Jan 16, 2020

అమరావతిని రక్షించండి


15-01-2020
సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ సుజనా చౌదరి లేఖ
రాజధానిని కొనసాగిస్తే రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం
తరలిస్తే... రూ.4 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలి
‘‘అమరావతిని రక్షించండి. అది మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను రక్షిస్తుంది. ఇప్పటికైనా చిన్న చిన్న రాజకీయ వైరాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం అమరావతినే రాజధానిగా కొనసాగించండి’’ అని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ సుజనా చౌదరి లేఖ రాశారు. ‘‘రాజధాని అని పేరు పెట్టినంత మాత్రాన అది రాజధాని అయిపోదు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్లు.. ఇవన్నీ ఉండాలి. అవన్నీ అమరావతిలో ఇప్పటికే ఉన్నాయి. అమరావతిలో ఉన్న భూముల్ని అభివృద్ధి చేసి పలు సంస్థలు, ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా ఆ పని సాకారమవుతుంది. ప్రధాని మోదీ నిర్దేశించిన 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి కూడా తోడ్పడుతుంది. అమరావతిలోని భూములను అభివృద్ధి చేస్తే... ఖర్చులు పోను, రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఒకవేళ అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తే రైతులకు, ఇతరులకు కలిపి సుమారు రూ.4 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’
 కమిటీ చెప్పింది ఇదీ...
రాజధాని విషయంపై సిఫార్సులు చేసేందుకు ఒక సలహా కమిటీని జీవో 133 ద్వారా ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు... అంటే దక్షిణాన చివరిలో ఉన్న అనంతపురానికి, తూర్పున చివరిలో ఉన్న శ్రీకాకుళానికి అమరావతి సమదూరంలో ఉంటుందని ఆ కమిటీ చెప్పింది. ‘‘రాష్ట్రంలోని ప్రతి మూల నుంచీ రోడ్‌, రైలు అనుసంధానం ఉంది. గన్నవరం విమనాశ్రయం సమీపంలోనే ఉంది. పైగా అత్యంత కీలకమైన తాగునీరు అమరావతిలో 24 గంటలు, ఏడాది పొడవునా సరఫరా చేయగలం. ప్రసిద్ధ శాతవాహనుల రాజధానిగా వర్ధిల్లిన అమరావతికి చారత్రిక ప్రాధాన్యత కూడా ఉంది’’ అని సిఫార్సు చేసిందన్నారు. ఆ సిఫార్సుల ఆధారంగా నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. ఆ తర్వాత 29,754 మంది చిన్న, సన్నకారు రైతులు 33,771 ఎకరాలను భూ సమీకరణ కింద ఇచ్చారని,. దీనికి ప్రభుత్వ భూమి 19,876 ఎకరాలు కలిసిందని పేర్కొన్నారు.
 మొత్తం 53,647 ఎకరాలు సమకూరిందనీ, దీనిలో నవనగరాలు నిర్మించాలని ప్రభుత్వం మాస్లర్‌ ప్లాన్‌ రూపొందించిందనీ తెలిపారు. ఆ మాస్టర్‌ప్లాన్‌ను అన్ని పత్రికల్లోను ప్రచురించి, అభ్యంతరాలును ఆహ్వానించిందన్నారు. అనంతరం ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారనీ, కేంద్రం రూ.1500 కోట్లు ఆర్థిక సాయం చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి బాండ్ల రూపంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సేకరించిందన్నారు. చివరికి ప్రజలు రూ.42 కోట్లు విరాళాలు ఇచ్చారని తెలిపారు. ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.52,537 కోట్ల ఖర్చుతో కూడిన 62 ప్రాజెక్టులు అమరావతిలో కొనసాగుతున్నాయి. మీరు ఆశ్చర్యకరంగా అన్నింటినీ ఆపేశారు. మీరు, మీ మంత్రులు మాట్లాడుతున్న దాన్నిబట్టి రాజధానిని మార్చాలని స్పష్టంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
 మారిస్తే భారమే...
‘‘రైతుల నుంచి సమీకరించిన 33,771 ఎకరాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు 50 శాతం, రైతుల వాటా తీసేశాక 8442.75 ఎకరాలు మిగులుతుంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎకరా రూ.15 కోట్లు ఉంది. అంటే రూ.1,26,641 కోట్లు వస్తుంది. మరోవైపు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ భూమిలో అత్యంత అధునాతనంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎకరాకు రూ.40 లక్షల చొప్పున రూ.13,608 కోట్లు అవుతుంది. ఇవిపోను రూ.1,13,133 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన 19,876 ఎకరాలు మిగులుతుంది. వీటిని పలు సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు ఇవ్వొచ్చు. ఈ వివరాలన్నీ చూస్తే ప్రభుత్వం వద్ద నిధులు లేక కాదు... మనసు లేక ఇక్కడినుంచి రాజధానిని తరలించాలని భావిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే ఉన్న భవనాలకు తోడు మరో రూ.3 వేల కోట్లు ఖర్చుపెడితే మిగిలిన భవనాల పనులు పూర్తిచేయవచ్చు.
 ఈ తరుణంలో రాజధాని మార్పు సహేతుకం, న్యాయసమ్మతం అయినది కాదు. మరోవైపు రాజధానని తరలిస్తే సుమారు రూ.2 లక్షల కోట్లు రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలి. ఇప్పుడు అక్కడ గజం రిజిస్ర్టేషన్‌ విలువ రూ.5 వేలు ఉంది. అంటే ఎకరాకు 4480 గజాలకు కలిపి రూ.2.24 కోట్లు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం రెండున్నర రెట్లు... అంటే రూ.5.60 కోట్లు ఇవ్వాలి. 33,177 ఎకరాలకు కలిపి రూ.1,89,117 కోట్లు చెల్లించాలి. దీనికి 12 శాతం వడ్డీ కలిపితే రెండు లక్షల కోట్లు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ భూములు, స్థలాలు కొనుగోలు చేసినవారికి పరిహారంగా మరో రూ.2 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు.

