Jan 25, 2018

ఏపీకి తిరుగులేని నేత చంద్రబాబు


               ఎవరు ఎన్ని చెప్పినా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని నేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన  నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయనకున్న అపార అనుభవంతో నిలదొక్కుకునేలా చేస్తున్నారు. తుది నిర్ణయం తీసుకున్న తరువాత ఏపీ నేతల అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పడానికి అవకాశం లేకుండా, కొంపలు మునిగిపోతున్నట్లు ఆదరాబాదరగా అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. రాజధాని లేదు. ఆర్థిక లోటు. విద్యుత్ కొరత. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయవనరులు హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం
వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రాన్ని దయనీయమైన స్థితిలో వేరు చేశారు
. అయినా కూడా చంద్రబాబు నాయుడు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో రాష్ట్రానికి నూతన రాజధానితోపాటు జలవనరులు, -ప్రగతి, పారిశ్రామికీకరణ, ఇతర  ఆదాయ వనరులు సమకూర్చడానికి రాత్రిపగలు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందిని కూడా పరుగులు పెట్టిస్తూ అభివృద్ధిలో, వృద్ధి రేటులో ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను రూపొందించుకుని రెండంకెల వృద్ధి రేటు సాధించారు. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జీవీఏ - గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జీవీఏ వృద్ధి రేటు గత ఏడాది, ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కువగానే ఉంది. దేశంలో 25 ఏళ్ల క్రితం పివి నరసింహారావు హయాంలో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితాలు మన రాష్ట్రంలో కూడా కనిపిస్తున్నాయి. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు ప్రైవేటు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. దేశంలో సంపదతోపాటు ఉద్యోగ అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగాయి. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణలను అందిపుచ్చుకొని, ఆర్థిక పరంగా రాష్ట్రంలో గట్టి పునాదులు వేశారుమళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గతంలో తను కొనసాగించిన విధానాలనే మళ్లీ కొనసాగించారు. ఆయన వేసిన పునాదులపై బలపడిన  వ్యవస్థ నుంచి మంచి ఫలితాలు రావడం మొదలైంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర ఏళ్లలో ఏడాదికి ఏడాది వృద్ధి నమోదవుతోంది. దాంతో అన్ని రంగాలలో సమ్మితళిత వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది.  
మానవ వనరులు, మౌలిక వసతులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సుస్థిరత, పాలనావిధానం, వ్యాపార అనుకూల వాతావరణం అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) సంస్థ దేశవ్యాప్తంగా 2016లో 29 రాష్ట్రాలు, ఢిల్లీతో సహా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందే వాతావరణం ఉందని పేర్కొంది. కార్మికుల లభ్యత, కార్గో నిర్వహణ, సులభతరమైన భూకొనుగోలు కార్యకలాపాలు, ఏపీ ప్రధాన బలాలని సర్వే నివేదిక వెల్లడించింది.

              అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటూ  సమర్థవంతమైన పాలనతోపాటు ఆర్థిక వృద్ధి సాధించేందుకు చంద్రబాబు చేపట్టిన బహుముఖ వ్యూహాలు ఫలిస్తున్నాయి. పాలన వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్) మరో ఐదు (నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం) ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెయ్యడం ద్వారా దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు ఆలోచన. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయడంతోపాటు  పథకాలు అమలు చేస్తున్నారు. ప్రపంచం అంతా ఏపీ పైపు చూసేలా తెలుగువారి సత్తా చాటుతూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. విదేశీ, స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఈ రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నారువిద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రం ఏపీ. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ వినియోగంలో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో నూరు శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి అయింది. రాష్ట్రంలో ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రూ.149 లకే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ మూడు సౌకర్యాలను కల్పిస్తున్నారు. పౌర సేవలన్నీ ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. ప్రజలే ముందు అన్న నినాదంతో 1100కు ఒక్క ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కారం అయ్యే ఏర్పాట్లు చేశారు. -పరిపాలనలో రాష్ట్రం ముందుంది. వచ్చే మార్చి నుంచి పేపర్ లెస్ పాలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, ఇన్నొవేషన్ పాలసీలు, -గవర్నెస్ లో రాష్ట్రం అద్వితీయమైన ప్రగతి సాధించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించింది. ప్రపంచంలో ఈ-ప్రగతి ద్వారా పరిపాలన కొనసాగించే రాష్ట్రాల సరసన చేరింది. ఈ విధంగా అన్ని అంశాలలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోంది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉండటం ఓ వరం. సముద్రంలోనే కాకుండా తీరం వెంట భూగర్భంలోనూ అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందిదానికి తోడు రాష్ట్రంలో  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో సాగర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ సీఎం దేశ,విదేశాల్లో పర్యటిస్తూ పెట్టుబడులను రాబడుతూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయిరాష్ట్ర తీరప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపధ్యంలో కేంద్రం తీర ప్రాంత ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు చేసి అనేక రాయితీలు ఇవ్వడం ద్వారా  పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో పెట్టుబడుల వృద్ధి, భవిష్యత్ అంచనాలపై చేసిన అధ్యయనంలో  దేశంలో ఏ రాష్ట్రం సాధించనంతటి వృద్ధిని ఏపీ సాధించింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద రాష్ట్రానికి 8.1 శాతం పారిశ్రామిక  పెట్టుబడులు రాగా2015-16 లో  15.8 శాతం పెట్టుబడులు వచ్చాయి. అంటే  ఒక్క ఏడాది కాలంలో 7.7 శాతం పెట్టుబడులు పెరిగాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులలో లక్షల కోట్ల పెట్టుబడుల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయులు కూడా కుదుర్చుకుంది.

          రాష్ట్రం గురించి సీఎం కన్న కలలు ఒక్కొక్కటిగా  ఫలిస్తున్నాయి. 2022 నాటికి దేశంలో మొదటి 3 రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా ఉండాలని, 2029 నాటికి మొదటి స్థానానికి చేరాలన్ని ఆయన లక్ష్యం. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి కావలసిన ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్రం గడచిన గడచిన మూడన్నరేళ్లలో సాధించిన ప్రగతిని గమనిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. చంద్రబాబుపై ఉన్న నమ్మకం, ఆయన కృషి ఫలితంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకింది. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఉద్యమంలా ఓ ఊపు తీసుకువచ్చి ఈ స్థాయికి తీసుకురావడం చంద్రబాబుకే చెల్లింది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...