Sep 22, 2018


చట్టాలు హత్యలను ఆపలేవు మనుషులే మారాలి !
              
 పరువు హత్యలను చట్టాలు ఆపలేవు. మనుషులే మారాలి. సమాజాన్ని మార్చాలి. తెలంగాణలోని నల్లొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగినప్రణయ్‌ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో అందరికీ తెలిసిందే. సమాజం అగ్ర కులంగా భావించే ఓ కులానికి చెందిన  అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ప్రణయ్‌ ని ఆ అమ్మాయి తండ్రి హత్య చేయించాడు. మూడు రోజుల నుంచి ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా అంతటా ఇదే వార్త. ప్రణయ్‌ని చంపించినందుకు తనకేం బాధలేదని, జైలుకు వెళ్లడానికి సిద్ధపడే ఈ పని చేశానని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు చెప్పాడు. అంటే అతనిలో కుల పిచ్చ, కుల వివక్ష ఏ స్థాయిలో పాతుకు పోయిందో అర్ధమవుతోంది.
శిక్ష పడుతుందని తెలిసి కూడా ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే, చట్టాలు ఇటుంటి హత్యలను ఆపలేవని అర్ధమవుతోంది. మరో వైపు ప్రణయ్ ని చంపినవారిని అంతే కిరాతకంగా మిర్యాలగూడెం నడిబొడ్డున చంపేయాలని, మరొకరు ఇటువంటి హత్య చేయాలంటే భయపడాలని ప్రణయ్ భార్య అమృత చెబుతోంది. ఆమెకు, ఆమె కుటుంబానికి మద్దతుగా అనేక మంది జనంతోపాటు  పలు ప్రజా సంఘాలు నిలిచాయి. అంటే సమాజంలో కులం విషయంలో తీవ్ర వైవిద్యం ఉంది. కులాన్ని కాకపోయినా కుల వివక్షను నిర్మూలించడానికి అవకాశం ఉంది.  సమాజాన్ని ఆ వైపు నడిపించిన నాడే ఇటువంటి సంఘటనలకు అంతంపలికగలం.
          ఇటువంటి సంఘటనలు జరిగిన తరువాత ఓ నాలుగు రోజులు పాటు మీడియా,  కొంత మంది సామాజిక సంస్కరణవాదులు తరాలు మారినా, దేశం ఎంత పురోగతి సాధిస్తున్నా, ఎంత జ్ఞానం(?) సంపాదించినా ఇంకా కుల వివక్ష సమాజంలో కొనసాగుతూనే వుందని వాపోతుంటారు. వేల ఏళ్లుగా పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమయ్యేపని కాదు. కనీసం కుల వివక్ష లేని సమాజం సృష్టించడానికి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. రోజు రోజుకి కుల సంఘాలు పెరిగిపోతున్నాయి. పేర్ల చివర కులం పేరు పెట్టుకోవడం తప్పనిసరిగా మారిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ పబ్బం గడుపుకోవడానికి కులాల పేరుతో రాజకీయాలు చేయడానికి అలవాటుపడిపోయాయి. ప్రభుత్వాలు కూడా ఆర్థిక అసమానతలు ప్రాతిపదికగా కాకుండా కులాల ప్రాతిపదికగా సహాయ సహకారాలు అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కులాభిమానం వల్ల ప్రమాదంలేదు. అది పిచ్చిగా మారితేనే ప్రమాదం. మనం పిల్లలకు, మన సమాజానికి ఏం నేర్పుతున్నామో  ఆలోచించాలి. అందరూ మనుషులేనని, ఇతర కులాల వారిని గౌరవించాలని ఏనాడైనా చెబుతున్నామా? పరస్పర సహకారంతోనే సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఏనాడై చెప్పామా? కుల వివక్ష నిర్మూలనకు ఏవైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? విత్తు ఒకటి నాటి మొక్క మరొకటి కావాలంటే ఎలా సాధ్యం? పిల్లలకు చిన్నప్పటి నుంచి కులం బీజాలు నాటి, కుల వివక్షలేని సమాజం కావాలంటే ఎలా కుదురుతుంది? సమాజంలో సమూల మార్పు రావడం కోసం ప్రాధమిక స్థాయిలో విద్యాలయాలలోనే కుల వివక్ష నిర్మూలనకు సంబంధించిన బోధన నిరంతరం కొనసాగాలి.
                కమ్యునీస్టులు, హేతువాదులు, నాస్తికుల కుటుంబాలలో కులాంతర, మతాంతర వివాహాలు సర్వసాధారణం. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. సినిమా హీరోలు అక్కినేని కుటుంబంలో నాగార్జున, నాగ చైతన్య, కృష్ణ కుటుంబంలో కృష్ణ, మహేష్ బాబు, మంజుల, చిరంజీవి కుటుంబంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కుటుంబంలో కళ్యాణ రామ్, తారకరత్న, మోహన్ బాబు కుటుంబంలో మంచు లక్ష్మి, మంచు విష్ణు, రాజకీయ కుటుంబాలలో వైఎస్ షర్మిల, మంత్రి భూమా అఖిలప్రియ వంటివారు ఇంకా అనేక మంది కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే వారి అభిమానులు వారి కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు గానీ, వారి జీవన శైలికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఎందుకంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలు వారికి కుల వివక్షే నేర్పుతున్నారు. సాటి మనిషిని అతని కులంతో కాకుండా అతని గుణగణాలు, నడవడిక, నైపుణ్యం, జ్ఞానం, సామర్థ్యం ఆధారంగా గుర్తించాలి. ఆరోగ్యం బాగోక పోతే డాక్టర్ వద్దకు వెళ్లడానికి, వాహనానికి రిపేర్ వస్తే మెకానిక్ వద్దకు వెళ్లడానికి, ఇల్లు కట్టాలంటే మేస్త్రిని పిలవడానికి   అతని కులం గురించి ఆలోచించం. వారి వారి సామర్ధ్యాల గురించి ఆలోచిస్తాం, విచారిస్తాం. పిల్లలు పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు ఇలా ఎందుకు ఆలోచన చేయం? మనం మారాలి. మన పిల్లలను మార్చాలి. పిల్లలు మారుతూ ఉంటే ప్రోత్సహించాలి. మొత్తం సమాజం మారాలి. మీడియా కూడా సంఘటన జరిగినప్పుడే కాకుండా నిరంతరం ఆ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయాలి. అప్పుడే కుల వివక్షను నిర్మూలించగలం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...