Jun 8, 2019

మంత్రుల బయోడేటా


మోపిదేవి వెంకటరమణారావు
పేరు : మోపిదేవీ వెంకటరమణారావు
పుట్టిన తేదీ : 06-08-1964
స్వగ్రామం : నిజాంపట్నం
తల్లిదండ్రులు : నాగులమ్మ, వీరరాఘవయ్య
విద్యార్హత : బీఏ
భార్య  : అరుణాభాస్కరి
సంతానం : రాజీవ్, జస్మిత
నియోజకవర్గం : రేపల్లె
రాజకీయ నేపథ్యం : కాంగ్రెస్ తరఫున 1984లో ఎంపీపీగా ఎన్నిక. 1989, 1994లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున కూచినపూడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009లో రేపల్లే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలుపు. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున రేపల్లెలో పోటీ ఓటమి. 2019లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపు.
మేకతోటి సుచరిత

ఎమ్మెల్యే పేరు : మేకతోటి సుచరిత
స్వస్థలం : ఫిరంగిపురం
పుట్టిన తేదీ : 25:12:1972
విద్యార్హత  :  బాచిలర్ ఆఫ్ సైన్స్ , డిస్టెంట్ ఎడ్యుకేషన్ , మదురై కామరాజు యూనివర్సిటీ, మదురై.
భర్త పేరు : మేకతోటి దయాసాగర్
వివాహం : 21:05:1995
సంతానం :  హర్షిత (కుమారుడు), రితిక (కూతురు)
రాజకీయ ప్రవేశం : 2006 లో ఫిరంగిపురం జడ్పీటీసీ గా చేశారు.
2006 నుంచి 2009 వరకు జడ్పీటీసీగా పని చేశారు.
ఎమ్మెల్యేగా తొలి ప్రస్థానం :
2009 రాష్ట్రంలో జరిగిన పునర్విభజనలో  ప్రత్తిపాడు నియోజకవర్గం   ఎస్సీ రిజర్వుడు అయింది. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం లో  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 2042 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలో అడుగుపెట్టారు. 2012లో వైకాపా ఆవిర్భావంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్య పై 16781 ఓట్ల భారీ మెజారిటీతో రెండో సారి  గెలుపొందారు. 2014లో వైకాపా తరుపున మరోసారి పోటీ చేశారు. తెదేపా అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో 7405 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
తిరిగి 2019లో వైకాపా తరఫున మరోసారి పోటీ చేసి 7398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బాలనేని శ్రీనివాసరెడ్డి  :
పేరు : బాలినేని శ్రీనివాసరెడ్డి
స్వస్థలం : కొణిజేడు గ్రామం, ఒంగోలు
పుట్టిన తేదీ : 12-12-1964
విద్యార్హత : బీఎస్సీ
తల్లిదండ్రులు : బాలినేని రమాదేవి, వెంకటేశ్వరరెడ్డి
భార్య : శచీ దేవి
సంతానం : ప్రణీత్ రెడ్డి,కావ్య(కోడలు)
రాజకీయ ప్రస్థానం : జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2009 ఎన్నికల తరవాత రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, చేనేత జైళి శాఖ మాత్యులు బాధ్యతల నిర్వహణ. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో వైసీపీ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలుపు.

మేకపాటి గౌతమ్ రెడ్డి  :
పేరు : మేకపాటి గౌతమ్ రెడ్డి
తల్లిదండ్రులు : మేకపాటి రాజమోహన్ రెడ్డి(మాజీ ఎంపి), మణిమంజరి
పుట్టిన తేదీ : 02-11-1971
విద్యార్హత : ఎమ్మెస్సీ
భార్య :  శ్రీకీర్తి,
సంతానం : సాయి అనన్య(కుమార్తె), కృష్ణార్జున్ రెడ్డి(కుమారుడు)
సోదరులు : ఫృద్విరెడ్డి, విక్రమ్ రెడ్డి
వ్యాపార ప్రవేశం : 1997లో కేఎంసీ కనస్ట్రక్షన్ కంపెనీలో
రాజకీయ నేపథ్యం : 2014లో వైసీపీ తరఫున ఆత్మకూరు శాసనసభ్యునిగా గెలుపు. 2019లోనూ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా    ఎన్నిక.
అనిల్ కుమార్ యాదవ్ :
పేరు : అనిల్ కుమార్ యాదవ్
తండ్రి : తిరుపాలయ్య
విద్యార్హత : బీడీఎస్
భార్య : జాగృతి
సంతానం : సమన్వి, దర్శనందన్
రాజకీయ నేపథ్యం : 2008 లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా ఎన్నిక. 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి. 2014, 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపు.

