Sep 7, 2018


మొబైల్ తయారీ రంగంలో ఏపీ నెంబర్ 1

          రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధికి అనుకూలంగా, ప్రణాళికాబద్ధంగా పాలసీలు రూపొందించి ప్రభుత్వం సమర్థవంతంగా ఆచరణలో పెడుతోంది. రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన యువతకు కొదవలేదు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ముందుంది. దేశంలో అత్యంత సులభతర వాణిజ్యంలో  రాష్ట్రం  వరుసగా రెండవసారి నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దాంతో ఈ రంగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. లక్షల మందికి ఉపాధి చూపుతోంది.  విభజన నాటికి రాష్ట్రంలో ఒక్క ఎలక్ట్రానిక్ కంపెనీ కూడా లేదు. అటువంటిది ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మొబైల్ తయారీ రంగంలో నేడు ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 77 తయారీ యూనిట్లతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, 72 యూనిట్లతో నోయిడా 2వ స్థానంలో, 14 యూనిట్లతో మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. దేశీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చాయి.  దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్‌ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. అటు విశాఖతోపాటు ఇటు చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ ను సమర్థవంతంగా వినియోగిచుకుంటూ అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. కంపెనీలకు కావలసిన అనుమతులు సింగిల్ విండో ద్వారా 21 రోజుల్లో ఇస్తున్నారు. నిబంధనలకు లోబడి ఏర్పాటు చేసే కంపెనీలకు భూములను కూడా యుద్ధప్రాతిపదికన కేటాయిస్తున్నారు.  రేణిగుంటలో 1,2 ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ జోన్‌లో ఒకేచోట 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ రంగంలో 20 వేల ఉద్యోగాలు లభించాయి. ఆ ఉద్యోగాల్లో 90 శాతం మహిళలే ఉండటం గమనార్షం.
                  రాష్ట్రంలో  పెద్ద ఎత్తున రిలయన్స్ జియో పెట్టుబడులు పెట్టబోతోంది. వివిధ దశల్లో రూ.15 వేల కోట్లు రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ రాష్ట్రంలో సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరు చెబితే మైక్రోసాఫ్ట్ కంపెనీ పేరు ఎలా గుర్తుకువస్తుందో అలా రిలయన్స్ జియో ఏపీలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 125 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు కాబోతుంది  రోజుకి 10 లక్షల జియో ఫోన్లు, సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు జియో తయారు చేయబోతుంది. ఇక్కడ ఒకే చోట 25 వేల మందికి రిలయన్స్ జియో ఉద్యోగాలు కల్పించనుంది.  రిలయన్స్ గ్రూప్ ఇటీవల డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా అందించింది. కంపెనీ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
           ఇప్పటి వరకూ మన దేశంలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది దేశంలో నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా ఉన్న షియోమి మొబైల్ విడి భాగాల తయారీ కంపెనీ హోలీటెక్  తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ప్రారంభించేందుకు  ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హోలీ టెక్  మూడేళ్లలో రాష్ట్రంలో 1400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇండియాలో మొదటి మొబైల్ విడి భాగాల తయారీ కంపెనీ ఇది. తిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, టచ్ స్క్రీన్ మాడ్యూల్స్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఈ కంపెనీ తయారు చేయబోతుంది. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 75 ఎకరాల్లో  రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తారు. 2019 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించాలన్నది కంపెనీ  నిర్ణయం. ప్రతి నెలా 5 కోట్ల మొబైల్ విడిభాగాలు ఈ కంపెనీలో తయారువుతాయి. షియోమికి హోలీ టెక్  ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ విడిభాగాలను సరఫరా చేస్తోంది.  దేశంలోని అన్ని మొబైల్ తయారీ కంపెనీలకు కూడా విడిభాగలు సరఫరా చేసే అవకాశం ఉంది. దీని ద్వారా నేరుగా 6 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కంపెనీ మొదటి సారి మన దేశంలో పెట్టుబడి పెట్టబోతుంది. అధునాతన సాంకేతికత, పరిశోధనలు నిర్వహించేందుకు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ని  కూడా ఏర్పాటు చెయ్యబోతుంది. ఢిల్లీలోని నోయిడా రీజియన్, మహారాష్ట్ర నుండి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ ఈ కంపెనీ మన రాష్ట్రంవైపే  మొగ్గుచూపింది. దీంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కంపెనీ రాకతో రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో లీడర్ గా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచంలో మూడవ అతి  పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫ్లెక్స్ ట్రానిక్స్ రాష్ట్రంలో త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ 6,600 మందికి ఉపాధి కల్పించేవిధంగా 585 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలతోపాటు అనుబంధ కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశలు ఉన్నాయి.  కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు  తయారుచేసే అస్ట్రమ్ కంపెనీ 100 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ఉపాధి కల్పించే యూనిట్ ని తిరుపతి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో  ఏర్పాటు చేయనుంది. ఆడియో, సెల్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ కు సంబంధించిన పరికరాలు, ఎల్ఈడి లైట్లు, గేమ్ కంట్రోలర్స్ తదితర వస్తువులను ఈ కంపెనీ తయారు చేస్తుంది.
                రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవడానికి, వాటి తయారీ పెంచాలన్న  లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-2020 రూపొందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ లు ఏర్పాటుకు ఉపకరించే విధంగా, వచ్చే మూడు ఏళ్లలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఈ పాలసీ ఉంటుంది. ఈ పార్కులు 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేవారితోపాటు వాటిని వినియోగించేవారికి కూడా రాయితీలు ఇస్తారు.  ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్తంగా వంద ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తానికి సంబంధించి స్మార్ట్ మొబిలిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు పలు దేశాలలో పర్యటించడంతోపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, నైపుణ్యత కలిగిన మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహాకాలను వివరించడం మంచి ఫలితాలనిస్తోంది. ఇక నుంచి ప్రతి నెల ఒకటి, రెండు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. చైనాలోని షెన్జెన్‌, తైవాన్‌లోని షింజు నగరాల్లో లక్ష మంది ఒకే చోట పనిచేసే ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉన్నాయి.  అలాంటి కంపెనీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఒకే చోట లక్ష మంది పనిచేసే మెగా ఫ్యాక్టరీని రాష్ట్రంలో  ఏర్పాటు చేయించాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు, కల్పిస్తున్న రాయితీల వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా మారనుంది.
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ – 9440222914

Address:
S.Nagarjuna Rao
             
BA,BL,MJMC,
Senior Journalist,
5-500/B/9, 5th Line,
Anjaneyacolony,
MANGALAGIRI-522503
Cell: 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...