Nov 16, 2018


చంద్రన్న బీమాకు అత్యంత ప్రాధాన్యత
అధికారులకు మంత్రి పితాని ఆదేశాలు
Ø జాప్యం లేకుండా కేసుల అప్ లోడ్
Ø వారం రోజుల్లో దివ్యాంగ సర్టిఫికెట్
Ø పది రోజుల్లో క్లెయిమ్ పరిష్కారం
Ø కమిషనర్ కు, సిబ్బందికి అభినందనలు
Ø 100 శాతం పరిష్కారం అయితేనే సీఎంకు సంతృప్తి
Ø ప్రతిశాఖలో మోనిటరింగ్ బాధ్యతలు ఒకరికి అప్పగింత

               సచివాలయం, నవంబర్ 16: దేశం మొత్తంమీద ప్రాముఖ్యత కలిగి, రాష్ట్రానికి ఓ విశిష్ట స్థానం సంపాదించి పెట్టిన చంద్రన్న బీమా క్లెయిమ్ ల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం  అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కార్మిక, కర్మాగారాల శాఖల మంత్రి పితాని సత్యనారాయణ సంబంధింత అధికారులను దేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం చంద్రన్న బీమా పథకం పనితీరుని ఆయన సమీక్షించారు. ఈ పథకానికి సంబంధించి అన్ని స్థాయిల్లో సమర్థవంతంగా పని చేస్తున్న కమిషనర్ ని, సిబ్బందిని మంత్రి అభినందించారు. చంద్రన్న బీమా, చంద్రన్న రైతుబీమా పథకాలకు సంబంధించి ప్రమాద మరణాలు, సమజ మరణాలు, పరిష్కరించిన క్లెయిమ్ లు, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ ల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆదేశాల ప్రకారం వేగంగా కేసులు పరిష్కరించాలని మంత్రి చెప్పారు. కేసులు అప్ లోడ్ చేయడంలో, పరిష్కరించడంలో ఆలస్యం జరుగకుండా చూడాలన్నారు. బీమా కంపెనీలకు కావలసిన పత్రాలను అందజేస్తే  కేసులను త్వరగా పరిష్కారించడానికి అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల వారికి కావలసిన పత్రాలు అందజేయడంలో జాప్యం చేయవద్దని చెప్పారు. ఈ పథకంలో ప్రమాద బీమా కేసులను ఎఫ్ఐఆర్ ఆధారంగా పరిష్కారిస్తారని, అందువల్ల ఆ శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని అందజేయడంలో జాప్యం చేయవద్దన్నారు. ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినవారికి వారం రోజులలో సర్టిఫికెట్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.  అలా ఇవ్వడం సాధ్యకాని పరిస్థితుల్లో కారణాన్ని తెలపాలని చెప్పారు.  99 శాతం క్లెయిమ్ లు పరిష్కరించిన ఎల్ఐసీ వారిని అభినందించి, ఆ ఒక్క శాతం ఎందుకు కాలేదని ప్రశ్నించారు. వంద శాతం ఫలితాలు సాధిస్తేనే ముఖ్యమంత్రి సంతృప్తి చెందుతారని, ఆ ఒక్క శాతం విషయం ఆయన తమని అడుగుతారని చెప్పారు. పది రోజుల్లో చంద్రన్న బీమా క్లెయిమ్ లు పరిష్కరించాలని మంత్రి పితాని ఆదేశించారు.
                  ఈ పథకానికి సంబంధించిన ప్రతి శాఖలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్ అదేశించారు. మోనిటరింగ్ చేసే బాధ్యతను ఒక ఉద్యోగికి అప్పగించాలన్నారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టాలని, రావలసిన సర్టిఫికెట్లు తెప్పించాలని చెప్పారు. చంద్రన్న బీమా ప్రాధాన్యతను, పథకం నియమ నిబంధనలకు సంబంధించి డాక్టర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో మన రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోందని, దిగువ స్థాయిలో పనులు ఆ స్థాయిలో జరగడంలేదన్నారు. అక్కడ మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తిరస్కరించిన క్లెయిమ్ లు పరిశీలించి వాటిని కూడా జాప్యంలేకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్ శాఖలో పెండింగ్ కేసులు 400 నుంచి 80కి తగ్గినట్లు ఆ శాఖ అధికారి చెప్పారు. గుంటూరు జిల్లా శావల్యాపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఒక పెండింగ్ కేసు సమస్య వివరించగా, దానికి అధికారులు పరిష్కారం చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈఓ డాక్టర్ పి.కృష్ణమోహన్, ఏపీ వైద్యవిధాన పరిషత్ అధికారి శ్రీదేవి, పోలీస్, బీమా కంపెనీల అధికారులు హాజరయ్యారు.