డాక్టర్ ఆదిమూలపు సురేష్ :
పేరు : డాక్టర్ ఆదిమూలపు సురేష్
విద్యార్హత : బీఈ, ఎంటెక్, పీహెచ్డీ
భార్య : విజయలక్ష్మి( కమిషనర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్, ఏపీ, టీఎస్)
సంతానం : విశాల్(కుమారుడు), శ్రీస్టి(కుమార్తె)
రాజకీయ నేపథ్యం : 2009లో కాంగ్రెస్ తరఫున ఎర్రగుండపాలెం నుంచి ఎమ్మెల్యే గెలుపు. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో ఎర్రగుండపాలెం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా మరోసారి గెలుపు. ఏపీ అసెంబ్లీ కమిటీల్లో సభ్యునిగా పనిచేసిన అనుభవం. వైసీపీలో క్రియాశీలక నేతగా గుర్తింపు.

Jun 5, 2019

సీఎం ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజేయ్ కల్లం


  
  సచివాలయం, జూన్ 5:  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం సచివాలయం మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం  పదవీబాధ్యతలు స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాలో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన  సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాధారణ పరిపాలన(రాజకీయ వ్యవహరాలు) ముఖ్య కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా, ఏపీ ట్రాన్స్ కో ముఖ్య కార్యదర్శి  శ్రీకాంత్ నాగులాపల్లి, పలువురు ఇతర అధికారులు  అజేయ్ కల్లంను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

May 30, 2019



కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు !
 
          ప్ర్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఆర్థిక పరిస్థితుల రీత్యా ముఖ్యమంత్రి పదవి ఓ సవాల్ లాంటిది. అత్యంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఎన్నికల మేనిఫెస్టో అమలు, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు వంటి ముఖ్య అంశాలు ఈ నెల 30న నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే  వైఎస్ జగన్మోహన రెడ్డి ముందున్నాయి. పరిపాలనా వ్యవస్థలో సమూల మార్పులు, వివిధ శాఖల ప్రక్షాళన, పాదర్శక పాలన, దుబార వ్యయం నియంత్రణ వంటి ఆలోచనలతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అన్నిటికంటే ముఖ్యం పొరుగురాష్ట్రాలతో సఖ్యత, కేంద్రంతో సత్ సంబంధాలు నెరపాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే సరైన విధానంగా ఆయన భావిస్తున్నారు.  అదేవిధంగానే ఆయన వ్యవహరిస్తున్నారు.  రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో రాజధాని నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. ఓ పెద్ద యజ్ఞం లాంటిది. అందులో జరిగిన అవకతవకలను సరిదిద్దవలసి ఉంది. రైతులకు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించాలి. కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన, పూర్తిగా కేంద్రం వ్యయంతో నిర్మించే పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లుగా ఉన్న రుణ భారం కాస్తా రూ.2.58 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అంతేకాకుండా ప్రభుత్వంలోని  కార్పొరేషన్‌లు, ఇతర సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.  ప్రభుత్వం చెల్లించవలసిన బిల్లులూ తక్కువ ఏమీలేవు. ఈ పరిస్థితులలో కేంద్రం సహాయ సహకారాలు తీసుకోవలసిన అవసరాన్ని జగన్మోహన రెడ్డి గుర్తించారు. ఆడంబరాలకు పోకుండా అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ దుబారా ఖర్చులను తగ్గిస్తూ ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల సలహాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నిరాడంబరంగా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓ శుభపరిణామం.
                  నవరత్నాలలో భాగమైన  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12.50 వేల  చొప్పున 4 ఏళ్లలో 50 వేలు చెల్లించడం - వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బోర్లు – వైఎస్ హయాంలో ఎందరో జీవితాలను నిలిపిన ఆరోగ్యశ్రీ , యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన - వృద్దాప్య ఫించన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్​ అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు కుదింపు - విద్యార్థులకు పూర్తి ఫీజు రీఇంబర్స్‌ మెంట్‌తోపాటు ఏడాదికి 20 వేల స్టైఫండ్ - పేదల కోసం ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టించడం – జలయజ్ఞం - పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇచ్చే "అమ్మఒడి" పథకం,  స్వయం సహాయక సంఘాల రుణ మాఫి - దశల వారీగా మద్యపాన నిషేధం లాంటి హామీలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది. వీటన్నిటితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతులు, యువత, పేదలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

