Jan 28, 2019


త్రాగునీరు, ఉపాధి, గృహనిర్మాణానికి ప్రాధాన్యత
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశాలు
              సచివాలయం, జనవరి 28: త్రాగునీరు, ఉపాధి, గృహనిర్మాణ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం తొలిసారిగా జరిగిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. కలెక్టర్ల సమయం ఆదా అవడం కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   ప్రతి గ్రామంలో, పట్టణంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందిలేకుండా చూడాలని చెప్పారు. అందుకు కావలసిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. రానున్న వేసవి కాలానికి తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్ శాఖ ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని చెప్పారు. నిరుద్యోగ యువతకు తగిన శిక్షణ ఇప్పించి, ఏజన్సీల ద్వారా లేదా నేరుగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారికి ఉపాధి కల్పించాలన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు. కేటాయించి మంజూరు కాని ఇళ్లను ఫిబ్రవరి 1వ తేదీకీ మంజూరు చేయాలని ఆదేశించారు. 9వ తేదీన ఒకే  రోజు 3 లక్షల  గృహప్రవేశం జరగాలని ఆదేశించారు.  అలాగే కొత్త రేషన్ కార్డులను, కొత్త వృద్ధాప్య పెన్షన్ పత్రాలను ఫిబ్రవరి 1వ తేదీకి లబ్దిదారులకు అందజేయాలని చెప్పారు. ఆలస్యం చేయకుండా చుక్కల భూములు, ఇతర భూ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. చుక్కల భూముల విషయంలో అధికారులు బుక్ నాలెడ్జ్‌ ను అనుసరించడం వల్లనే ఇన్నాళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గుంటూరు జిల్లాలో చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు దాదాపు 28 వేలు పరిష్కారం అయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ అనుసరించిన విధానాన్ని అనుసరించమని ఆదేశించారు. సాంకేతిక సమస్యలతో లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించకుండా సరళమైన విధానాలతో సమస్యను పరిష్కరించాలన్నారు. దావోస్ వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రకృతి సేద్యంపై చర్చ జరిగిందన్నారు. ప్రపంచానికి భారతదేశం తరఫున మనం అందించే గొప్ప కానుక ప్రకృతి సేద్యం అని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని చెప్పారు. తాను ప్రకృతి సేద్యం ద్వారా పండిన పంటనే తింటున్నానని, అందరూ అదే తినాలని సూచన చేశారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్‌కు పిలుపు ఇచ్చిందని, దానికి ఇబ్బందిలేకుండా 2, 3, 4 తేదీలతో జన్మభూమి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్న క్యాంటీన్లను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆదరణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా సమీక్షించుకుని చివరి లబ్ధిదారుని వరకు చేరేలా చూడాలన్నారు.  బీసీలు ఎప్పటి నుంచో అడుగుతున్నందున కొత్తగా 10 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనాభా దామాషా ప్రకారం పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. కాపు రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడానికి ఈ అంశాన్ని శాసనసభకు తీసుకొస్తున్నామని చెప్పారు. సమాజంలో ఎవరూ తాము పేదవాళ్లం, తమకు గుర్తింపు లేదని బాధ కూడదన్నతది తన భావనగా వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలలో వున్న పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తున్నామన్నారు.  అత్యంత వెనుకబడిన కులాల వారికి నెలకు 100 యూనిట్ల, బార్బర్ షాపులకు, స్వర్ణకారులకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అమరావతిలో  100 కోట్లతో పూలే స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 106 గురుకులాలు ఉన్నాయని, కొత్తగా 69 ఏర్పాటు చేస్తామన్నారు. మన సంప్రదాయ సంగీత కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డోలు, సన్నాయి, వయోలిన్ వంటి సంగీత కళలకు ఇప్పటికీ ఎంతో డిమాండు వుందని చెప్పారు. రాజధానిలో సంగీత కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆర్టీజీకి, ఆయా శాఖల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుసంధానం  ఉండాలన్నారు.  
రంగు మారిన ధాన్యాన్ని గ్రేడింగ్ లేకుండా రూ.1,550లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. 31, 1 తేదీలలో ఫెతాయ్ తుఫాన్ నష్టం పరిశీలనకు కేంద్రం బృందం వస్తుందని, వారికి రంగుమారిన ధాన్యాన్ని, నష్టం ఫొటోలను చూపించాలన్నారు.
ఉపాధి హామీ నిధుల కేటాయింపులో కేంద్రం కాలయాపన చేస్తుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర సహాయాలపై ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల మంత్రులపై వత్తిడి తేవాలని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచన చేశారు. గ్రామాలలో గార్బేజ్ కలెక్షన్ పనులు ఉధృతం చేయాలని,  డ్రెయిన్లలో పూడిక ఉంటే తీయించాలని,  అన్ని గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత, సుందరీకరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పెండింగ్ పనులు ఉంటే షార్ట్ టెండర్లు పిలిచి పూర్తిచేయాలని ఆదేశించారు. కడప హజ్ భవన్ నిర్మాణం కోసం అవసరమైన నిధుల్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచన చేశారు.
కొత్త రేషన్ కార్డులు, ప్ల్పిట్ కార్డుల కోసం 55,540 దరఖాస్తులు రాగా, 40,040 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ కమిషనర్ రాజశేఖర్ చెప్పారు. 7,024 దరఖాస్తులు తిరస్కరించామని, 8,476 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు.  10,033 కొత్త రేషన్ కార్డులు, 5,196 ప్ల్పిట్ రేషన్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. 24,811 రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

            మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటనపై సమాచార శాఖ వీడియో లఘుచిత్రాన్ని ప్రదర్శించించింది.  ఏపీలో అనుసరించిన ప్రకృతి సేద్యం విధానాల్నిఇండోనేషియా దేశమంతటా అమలుచేస్తామని ఆ దేశ ప్రతినిధి ప్రకటించడం గర్వకారణంగా ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో ఏపీకి దేశంలో మొదటిస్థానం దక్కిందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలో 225 ఉత్తమ గ్రామ పంచాయతీలలో 133 మన రాష్ట్రం నుంచే ఎంపికైనట్లు, వాటిలో 33 చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లు తెలిపారు. విద్యాశాఖ దేశంలో మూడవ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు కార్యక్రమంలో 48 మంది భాగస్వాములకు పురస్కారాలు ప్రకటించారు. ఆయా శాఖల సిబ్బందిని సీఎం అభినందించారు. ఇన్నోవేషన్స్‌లో మనం నెంబర్ వన్‌గా రావాలన్నారు. తన భార్య దత్తత తీసుకున్న కొమరోలు గ్రామాన్ని కూడా చాలా బాగా అభివృద్ధి చేశారని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తన స్వగ్రామాన్ని అభివృద్ధి చేశారని,  స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను మన:స్పూర్తిగా అభినందిస్తున్నాన్నారు. అటువంటి వారు ఇంకా ఎక్కువ మంది ముందుకు రావాలన్నారు.
                   10 వేల ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు  గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. కృష్ణాజిల్లాలో చుక్కల భూమి సమస్య లేదని కృష్ణా జిల్లా కలెక్టర్  బి.లక్ష్మీకాంతం చెప్పారు.  కృష్ణా జిల్లాలో అనుసరించిన డిజిటలైజేషన్ విధానాల్ని అసోం రాష్ట్ర మంత్రి,  అధికార బృందం పరిశీలించి ప్రశంసించారని, వారి సచివాలయంలో అమలు చేయనున్నట్లు కూడా చెప్పారన్నారు. కొత్తగా తీసుకొస్తున్న భూధార్ నమూనా కార్డును ఐటీ సలహాదారు జె. సత్యనారాయణ ముఖ్యమంత్రికి చూపించారు. భూధార్ కార్డులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి క్యూఆర్ కోడ్ ను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంక్షేమానికి సంబంధించి 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను, చంద్రన్న బీమా, పెళ్లికానుక, ముఖ్యమంత్రి యువ నేస్తం పనితీరుని సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

Jan 23, 2019


25న సీఎం పర్యటన వివరాలు
                     సచివాలయం, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న గుంటూరు, కడప, విశాఖపట్నం జిల్లాలలో జరిగే డ్వాక్రా సదస్సులలో పాల్గొంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో ఉదయం జరిగే సదస్సులో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత హెలీకాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నానికి కడప చేరుకుంటారు. అక్కడ మునిసిపల్ గ్రౌండ్ లో జరిగే డ్వాక్రా సదస్సులో ప్రసంగిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. అనంతరం అక్కడ బయలుదేరి రాత్రికి ఉండవల్లి సెంటర్ సమీపంలోని నివాసానికి చేరుకుంటారు.

