Sep 14, 2018


మాతృ వందన సప్తాహలో
దేశంలో అత్యున్నతంగా నిలిచిన ఏపీ
       సచివాలయం, సెప్టెంబర్ 14: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని  మాతృ వందన సప్తాహ కార్యక్రమంలో రాష్ట్రం లక్ష్యాలను అధిగమిచి దేశంలో అత్యుత్తమంగా నిలిచింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2017 సెప్టెంబర్ లో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కార్యక్రమం ప్రారంభించింది. ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘మాతృ వందన సప్తాహ’ పేరుతో   కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వార్షికోత్సవం నిర్వహించింది.  లబ్దిదారుల లక్ష్యాన్ని 145.43 శాతం అధిగమించి  ఏపీ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచినట్లు ముగింపు ఉత్సవంలో ఆ శాఖ ప్రకటించింది.  అంతేకాకుండా దక్షిణ జోన్ లో ఉత్తమ రాష్ట్ర అవార్డు  ఏపీ  సాధించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.  
       ఈ పథకం కింద ఈ ఏడాది సెప్టెంబర్ 14 నాటికి 3,30,034 మంది లబ్దిదారులకు రూ.111.5 కోట్లు అందజేశారు. దేశంలో ఇదే అధిక మొత్తం. జిల్లా స్థాయిలో లక్ష్యాలను సాధించడంలో కర్నూలు జిల్లా అవార్డు అందుకుంది.  ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలు  అందరూ అర్హులే. 2017 జనవరి 1వ తేదీన గానీ, ఆ తరువాత గానీ నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు(కుటుంబంలో మొదటి బిడ్డ) అర్హులవుతారు. 2017 అక్టోబర్-నవంబర్ లో నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కోసం వినియోగించే నిధులలో 60 శాతం కేంద్రం వాటా కాగా, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంటాయి. లబ్ధిదారుల వివరాలు  ఎప్పటికప్పుడు పీఎంఎంఈవీవై-సీఏఎస్ వెబ్ సైట్ లో నమోదు చేస్తారు. ప్రసూతి ప్రయోజన కార్యక్రమం కింద గర్భవతి అయినప్పటి నుంచి బాలింత వరకు  సగటున గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.6వేలు, పట్టణ ప్రాంతం అయితే రూ.5,600 ఇస్తారు. ఈ మొత్తాన్ని 4 దశలలో చెల్లిస్తారు. గర్భవతి అయిన 150 రోజుల లోపల పేరు నమోదు చేయించుకున్నప్పుడు రూ.1000లు, గర్భం దాల్చిన ఆరు నెలల తరువాత రూ.2000లు, బిడ్డ పుట్టినట్లు నమోదు చేసినప్పుడు రూ.2000లు,  ఆ తరువాత జనని సురక్ష యోజన (జేఎస్ వై) కింద గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1000లు, పట్టణ ప్రాంతాల వారికి రూ.600లు చెల్లిస్తారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ ధృవీకరణ చేసుకున్న తరువాత పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం) ద్వారా ఆన్ లైన్ లో చెల్లిస్తారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...