May 12, 2017

తూనికలు, కొలతల శాఖ పఠిష్టతకు చర్యలు

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
·       వినియోగదారుల మేలు కోసం కఠినంగా వ్యవహరిస్తాం
·       పెట్రోలు, ఎరువులు, సిమెంట్, గ్యాస్, ఆస్పత్రులు, రైస్ మిల్లులు, బేకరీలు అన్ని చోట్ల మోసపోతున్న వినియోగదారులు
·       బంగారం షాపుల్లో భారీ ఎత్తున మోసాలు
·       లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక
·       త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు




 సచివాలయం, మే:8: వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు తూనికలు, కొలతల శాఖను పఠిష్ట పరుస్తామని పౌర సరఫరాలు,
 వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ శాఖల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.  సచివాలయంలోని తన కార్యాలయంలో లీగల్ మెట్రాలజీ శాఖకు చెందిన 13 జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం  సోమవారం మధ్యాహ్నం 4వ బ్లాక్ పబ్లిసిటీసెల్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులు అన్ని విధాల మోసపోతున్నట్లు తమ సమీక్షలో స్పష్టమైందన్నారు.  పెట్రోలు, ఎరువులు, సిమెంట్, గ్యాస్, ఆస్పత్రులు, కిరోసిన్ హాకర్ల వద్ద,  రైస్ మిల్లులు, బేకరీలు అన్ని చోట్ల వినియోగదారులు మోసపోతున్నారని వివరించారు. బంగారం షాపుల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, పన్నులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నట్లు  మంత్రి చెప్పారు. చివరకు సెలక్ట్ చానల్ పేరుతో రూ.20ల మంచి నీళ్ల బాటిళ్లు కూడా రూ.50లకు అమ్ముతున్నారని చెప్పారు.  తమ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ పెనాల్టీ విధిస్తున్నట్లు, తూనికలు, కొలతల్లో తక్కువగా ఉన్న సరుకులను నింపిస్తున్నట్లు పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కాంపౌండ్ ఫీజు కింద రూ. 8.60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.  75 పెట్రోల్ బంకుల్లో మెట్రోల్, డీజిల్ తక్కువగా పోస్తున్నట్లు అధికారులు గుర్తించారని, గుణదలలోని బంకు లైసెన్స్ రద్దు చేయమని సిఫారసు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరరకు అమ్మినా, తరుగు వచ్చినా ఆ కంపెనీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. ఎరువుల దుకాణాల్లో కూడా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. 9 కంపెనీలకు చెందిన ఎరువుల బస్తాల్లో ఒక్కోదాంట్లో రెండు కిలోల వరకు తరుగు వస్తున్నట్లు తెలిపారు. అలా 40 వేల బస్తాల్తో తరుగు వచ్చినట్లు చెప్పారు. సిమెంట్ బస్తాల్లో కూడా రెండేసి కిలోల చొప్పున తరుగు వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 26 వేబ్రిడ్రిలలో కూడా లోపాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో సరఫరా చేసే మందులు, ఇతర వస్తువుల్లో తరుగులు వస్తే ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మంత్రి చెప్పారు. అటువంటివాటిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్యాస్ సిలెండర్ కు రెండు కిలోల తక్కువగా ఉన్నట్లు తమ సిబ్బంది గుర్తించారని చెప్పారు. గ్యాస్ కంపెనీలను నియంత్రిస్తామన్నారు.
1671 ప్రభుత్వ చౌక దుకాణాల్లో, 68 రైస్ మిల్లుల్లో, 14 కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లుల్లో తరుగులు వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎక్కడ మోసం జరుగుతున్నా వినియోగదారులు వెంటనే తెలియజేయడానికి తమ శాఖ తరపున టోల్ ఫ్రీ నెంబర్ ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఖాళీ పోస్టులు 95
      తమ శాఖలో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కూడా దాడులు నిర్వహించడం కష్టంగా ఉందని చెప్పారు. తగినంత సిబ్బందిలేక తనిఖీలు నిర్వహించలేకపోతున్నారన్నారు. 95 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యట నుంచి తిరిగి రాగానే పరిస్థితి వివరించి ఖాళీలను భర్తి చేస్తామన్నారు. వినియోగదారులు మోసపోకుండా, వారికి మేలు జరిగే విధంగా మోసాలు అరికడతామన్నారు.