ఓ అద్భుత  లేఖ

       ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన  లేఖ ఇది. తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ  ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్  టీచర్ కి రాసిన లేఖ. ప్రతి తల్లి, తండ్రి, టీచర్, విద్యార్ధి చదవలసిన లేఖ. ప్రముఖ అనువాదకురాలు  శాంత సుందరి  లేఖను తెలుగులోకి అనువదించారు.
            " మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు. కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు. ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూదుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు. అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరాఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి. అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి. ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి. అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి. స్కూల్లో మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.  ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం  నేర్పండి. అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి. అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి. వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి. కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి. ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి. క్రూరులను ఎగతాళి చెయ్యటం నేర్పండి. పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి, కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించిఎండలో ఝుమ్మనే తేనెటీగల గురించి, పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి.  అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి. అందరూ మందని అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి. అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి. తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి, కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల 
నిర్ణయించద్దని నేర్పించండి. అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి. ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ, అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి. ఇదీ క్రమం టీచర్,.. మీకు వీలైనంత వరకూ ప్రయత్నించండి. వాడు మంచి పిల్లవాడు. వాడు మా అబ్బాయి.



అమరావతికి ఆధునిక హంగులు
            
  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతికి ఆధునిక హంగులు సమకూరుస్తోంది. ప్రపంచ స్థాయిలో నిర్మించే ఈ మహానగర రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగించి శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్, ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మస్తారు. భవన నిర్మాణ సమయాన్ని  తగ్గించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన ప్రయోగాలలో  భాగంగా  ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో  భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్, ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను ఇతర చోట్ల తయారు చేసుకొని తీసుకువచ్చి ఇక్కడ బిగిస్తారు. దాంతో చాలా వరకు సమయం ఆదా అవుతుంది.  సాధారణంగా ఇంత భవనాలు నిర్మించడానికి రెండు, మూడు ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ ఆధునిక టెక్నాలజీ వినియోగించడంతో వారానికో అంతస్తు లేస్తోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణం ఏక కాలంలో జరుగుతోంది.  ఈ విధంగా నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు.


             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద అత్యంత ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో  ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్సోంది. దీనికి గత ఏడాది డిసెంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.   ‘డయాగ్రిడ్’ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి  సచివాలయం శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయం నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  41 ఎకరాల్లో 56 లక్షల చదరపు అడుగుల్లో 250 మీటర్ల ఎత్తులో శాశ్వత సచివాలయం నిర్మిస్తున్నారు. 40 అంతస్తులతో 4 టవర్లు, 50 అంతస్తులతో మరో టవర్ ను నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.  భూగర్భ డ్రైనేజీతో పాటు తాగునీటి వ్యవస్థ పైపులు, గ్యాస్, విద్యుత్, కేబుల్ గ్రిడ్ వంటి వాటిని డక్ట్ ద్వారా భూగర్భంలోనే అమర్చుతారు. ఈ విధంగా దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం మనదే. రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి, పగలు నిరంతరం శ్రమిస్తున్నారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్, ప్రభుత్వ గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఏపీ సీఆర్డీఏ ఉంది.

                    అమరావతిలోని పరిపాలనా నగరంలో భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సచివాలయంలో విద్యుత్ వాహనాలను వాడుతున్నారు. కొంతమంది సచివాలయ, సీఆర్డీఏ అధికారులు కూడా ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలో, విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్, నీరు, విద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని అందిస్తారు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఎక్కడాలేదు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఈ విధంగా రాజధాని అమరావతికి ప్రభుత్వం అనేక ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Jan 20, 2019