Nov 15, 2018

కాపులకు ప్రభుత్వ దీవెన
ఫలించిన కాపుల పోరాటం

v బీసీలుగా శాసనసభలో తీర్మానం
v పోరాడి సాధించుకున్న కాపులు
v కాపులకు అండగా ప్రభుత్వం
v అభ్యున్నతికి ఆరు పథకాలు
v ఏడాదికి రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్లు కేటాయింపు
v గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాపు భవనాలు
                  'ప్రపంచ కార్మికులారా ఏకంకండి, పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్ళు తప్ప. విప్లవం ద్వారా నీదైన జీవితాన్ని నీవు సంపాదించుకుంటావు’’ అనే దాన్ని ‘‘రాష్ట్రంలోని కాపుల్లారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీలేదు మన మధ్య దూరం తప్ప, ఉద్యమాల ద్వారా మనదైన జీవితాన్ని మనం సంపాదించుకుందాం’’ అన్న రీతిలో పోరాడి చాలా వరకు విజయం సాధించారు. రాజకీయంగా బలపడ్డారు. అధికార పదవులు పొందారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నారు. కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన ఈ వ్యవస్థలో ఇతర కులాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం కూడా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చడానికి శాసనసభలో తీర్మానం చేసింది. వారి సంక్షేమం  కోసం ఆరు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు  సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ఏడాదికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వందల కోట్ల వరకు మంజూరు చేస్తోంది. కాపుల కోసం ప్రత్యేకంగా స్వయం ఉపాధి, విదేశీ విద్యా దీవెన, విద్యోన్నతి, నైపుణ్య అభివృద్ధి, కాపుల భవనాలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ వంటి పథకాలు  ప్రవేశపెట్టింది.
              