కేంద్రం నిధులు రూ.50 కోట్లు
           రాష్ట్రంలో లీగల్ మెట్రాలజీ శాఖ ల్యాబులు, కార్యాలయ భవనాల నిర్మాణానికి కేద్రం ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. స్థలాలు కేటాయించమని తమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లను కోరుతున్నారని, కేటాయించగానే నిర్మాణం మొదలుపెడతామని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు.

జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.



మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీకి ‘రెరా’ బాధ్యతలు

      సచివాలయం, మే 4: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఆర్ఇఆర్ఏ) బాధ్యతలను మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) యాక్ట్ -2016’ చట్టం రూపొందించిన విషయం తెలిసేందే. దీనిని ఈ ఏడాది మే నుంచి అమలు చేయాలని కేంద్రం సూచించిన  నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) నిబంధనలు-2017’ని రూపొందించింది. ఆర్ఇఆర్ఏ ఏర్పడేంత వరకు ఈ చట్ట ప్రకారం నిర్వహించవలసిన  బాధ్యతలను మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఇఆర్ఏ నిబంధనల ప్రకారం అథారిటీ సొంత వెబ్ సైట్ ని రూపొందిస్తుంది. డెవలపర్లు, ప్రమోటర్లు తమతమ ప్రాజెక్టు వివరాలను ఆ వెబ్ సైట్ లో నమోదు చేయాలి. ఈ వెబ్ సైట్ రూపొందించే లోపల డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీ అండ్ సీపీ) www.dtcp.ap.gov.inలో వివరాలు నమోదు చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పిస్తారు. ‘రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) నిబంధనలు-2017 ప్రకారం చేపట్టే ప్రాజెక్టుల వివరాలు వెంటనే నమోదు చేసుకోవాలని డీటీ అండ్ సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు, ప్రమోటర్లు తమ సమస్యలను వెబ్ సైట్ ద్వారా అథారిటీకి తెలియజేయాలని పేర్కొంది. శాశ్విత ప్రాతిపదికన అథారిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ లోపు అథారిటీ తన విధులను తాత్కాలికంగా వెలగపూడిలోని సచివాలయం రెండవ బ్లాక్  గ్రౌండ్ ఫ్లోర్ 107వ రూమ్ నుంచి నిర్వహిస్తుంది. ఇంకా వివరాలు కావలసినవారు apmaudosd@gmail.com, dtcp.ap@gmail.com ద్వారా సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జారీ చేసినవారు : పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి


14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు లబ్దిచేకూర్చే ‘జగ్జీవన్‌ జ్యోతి’

·       ఉచిత విద్యుత్ 50  నుంచి 75 యూనిట్లకు పెంపు
·       ప్రభుత్వంపై రూ.120.03 కోట్ల అదనపు భారం

           రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారికోసం మరో పథకం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివశించే వారికి ప్రస్తుతం నెలకు 50 యూనిట్ల విద్యుత్ వరకు  ఉచితంగా అందిస్తున్నారు. జూన్ 1 నుంచి నెలకు వంద యూనిట్లు లోపల విద్యుత్ ఉపయోగించుకునే ఎస్పీ,ఎస్టీల కుటుంబాలకు 75 యూనిట్లు ఉచితంగా అందజేసే జగ్జీవన్ జ్యోతి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  జగ్జీవన్ రామ్ 110వ జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రకటించారు. దీని వల్ల 14.23 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ప్రభుత్వంపై రూ.206.14 కోట్ల భారం పడుతుంది.

