May 12, 2017

అంబేద్కర్ స్మృతివనం నిధులు

రూ.97.64 ఏపీఐఐసీకి అప్పగింత
బాధ్యతలు స్వీకరించిన మంత్రి నక్కా ఆనందబాబు
·       సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.41.81 కోట్లు
·       3 గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ. 63.36 కోట్లు మంజూరు
·       హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అంశం పరిశీలిస్తా
·       అభివృద్ధి, సంక్షేమం, 2019 ఎన్నికలే ధ్యేయంగా కృషి

         సచివాలయం, ఏప్రిల్ 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమరావతిలో నిర్మించే బాబా సాహేబ్ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించిన రూ.97.64 కోట్ల నిధులు ఏపీఐఐసీకి అప్పగించామని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు హిందూ సాంప్రదాయబద్దంగా పూజలు, క్రైస్తవ ఆచారం ప్రకారం ప్రార్ధనలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా అవకాశం ఇచ్చి తన క్యాబినెట్ లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన రెండు శాఖలకు సంబంధించి సంపూర్ణ అవగాన ద్వారా పేద,బడుగు, బలహీన, దళిత వర్గాలకు న్యాయం జరిగేందకు కృషిచేస్తానని చెప్పారు. తమ నేత సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు 2019 ఎన్నికలే ధ్యేయంగా పని చేస్తానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు సారధ్యంలో బలహీన, బడుగు వర్గాల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండేవిధంగా పాటుపడతానని చెప్పారు.
రాష్ట్రంలోని 90 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.41.81 కోట్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే హిందూపురం, తుని, సత్తెనపల్లిల్లో సాంఘీక సంక్షేమ పాఠశాలల నిర్మాణం నిమిత్తం రూ.63.36 కోట్ల నిధులు విడుదల చేస్తూ మరో ఫైల్ పై సంతకం చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో కేటాయించిన విధంగా అంబేద్కర్ స్మృతి వనం నిధులు ఏపీఐఐసీకి అప్పగించడం, సాంఘీక సంక్షేమ పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం తన చేతులు మీదగా జరిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఎస్టీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లినట్లు వచ్చిన విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేదని చెప్పారు. తనకు కేటాయించిన శాఖలలోని వివిధ అంశాలను పరిశీలించి, సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానన్నారు. భవిష్యత్ లో ఎవరికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేవిధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయులు కొరతగా ఉన్న అంశం తన దృష్టికి కూడా వచ్చిందని, ఈ అంశాన్ని పరిశీలించి పరిష్కరిస్తానన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టే అంశం పరిశీలిస్తానని మంత్రి ఆనందబాబు చెప్పారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం.



టెక్నాలజీతో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట

మంత్రి సుజయ కృష్ణ రంగారావు

·       పెట్టుబడిదారులకు రెడ్ టేపిజం లేకుండా రెడ్ కార్పెట్ తో స్వాగతం
·       3 నెలల్లో శాఖలోని అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే
·       అందరికీ అందుబాటులో వ్యాపార అవకాశాల సమాచారం

           సచివాలయం, ఏప్రిల్ 14: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటామని భూగర్బ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమం జరిగిన వెంటనే బాబాసాహేబ్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున కార్యాలయంలోకి అడుగుపెట్టడం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యత గల ప్రతి వ్యక్తి అంబేద్కర్ ఆశయాలు స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కీలక శాఖలలో ఒకటైన ఈ శాఖను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన దన్యవాదాలు తెలపారు. ఈ శాఖ ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో భవిష్యత్ లో కూడా అదేవిధంగా ఉపయోగపడేవిధంగా కృషి చేస్తానన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యాలను ఏవిధంగా చేరుకోగలిగారో, 2017-18లో కూడా అదేవిధంగా చేరుకుంటామన్నారు. అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రెడ్ టేపిజం లేకుండా, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరించి పెట్టుబడులను రాబడతమాని చెప్పారు. తమ శాఖకు సంబంధించి వ్యాపార అవకాశాలు ఏమేరకు ఉన్నాయో ఆ వివరాలను అందరికీ తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం తమ శాఖలో చాలా వరకు ఆన్ లైన్ లోనే వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే అన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆ రకంగా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
          
విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో దాదాపు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు(ఎంఓయులు) జరిగినట్లు తెలిపారు. వాటిలో 50 శాతానికి పైగా పెట్టుబడులు వచ్చేవిధంగా కృషి చేస్తామని చెప్పారు. తమ శాఖకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మానవతా దృక్పదంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.


ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఓ సమస్య పరిష్కారం


·       జనాభా నిష్పత్తిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు పంచుకోవడానికి అంగీకారం
·       ఇది శుభపరిణామం: మంత్రి పితాని సత్యనారాయణ

          సచివాలయం, ఏప్రిల్ 13: ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రా మధ్య  మూడేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల సమస్య  పరిష్కారమైనట్లు  ఉపాధి, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. సచివాలయం 4 బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇంత కాలం అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య సామరస్యంగా పరిష్కారమవడం శుభపరిణామం అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావుల అంగీకారం మేరకు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహా రెడ్డితో తాను మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఇరు రాష్ట్రాల అధికారులు కూడా మాట్లాడి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. మన రాష్ట్ర అధికారులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయడానికి అంగీకారం కుదిరినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, చర్చలు జరపడం ద్వారా  ఈ సమస్య పరిష్కారమైనట్లు తెలిపారు.
సంక్షేమ బోర్డుకు సంబంధించిన నిధులు ఇరు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన 58+42 నిష్పత్తిలో పంచుకోవడానికి ఇరు ప్రభుత్వాలు అంగీకరించాయి. 2014 జూన్ 1వ తేదీ నాటికి మొత్తం నిధులు రూ.1463 కోట్ల 44 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.458 కోట్ల 52 లక్షలు ఇరు రాష్ట్రాల పీడీ ఖాతాలలో జమ అయ్యాయి. ఏపీ ఖాతాలో రూ.267 కోట్ల 41 లక్షలు, తెలంగాణ ఖాతాలో రూ. 191 కోట్ల 11 లక్షలు జమ అయ్యాయి. మిగిలిని రూ. 1105 కోట్ల 56 లక్షలలో ఏపీకి రూ. 639 కోట్ల 91 లక్షలు, తెలంగాణకి రూ. 465 కోట్ల 64 లక్షలు జమ కావలసి ఉంది.
రాష్ట్రంలోని పెద్దలు ఎవరినీ సంప్రదించకుండా చీకటి ఒప్పందం ద్వారా పాస్ చేసిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు వల్ల అనేక సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని కూడా ఇదేవిధంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఉద్యోగులు, టూరిజం, పోలీస్ కేసులు వంటి సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఏపీ ప్రభుత్వ పక్షాన తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పితాని చెప్పారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం

సమర్థతకు, పనికి ప్రత్యామ్నాయంలేదు


ఎక్సైజ్ శాఖ మంత్రి శామ్యూల్ జవహర్

·       ఎక్సైజ్ శాఖ ప్రధాన ఆర్థిక వనరు కాదు
·       ఎమ్మార్పీకి మించి అమ్మాలంటే భయపడేవిధంగా చర్యలు
·       యువతను మద్యానికి దూరంగా ఉంచుతాం
·       సమాచార విప్లవాన్ని వినియోగించుకుంటాం
·       అవసరమైతే నేనూ దాడుల్లో పాల్గొంటాను
·       సోమవారం, శుక్రవారం సచివాలయంలో అందుబాటులో ఉంటా