          బ్యాంక్ లతో అనుబంధంగా స్వయం ఉపాధి పథకం ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 46,019 మందికి రూ.588.50 కోట్లు రుణాలు అందజేశారు. 2017-18లో 40,397 మందికి రూ.602.10 కోట్లు ఇచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 74,387 మందికి రూ.1487.74 కోట్లు రుణాలుగా అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అక్టోబర్ వరకు 56,661 మందికి రూ.795.26 కోట్లు మంజూరు చేశారు. రుణాల మంజూరులో తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విదేశీ విద్యా దీవెన పథకం కింద 2016-17లో 365 మందిని ఎంపిక చేసి, రూ.39.69 కోట్లు ఖర్చు చేశారు. 2017-18లో లక్ష్యానికి మించి 1050 మందిని ఎంకి చేసి రూ.64.55 కోట్లు ఖర్చు చేశారు.  2018-19లో వెయ్యి మంది లక్ష్యంగా రూ.110 కోట్లు కేటాయించారు. అక్టోబర్ వరకు 342 మందిని ఎంపిక చేసి 37.62 కోట్లు మంజూరు చేశారు. సివిల్స్ కు కోచింగ్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన విద్యోన్నతి పథకం ద్వారా 2017-18లో 11 కోచింగ్ ఇన్ స్టిట్యూషన్ల ద్వారా 661 మందికి రూ.14.25 కోట్లు ఖర్చు చేసి శిక్షణ ఇప్పించారు. వారిలో 8 మంది యుపిఎస్సీ సివిల్స్ మెయిన్ కు అర్హత సాధించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఇతర గుర్తింపు పొందిన సంస్థల  ద్వారా 12,463 మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులలో నిర్వహించిన జాబ్ మేళాలలో 1284 మంది కాపు యువత షార్ట్ జాబితాకు ఎంపికయ్యారు. ప్రతి జిల్లా కేంద్రంలో 13 కాపు భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున రూ.26 కోట్లు మంజూరు చేశారు. 10 జిల్లా కేంద్రాలలో రెవెన్యూ శాఖ భూములు కూడా కేటాయించింది. 2017-18లో 80 మినీ కాపు భవనాలకు రూ.42.59 కోట్లు మంజూరు చేశారు. 2018-19లో 200 మినీ కాపు భవనాలు లక్ష్యం కాగా, అక్టోబర్ వరకు 123 భవనాలు, రూ.32.41 కోట్లు   మంజూరు చేశారు. ఇప్పటికే ఒక భవన నిర్మాణం పూర్తి అయింది. 15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 58 భవనాల నిర్మాణాలు టెండర్  దశలో ఉన్నాయి. మరో 130 భవనాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించారు. 2017 డిసెంబర్ 21న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2,82,155 మంది విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పరిధిలోకి వచ్చారు. గత ఏడాది 1,56,303 మంది విద్యార్థులు రూ.263 కోట్లు అందజేయగా, ఈ ఏదాడి అక్టోబర్ వరకు 1,25,852 మంది విద్యార్థులకు 213.38 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మండలాలు, డివిజన్ లలో కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి తగిన స్థలాలను గుర్తించమని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ రకంగా అన్ని స్థాయిల్లో, అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం కాపులకు పూర్తి అండగా ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 14, 2018