ఎస్సీ లబ్దిదారులు 10 లక్షల 29వేలు : నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్ ను వాడుకునే ఎస్సీ కుటుంబాలు 6,89,848, 51 నుంచి 75 యూనిట్ల లోపల వాడుకునే కుటుంబాలు 2,19,100,  76 నుంచి 100 యూనిట్ల లోపల వాడుకునే కుటుంబాలు 1,20,965 ఉన్నాయి. ఈ ప్రకారం  మొత్తం 10,29,913 ఎస్సీ కుటుంబాలు 75 యూనిట్ల ఉచిత విద్యుత్ ను పొందుతాయి. ఇందు కోసం ప్రభుత్వానికి రూ.113.06 కోట్లు ఖర్చు అవుతుంది.

ఎస్టీ లబ్దిదారులు 3 లక్షల 92 వేలు:  నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్ ను వాడుకునే ఎస్టీ కుటుంబాలు 2,99,851, 51 నుంచి 75 యూనిట్ల వరకు వాడుకునే కుటుంబాలు 36,116, 76 నుంచి 100 యూనిట్ల లోపల వాడుకునే కుటుంబాలు 56,899 ఉన్నాయి. ఆ విధంగా 75 యూనిట్లు ఉచిత విద్యుత్ ను పొందే ఎస్టీ కుటుంబాలు   మొత్తం 3,92,866 ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వానికి రూ. 40.59 కోట్లు ఖర్చవుతుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్ ను వినియోగించుకునే ఎస్సీ కుటుంబాలు 6.89 లక్షలు, ఎస్టీ కుటుంబాలు 2.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు అందించే ఉచిత విద్యుత్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.86.11 కోట్లు ఖర్చు చేస్తోంది.

         ఉచితంగా అందించే విద్యుత్ ను పెంచడంతో వంద యూనిట్ల విద్యుత్ ని వాడుకునే మొత్తం 14,23,779 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు లబ్ది పొందుతాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం  75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది.  ఇందుకు అయ్యే రూ.206.14 కోట్ల ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. ఉచిత విద్యుత్ యూనిట్లు పెంచడం వల్ల  3.41 లక్షల ఎస్సీలు,  లక్ష మంది ఎస్టీలు అదనంగా లబ్దిపొందుతారు.  ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో రూ.120.03 కోట్లు అదనంగా ఖర్చవుతుంది.

       విద్యుత్ ని వినియోగించుకోవడానికి ఆర్థిక స్తోమతలేని నిరుపేద ఎస్సీ,ఎస్టీ కుటుంబాల వారు రాత్రుళ్లు కిరోసిన్ దీపాలతో కాలం గడుపుతున్నారు. ఈ కారణంగా వాతావరణ కాలుష్యంతోపాటు ఆ కుటుంబాలకు హాని అని భావించిన ప్రభుత్వం జగ్జీవన్‌ జ్యోతి ప్రథకం ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా పేద ఎస్సీ,ఎస్టీ కుటుంబాల జీవన ప్రమాణ స్థాయి పెరిగే అవకాశం ఉంది.

జారీ చేసినవారు : పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి


80 శాతం ఉద్యోగాలు స్థానికులకే!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Ø అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు కియా కంపెనీతో ఒప్పందం
Ø 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశం

           సచివాలయం, ఏప్రిల్ 27: అనంతపురం జిల్లాలో కార్ల కంపెనీ స్థాపనకు అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం, కొరియాకు చెందిన  కియా కంపెనీతో ఒప్పందం జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సచివాలయం ఒకటవ బ్లాక్ లో గురువారం ఉదయం కియా కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. దాదాపు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ తయారీ కేంద్రంలో  ఏటా 3 లక్షల చిన్న కార్లు తయారవుతాయని చెప్పారు. అవకాశం ఉంటే 4 లక్షల కార్ల వరకు తయారయ్యే అవకాశం ఉందన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుందన్నారు. 2019 జూన్ నాటికి  ఉత్పత్తి ప్రారంభిస్తారని చెప్పారు. ఇక్కడ తయారయ్యే కార్లలో 90 శాతం దేశీయ మార్కెట్‌లోనే విక్రయిస్తారని, మిగిలిన పది శాతం ఎగుమతి చేస్తారని వివరించారు. ఈ కార్ల ఉత్పత్తి కేంద్రంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో, తక్కువ ధర కార్లను ఈ సంస్థ తయారు చేస్తుందని చెప్పారు. 1944లో ప్రారంభమైన కియా కంపెనీకి  దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాలలో ప్లాంట్లు ఉన్నాయని, 51 వేల మంది ఉద్యోగలు పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్ల కంపెనీతో ఒప్పందం కుదరడంలో అధికారుల కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
అభివృద్ధికి, ఆటోమొబైల్ రంగానికి లింక్ ఉందని సీఎం చెప్పారు. ఎవరైనా కొంత డబ్బు సంపాదించగానే ద్విచక్రవాహనం కొంటారని, ఇంకా ఎక్కువ సంపాదిస్తే కారు కొంటారని చెప్పారు. 2020 నాటికి ఆటోమొబైల్ రంగంలో రాష్ట్రంలో రెండు లక్షల మందికి ఉపాధి లభించాలనేది తమ లక్ష్యం అన్నారు. నీటి లభ్యతపై పారిశ్రామిక రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కు నీరు రావడంతో అక్కడ పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ :  కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. అది వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇంతటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.

లక్ష మందికి ఆంగ్లంలో శిక్షణ:  ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలంటే ఆంగ్ల భాషలో నేర్చుకోవడం కూడా ముఖ్యమని, అందువల్ల లక్ష మంది యువతకు ఆంగ్లలో శిక్షణ ఇచ్చేందుకు బ్రిటీష్ కౌన్సిల్ తో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం తెలిపారు. వీలునుబట్టి ఇంకా ఎక్కవ మందికి శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థలు కూడా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చన్నారు.

మహిళా సాధికారితపై అమరావతి ప్రకటన జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజేత

 శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్
·       మహిళలకు సంబంధించిన పది అంశాలపై చర్చ
·       కోర్ కమిటీ, సూచనల కమిటీ నియామకం

         సచివాలయం, ఏప్రిల్ 25: మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనను జూన్ నెలాఖరకు ప్రభుత్వానికి అందజేస్తామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. శాసనసభ సమావేశ హాలులో మంగళవారం ఉదయం మహిళా సాధికారితపై అమరావతి ప్రకటనకు సంబంధించిన సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. పవిత్ర సంగమం వద్ద ఫిబ్రవరి నెల్లో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ చర్చల సారాంశం భావితరాలకు అందించడానికి అమరావతి ప్రకటన చేయదలచినట్లు చెప్పారు. మహిళలకు, యువతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, పరిష్కార మార్గాలు, అవకాశాలు అందిపుచ్చుకోవడం ఎలా... వంటివి అన్ని ఉంటాయని వివరించారు. దీనిని రూపొందించడానికి ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా నాయకత్వంలో ఒక కోర్ కమిటీని, ఒక సలహా కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులతోపాటు ఎన్జీఓ సంస్థలకు చెందినవారు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు ఉంటారని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై చర్చించి,  ప్రభుత్వ శాఖల నుంచి డేటా సేకరించి, వివిధ వర్గాలకు చెందినవారి నుంచి అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిప్రాయాలను సేకరిస్తారని చెప్పారు.
            జాతీయ మహిళా పార్లమెంట్ మొక్కుబడి సమావేశంగా మిగలకూడదని, సమాజాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేసేటటువంటి ప్రకటన వెలువరించాలనేది తమ ఉద్దేశం అన్నారు. రాజకీయాలకు అతీతంగా శాసనసభ వేదికగా  ఈ ప్రకటన వెలువడుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారితకు సంబంధించి రూపొందించే ఈ ప్రకటనను  ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తుందన్నారు.
          ప్రకటనకు సంబంధించి సమావేశంలో పలు విషయాలను, ప్రధానంగా పది అంశాలపై చర్చ జరిగినట్లు స్పీకర్ తెలిపారు. మహిళా విద్య, డిజిటల్ అక్షరాశ్యత-మహిళలు, మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళలకు సామాజిక భద్రత, మహిళల న్యాయపరమైన హక్కులు,  పరిశోధన రంగంలో మహిళలు, సామాజికాభివృద్ధిలో మహిళలు, మహిళాభివృద్ధికి లక్ష్యాలపై చర్చినట్లు డాక్టర్ కోడెల వివరించారు.

    ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా మాట్లాడుతూ అమరావతి ప్రకటనను ఎలా రూపొందించాలనేదానిపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కాలపరిమితి నిర్ణయించుకొని పని చేస్తున్నట్లు చెప్పారు.

పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు
          మహిళా సాధికారితపై అమరావతి ప్రకటన కోసం జరిగిన సమావేశంలో పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. మహిళా సమస్యలను ఆమూలాగ్రం చర్చించారు. వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించారు. సామాజిక భద్రత, ఒంటరి మహిళల సమస్యలు, లింగ వివక్షత, మహిళా చట్టాలు, వేధింపులు, మహిళల ఆర్థిక స్వావలంబన, మహిళా రుణాలు, ఆత్మహత్యలు, బాలికలు మధ్యలోనే బడిమానవేయడం, మహిళలకు నైపుణ్య శిక్షణ... వంటి అన్ని అంశాలను చర్చించారు. వివిధ అంశాలపై నిపుణులు అభిప్రాయాలు తెలిపారు. మహిళలకు చట్టాల గురించి అవగాహన కల్పించడం, ఆస్తిలో మహిళలకు ఎన్టీఆర్ సమాన హక్కు కల్పించడం, మహిళలకు సంబంధించి నిధుల కేటాయింపు, డ్వాక్రా గ్రూపులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
వంద మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలు
         సమావేశంలో స్పీకర్ కోడెల మాట్లాడుతూ వంద మైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుందని, మీరు రూపొందించే అమరావతి ప్రకటన ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. దేశానికే ఒక ఆదర్శవంతమైన ప్రకటన వెలువడాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల్లో చైతన్య వచ్చిందని, ‘‘నా పెన్షన్ ఏదీ, నాకు రావలసిన పథకం ఏదీ?’’ అని ప్రశ్నిస్తున్నారన్నారు. వారిలో ఇంకా చైతన్య రావాలని స్పీకర్ కోడెల అన్నారు.

సిమెంట్ ధర తగ్గించాలి

ఉత్పత్తిదారుల సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల

    సచివాలయం, ఏప్రిల్ 24: ఒక్కసారిగా పెరిగి ప్రజలకు భారంగా మారిన సిమెంట్ ధర సమస్యకు పరిష్కారం కావాలని సిమెంట్ ఉత్పత్తిదారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం రెండవ బ్లాక్ లో సోమవారం మధ్యాహ్నం సిమెంట్ ఉత్పత్తిదారులు మంత్రి మండలి ఉపసంఘంతో సమావేశమయ్యారు. సిమెంట్ బస్తా ధర ఒక్కసారిగా 70 నుంచి 90 రూపాయలు పెరగడం, అలాగే జిల్లా జిల్లాకు ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసే సీఫామ్ ద్వారా అమ్మే సిమెంట్ బస్తా ధరకు, సాధారణ  మార్కెట్ ధరకు రూ.40ల వరకు వ్యత్యాసం ఉంటుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్- వస్తుసేవల పన్ను) అమలులోకి వస్తుంది. దాంతో సీఫామ్ ద్వారా సిమెంట్ అమ్మకానికి ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడంలేదు. జీఎస్టీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పన్ను రాయితీ  ఇవ్వదేమోనన్న అనుమానాలు వారికి ఉన్నాయి.  ఈ విషయంలో ఆర్థిక మంత్రి యనమల వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. జూన్ నెలాఖరువరకు ప్రభుత్వం సీఫారాలు జారీ చేస్తుందని, ఉత్పత్తిదారులు సిమెంట్ సరఫరా చేయాలని, దాని వల్ల జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మంత్రులుగా తాముగానీ, ప్రభుత్వంగానీ ప్రజల మేలు కోసం పని చేస్తామన్నారు. ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత తమకు ఉందని చెప్పారు. అదే సందర్భంలో పరిశ్రమలు కూడా బాగుండాలనే అనేక రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తిదారులకు ఉండే సమస్యలు వారికీ ఉంటాయని, కాదనడంలేదన్నారు.  సీఫామ్ లు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం రూ.60 నుంచి రూ.70 కోట్ల   నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నందున ఉత్పత్తిదారులు కూడా లాభాల్లో ఒక శాతం తగ్గించుకొని సిమెంట్ ధర తగ్గించాలన్నారు. నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు డీలర్లు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో సిమెంట్ బస్తా ధర ఒకే రకంగా ఉండాలని, ఒక వేళ వ్యత్యాసం ఉన్నా రవాణా చార్జీలకు మించి ఉండకూడదని మంత్రి యనమల చెప్పారు.