             2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు ఈ దేశంలో ఏ యువనేత ఎదుర్కోలేదు. తండ్రి అకాల మరణం - ఆ తరువాత రాజకీయ పరిణామాలు,  తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు - ఉప ఎన్నికలలో దాదాపు అన్ని సీట్లు గెలుపు  - అనేక కేసుల్లో ఇరికించడం జైలు జీవితం 2014 ఎన్నికల్లో ఒంటరి పోరాటం అధికారం చేజిక్కకపోయినా పట్టుదలతో పోరాటం కొనసాగింపు ప్రజా సంక్షేమ పథకాల అధ్యయనం అన్ని వర్గాల వారిని ఆకర్షించేవిధంగా నవరత్నాల రూపకల్పన రాజధాని రైతుల పక్షాల పోరాటం -ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదం పార్టీ ఎంపీల రాజీనామా - కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి పార్టీ నేతల నోటీసులు టీడీపీని ఇరుకున పెట్టడం 2019 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం బీసీలకు అధికంగా టిక్కెట్లు ఇవ్వండం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారంలో నూతన వరవడి – ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగటం - టీడీపీ వారి విమర్శలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం ...... వంటివాటితో సాగింది ఆయన రాజకీయ పోరాటం.  ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను ఎదుర్కొని ఘనవిజయం సాధించారు. ముందుగా తాము ఊహించిన, ఆశించిన విధంగా తమపై ఎంతో నమ్మకంతో  అత్యధికంగా 151 శాసనసభా స్థానాలలో గెలిపించడంతో బాధ్యత పెరిగినట్లుగా జగన్ భావిస్తున్నారు. ఆ నమ్మకాన్ని చెదరనివ్వకుండా ఆరు నెలల లోపలే ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకునే రీతిలో పనులు చేయాలన్న తపనతో ఆయన ఉన్నారు. తండ్రికి మించిన పట్టుదలతో ఒంటరి పోరాటం చేసి 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని ఘన విజయం సాధించిన జగన్ అంతే పట్టుదలతో  ప్రత్యేక హోదా సాధించి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని, తమకు న్యాయం చేస్తారని రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అద్వితీయమైన మద్దతుని దృష్టిలో పెట్టుకొని  జగన్మోహన రెడ్డి సుపరిపాలన అందిస్తారని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 27, 2019


కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
కొత్త ప్రభుత్వానికి సంఘం అధ్యక్షుడు సుమన్ విజ్ఞప్తి
నూతన సీఎం జగన్మోహన రెడ్డికి అభినందనలు
          అమరావతి, మే 27: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొత్తగా ఏర్పడే వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన రెడ్డికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం తరపున అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా  రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న కొత్త ప్రభుత్వ న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు లక్షా 80వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత, పే స్కేల్, టైమ్ స్కేల్, సమాన పనికి సమాన వేతనం లేదని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఊసే లేదన్నారు. 2015 - 2018 మధ్య కాలంలో జరిగిన శాసనసభ సమావేశాలలో కాంట్రాక్ట్,  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ (పర్మినెంట్) చేయమని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీరు చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని అసెంబ్లీ సాక్షిగా గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆదోనిలో మాట్లాడుతూ అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యార్హతలు ఆధారంగా అవకాశం ఉన్నంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హతల ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని, పెన్షన్ వర్తింపజేయాలన్నారు. రెండు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సుమన్  కోరారు.