పట్టణాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధి
పట్టణ మౌలిక వసతుల కల్పన, నిర్వహణపై సీఎస్ సమీక్ష
              సచివాలయం, నవంబర్ 14: నగరాలు, పట్టణాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని మౌలిక వసతులను కల్పించి, నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని తన చాంబర్ లో బుధవారం సాయంత్రం ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ చేపట్టిన పనుల ప్రగతిని ఆయన  సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మధ్యతరహా పట్టణాలు సమ్మిళిత అభివృద్ధి సాధించేవిధంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్కుల వంటి వాటిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేవిధంగా రోడ్లు, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. విజయవాడ వంటి చోట్ల ప్రజలకు పార్కుల వంటివి లేవన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పార్కింగ్ సౌకర్యంలేదని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలోపెట్టుకొని జనాభా ప్రాతిపదికన మౌలికసదుపాయాలు, వినోద ప్రదేశాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆటవిడుపుకు, వినోదానికి అనువైన విధంగా విస్తృతంగా పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా రోజువారీ ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు. కొన్ని చిన్నచిన్న అంశాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగై ప్రజల సామాజికాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. 1985 ప్రాంతంలో విశాఖలోని బీచ్ వద్ద రాత్రి 7 గంటలు దాటితే పెద్దగా జనం తిరిగేవారు కాదని, అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ఇప్పుడు రాత్రి 10 గంటలు దాటినా సందడిగా ఉంటుందని సీఎస్ చెప్పారు.
            అధికారులు వివిధ పట్టణాలలో చేపట్టిన పనులను సీఎస్ కు వివరించారు. జక్కంపూడి ప్రాజెక్ట్, పైప్ లైన్ల నిర్మాణం, ఒంగోలులో చేపట్టవలసిన పనులు, విశాఖ కార్పోరేషన్, మధురవాడలలో, శ్రీశైలంలో చేపట్టిన పనులు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, మరికొన్ని టెండర్ల దశ పూర్తి అయిందని వివరించారు. శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం వంటి స్మార్ట్ సిటీలలో చేపట్టే పనుల గురించి వివరించారు. ఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు రూ.12వేల కోట్ల పెట్టుబడులతో తిరుపతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.
              శ్రీకాకుళంలో రోడ్ల అభివృద్ధి, పట్టణాల సుందరీకరణ, ఆర్ఛిల నిర్మాణం, విజయవాడలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కులు, కంపోస్టింగ్ ప్లాంట్స్ వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సీఈఓ ప్రకాష్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా రంగం అభివృద్ధికి చర్యలు
మంత్రి నక్కా ఆనందబాబు
Ø త్వరలో సినీ ప్రముఖులతో  సమావేశం
Ø నవంబర్ లో రాష్ట్రంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్
Ø పూనే తరహాలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూషన్ ఏర్పాటు
Ø ఐఏఎస్ కోచింగ్ అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి అధికారి
             సచివాలయం, నవంబర్ 14: రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘీక సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాటోగ్రఫీ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా తనకు అప్పగించినందున ఆ శాఖకు సంబంధించిన  హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండి ఎస్.వెంకటేశ్వర్, ఇతర అధికారులతో చర్చించినట్లు తెలిపారు. సినిమా రంగం గురించి కూలంకుషంగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, అవార్డులు, షూటింగ్ రాయితీలు, థియేటర్ల సమస్యలు అన్నిటిని అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ రంగం అభివృద్ధికి తీసుకునే చర్యలలో భాగంగా త్వరలో సినీ ప్రముఖులు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో ప్రతి ఏడాది నవంబర్ లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేవారమని, రాష్ట్రం విడిపోయిన తరువాత జరపలేదని, వచ్చే ఏడాది ఏపీలో ఆ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కూడా మన రాష్ట్రంలో జరపడానికి ఆ నిర్వాహకులతో మాట్లాడతామన్నారు. రాష్ట్రంలో సినిమా రంగం పట్ల ఆసక్తి చూపించే యువతకు తగిన శిక్షణ ఇచ్చేందుకు పూనేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తరహాలో ఒక ఇన్ స్టిట్యూషన్ ని నెలకొల్పుతామని చెప్పారు. దానికి సంబంధించి అధ్యయనం జరుగుతున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ విద్యాపథకం కింద ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ అభ్యర్థుల సమస్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఆ అంశంపై ప్రతి రోజు సంక్షేమ శాఖ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఢిల్లీ పంపుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శిక్షణ పొందవలసి ఉంటుందని, వారి సమస్యలు ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుందన్నారు. తెలుగు మీడియంలో కూడా శిక్షణ పొందేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరంలేదని మంత్రి ఆనందబాబు హామీ ఇచ్చారు.

మంత్రి కిడారి శ్రావణ్ బాధ్యతల స్వీకరణ
15 గిరిజన పాఠశాలల్లో ఆర్వో ప్లాట్ల మంజూరు, 
48 రోడ్ల ప్రతిపాదనపై తొలి సంతకాలు

                 సచివాలయం, నవంబర్ 14: ప్రాధమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, ఏపీ వైద్యవిధాన పరిషత్, ఆయుష్, మందుల నియంత్రణ, గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ బుధవారం ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు.  15 గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాట్లు మంజూరు చేస్తూ, గిరిజన ప్రాంతాల్లో రూ.213 కోట్ల వ్యయంతో 48 రోడ్లు నిర్మించాలని రోడ్లు భవనాల శాఖకు పంపే ప్రతిపాదనలపై తొలి సంతకాలు చేశారు. తల్లి పరమేశ్వరి, సోదరుడు సందీప్, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో శాస్త్రబద్ధంగా పూజ చేయించి  ఆయన బాధ్యతలు స్వీకరించారు. పండితుడు, తల్లి, ఇతర పెద్దలు ఆయనను దీవించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణ కుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏపీవివిపీ ప్రత్యేక అధికారి శ్రీదేవి తదితరులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంతటి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమపథకాలు అందేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Nov 13, 2018