అమరావతికి వరద ముప్పులేదు



v  జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ నవంబర్ 17, 2017న  తీర్పు
v రాజధాని నిర్మాణానికి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ ఇచ్చిన అనుమతుల్లో ఎటువంటి లోపంలేదు.
v ఆ ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికీ గురికాలేదు.
v అసాధారణ వరదల సమయంలో కూడా అక్కడ నది గట్టు దాటి ప్రవహించలేదు.
v ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజధాని ప్రాజెక్ట్ ఉంది.
v రాజధాని ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు సులభంగా అనుసంధానమై ఉంది.
v ఇప్పటికే పలు సౌకర్యాలు ఉన్నందున రాష్ట్రంపై అదనపు భారం పడదు.
v రాజధాని నగర నిర్మాణ ప్రదేశంపై నిర్ణయం తీసుకునే ప్రత్యేక అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది.
v రాజధానిపై 4,728 స్పందనలు అందగా విజయవాడ-గుంటూరు ప్రాంతానికి అత్యధిక ప్రజలు ఓటు వేశారు.
v ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం (సెక్షన్ 5 ప్రకారం) అమల్లోకి వచ్చిన పదేళ్ల తరువాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని అవుతుంది. ఏపీకి రాజధాని నగర నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది.
v అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ రాజధానిగా అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v ప్రవేటు, వాణిజ్య ప్రయాజనాల కోసం ప్రజావనరులను మళ్లించలేదు.
v వరద ప్రాంతాలు, మైదానాల హద్దుల్ని నిర్ణయించేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ప్రకారం కృష్ణా నది గట్టుల్ని దాటి నీరు ప్రవహించిన సందర్భాలు లేవు. నది గట్టులు దాటి ఉన్న ప్రాంతాన్ని వరద మైదానంగా పేర్కొనడానికి వీలులేదు.
v 1853, 2009లో కృష్ణా నదికి వచ్చిన అసాధారణ వరదలను పరిగణనలోకి తీసుకున్నా వరద ప్రభావిత ప్రాంతంలో రాజధాని నగర నిర్మాణం చేయబోతున్నట్లు పిటిషనర్లు రుజువు చేయలేకపోయారు.
v పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక సైతం రాజధాని నగరం వరద మైదాన ప్రాంతంలోకి వస్తుందని పేర్కొనలేదు.
v వరద ప్రాంత పరిధిలోకి రాజధాని విస్తరించి ఉందన్న పిటిషనర్ల అభ్యర్థలను తిరస్కరిస్తున్నాం.
v రాజధాని ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికి గురికాలేదని అధికారులు స్పష్టం చేశారు.
v కొండవీటి వాగు ఆక్రమణలకు గురికావడం వల్ల కుంచించుకుపోయింది. వాగుని అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వాగు రాజధాని నిర్మాణాలకు అడ్డంకి అని చెప్పలేం.
v రాజధానికి సంబంధించి ప్రభుత్వం ప్రతి దశలో ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రజల అభిప్రాయాలు సేకరించి, వారితో సంప్రదించి, వారి అభ్యంతరాలు స్వీకరించి మాస్టర్ ప్లాన్ రూపొందించి నోటిఫై చేసింది.
v పలు అంశాలకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టంచేసిన తరువాతే 90 షరతులు విధించి ఎస్ఈఐఏఏ(స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంప్యాక్ట్ అసెస్ మెంట్ అథారిటీ) పర్యావరణ అనుమతులు ఇచ్చింది.
v పర్యావరణాన్ని కాపాడటం, రాజధాని నగరం అభివృద్ధి మధ్య రాష్ట్రప్రభుత్వం సమతౌల్యం సాధించాలి.
v రాజధాని ప్రాంతంలో 251 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిని రాజధాని నగరానికి ప్రాణవాయువు ఇచ్చేవిగా అలాగే ఉంచాలి.
-----------------------------------