May 23, 2019

ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలి



బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్
                అమరావతి, మే 22:  ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు  బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేంద్రరాష్ట్ర ప్రభుత్వం  బీసీ సాధారణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదని తెలిపారు.  గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగ నియామకం పొంది ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి అయినా,  వారి వార్షికాదాయం రూ.8 లక్షలు దాటినా వారు కూడా క్రీమిలేయర్ కిందకు రారని, వారి పిల్లలు ఓబిసిలుగా పరిగణించాలని తెలిపారు. ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామితులైనవారు, తల్లిదండ్రులు నేరుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియమితులైన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందకు వస్తారని వివరించారు. సాధారణ ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షిక ఆదాయము రూ.8 లక్షలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పారు. అయితే చాలా మంది రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షికాదాయం రూ.8 లక్షలు దాటితే,  వారి పిల్లలకు ఓబిసి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. దాంతో వారి పిల్లలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులలో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.  ఈ నేపధ్యంలో క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీవికలాంగులుమహిళలు వంటి తొమ్మిది వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారని  వారికెవరికీ లేనిక్రీమిలేయర్ నిబంధన ఒక్క బీసీ వర్గానికే ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు.  రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్షసాంఘిక వెనుకబాటుతనం విద్యారంగంలో వెనుకబాటుతనమే కానీ ఆర్థిక వెనుకబాటుతనం  కాదన్నారు. ఈ విషయాన్ని రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్ కమిషన్కాకా కలేల్కర్ కమిషన్ రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ రచయితల దృక్పథంలో గానీసామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టం చేశారన్నారు. రిజర్వేషన్లపై అనేక సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయనిసమాజాన్ని సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా కులపరమైనవిధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని సూచించారని తెలిపారు. బీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లను పూర్తిగా అమలు చేయకుండా క్రీమిలేయర్ నిబంధన పెట్టడం అన్యాయమని, ఆ షరతును వెంటనే తొలగించాలని ఆయన కోరారు. కేంద్రంలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేసిన రోజునే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని,  ఆశించిన లక్ష్యాలను  సాధించగలుగుతామని శంకరరావు స్పష్టం చేశారు.

May 20, 2019

ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ ను పటిష్ట పరచాలి


బీసీ  సంక్షేమ  సంఘం  రాష్ట్ర  అధ్యక్షుడు  కేసన

                           అమరావతి, మే 20:  నిరుద్యోగ   యువతను    పోటీ  పరీక్షలకు  సిద్దం చేయడానికి  ప్రభుత్వం  ఏర్పాటు  చేసిన  బీసీ స్టడీ  సర్కిల్స్,  ఏపీ   స్టడీ  సర్కిల్స్ లో  సౌకర్యాలు  మెరుగుపరచాలని    బీసీ  సంక్షేమ  సంఘం  రాష్ట్ర  అధ్యక్షుడు  కేసన  శంకర రావు  బీసీ  సంక్షేమ  శాఖ ముఖ్య   కార్యదర్శి  బి.ఉదయ లక్ష్మికి   విజ్ఞప్తి  చేశారు.   ఈ మేరకు  సోమవారం   మధ్యాహ్నం   సచివాలయంలోని  బీసీ  సంక్షేమ శాఖ  కార్యాలయంలో    అసిస్టెంట్    సెక్రటరీ  ఎస్ .హనుమంతరావును    కలిసి    ఒక  వినతి పత్రాన్ని అందజేశారు.   అట్టడుగు  వర్గాల యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సదుద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఈ స్టడీ సర్కిళ్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోపడుతోందని శంకర రావు చెప్పారు. అయితే  స్టడీ సర్కిళ్లకు సొంత భవనాలు లేవని, ప్రస్తుతం నిర్వహించే స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు అధ్యయనం చేయడానికి తగిన సౌకర్యాలు గానీ, అనువైన వాతావరణ గాని లేదని తెలిపారు. అలాగే వసతి, భోజన సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. 2004 సంవత్సరంలో నిర్ణయించిన ధరల ప్రకారం స్టైఫండ్, మెటీరియల్స్, ఫ్యాకల్టీ రెమ్మూనరేషన్ ఉన్నాయని వివరించారు. ఆ ధరలతో ప్రస్తుత అవసరాలు తీరే అవకాశంలేదన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీకి ఇచ్చే రెమ్మూనరేషన్ ఎక్కవగా ఉండటంతో ఇక్కడకు సమర్థులైన బోధకులు వచ్చే అవకాశం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే యువతకు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో భోజన, మెటీరియల్ వంటి అవసరాలు తీర్చుకోవడం కష్టం అని తెలిపారు.
                ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను ఉపయోగించుకోకుండా, ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో యువతకు కోచింగ్ ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి అధిక వ్యయం అవుతుందిన చెప్పారు. ఆ ఖర్చులో 25 శాతంతోనే ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. సొంత భవనం నిర్మించడంతోపాటు స్టడీ సర్కిళ్లలో మెరుగైన ఆడియో, వీడియో వ్యవస్థని, జిరాక్స్ మిషన్ ని, గ్రంథాలయాన్ని, ప్రతి శిక్షణా తరగతిలో కూర్చొని రాసుకోవడానికి అనువుగా బెంచీలు ఏర్పాటు చేయాలని, అధ్యయనానికి వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని శంకర రావు కోరారు.  స్టడీ సర్కిల్ నిర్వహణకు గ్రూప్-1 స్థాయి డైరెక్టర్ ని నియమించాలని, కాంట్రాక్ట్ ప్రాతిపదిన నియమించి 15 ఏళ్లు పూర్తి అయిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత ప్రైవేటు హాస్టళ్ల ఉండి శిక్షణ పొందేందుకు స్టైఫండ్ నెలకు కనీసం రూ.4000 ఇవ్వాలన్నారు. సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్ బి తదితర ఉద్యోగాలతోపాటు గ్రూప్-1, II, III, IV  సర్వీస్ ఉద్యోగాలకు మంచి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. స్టడీ సర్కిళ్లలో ఇచ్చే కోచింగ్ వివరాలు నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంచాలన్నారు.  స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మంచి ఫ్యాకల్టీని నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శంకరరావు కోరారు.  వినతి పత్రం ఇచ్చిన వారిలో సంక్షేమ సంఘం నాయకులు కుమ్మర క్రాంతి కుమార్, నాగలింగం, దాసరి అప్పారావు, గోపి కృష్ణ, మేకా రవి, వెంకట్, శేఖర్ తదితరులు ఉన్నారు. 

కుల వ్యవస్థ వల్ల నష్ట ఎవరికి?

·       జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కని బీసీలు
·       సమాన అవకాశాల కమిషన్ వల్ల సమన్యాయం


  ప్రపంచంలో ఎక్కడాలేని కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. భారతీయ సమాజంలో నరనరాన వేళ్లూనుకుంది. మనుధర్మాన్ని పాటించిన  ఈ వ్యవస్థలో ఉన్నత కులాలు లేదా అగ్రకులాలు లేదా ఆధిపత్య కులాలు (ఓసీలు) రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉండటమే కాక సర్వ సుఖాలు అనుభవించారు. అనుభవిస్తున్నారు.  వేల సంవత్సరాల నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యంత దారుణమైన వివక్షకు గురై, అణచివేయబడి తీవ్రంగా నష్టపోయారు. స్వాతంత్ర్యం సాధించిన తరువాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ పుణ్యమా అంటూ రాజ్యాంగం ద్వారా ఎస్టీ, ఎస్సీ కులాల పరిస్థితి కొంత మెరుగుపడింది. జనాభా దామాషా ప్రకారం వారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. రాజ్యాంగపరంగా వారికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు. కుల వ్యవస్థ కొనసాగుతున్న క్రమంలో వృత్తి నైపుణ్యంలో అగ్రస్థానంలో ఉన్న బీసీ కులాల పరిస్థితిలో మార్పులేదు. ఆనాడు, ఈనాడు ప్రధాన వృత్తులు, ముఖ్యంగా చేనేత, బంగారు వస్తువుల తయారీ, వడ్రంగి వంటి అత్యత నైపుణ్యత కలిగిన సున్నితమైన వృత్తులు వారే చేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ కులాల మాదిరిగా రాజ్యాంగపర రక్షణ లేకపోవడంతో బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. జనాభా దామాషా ప్రకారం ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతున్నారు. 52 శాతం జనాభా ఉంటే ఉద్యోగాలలో 25 నుంచి 27 శాతం మాత్రం రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు జరగడంలేదు. అధికార గణంలో ఉన్న ఆధిపత్య కులాల వారు ఎక్కడికక్కడ వారిని తొక్కేస్తున్నారు. వారికి రావలసిన అవకాశాలను కూడా వారికి దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఏపీపీఎస్సీలో కూడా అదే ధోరణి కొనసాగుతోందని బీసీలు గగ్గోలుపెడుతున్నారు. శాసనసభలో దామాషా ప్రకారం వారికి ప్రాతినిధ్యంలేదు. రాజ్యాంగపరమైన హక్కు లేకపోవడం వల్లే వారి పరిస్థితి ఇలా ఉంది. యాంత్రీకరణ, ఆధునిక పోకడలతో కుల వృత్తులు క్షీణించడంతో వారిలో కొందరి బతుకులు మరింత దయనీయంగా తయారయ్యాయి.