పీఎంఈవై-ఎన్టీఆర్ నగర్ గృహాలకు
రుణ మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
బ్యాంకర్లను కోరిన ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్

             సచివాలయం, నవంబర్ 13: పట్టణాలలో భారీ స్థాయిలో నిర్మించే పీఎంఈవై, ఎన్టీఆర్ నగర్ గృహాలకు రుణ మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ బ్యాంకర్లను కోరారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్ బీసీ) సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 28 గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, మిగిలిన నిర్మాణాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. నాలుగేళ్లలో మొత్తం 5,28,886 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిలో 4,60,492 గృహాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.38,265 కోట్లు కాగా, అందులో ఇళ్ల నిర్మాణ వ్యయం 32,730 కోట్లు, భూమి విలువ రూ.1035 కోట్లు, మౌలిక సదుపాయాల వ్యయం రూ.4500 కోట్లని వివరించారు. ముఖ్యమంత్రి త్వరలో ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు. సమయం తక్కువ ఉన్నందున బ్యాంకర్లు ఈ ప్రాజెక్టులకు రుణాల మంజూరు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రైవేటు బిల్డర్లు వ్యాపార దృక్పదంతో నిర్మిస్తారని, ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ఈ ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. భూమి, మౌలిక సదుపాయాలు, నిర్మాణ వ్యయం కలిపితే ఒక్కో ఫ్లాట్ విలువ రూ.10 నుంచి 12 లక్షలు ఉంటుందని, బ్యాంకులు రూ.2.65 లక్షలు మాత్రమే ఇవ్వలసి ఉంటుందన్నారు. బ్యాంకులకు కావలసిన అన్ని పత్రాలను మునిసిపల్, టిడ్కో, మెప్మా అధికారులు అందజేస్తారని చెప్పారు. ప్రభుత్వం ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ కు, మార్ట్ గేజ్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చిందని వలవన్  తెలిపారు.
ఈ ఇళ్లను అత్యంత ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో దృఢంగా నిర్మిస్తున్నట్లు టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ బీఎం దివాన్ మైదీన్ చెప్పారు. ప్రజల నివాసంతోపాటు చిన్నతరహా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా ఈ కాలనీలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఒకే పద్దతిలో జీ+3 విధానంలో మూడు కేటగిరీలుగా ఇళ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. 300, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, 465 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వెర్టిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్, గ్లేజ్ సెరామిక్ టైల్స్, బ్లాక్ గ్రానైట్, సాల్ ఉడ్ తలుపులు, ప్లాస్టిక్ ఎమల్సన్ పెయింటింగ్ వంటి వాటిని వాడుతున్నట్లు వివరించారు.
ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ వంటి పెద్ద సంస్థలు వీటిని నిర్మిస్తున్నట్లు మైదీన్ చెప్పారు.

          టిడ్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణం పూర్తి అయిన నెల్లూరు, గుంటూరు, చిలకలూరిపేట,కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, గుడివాడ,  భీమవరం, పొన్నూరు, అమలాపురం, పెద్దాపురం, రాజమండ్రి, మండపేట తదితర ప్రాజెక్టులను చూపించారు. ఈ ప్రాజెక్టుకు రుణాలు మంజూరుకు సంబంధించి 30 అంశాలను  టిడ్కో ఆర్థిక సలహాదారు జగదీష్ బ్యాంకర్లకు వివరించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి పట్టణంలో బ్లాకుల వారీగా బ్యాంకులకు కేటాయిస్తామని చెప్పారు. లబ్దిదారులను కమిటీ ఎంపిక చేస్తుందని, డ్రా విధానంలో ఫ్లాట్లు లబ్దిదారులకు కేటాయిస్తారని, ఆ జాబితాలను మునిసిపల్ కమిషనర్ తన సంతకంతో ఆయా బ్యాంకు బ్రాంచ్ మేజేర్లకు  అందజేస్తారని వివరించారు. ప్రతి జిల్లాకు ఒక మెప్మా కోఆర్డినేట్ ఉంటారని, వారు బ్యాంకులకు సహకరిస్తారని చెప్పారు.  చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ మొట్టమొదటగా రుణాలు మంజూరు చేసిందని, ఆ బ్యాంక్ మేనేజర్ ని అభినందించారు. న్యాయ సలహా, ఫ్లాట్ విలువ, అబ్దిదారుల వయసు, చెల్లించవలసిన వాయిదాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాలను చర్చించారు.
దాదాపు అన్ని అంశాలకు బ్యాంకర్లు అంగీకరించారు. లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోతే అందరి పేరన కొత్త ఖాతాలు తెరుస్తామని వారు చెప్పారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి  వారు చేసిన సూచనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎల్ బీసీ కన్వీనర్ శివ వరప్రసాద్, 16 ప్రభుత్వ రంగ, 2 సహకార, 6 ప్రైవేటు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Nov 12, 2018