    తమ నిర్ణయం తెలపడానికి  ఉత్పత్తిదారులు  రెండు రోజులు సమయం అడిగారు. తాము చర్చించుకొని నిర్ణయం తెలియజేస్తామన్నారు. ధర మాత్రం తగ్గించాలని మంత్రులు డిమాండ్ చేశారు.  మళ్లీ ఈ నెల 27వ తేదీ సాయంత్రం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు  ఇతర మంత్రులు నారాయణ, అమరనాథ రెడ్డి, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు పాల్గొన్నారు.

 బాధలు చెప్పుకున్న  బిల్డర్లు
ఉత్పత్తిదారులతో సమావేశం ముగిసిన తరువాత మంత్రులు బిల్డర్లతో కూడా సమావేశమయ్యారు. వారు తమ ఇబ్బందులను చెప్పారు. మార్చిలో కొన్ని బ్రాండ్ల సిమెంట్ బస్తా రూ.235లకే ఇచ్చారని, ఇప్పుడు రూ.370 రూపాయల వరకు అమ్ముతున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం సీఫామ్ పై ఎవరూ సిమెంట్ అమ్మడంలేదని చెప్పారు. సిమెంట్ ధరలు ఈ స్థాయిలో పెరగడంతో ఇప్పటికే తాము అంగీకరించిన వాటిని పూర్తి చేసి ఇవ్వడం కష్టమని వారు తమ బాధలు వివరించారు. అడిగినవారందరికి సీఫామ్స్ ఇస్తారని, వాటిపై కంపెనీలు సిమెంట్ కూడా పంపిణీ చేస్తారని, రెండు రోజుల్లో ధరలు తగ్గుతాయని మంత్రి యనమల వారికి చెప్పారు.


జారీచేసినవారు: పబ్లిసిటీసెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం


ఉద్యమ స్పూర్తితో నీటి సంరక్షణ

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన
మంత్రి శిద్ధా రాఘవరావు

సచివాలయం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యమ స్పూర్తితో నీటి సంరక్షణ చర్యలు చేపట్టినట్లు అటవీ, శాస్త్ర,సాంకేతిక శాఖల మంత్రి మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం 5వ బ్లాక్ లో మంత్రి కేక్ కట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం రాత్రి పగలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో వృద్ధిరేటు డబుల్ డిజిట్ సాధించామని, చక్కటి రాజధాని నిర్మించుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం నీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 90 రోజులపాటు నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు రహిత రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఓ చరిత్రగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2018 నాటికి దీనిని పూర్తి చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. దీంతో కరువు తొలగిపోతుందన్నారు.
2018 నాటికి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి నీరందిస్తారని మంత్రి చెప్పారు. నీటి సంరక్షణలో విద్యార్థులను, ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వాములను చేస్తున్నారని, చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నారని తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ మొదలుపెట్టి,  పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి నీరు తరలించి వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టుని 18 నెలల్లో పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి శిద్ధా అన్నారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం.