Sep 26, 2018


లోకేష్ చైనా పర్యటన విజయవంతం
          
ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వారం రోజుల చైనా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన పర్యటన ఆధ్యంతం బిజీబిజీగా సాగింది. అనేక మంది బహుళ జాతి పారిశ్రామిక దిగ్గజాలను ఆయన కలిశారు.  ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక వినియోగం, పారిశ్రామిక అవకాశాలు, నైపుణ్యత గల మానవవనరుల లభ్యత, సరళతర వ్యాపార నిర్వహణ గురించి తెలియజేశారు. రాష్ట్రాన్ని సందర్శించి, పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి పెట్టుబడులు పెట్టమని వారిని ఆహ్వానించారు. పలువురితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అలాగే చైనాలోని తెలుగువారితో సమావేశమై వారితో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకోవాడానికి అవకాశం ఏర్పడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలకు ఆహ్వానంపై చైనా వెళ్లిన ఆయన ఈ నెల 16 నుంచి 22 వరకు వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు. 16వ తేదీ ఆదివారం రాత్రి చైనా రాజధాని బీజింగ్ లోని  ఓ హోటల్ లో బస చేసిన ఆయన అక్కడ చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో  సమావేశమయ్యారు. ఆత్మీయ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ ‘‘ ప్రవాసాంధ్రులే మా బ్రాండ్ అంబాసిడర్లు. భార‌త‌దేశం వినియోగించ‌నున్న 480 బిలియన్ డాలర్ల విలువైన  ఎలక్ట్రానిక్స్ లో, 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ని ఏపీలో త‌యారు చెయ్యాల‌న్నది మన లక్ష్యం.  చైనాలోని ప్రవాస తెలుగువారు  రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాలి. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఐటీ అభివృద్ధి చేస్తున్నాం. ఫ్రాంక్లిన్, హెచ్ సిఎల్, జోహో, కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.  ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ఎపి ఎన్ఆర్టీని  ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. 17వ తేదీన హెచ్ సిటిజి కంపెనీ ప్రతినిధులతో మంత్రి  భేటీ అయ్యారు. టెలీకమ్యూనికేషన్ సర్వీసెస్ అందిస్తున్న ఈ కంపెనీ ఫైబర్ కేబుల్ సిరీస్, డిజిటల్ కేబుల్ సిరీస్, నెట్ వర్క్ క్యాబినెట్స్, ఆప్టికల్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ తదితర పరికరాలను తయారు చేస్తోంది.  రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల గురించి లోకేష్ వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అంగీకార పత్రాన్ని ఆ కంపెనీ ప్రతినిధులు  ఐటీ,ఎలక్ట్రానిక్స్ సెక్రెటరీ విజయానంద్ కి అందజేశారు. ఆ తరువాత మంత్రి  బీజింగ్ సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్, ప్రతినిధులతో సమావేశమయ్యారు.  ఈ కంపెనీ సోలార్ ఎనర్జీ సంబంధిత పరికరాలను తయారు చేస్తోంది.  ఏపీలో పునరుత్పాదక శక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నామని, సోలార్ ప్యానల్స్, సోలార్ సెల్స్ తదితర పరికరాల తయారీ, పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వారికి వివరించారు. గడిచిన 4 ఏళ్లలో 6.8 గిగావాట్ల  పునరుత్పాదక శక్తి సామర్ధ్యాన్ని అందుకున్నామని,  మరో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా  పనిచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, కంపెనీ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, సప్లైయర్ కంపెనీలు, సబ్సిడరి కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తామని సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్ హామీ ఇచ్చారు. బీజింగ్ రైసెన్ సోలార్ టెక్నాలజీ ఆపరేషన్స్ డైరెక్టర్ జియాన్పింగ్ జెంగ్, ప్రతినిధులను కూడా మంత్రి కలుసుకున్నారు. సోలార్ ప్యానల్స్ తయారీలో చైనాలో టియర్ 1 కంపెనీగా  రైసెన్ సోలార్ టెక్నాలజీ ఉంది.  ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికలతో వస్తామని  జియాన్పింగ్ జెంగ్ చెప్పారు. సన్నీ ఆప్టికల్ టెక్నాలజీ వైస్ డైరెక్టర్ ఆరాన్, ఓ ఫిల్మ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమై చర్చించారు. ఓ ఫిల్మ్, సన్నీ ఆప్టికల్స్ కెమెరా మాడ్యూల్, ఆప్టికల్ కంపోనెంట్స్ తయారు చేస్తాయి.   భారత్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని,  డిజైన్ టూ డెత్ అనే మోడల్ ని అభివృద్ధి చెయ్యబోతున్నట్లు మంత్రి వారికి వివరించారు. త్వరలో ఏపీకి వస్తామని, అక్కడ పరిస్థితులు గమనించి పెట్టుబడులు పెడతామని ఆరాన్, ఓ ఫిల్మ్ కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆ తరువాత మంత్రి షామీ సప్లైయర్స్ మీట్ లో ప్రసంగించారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అనువైన పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీపై నమ్మకం ఉంచి అందరి కంటే ముందే నిర్ణయం తీసుకొని కంపెనీ ఏర్పాటు చేస్తున్న హొలీ టెక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