            కుల వ్యవస్థ కొనసాగడం వల్ల అటు ఉన్నత కులాలు, ఇటు ఎస్సీ, ఎస్టీలు బాగానే లబ్ది పొందుతున్నారు. ఓసీలు జానాభా దామాషా ప్రకారం మూడు, నాలుగు రెట్లు రాజ్యాధికారంలో, ఉద్యోగాలలో భాగం పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల వారు జనాభా దామాషా ప్రకారం పొందగలుగుతున్నారు. చిత్రమైన పరిస్థితి ఏమిటంటే బీసీలు అత్యంత దారుణంగా నష్టపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న వారి పరిస్థితిని ఇంకా దిగజార్చడానికి ఇతరులను కూడా తీసుకువచ్చి బీసీలలో కలిపారు. ఇంకా కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగానే వారిని దెబ్బతీస్తున్నారు. అటు ప్రైవేటు రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులలో ఇతరులు ఉంటుంటే దిగువ స్థాయి ఉద్యోగాలు బీసీలు చేస్తున్నారు. కేంద్రంలోని  ఉద్యోగాలలో  బీసీలు పది శాతం మంది కూడా లేరు. అంటే బీసీలు ఏ స్థితిలో ఉన్నారో  అర్ధం చేసుకోవచ్చు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు హక్కులు దక్కలేదు. ఇక దక్కే అవకాశం కూడా కనుచూపుమేరలో కనిపించడంలేదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించే అంశం ఇది.

              డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలనను ప్రతిపాధించారు. అయితే అది తగిన రీతిలో కార్యరూపం దాల్చలేదు. దేశంలోని పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అందుకు సిద్ధంగాలేరు. కుల వ్యవస్థను వారు అనుకూలంగా మలుచుకుంటారు. ఏ ప్రాంతంలోనైనా, ఏ గ్రామంలోనైనా కమ్మ- రెడ్డి, కాపు - యాదవ, మాల – మాదిగ పేర్లతో వారిని విడగొట్టి లబ్ది పొందడం వారికి తేలిక.  అన్నివిధాల అత్యధిక లాభం పొందే ఆధిపత్య కులాల వారు గానీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ,ఎస్టీ కులాల వారు గానీ  కుల నిర్మూలన ఉద్యమం పట్ల అసలు ఆసక్తి చూపరు. ఆ ఉద్యమం బలపడితే వారికి ఏమీ లాభం ఉండదు. కుల వ్యవస్థ కొనసాగితేనే వారు  ఎక్కువ లబ్దిపొందడానికి అవకాశం ఉంటుంది. చివరికి మనకి అర్ధమయ్యేది ఏమిటంటే కుల వ్యవస్థ కొనసాగడం వల్ల తీవ్రంగా నష్టపోయేది బీసీ కులాలవారే.
ఈ పరిస్థితులలో తెలంగాణ బీసీ కమిషన్ సూచించిన విధంగా మన రాష్ట్రంలో కూడా సమాన అవకాశాల కమిషన్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.  ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆ కమిషన్‌ పని చేయాలి. ఏ ఒక్క సామాజిక, మత, కుల, భాష, ఇతర వర్గాల వారికి పక్షపాతం కానీ, విరోధం కానీ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా దానిని రూపొందించాలి. ఉద్యోగాల నియామకం, గృహ నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి పథకాలను ఈ కమిషన్ పరిధిలో చేర్చితే  అందరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914