధంగా ఉన్న సమయానికి పెట్టలేకపోతున్నందుకు సీఎం బాధ వ్యక్తం చేశారు. 

తొలుత పది రోజుల జన్మభూమి కార్యక్రమాలతో సమాచార, పౌరసంబంధాల శాఖ, పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. ఆ తరువాత వి.సుధాకాంత్ ఇసుకరేణువులతో జన్మభూమి కార్యక్రమాల దృశ్యాలను రూపొందించారు. ప్రార్థనా గీతం ఆలపించిన తరువాత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతోపాన్యాసం చేశారు. జన్మభూమి కార్యక్రమాలు ఓ మహత్తర శక్తిగా పేర్కొన్నారు. కృషి చేసినవారినందరినీ అమరావతిలో చూడాలని, వారికి పసందైన విందు ఏర్పాటు చేయాలన్నది సీఎం చంద్రబాబు కోరిక అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం అన్నారు. ఈ స్పూర్తి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.
ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా మాట్లాడుతూ 12,918 గ్రామ పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల వివరాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  దాదాపు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా 700 ప్రాంతాల్లో రెండు లక్షల 60 వేల మంది 5కె రన్ లో పాల్గొన్నాట్లు వివరించారు. 12.39 లక్షల ఫిర్యాలు రాగా, 11.99 లక్షల ఫిర్యాదులు ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు మాట్లాడుతూ ఇక్కడ జరిగిన జన్మభూమి గురించి ఇతర రాష్ట్రాలలో చెప్పుకుంటున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఘనత అన్నారు.
చివరగా రాష్ట్ర స్థాయిలో జన్మభూమి కార్యక్రమాల్లో  ఉత్తమ పనితీరు ప్రదర్శించిన అధికారులకు, ఉద్యోగులకు సీఎం అవార్డులు అందజేశారు. ప్రశంసా పత్రాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. చివరగా అవార్డులు పొందినవారికి, సభకు వచ్చినవారందరికీ విందుభోజనం పెట్టారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...