ప్రజల నుంచి అవార్డులు రావాలి

వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమైన మంత్రులు ఫరూక్, శ్రావణ్
             
             సచివాలయం, నవంబర్ 12 : ప్రజల నుంచి అవార్డులు వచ్చేవిధంగా మన పనివిధానం ఉండాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బందిని మంత్రి ఫరూక్ ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం వైద్యవిద్య, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఏపీ మెడ్ టెక్ జోన్, ఆహారభద్రత, మైనార్టీ సంక్షేమం, సాధికారత  శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రాధమిక వైద్యం, కుటుంబ సంక్షేమ, ఏపీ వైద్యవిధాన పరిషత్, ఆయుష్, మందుల నియంత్రణ, గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ లు ఆయా శాఖ సిబ్బందితో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.  అధికారులు ముందుగా తమను పరిచయం చేసుకొని తమతమ విభాగాలలోని పరిస్థితులను మంత్రులకు వివరించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల వివరాలు, డయాలసిస్ సెంటర్లు,  అంటువ్యాధులు సోకకుండా తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ పథకాలు, స్వైన్ ఫ్లూ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల సోకడానికి కారణాలు, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, గ్రామాలు, పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలు తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 19 గైనిక్ యూనిట్లు నెలకొల్పినట్లు చెప్పారు. వైద్యశాఖలోని పోస్టుల భర్తీ, కర్నూలులో కేన్సర్ సెంటర్ నిర్మాణం, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం గురించి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ, గిరిజన ప్రాంతాల్లో అందించే వైద్యసేవల గురించి తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల ఆయా సరిహద్దు జిల్లాల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకుతున్నట్లు వివరించారు.  
                  ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాను గతంలో  వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నానని, అయితే వైద్య ఆరోగ్య శాఖ తనకు కొత్తని చెప్పారు. ప్రజారోగ్యం పేదలకు అందుబాటులో ఉండాలని, అందరం కలసికట్టుగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకువద్దామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రజల నుంచి అవార్డు పొందేవిధంగా పనిచేయాలన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ కు కొదవలేదని, రూ.8వేల కోట్ల బడ్జెట్ ఉందని తెలిపారు. అంటువ్యాధులు సోకకుండా ఉండటానికి పారిశుధ్యం చాలా ముఖ్యమని చెప్పారు. మునిసిపల్ శాఖ సహకారంతో ప్రజలలో అవగాహన కలిగించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చిన్న వయసులో పెద్ద బాధ్యతలు
             ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అప్పగించారని మంత్రి శ్రావణ్ కుమార్ చెప్పారు. తనకు తోడుగా అనుభవం ఉన్న సీనియర్ మంత్రి ఉన్నారన్నారు. శాఖలో సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాము ప్రజలలోకి వెళ్లగానే ముందుగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల గురించి అడుగుతారన్నారు. వాటి నివారణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.  రెండు మూడు రోజులు జ్వరం ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. మనందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలమేనని, ఆరోగ్య భద్రత కోసం అందరం కలసి పనిచేద్దామని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు, అందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరుని మంత్రి ప్రశంసించారు.