                 టియాన్జిన్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు  3 రోజులు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాలకు మన దేశంలోని ఇద్దరు మంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సాంకేతిక వినియోగం, సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గురించి వివరించి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు వివరించారు.  అసెంబ్లీ ఆఫ్ సిటీ లీడర్స్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి తీసుకోవలసిన చర్యలు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ వ్యాప్తంగా డెలివరీ, సమాచార సేకరణ కోసం డ్రోన్ల వినియోగం, మెరుగైన సమాజం కోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ....తదితర అంశాలపై జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మూడు రోజుల్లో ఆయన అక్కడ అంతర్జాతీయంగా మ్యాప్ కంటెంట్, ట్రాకింగ్, లొకేషన్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ సేవలు అందిస్తున్న హియర్ టెక్నాలజిస్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ మెలోడీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లీడర్ షిప్ ఫెలో ప్రోగ్రామ్ కు చెందిన జయంత్ నారాయణ్,  ఏఐఐబి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్  వాన్ ఆమ్స్‌ బర్గ్‌, స్టీల్, పెట్రోలియం, కెమికల్స్, కోల్, ఇండస్ట్రీయల్ ప్రొడక్ట్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియాకి చెందిన జిఎస్ గ్లోబల్ ప్రెసిడెంట్ సీయాహాంగ్,   హెచ్ పి కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ క్రిక్ వంటి వారితో వ్యక్తిగతంగా  సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను, అందుబాటులో ఉన్న వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాలతోపాటు భారీ ఎత్తున స్థాపించే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, కల్పించే సౌకర్యాలు వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి తమ రాష్ట్రానికి రావలసిందిగా వారిని ఆహ్వానించారు. 19వ తేదీని ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  సన్ రైజ్ రాష్ట్రంగా, తూర్పు ముఖ ద్వారంగా ఉంటూ దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులకు గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతోంది.  అనేక అంశాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును సాధించడంలో దేశంలో ముందుంది. అమరావతికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ అందించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం జరుగుతోంది.  రాష్ట్రలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో, సముద్ర జలాల్లో సంపద ఉంది.   6 పోర్టులు ఉన్నాయి. మరో 6 పోర్టులు నిర్మించనున్నాం.  ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.  కొరియాకి చెందిన అతి పెద్ద కార్ల కంపెనీ కియా రాష్ట్రాలో ఉత్పత్తి యూనిట్ ని నెలకొల్పింది. ఇసుజు, హీరో మోటార్స్, అపోలో టైర్స్, అశోక్ లైల్యాండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీలు వచ్చాయి.  పలు  ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడంతో  దేశంలో తయారు అవుతున్న 100 సెల్ ఫోన్లలో 30 ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యత కలిగిన యువతీ,యువకులకు కొందవలేదు. ఇన్నోవేషన్ వే ఆఫ్ లైఫ్ గా(నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా) మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా ఫలితాలు సాధిస్తున్నాం. ఐఓటి పరికరాలు వినియోగించి రియల్ టైం లో సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల శాఖల మధ్య పోటీ పెరిగింది. దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన రియల్ టైం  డేటా అందరికీ అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించి ల్యాండ్ రికార్డులకు భద్రత కల్పిస్తున్నాం. ఈ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల్లో ఎల్ఈడి లైట్ల పర్యవేక్షణ కోసం సిసిఎమ్ఎస్ టెక్నాలజీ వినియోగిస్తున్నాం.  సెన్సార్ల ద్వారా నీటి నాణ్యతను, డ్రోన్లు, లైడార్ టెక్నాలజీ అనుసంధానంతో రోడ్ల నాణ్యత తెలుసుకుంటున్నాం. రాష్ట్రంలో 100 ఎకనామిక్ సిటీలు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 4వ పారిశ్రామిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. బిగ్ డేటా, ఇండస్ట్రీయల్ రివల్యూషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అంశాల అమలులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం కావాలని సమావేశానికి హాజరైన వ్యాపార దిగ్గజాలను కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీలు, రాయితీలు, రియల్ టైం గవర్నెన్స్, నైపుణ్యత మానవవనరుల లభ్యత, భూగర్భ సంపద, 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ... వంటి అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, అక్కడ సాంకేతిక వినియోగం గురించి తమకు తెలుసునని, త్వరలో రాష్ట్రాన్ని సందర్శించి పెట్టుబడులు పెడతామని, తమ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు లోకేష్ కు హామీ ఇచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదటిసారిగా త్వరలో ఇండియాలో ఒక సెంటర్ ను  ఏర్పాటు చేయబోతోంది. ముంబై కేంద్రంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రోన్స్, బ్లాక్ చైన్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ని ఏర్పాటు చేస్తారు. 4వ పారిశ్రామిక విప్లవానికి చేయూతనిచ్చేవిధంగా దీనిని రూపొందిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఫోరం సభ్యులు లోకేష్ కు చెప్పారు. ఆ విధంగా మంత్రి లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవిధంగా  సద్వినియోగం చేసుకున్నారు.