పేజీలు 49, 50లలో 77వ పేరా: రాజధాని ప్రాంతంలో గట్లు ఉన్న కారణంగా కృష్ణా నది నుంచి ఎలాంటి వరద ప్రమాదం లేకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పేర్కొనలేం. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలను వరద ముంపు ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. అయితే ప్రతిపాదిత రాజధానికి కృష్ణా నది నుంచి ఎలాంటి వరద ముప్పు లేకపోవడం చేత, ఈ ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించడానికి వీల్లేదు.
పేజీ 49లో 79వ పేరా: ఈ ప్రాంతంలో జరిగే నిర్మాణ కార్యకలాపాలు ఇక్కడి భూ జలస్వరూపం మీద ఎలాంటి దుష్ప్రభావమూ చూపవని చెప్పవచ్చు.
పేజీ 53లో 80వ పేరా: 2009 వరదలు రాజధాని నగరంలో ఎలాంటి పరిమితినీ దాటలేదని ట్రైబ్యునల్ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. నదికి అడ్డుకట్టలు, గట్లను దాటి ఉన్న ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించలేము.
పేజీ 53లో 81వ పేరా:  1853, 2009లో వచ్చిన అసాధారణ  వరదల సందర్భంగా కూడా ప్రతిపాదిత రాజధాని ప్రాంతం వరద ముంపునకు గురికాలేదని తెలుస్తోంది. ఈఐఏ నివేదిక ఆధారంగా, ఇతర సుదీర్ఘ వివరణ ఆధారంగా రాజధాని ప్రాంతాన్ని వరద ముంపు ప్రాంతంగా పరిగణించలేం.

పేజీ 57లో 82వ పేరా: 1853లో వచ్చిన వరదలను చరిత్రాత్మకంగా భావిస్తుంటారు. ఆ వరదలు కూడా ప్రస్తుత రాజధాని ప్రాంతంమీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.
పేజీ 68లో 96వ పేరా: శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ధిష్టమైన సిఫార్సు ఏమీ చేయలేదు(పేజీ5). జిల్లా, రాజధాని మండలానికి తగిన సూచీని అనుసరించి ‘‘రాజధాని కావడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను’’ మాత్రమే సూచించింది. అందులో విజయవాడ-గుంటూరు ప్రాంతం అత్యంత అనువైదిగా అవతరించింది.
పేజీ 70లో 100వ పేరా: భూ సమీకరణ పథకంలో ఏక పక్షంగా గానీ, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలు కాని లేవని నిర్ధారణకు వచ్చాం. రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించడానికి ముందుకు వచ్చారు. భూ సమీకరణ పథకం రైతులకు మేలే చేస్తుందని రుజువు అవుతోంది.

