Sep 19, 2018

బీసీల రాజకీయ మేథోమథనం

 
 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. జనాభాలో 50 శాతానికి పైగా తామున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ, వేదన వారిలో తీవ్రస్థాయిలో నెలకొంది. తమలో ఐకమత్యంలేకపోవడం వల్లే పరిస్థితి ఇలా ఉందని వారికి స్పష్టమైంది.  రాజకీయ భాగస్వామ్యం కోసం వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎందగడానికి చేయవలసిన ప్రయత్నాలను అన్వేషిస్తున్నారు.  రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లైనా తమ బతుకుల్లో మార్పు రాదని వారికి అర్ధమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేథావులు, ఉద్యోగులు ఎక్కువ చైతన్యవంతంగా ఈ పనికి పూనుకున్నారు. యువతలో ఉత్సాహం నింపుతున్నారు.  అయితే బీసీ కులాలన్నీ ఏకమవడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. చేనేత లాంటి ఒకే వృత్తి చేసుకునే పద్మశాలి, దేవాంగ వంటి రాష్ట్రంలోని 19 కులాలు ఏకమవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితులలో బీసీ కేటగిరీకి చెందిన కులాలన్నీ ఏక కావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. వీరందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడానికి గట్టి నాయకత్వం కావాలి. బీసీలలో అటువంటి నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  అయినా రాష్ట్రంలోని బీసీలకు చెందిన అన్ని కుల సంఘాలను, ఉద్యోగ సంఘాలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందరూ వెనుకబడిన వార్గాలవారైనప్పటికీ ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పధాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేథావి వర్గం ప్రయత్నిస్తోంది. ఏకమైయ్యే క్రమంలో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. మేథోమథనం జరుగుతోంది. వారిలో కొందరు అత్యంత ఉత్సాహవంతులు, అతి ఆవేశపరులు ఓసీలను(ఆధిపత్య కులాలను) విమర్శిస్తూ బీసీలు ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగాలని వాదిస్తున్నారు. మరొకొందరు ఇప్పటికిప్పుడు ఇలా సాధ్యం కాదని, బీసీలకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలిపి ఎక్కువ సీట్లను పొంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రాజకీయ భాగస్వామ్యం పొందాలని అంటున్నారు. ఇంకొందరు రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని వాదిస్తున్నారు. ఇద్దరు బీసీ అభ్యర్థులు పోటీ పడే చోట, రాష్ట్ర స్థాయిలో ఒక బీసీ కమిటీ ఏర్పడి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించాలన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. పోటీ పడే అభ్యర్థులందరూ బీసీలయితే ఏకాభిప్రాయంపై ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని, అలా సాధ్యం కానిపక్షంలో తటస్థంగా ఉండటం మంచిదని అంటున్నారు. అక్కడ ఎవరు గెలిచినా బీసీలే అయినందున తమ వర్గం వారే గెలుస్తారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అనుభవజ్ఞులైన మేథావులు బీసీలు రాజకీయంగా ఎదగడానికి గట్టి పునాదులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు, విద్యావంతులై రాజకీయాల్లోకి రావలన్న ఉత్సాహంతో ఉన్న యువతీ, యువకులకు తగిన శిక్షణ ఇచ్చి జిల్లాల వారీగా బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన వారిలో ఉంది. అలాగే ఇతర కులాలను పక్కన పెట్టడం, వారిని విమర్శించడం మంచి పద్దతి కాదు. చారిత్రకంగా సమాజంలో అన్ని విషయాలలో మొట్టమొదట సంస్కరణలు తీసుకువచ్చింది ఉన్నత కులాలవారుగా భావిస్తున్నవారేనన్న విషయం మరువకూడదు. బీసీ అని మడికట్టుకు కూర్చుంటే కుదరదు. కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన మన సమాజంలో ఇతర కులాల సహకారంలేకుండా రాజకీయంగా ఎదగడం ఎవరికీ సాధ్యం కాదు. కులాలు వేరైనా మనుషులుగా అందరినీ గౌరవించవలసిన అవసరం ఉంది.  అంబేద్కర్ వల్లే అంతా సాధ్యమయిందని అనుకుంటే అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు. ఆయన ఆలోచనలకు, అభిప్రాయాలకు మద్దతు ఇచ్చినవారు ఆనాడు ఇతర కులాలలో అనేక మంది ఉన్నారు. అయితే అణగారిన వర్గం నుంచి అనేక బాధలుపడి అంబేద్కర్ అత్యున్నత స్థాయికి ఎదగడం, ఆ కాలంలోనే ఆయన ఉండటం, వాదనాపటిమతో అందరినీ ఒప్పించడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలతోపాటు మహిళలకు కూడా మేలు జరగడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల సామాజిక సమానత్వాన్ని కోరుకునే వారిలో ఉన్నత కులాల వారూ ఉంటారు, ఉన్నారని, అటువంటి భావాలు ఉన్నవారిని కూడా కలుపుకొనిపోవాలన్నది వారి వాదన. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గోరా (గోపరాజు రామచంద్రరావు), పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, బాలగోపాల్ వంటి వారివి విభిన్న రాజకీయ అభిప్రాయాలైనప్పటికీ సమసమాజం కోసం పాటుపడ్డారు. అందువల్ల ఉన్నత కులాలుగా భావించేవారందరినీ ఒక గాట కట్టడం మంచిదికాదని, భావసారూప్యత కలిగిన వారందరినీ కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నించాలన్నది వారి భావన. ఆ దిశగా వారు అడుగులు వేస్తున్నారు. ఆయా కులాల పెద్దలను కలిసి అన్ని బీసీ కుల, ఉద్యోగ, వృత్తి సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా కూడా తగిన స్థాయిలో తమ వర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీలు ఏకమై ఐకమత్యంతో బలం నిరూపించుకుంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పిలిచి టిక్కెట్లు ఇస్తాయన్నది వారి వాదన.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...