           సచివాలయం, ఏప్రిల్ 12: సమర్థతకు, పనికి ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని, తనకు ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఎస్ఐ స్థాయి అధికారికి కూడా సిమ్ ఇవ్వడానికి సంబంధించిన ఫైల్ పై రెండవ సంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీవెనలతోనే ఎమ్మెల్యేనీ, మంత్రిని అయ్యానన్నారు. తనపై నమ్మకంతో దళితుడినైన తనకు ఎక్సైజ్ వంటి ముఖ్య శాఖని అప్పగించారన్నారు. తాను మంత్రి పదవి అడగలేదని, సీఎంగారే ఇచ్చారని చెప్పారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఈ శాఖకు సంబంధించిన విషయాలు తెలుసుకొని అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖను తాము ప్రధాన ఆర్థిక వనరుగా చూడటంలేదన్నారు. మద్యం సేవించడాన్ని తాము ప్రోత్సహించం అని చెప్పారు. యువత మద్యం, మాదక ద్రవ్యాలవైపు మళ్లకుండా, మత్తుకు బానిసలు కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎడిక్షన్ కేంద్రాల ద్వారా యువతను మత్తుకు దూరంగా ఉంచుతామన్నారు.
                సమాచార విప్లవాన్ని పూర్తీగా సద్వినియోగం చేసుకొని తమ శాఖలో అవకతవకలు జరుగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. సమర్థతకు, పనికి పత్యామ్నాయంలేదని చెప్పారు. మద్యం తాగటానికి టార్గెట్ ఏమీ లేదన్నారు. తమ శాఖ తరపున యాఫ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్యంని టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అవకతవకలు జరుగకుండా గోడౌన్ వద్ద నుంచి మద్యం లారీ బయలు దేరిన తరువాత దిగుమతి జరిగే పాయింట్ కు చేరే వరకు ట్రాకింగ్ విధానం ద్వారా  నిఘా ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కోర్టు నిబంధనల ప్రకారం  గ్రామానికి 500 మీటర్ల దూరంలో మద్యం షాపు ఏర్పాటుకు, 20వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 220 మీటర్ల దూరంలో  షాపులు ఏర్పాటుకు అనుమతి ఇస్తారని వివరించారు.
           ఎమ్మార్పీ ధరలకు మించి మద్యాన్ని విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇటువంటి నేరానికి లక్ష రూపాయలు ఫైన్ విధిస్తున్నారని, ఇక ముందు అలా చేయాలంటే భయపడే స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం కల్తీని నిరోధించేందుకు అవసరమైన చర్యలన్నిటినీ తీసుకుంటామన్నారు. అవసరమైతే తాను కూడా దాడులలో పాల్గొంటానని, అటువంటి చర్యలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ను కూడా ప్రయోగిస్తామని మంత్రి హెచ్చరించారు.
            మంత్రి మండలి సమావేశం, ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ప్రతి సోమవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలో తాను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. శాఖలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తానన్నాను. రాజకీయాలకు ఆస్కారంలేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని మంత్రి జవహర్ చెప్పారు.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వంద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. మొదటగా గురువారం ఏలూరులో ప్రారంభించనున్నట్లు మంత్రి జవహర్ పేర్కొన్నారు.  


జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి,




అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం

మంత్రి కొల్లు రవీంద్ర
6 శాఖల బాధ్యతల స్వీకరణ
త్వరలో యూత్, స్పోర్ట్స్ పాలసీలు
నియోజవర్గానికి ఓ స్టేడియం నిర్మాణం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ అభివృద్ధి

    సచివాలయం, ఏప్రిల్ 12: యువతను ప్రోత్సహించి రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామని యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయ, నైపుణ్యా భివృద్ధి, నిరుద్యోగభృతి, ప్రవాసభారతీయుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సచివాలయం 2వ బ్లాకులోని తన చాంబర్ లో బుధవారం ఉదయం తనకు కేటాయించిన ఆరు శాఖ బాధ్యలను ఆయన స్వీకరించారు. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతగల ఆరు శాఖలను తనకు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు, తరువాత కూడా సీఎం యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరుద్యోగ భృతికి ఈ ఏడాది బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. అవసరమైతే ఈ నిధులను పెంచుతారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత అభిప్రాయాలను తెలుసుకొని నిరుద్యోగ భృతికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రోంలోని యువత ప్రపంచ స్థాయిలో నిలవాలన్నదే తమ ధ్యేయం అన్నారు.

త్వరలో యూత్, స్పోర్ట్స్ పాలసీలు
     త్వరలో యూత్ పాలసీ,  స్పోర్ట్స్ పాలసీలను రూపొందించనున్నట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తామని చెప్పారు. మూడు వేల పాఠశాలల్లో గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రవాస భారతీయులను ప్రోత్సహించి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రం పదకుండున్నర శాతం వృద్ధి రేటుతో ముందుకు పోతున్నట్లు తెలిపారు.