Jan 14, 2020

రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ చర్యలపై హైకోర్టు ఆగ్రహం



13-01-2020:
v హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి బెంచ్‌ వ్యాఖ్యలు: ‘‘గ్రామాల్లో 200 మంది పోలీసులతో కవాతు చేయిస్తారా? ఆ గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మహిళల్ని మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? ఇదంతా ప్రభుత్వానికి ఓ నవ్వులాటలా ఉన్నట్లుంది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం గుర్తుందా?’’
v రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమిస్తున్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గర్హించింది.
v చిన్నా, పెద్దా, మహిళలన్న తేడా లేకుండా అందరిపైనా పోలీసులు లాఠీచార్జ్‌ చేసి గాయపరిచిన ఘటనలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
v 144 సెక్షన్‌ అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజయవాడ కమిషనర్‌ గుంటూరు పట్టణ, రూరల్‌ ఎస్పీలను ఆదేశించింది.
v చట్టం అమలులో ఇష్టానుసారం వ్యవహరించిన సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించి.. దానిపై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ.
v  శాంతియుత ఉద్యమాలను అడ్డుకోవద్దు. రాజధాని గ్రామాల్లో ఇళ్లలోకి వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.
v అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని అమలు చేసే తీరు ఇదేనా? చట్టాన్ని ఎలా అమలు చేయాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు తెలియదా? 144 సెక్షన్‌ను ఎప్పుడు ప్రయోగించాలో కూడా తెలియదా? గ్రామాల్లో కవాతులు జరపడానికి అక్కడేమైనా కర్ఫ్యూ విధించారా?
v . ‘‘కనీసం మీరైనా ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు కదా?’’ అని అడ్వకేట్‌ జనరల్‌ను నిలదీసింది.
v విచారణ 17వ తేదీ శుక్రవారానికి వాయిదా. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం.
ఎనిమిది పిటిషన్ల దాఖలు
v  రాజధాని ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ అత్యవసర విచారణ కోసం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో ఆరు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారని, దానివల్ల సాధారణ జనజీవనానికి విఘాతం కలుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు.
v  సంక్రాంతి సెలవుల కారణంగా హైకోర్టుకు సెలవులు ఇచ్చినప్పటికీ అత్యవసర కేసుల విచారణ కోసం సోమవారం ప్రత్యేక బెంచీలు ఏర్పాటయ్యాయి.
v చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది.
v ‘‘144 సెక్షన్‌ అమలు చేసే తీరు ఇలాగేనా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్‌, మరోవైపు జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్రంలో పర్యటిస్తూ విచారణ జరుపుతున్నాయి. దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితులు మాకు విస్మయానికి గురి చేస్తున్నాయి’’
v   పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఇంద్రనీల్‌ బాబు,  భానుప్రసాద్‌, ఆనంద్‌ శేషు, సుధాకర్‌రావు అంబటి, ప్రణతి:  ‘‘144 సెక్షన్‌ విధింపుకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మగపోలీసులు మహిళా రైతులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఫోటోల్ని చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో మహిళల్ని ఇళ్ల నుంచి బయటకు రానీయడం లేదు. నిత్యావసరాల కోసం బతిమలాడుకున్నా అంగీకరించడం లేదు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు. అడిగితే దాడులకు దిగుతున్నారు’’  నిరసనకారులపై దాడులు చేస్తున్నారు. కులం పేరు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు.  గ్రామ దేవతల పూజలకు సైతం అనుమతించడం లేదు. సచివాలయంలో అధికారిక సమావేశం ఏదైనా ఉంటే, అక్కడికి సమీపాన ఉన్న మందడంలో పోలీసులు బలవంతంగా షాపులు మూయిస్తున్నారు. రోడ్లపై ప్రజల్ని తిరగనివ్వడం లేదు.
v పత్రికల్లో వచ్చిన ఓ ఫొటోను చూడాలని ధర్మాసనం ఏజీని కోరింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్‌ 354 కింద పోలీసులపై కేసు నమోదు చేయడానికి ఈ ఫొటో ఒక్కటి చాలని ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది.
v  ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఏజీ వివరించారు.
v ధర్మాసనం: ప్రభుత్వానికి, పోలీసులకు పలు ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో అధికార యంత్రాంగం చట్టాన్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నాం. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు సీఆర్‌పీసీ సెక్షన్‌ 46కు విరుద్ధంగా ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను పరిరక్షించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ
మధ్యంతర ఉత్తర్వులు
v  జీవనోపాధి నిమిత్తం ప్రజలను వారి వారి ఇళ్ల నుంచి స్వేచ్ఛగా బయట తిరగనివ్వాలి.
v  శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలి.
v  గ్రామ దేవతలకు, ఇతర దేవుళ్లకు తమ తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకునేందుకు ప్రజల్ని అనుమతించాలి.
v  సీఆర్‌పీసీ నిర్దేశించిన నిబంధనల మేర తప్ప, గ్రామస్థుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయరాదు.
v  అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 46ను విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు తూచా తప్పక పాటించాలి.
v  నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి.
v  గాయపడినట్లు పత్రికలు, టీవీల్లో కనిపించిన వారికి తక్షణమే వైద్యసదుపాయం కల్పించాలి.
v  అరెస్టు చేసిన వ్యక్తులను తక్షణమే సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలి.
v  సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 తదితరాలను ఉల్లంఘించిన పోలీసులపై విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
v  చట్టాన్ని అమలు చేయని సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, డీజీపీలు కోర్టుకు వివరణ ఇవ్వాలి.
v ప్రభుత్వ చర్యలపై శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తుంటే 144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చిందో విజయవాడ పోలీసు కమిషనర్‌, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు, కృష్ణా, గుంటూరు కలెక్టర్లు వివరణ ఇవ్వాలి.