                 22వ తేదీన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి, ఎలక్ర్టానిక్స్ తయారీలో ప్రపంచంలోనే పేరుగాంచిన చైనాలోని షెన్ జెన్ లో మంత్రి  వివిధ సంస్థల ప్రతినిధులతో కీలక భేటీలు నిర్వహించారు. మొబైల్ ఫోన్ల ప్లాస్టిక్ కేసింగ్ తయారు చేసే టోంగ్డా కంపెనీ వైస్ ఛైర్మెన్ వాన్గ్ యాహువాతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.  ఇరువురూ కీలక అంశాలపై చర్చించారు. అక్టోబర్ 2 వ వారంలో ఏపీకి కంపెనీ బృందం వస్తుందని, సుమారు 5 వేల మందికిపైగా నిపుణులు తమకు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఏపీలో మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారు టోంగ్డా కంపెనీలో ఉద్యోగాలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. టోంగ్డా కంపెనీలో 24 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.  కాంపోనెంట్స్ బిజినెస్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ హార్డ్ వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ లో ఐటీ సర్వీసెస్ అందిస్తున్న సివిటిఈ కంపెనీ డైరెక్టర్ హువాంగ్ జేన్గ్కాంగ్ తో మంత్రి సమావేశమయ్యారు.   భారత్ లోని ఇతర నగరాలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో ఏపీలో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని  లోకేష్ వారికి వివరించారు. త్వరలో తమ కంపెనీ ఉన్నత బృందం ఏపీకి వస్తుందని, ఆ తరువాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని జేన్గ్కాంగ్ మంత్రికి చెప్పారు.  షెన్ జెన్ లోని హువావే కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి, ఐటీ అధికారుల బృందం సందర్శించింది.  170 దేశాల్లో వ్యాపారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో 72వ స్థానం, అన్ని దేశాలలో కలిపి  లక్షా 80 వేల మంది ఉద్యోగులు, 36 జాయింట్ ఇన్నోవేషన్ సెంటర్లు, 14 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్న హువావే ఐటీ, ఎలక్ర్టానిక్స్ రంగాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తోంది. క్లౌడ్ డేటా సెంటర్లు, ఎంటర్ ప్రైజ్  కొలాబ్రేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంటర్ ప్రైజ్  వైర్లెస్ సర్వీసెస్ సేవలను హువావే అందిస్తోంది. వీటితోపాటు సిసి కెమెరాలు, మొబైల్స్, రౌటర్లు, సర్వర్లు  తయారుచేస్తోంది. హువావే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హాన్ జియోతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన, పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాడకం, ఈ గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్, రియల్ టైం గవర్నెన్స్, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ గ్రామాల అభివృద్ధి గురించి మంత్రి వివరించారు.  దీనిపై స్పందించిన హువావే వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఏపీ పాలసీలు, విజన్ తమకు నచ్చాయని, రియల్ టైం గవర్నెన్స్, స్మార్ట్ గ్రామాల అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.  షెన్ జెన్ లో అస్ట్రమ్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన హాంకాంగ్, చైనా ఇన్వెస్టర్ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న అస్ట్రమ్ తో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఎల్ఎల్కే డిజైన్, షేన్ జెన్ పవర్ టెక్నాలజీ, డాన్గువాన్ వైజి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీలు ముందుకొచ్చాయి.   అస్ర్టమ్ తో మూడు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా  తిరుపతిలో  ఎల్ఎల్కే డిజైన్ సంస్థ ఇన్నోవేషన్  డిజైన్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది. షెన్ జెన్ పవర్ టెక్నాలజీ సంస్థ కూడా తిరుపతిలో తయారీ సంస్థను నెలకొల్పనుంది. డాన్గువాన్ వైజి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీ  సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం చేసుకుంది. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు అస్ట్రమ్ రూ.100 కోట్ల పెట్టుబడితో తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో కంపెనీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయి.  ఆడియో పరికరాలు, ఎల్ఈడీ లైట్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ యాక్ససరీస్, కంప్యూటర్ కంపోనెంట్స్ , గేమ్ కంట్రోలర్స్ వంటి కన్య్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న అస్ట్రమ్  ఈ మూడు కంపెనీలతో కలిపి ఈ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల ప్రతినిధులను మంత్రి లోకేష్ అభినందించారు.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...