Jan 10, 2018

రాజకీయ భాగస్వామ్యం కోసం చేనేత గర్జన!

       
రాజకీయ భాగస్వామ్యం కోసం చేనేత కులాలన్నీ ఏకమవుతున్నాయి. రాష్ట్రంలో పద్మశాలీలతోపాటు 19 చేనేత కులాలకు చెందిన వారు 75 లక్షలకుపైగా ఉన్నారు. వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం.  అయినా వారికి చట్ట సభలలో స్థానం కరువైంది. దాంతో వారి గురించి మాట్లాడేవారుగానీ, వారి సమస్యలు పట్టించుకునేవారు గానీ లేరు. రాజకీయంగా వారు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. భారతదేశమంటేనే కులవృత్తుల సమాహార సమాజం. సమస్త ఉత్పత్తులకు సహస్ర కులవృత్తులే కారణం. అందులో చేనేత  ఒకటి. మానవాళికి వస్త్రాలు అందించడమేకాక  చలి, ఎండల నుంచి రక్షణ కల్పించిన శ్రమజీవులు వాళ్ళు. ఆదిమ  దశలో మానవులు ఆకులు కప్పుకున్నారు. ఆ తరువాత నార బట్టలు ధరించి  తమ శరీర అవయవాలు కనపడ కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్రమంగా చేనేత ప్రారంభం అయింది. క్రీ.పూ.4000 సంవత్సరం నుంచి నూలు వకుతున్నారు. క్రీ.పూ.500లో చక్రం కనిపెట్టారు. ఈ చక్రం ప్రపంచ మానవ జీవిత గమనాన్నే మార్చేసింది. అలాగే చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ తరువాత పారిశ్రామికీకరణతో మిల్లు వస్త్రాలు తయారవడంతో చేనేత పతనానికి కూడా అదే కారణమైంది. మిల్లుల్లో ఎన్నిరకాల డిజైన్ వస్త్రాలు తయారయినా చేనేత వస్త్రాల ప్రాధాన్యత, వాటి విలువ తగ్గలేదు. చేనేత కార్మికులు చేనేత ఉనికిని కాపాడుకుంటూనే వస్తున్నారు.  పద్మశాలీలు, దేవాంగులు మొదలైన చేనేత కులాల వారు మంచి నాణ్యమైన బట్టలు తయారు చేసేవారు. బ్రిటీష్ వారు ఇండియాను వదిలిపెట్టి పోయే సమయానికే అగ్గిపెట్టెలో పెట్టే చీరను నేశారంటే వారు ఎంతటి  నైపుణ్యం కలిగినవారో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా జాతీయోద్యమంలో చరకా, చేనేత వస్త్రాలు కీలక పాత్ర పోషించాయి. 1905 ఆగస్టు 7 కలకత్తాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేయడంతో విదేశీ వస్తు బహిష్కరణ ప్రారంభమైందిరాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో గాంధీజీ చేర్చారు. తకిలి అనే కదురు రూపొందించి అందరు దూదితో నూలు వడకాలని, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువచ్చారు. గాంధీజీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్స వంగా కేంద్రం ప్రకటించిందిగాంధీజీ కృషివల్ల ఖాదీ బట్టలకు గొప్ప గౌరవం దక్కింది. పట్టు బట్టలవలె వాటికి గౌరవం లభిస్తోంది. వర్షాకాలంలో చేనేత పని సాగదు. దాంతో వారికి ఆ కాలంలో కడుపు నిండా తిండి కూడా లభించని పరిస్థితి. అందువల్ల మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇస్తున్నవిధంగా చేనేత కార్మికులకు కూడా చేనేత విరామ భృతి ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని చేనేతకు కూడా వర్తింపచేయాలని వారు కోరుతున్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక సబ్సిడీ 365 రోజులు కొనసాగించడంతోపాటు రైల్వే, టెలిఫోన్, ఆర్టీసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారానికి కనీసం ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించడాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి కోట్లాది మందికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. చేనేత అంటే దానికి అనుబంధంగా 10-15 రకాల వృత్తుల వారు ఉపాధి పొందే అవకాశం ఉంది. పత్తి పంట ద్వారా వ్యవసాయదారులు, నూలు వడకడం, ఆసు తోడటం, పడుగులు చేయడం, రంగుల అద్దకం, కుంచెలు, లాకలు  తయారు చేసేవారుమగ్గాలు, రాట్నాలు వంటివి తయారుచేసే వడ్రంగులు, చివరకు వస్త్రాల అమ్మకం ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. చేనేత అనేది దేశ వారసత్వ సంపద. దానిని కాపాడుకోవడానికి ఏ ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలేదు. బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకపోగా కోత విధిస్తున్నారు. అదేమని అడగడానికి చట్ట సభలలో చేనేత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కరువయ్యారుదాంతో వారి సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి అవకాశం లేకుండా పోయిందిఅటు పార్లమెంట్ లోగానీ, ఇటు ఏపీ శాసనసభలో గానీ చేనేత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. చట్ట సభలలో చేనేత గళం విప్పడానికి ఈ వర్గానికి రాజకీయ వారసత్వం కరువైందిచేనేత ఓటర్లు గణనీయంగా ఉన్నా ఏపీ శాసనసభలో 175 మంది సభ్యులలో  ఆ వర్గానికి చెందిన ఒక్కరు కూడా లేరు. అంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చట్టసభకు పోటీ చేసి గెలిచేటంతటి ఆర్థిక స్తోమత వారికిలేదు.  అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప ఒక్కరే లోక్ సభకు ఎన్నికయ్యారు. వారి పరిస్థితిని గమనించి శాసనమండలిలో ఇటీవల ఈ వర్గానికి చెందిన పోతుల సునీతకు అవకాశం కల్పించారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో 18 వరకు శాసనసభ స్థానాలు  చేనేత కులాలకు దక్కాలికనీసం 15 మంది చేనేత కులాల నుంచి ఎమ్మెల్యేలుగా వస్తేనే చేనేతలకు నిజమైన న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితులలో చేనేత కులాలన్నీ ఏకమైతే తప్ప ఫలితం ఉండదని వారికి అర్ధమైంది. చట్ట సభలలో స్థానం సంపాదించిన రోజే తాము  రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. చేనేత కులాలు ఎవరికి వారు మేం గొప్పంటే మేం గొప్పఅని వాదించుకుంటూ ఎవరికి వారుగా ఉంటే సాధించేది ఏమీ లేదని అర్ధమైపోయింది.

దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జ పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలిసేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియకరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాలకుర్ని, ఖత్రినీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్,  సాలివన్, నెస్సి మొదలైన కులాలు ఉన్నాయి. దాదాపు 19 కులాల వారు ఏపీ ఉన్నారువాటిలో అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే చేనేతకు, చేనేత కుటుంబాలకు ఎంతో నష్టం జరిగిందని తెలుసుకున్నారు.
చేనేతకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహంలేకపోవడంతో చేనేత పరిశ్రమ కుంటుపడిపోయింది. దాంతో మరో పని చేయడం చేతకాని చేనేత కార్మికులు అప్పులపాలై, అధిక వడ్డీలు చెల్లించలేక, ఆత్మగౌరవం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వారికి ఉపాధి భద్రతలేదురాష్ట్రంలోని చేనేత కులాలన్నీ కలిసి తమ బలం ప్రదర్శించి, గర్జన వినిపించడానికి సిద్ధమయ్యాయి.
తక్కువ జనాభా కలిగిన కులాలకు కార్పోరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నారని, ఇంత మంది జనాభా ఉన్నా చేనేత కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడానికి కారణం తమలో ఐక్యతలేకపోవడమేనన్న భావన వారిలో ఉంది.
కొంతమంది ఉత్సాహవంతులైన పద్మశాలీలు  చేనేత కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో గుంటూరులో ప్రైవేటుగా చేనేత ఫైనాన్స్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు గానీ, దానికి నిధుల కొరత వెంటాడుతోంది. ఈ పరిస్థితులలో రాజకీయ భాగస్వామ్యం ఉంటేనే నిలదొక్కుకోగలుగుతామని నిర్ణయానికి వచ్చి  అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చేనేతకు ప్రాధాన్యత తగ్గిందని, చేనేత కులాలు, ఉప కులాలన్న వ్యత్యాసం వదిలివేసి రాష్ట్రంలోని చేనేత కులాల వారందరూ ఏకమై ఒక్క తాటిపై నిలబడి సమస్యలు పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. రాజకీయ భాగస్వామ్యం కోసం ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. చేనేత గళం వినిపించాలంటే చట్ట సభలలో స్థానం సంపాదించాలిఅలాగే అందరూ కలసి బలీయమైన శక్తిగా ఏర్పడి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ శాసనసభ స్థానాలు గెలుచుకోవాలన్న  గట్టి పట్టుదలతో ఉన్నారు. తమకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీకే తమ మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. అంతేకాకుండా అందరూ కలసి బలప్రదర్శన చేస్తేనే రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తాయన్న అభిప్రాయానికి వారు వచ్చారు. దాంతో భారీ స్థాయిలో లక్ష మందితో విజయవాడలో ఒక ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నారు. చేనేత కులాలలో ఏ నియోజకవర్గంలో ఏ కులం వారు ఎక్కువ ఉంటే వారిని పోటీకి నిలబెట్టాలని చేనేత పెద్దలు నిర్ణయించారు. చేనేత కార్మికులునందరినీ మగ్గం దండు పేరుతో ఒకరు ఏకం చేస్తుంటే, అన్ని చేనేత కుల సంఘాల పెద్దలను కలిసి ఏకంచేసే పనిలో  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ (చేనేత ఐక్యవేదిక) ఉంది. అందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి, ప్రభుత్వ సహకారంతో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఫ్రంట్ కృషి చేస్తోంది. భారీ బహిరంగ సభ నిర్వహణకు చేనేత కులాల, ఆ కులాల పెద్దల సమీకరణలో ఫ్రంట్ నిమగ్నమై ఉంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...