ఏపీలో పోలీసుల అరాచకాలపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర హోం మంత్రికి లేఖ



v రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఇచ్చాపురం నుంచి తడ వరకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
v రాజధాని గ్రామాల్లో నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడంలేదు.
v అర్దరాత్రుల్లో ఇళ్లలోకి చొరబడి సంక్రాంతికి వచ్చిన బంధువుల వివరాలు చెప్పాలని సోదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు.
v భూములు ఇచ్చిన రైతులు పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
v అధికార పార్టీ వారి ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ, అమరావతి పరిరక్షణ సమితి వారికి  శాంతియుత ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంలేదు.
v మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని పోలీసులు చితకబాదారు.
v మహిళలను, పిల్లలకు కూడా ఈడ్చుకువెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించారు.
v మహిళలను బూటు కాళ్లతో అమానుషంగా తన్నారు.
v శాంతియుతంగా నిరసన తెలిపే మహిళలను మగ పోలీసులు అరెస్ట్ చేశారు.
v మహిళలను రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారు.
v ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించింది.
v రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో 15 మంది గుండె ఆగి మరణించారు.
v షాపింగ్ కు వెళ్లిన మహిళలను కూడా పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
v రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను ప్రయోగిస్తున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------

తేది : 14.01.2020

To, 
గౌరవనీయ హోంమంత్రి మంత్రి,
భారత ప్రభుత్వం,
నార్త్ బ్లాక్, న్యూ ఢిల్లీ-110 001
 
From,
అనగని సత్య ప్రసాద్,
శాసనసభ సభ్యుడు,
రేపల్లె నియోజకవర్గం,
ఆంధ్రప్రదేశ్.

విషయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి - అక్రమ నిర్బంధాలు - కేసులు - మహిళలపై శారీరక వేధింపులు - సెక్షన్లు 144 30 - పొలిటికల్ వెండెట్టా.
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి సమస్యపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు, ముఖ్యంగా మహిళల పట్ల అమానుషంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బీభత్సం, భయానక వాతావరణం సృష్టిస్తూ, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నా పోలీసు సిబ్బంది అమానవీయ ప్రవర్తనను నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మిమల్ని ప్రార్ధిస్తున్నాను. ఇక్కడి గ్రామాలలోని పరిస్థితులను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనవరి 13, 2020న ‘‘గ్రామాల్లో 200 మంది పోలీసులతో కవాతు చేయిస్తారా? ఆ గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మహిళల్ని మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? ఇదంతా ప్రభుత్వానికి ఓ నవ్వులాటలా ఉన్నట్లుంది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం గుర్తుందా?’’ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