     విజయవాడ భవానీపురం బ్రిడ్జి త్వరలోనే పూర్తి అవుతుందని మంత్రి చెప్పారు. రూ.65 కోట్లతో దానిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి కూడా త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. మచిలీపట్నం పోర్ట్ భూములను పోర్టుకు అప్పగించినట్లు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెబుతూ అక్కడ భూములకు సంబంధించి ఏమీ సమస్యలు లేవని చెప్పారు. ఏవైనా ఉన్నా ఎంపీ గారు, తాను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చైనాలోని షాంగైలో కూడా ఇక్కడ మాదిరే వాతావరణం ఉన్నట్లు తెలిపారు. అందువల్ల అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కన్సెంల్టెంట్ ని నియమించిన తరువాత వారు పోర్ట్ ప్లాన్ రూపొందిస్తారని మంత్రి రవీంద్ర చెప్పారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి,


జీఎస్టీకి దేశవ్యాప్తంగా అనుకూలత

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
          కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల విధానం పట్ల దేశవ్యాప్తంగా అనుకూలత వ్యక్తమవుతున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్ లో మంగళవారం మధ్యాహ్నం  తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ వల్ల నాలుగు రకాల వస్తువులు పొగాకు ఉత్పత్తులు,  లగ్జరీ కార్లు, సాఫ్ట్ డ్రింక్స్, బొగ్గు(క్లీన్ ఎన్విరాన్ మెంట్ సెస్)పై 28 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని తెలిపారు. మిగిలినవాటిపై 5 శాతం, 12 శాతం, 18 శాతం చొప్పున పన్ను విధించే అవకాశం ఉందని చెప్పారు. కొత్త పన్నులకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (ఐజీఎస్టీ), పరిహార బిల్లులను పార్లమెంటులో ఆమోదించినట్లు తెలిపారు.  వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపార,  ఆమోదించిన తరువాత గజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. ఆ తరువాత రాష్ట్రాలు ఆమోదించవలసి ఉంటుందని చెప్పారు. ఈ బిల్లులు ఆమోదించడం కోసం ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ రాష్ట్రంలో ఉభయ సభల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈలోపు వివిధ రాష్ట్రాల్లో వస్తువులపై పన్నులను అధ్యయనం చేసి నిపుణుల కమిటీ ఒక నివేదిక అందజేస్తుందని తెలిపారు. అయితే ఈ కమిటీలో మన రాష్ట్రం నుంచి సభ్యుడు ఎవరూ లేరని చెప్పారు. ఈ నెల 18, 19 తేదీల్లో శ్రీనగర్ లో జీఎస్ టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఏఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలి, నష్టపోయే రాష్ట్రాలను ఏ విధగా ఆదుకోవాలి.... వంటి అన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారన్నారన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన తరువాత దేశవ్యాప్తంగా  జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
         ఒకే రకమైన పన్నుల విధానాన్ని ప్రపంచంలో సగం దేశాలు ముఖ్యంగా యూరప్ లో అమలు చేస్తున్నట్లు వివరించారు. నూతన పన్నుల విధానం పట్ల దేశవ్యాప్తంగా అనుకూలత వ్యక్తమవుతున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో రెవిన్యూ పెరుగుతుందని, స్వల్ప కాలంలో నష్టాలు వస్తాయని చెప్పారు. అయితే నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం సెస్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి యనమల  తెలిపారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు  కూడా పాల్గొన్నారు.
జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి  సెల్ నెంబర్ : 9949351604


‘ఉడా’లు అన్నిటిలో ఒక రకమైన నిబంధనలు

-     మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం
     
    రాష్ట్రంలోని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఉడా)లన్నింటిలో ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని మంత్రి వర్గ ఉపసంఘం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశంలో నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్ లో మంగళవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పట్టణాభివృద్ధి సంస్థలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయని, వాన్నిటినీ ఒకే విధంగా రూపొందిస్తారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగవలసిన అవసరం ఉందని, పెట్టుబడులు రావాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ విషయాలపై ఈ రోజు చర్చించినట్లు మంత్రి చెప్పారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేందకు లేఅవుట్ల నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. సీఆర్ డీఏ పరిధిలో అమరావతి రాజధాని లోపల ఇన్నర్ రింగ్ రోడ్డుకు బయట 10,255 ఎకరాల్లో లేఅవుట్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. లేఅవుట్ల నిబంధనలను సరళం చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి,  సెల్ నెంబర్ : 9949351604