            రాజధానిని మూడు భాగాలుగా విభజించాలన్న ఆంధ్రపప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబాలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34వేల ఎకరాల  వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన ఇప్పుడు పోలీసు క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారు. శాంతియుత ప్రదర్శనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనికి విరుద్ధంగా రాజధాని మార్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, రాజమండ్రిలలో కౌంటర్ ఊరేగింపులు తీసుకోవడానికి అధికార పార్టీ మంత్రులు, నాయకులకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అదే రోజున రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి ప్రజా ర్యాలీకి వ్యతిరేకంగా పోలీసులు అధికార పక్షానికి కూడా అనుమతులిచ్చి ఉద్రిక్తతలకు పురికొల్పారు.
            ఈ సమస్య నేపథ్యాన్ని మే 2019లో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా, అహేతుకంగా తీసుకున్న నిర్ణయం నుండి తెలుసుకోవచ్చు. AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం 2015 మార్చి 28న పట్టణాభివృద్ధి మాజీ కార్యదర్శి శ్రీ కె.సి.శివరామకృష్ణన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. సాధ్యమయ్యే అన్ని ఎంపికలను పరిగణనలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 04.09 2014న అమరావతిని కొత్త రాజధానిగా ఎంపిక చేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. 22.10.2015న ప్రధాని నరేంద్ర మోడీ పునాది రాయి వేశారు. ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకొని, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీల నేపధ్యంలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద రైతులు 34,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందించారు. సిఆర్‌డిఎ యాక్ట్ కింద అవసరమైన ఒప్పందాలు జరిగాయి.
            అమరావతిలో వివిధ నిర్మాణాలకు భారత ప్రభుత్వం నిధులు సమకూర్చింది. గౌరవ భారత రాష్ట్రపతి గెజిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఇక్కడే ఏర్పాటు చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో కూడా అమరావతిని ఎపి రాజధానిగా చేర్చింది. ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి కార్యకలాపాలకు పది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.  శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు మొదలైనవి అమరావతి నుండి సజావుగా పనిచేస్తున్నాయి. ఎటువంటి వివాదాలు లేకుండా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ అకస్మాత్తుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రులు రాజధాని నగరాన్ని విభజించే ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ ప్రాతిపదికన, అమరావతి నుండి విశాఖపట్నంకు రాజధానిని మార్చాలని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో గత 28 రోజులుగా రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనకు దారితీసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద 34వేల  ఎకరాల పంట భూమిని ఇచ్చిన తరువాత రాజధానిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని 29 గ్రామాల్లో ప్రజలపై పోలీసుల దారుణంగా వ్యవహరిస్తున్న తీరు మొత్తం రాష్ట్రంలోని సామాన్య ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. శాంతియుత నిరసన తెలుపుకునేందుకు రోడ్డు పక్కన గుడారాలు వేయడానికి అనుమతించకుండా ఎర్రటెండలో కూర్చునే పరిస్థితులు కల్పస్తూ మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు. కారణం చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు కవాతులు నిర్వహిస్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి న్యాయం కోరుతూ నినాదాలు చేసినందుకు వారిపై శారీరకంగా లారీలతో దాడి చేస్తూ వ్యాన్లలోకి ఎక్కించి అక్రమనిర్భందాలు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో పోలీసుల బీభత్సం కారణంగా ఇద్దరు మహిళలతో సహా 15 మంది రైతులు, రైతు కూలీలు మనస్తాపానికి గురై గుండె ఆగి ప్రాణాలు కోల్పోయారు. ఈ గ్రామాల మహిళలు పవిత్ర దేవత దుర్గమ్మను ప్రార్థించడానికి దేవాలయానికి వెళుతున్నా అడ్డంకులు సృష్టిస్తూ కొడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మహిళలపై, వారి దుస్తులు, ఉపకరణాలపై ఘోరమైన అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు.
            గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని సమీప పరిసరాల్లో జరుగుతున్న సంఘటనలు, మహిళల దుస్థితి ఎంతో దయనీయంగా, బాధాకరంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గొడుగు సంస్థ అమరావతి పరిరక్షణ సమితి- శాంతియుత ర్యాలీలు నిర్వహించడానికి పోలీసుల అనుమతి కోరింది. పొరుగున ఉన్న గుంటూరులో, వైద్యులు, న్యాయవాదులు, గృహిణులు, విద్యార్థినులతో కూడిన 5000 మంది మహిళలు ఎంతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా ఆశ్చర్యకరంగా పోలీసులు వారిపైకి దూసుకెళ్లి, అమానుషంగా ఈడ్చుకువచ్చి లారీలు, వ్యాన్లలోకి ఎక్కించి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారు. ఈ చట్టవిరుద్ధమైన అరెస్టులను ప్రశ్నించినప్పుడు, మహిళలను అసభ్యపదజాలంతో బూతులు తిడుతూ బెదిరిస్తున్నురు.
సమావేశమైన మహిళలను పోలీసులు బలవంతంగా ఎత్తివేసి, తరలించి, వాహనాల్లోకి విసిరివేయడం చాలా సిగ్గుచేటు. మహిళల చేతుల్లో ఉన్న పిల్లలను కూడా విడిచిపెట్టడం. షాపింగ్ కోసం ఆ ప్రాంతానికి వచ్చిన వారిని, అటుగా వెళుతున్న చాలా మందిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అనేక చోట్ల దుకాణం లోపల మహిళలను ఉంచి షాపులకు తాళాలు వేశారు. దాదాపు 1500 మంది మహిళలను అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
            పురుషులు, మహిళలకు పశువుల మాదిరిగా పడవేసి త్రాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. వారికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు. మహిళలను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, కొన్ని ప్రదేశాలలో రాత్రి 9 గంటల వరకు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాస్తమయం తరువాత నిర్బంధించడం చట్టవిరుద్ధం అని వారు విజ్ఞప్తి చేసినా వినిపించుకోవడం లేదు. ఆలస్యంగా మహిళలను విడుదల చేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా మహిళల కుల వివరాలను అడుగుతున్నారు. నగరం మధ్యలో, పరేడ్ మైదానంలో, స్థానిక ఎంపి,  ఇతర నాయకులు సూర్యాస్తమయం దాటినందున మహిళలను విడుదల చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై ధర్నా చేయవలసి  వచ్చింది. పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. 
            మొత్తం ఎపిసోడ్ అధికారమదంతో చట్టాన్ని ఉల్లంఘింస్తూ ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేస్తూ పోలీసు సిబ్బంది అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతున్నారు. సరళమైన భాషలో చెప్పాలంటే ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తోంది. పోలీసులు తమ రాజకీయ యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కఠినమైన చట్టాలు, చర్యలను రాష్ట్రం ఎన్నడూ చూడలేదు. పోలీసు వ్యవస్థ చట్టపరమైన నిబంధనలను పూర్తిగా విస్మరించింది. అంతేకాకుండా అధికార పార్టీ మంత్రులకు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఊరేగింపులు చేయడానికి అనుమతిస్తూ రాజకీయ ప్రత్యర్ధుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నోటికి రిబ్బన్‌ కట్టుకుని శాంతియుతంగా నిశ్శబ్ద ప్రదర్శనల ద్వారా తమ బాధను వ్యక్తం చేయడానికి నిరసన తెలిపే ప్రజలుకు మాత్రం అనుమతులు నిరాకరిస్తున్నారు.
            సాధారణ ప్రజలు, మహిళల ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. చాలా జిల్లాలలో పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎటువంటి సమర్థనీయమైన కారణాన్ని పేర్కొనకుండా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖ మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్షిక విచారణను జరిపాలని కోరుకుంటూ రాష్ట్రంలో చట్ట నియమాలను పునరుద్ధరించడానికి పరిష్కార చర్యలు తీసుకోవాలని నా మనవి.
                                                                         
                                                                                     మీ భవదీయుడు
 
                                                                                     (అనగాని సత్య ప్రసాద్)