వృద్ధులకు అండగా ప్రభుత్వం

సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత
               
    పట్టణీకరణసాంకేతికజీవన శైలిలో  మార్పులతో మానవసంబంధాలుకుటుంబ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి.కుటుంబ వ్యవస్థకు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది.దాంతో రానురాను వృద్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందిముఖ్యంగా ఏ ఆధారంలేని వృద్ధుల జీవనం దుర్భరమైందిఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ ను రూ.1000ల నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి రూ.2వేలకు పెంచిందిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ రోజు ఈ ప్రకటన చేయడంతో  పండుటాకుల కళ్లలో ఆనందం తాండవించింది. వారి కళ్లలో నిజమైన పండుగ కళ కనిపించిందిచివరిదశలో వివిధ కారణాల వల్ల కుటుంబ సభ్యులు సరిగా చూసిచూడక, గ్రామాలలో ఒక్కరినే వదిలివేసి పట్టణాలకు వెళ్లడంఆర్థికంగా ఏమాత్రం ఆధారంలేని వారికి కావలసింది ఆ కాస్త భరోసానేఎన్టీఆర్ హయాంలో కడుపు నిండా అన్నం తినని పేదలు ఉన్నారని తెలుసుకొని కిలో రూ.2 లకు బియ్యం పథకం ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టినవాటిలో ఇప్పటికీ అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అదే. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కిలో రూపాయికి తగ్గించినా ఇప్పటికీ జనంలో అది అన్న పథకంగానే గుర్తింపు పొందింది. బియ్యం పథకం అంటే ఆంధ్రులకు అన్నే గుర్తుకు వస్తారు. ఆయన ఆలోచనలు, ఆయన భావాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ పెన్షన్ పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ అని పేరు పెట్టింది. గతంలో రూ.200లు మాత్రమే ఇచ్చే పెన్షన్ ను 2014 అక్టోబర్ 2 నుంచి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో రూ.1000లకు పెంచింది. ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహిస్తోంది. మళ్లీ ఇప్పుడు దానిని రూ.2వేలకు పెంచారు. నెల మధ్యలో  పెన్షన్ రెట్టింపు  ప్రకటించినప్పటికీ జనవరి నెల నుంచే ఇది అమలవుతుందిఈ నెలలో ఇప్పటికే లబ్దిదారులు పెన్షన్ అందుకున్నారు.అందువల్ల ఈ నెలకు మిగిలిన రూ.1000లు,  ఫిబ్రవరి నెల పెన్షన్ రూ.2వేలు కలిపి మొత్తం రూ.3వేలు వచ్చే నెలలో లబ్దిదారులకు అందజేస్తారు.  ఆ తరువాత ప్రతి నెల రూ.2వేలు అందజేస్తారుదివ్వాంగులకుహిజ్రాలకు ఇచ్చే  పెన్షన్ ను రూ.1500ల నుంచి రూ.3వేలకు పెంచారురెండు చేతులు లేనిసంపాదనకు ఎటువంటి అవకాశంలేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేలు  ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
            ప్రస్తుతం రాష్ట్రంలో 22,46,947 మంది వృద్ధులు, 19,07,307 మంది వితంతువులు, 6,18,699 మంది దివ్యాంగులు, 95,415 మంది చేనేత కార్మికులు, 22,701 మంది కల్లు గీత కార్మికులు, 32,070 మంది కళాకారులు, 1645 మంది హిజ్రాలు, 39,967 మంది మత్స్యకారులు, 88,202 మంది ఒంటరి మహిళలు,దయాలసిస్ రోగులు ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందేవారు 3,373 మంది,అనుమతి పొందిన ఆస్పత్రులలో చికిత్స పొందేవారు 4,671 మంది సామాజిక భద్రత పెన్షన్లు  అందుకుంటున్నారు.  మొత్తం 50,61,906 మందికి ప్రభుత్వం 10రకాల పెన్షన్లు అందజేస్తోందితూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 5,54,934 మంది, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 2,84,045 మంది ఉన్నారు. పెన్షన్ అందుకునేవారిలో  ఎయిడ్స్ రోగులు కూడా ఉన్నారు.   2018 డిసెంబర్ నెలలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,62,008 మందికి పెన్షన్ రూపంలో రూ.560,79,49,000 అందజేసింది.  2019 జనవరి 17వ తేదీ వరకు 46,59,530 మంది లబ్దిదారులకు రూ.514,33,76,500 అందజేసింది. ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామసభలలో సామాజిక భద్రత పెన్షన్ కోసం దాదాపు 1.5లక్షల మంది దరకాస్తు చేసుకున్నారువాటిని కూడా పరిశీలించి అర్హులకు పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది.  వృద్ధులకు భద్రత, భరోసా కల్పించడం అభినందనీయం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jan 18, 2019


జీవితాంతం ఒకటే కుల సర్టిఫికెట్
కార్యదర్శుల సమావేశంలో సీఎస్ పునీఠ నిర్ణయం
15 రోజుల్లో జీఓ జారీ
                    సచివాలయం, జనవరి 18: ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలలో జీవీతాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన ధృవపత్రం(సర్టిఫికెట్) జీవితాంతం ఉపయోగపడేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఉదయం జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ  ఈ ధృవపత్రాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన పద్దతి కాదన్నారు. ఒకసారి ఇచ్చిన సర్టిఫికెట్ జీవితాంతం ఉపయోగపడాలన్నారు. ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సర్టిఫికెట్ కూడా 4 ఏళ్ల వరకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సర్టిఫికెట్ల విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఇ-గవర్నెన్స్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణతో చర్చించి సీనియర్ అధికారుల సలహాలు తీసుకొని 15 రోజుల్లో జీఓని  రూపొందించమని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబుకు సూచించారు. అవసరంలేని పోలీస్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికెట్లను ఆయా శాఖలతో సంప్రదించి తీసివేయాలన్నారు.   సర్టిఫికెట్ల విషయంలో ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలని సీఎస్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి రామాంజనేయులు సీఎస్ కు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్లుగా ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇది చాలా మంచి నిర్ణయంగా పేర్కొన్నారు.
21వ తేదీ నాటికి అవసరమైన ఫైల్స్ సిద్ధం చేయాలి
          ఈ నెల 21వ తేదీకి మంత్రి మండలి ఆమోదించవలసిన  అన్ని ఫైల్స్ సిద్ధం చేయాలని సీఎస్ కార్యదర్శులకు, హెచ్ఓడీలకు సూచించారు. కేంద్రం నుంచి రావలసిన నిధులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించకపోతే సమర్పించాలని, సమర్పించినవాటి పరిస్థితి గురించి తెలుసుకోవాలని, ఏపీ భవన్ రెసిడెన్స్ కమిషనర్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రావలసిన నిధులు రాబట్టాలని చెప్పారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను అధ్యయనం చేసి ఆ నిధులను పూర్తి స్థాయిలో పొందడానికి ప్రయత్నించాలన్నారు.  ప్రతి శాఖ నుంచి కార్యదర్శి గానీ, కమిషనర్ గానీ రావాలని, వారికి అవకాశం లేకపోతే ఆ శాఖ ప్రతినిధి ఒకరు తప్పనిసరిగా రావాలన్నారు. ఆ శాఖకు సంబంధించిన సమాచారం ఎవరు ఇస్తారని సీఎస్  ప్రశ్నించారు.   సమావేశంలో అధికారులకు, ఇతర సిబ్బందికి శిక్షణ, వివిధ శాఖలలో ఇంజనీరింగ్ విభాగం పనులు, హెచ్ ఆర్ పాలసీ, సర్వీస్ రూల్స్, మున్సిపాలీటీలలో పనులకు నిధులు,  ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసిన, చేయవలసిన పోస్టులు, సిలబస్, వివిధ పోస్టులకు కావలసిన విద్యార్హతలు,  గ్రామీణ, పట్టణ నీటి సరఫరా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పని భారం, వివిధ శాఖలు జారీ చేసే లైసెన్సుల ప్రక్రియ సులభతరం చేయడం, లైసెన్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థ, భూధార్, నబార్డ్ నిధుల వినియోగం, గ్రామీణ రహదారులు, వివిధ శాఖలలో చెల్లించవలసిన బిల్లులు, మధ్యాహ్న భోజన పథకం, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు, జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, యువనేస్తం, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణం, మునిసిపల్, పంచాయతీరాజ్ పథకాలు ... తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల పనితీరుపై ప్రజా స్పందనను, వారి సంతృప్తి స్థాయిని ఆర్టీజీ సీఈఓ బాబు వివరించారు. ఏపీ భవన్ రెసిడెన్స్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కేంద్రం నుంచి రావలసిన నిధులు, యుసీలు, నరేగా నిధులు, భారత్ నెట్ వర్క్, గ్రామీణ సడక్ యోజన, సాగరమాల పనులు, స్వచ్ఛభారత్ అర్బన్ నిధులు, కేంద్ర ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అవకాశం ఉన్నమేరకు రాష్ట్రానికి రావలసిన వాటా నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇ-ప్రగతి, ఇ-ఆఫీస్ ద్వారా సమయం చాలా ఆదా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలకు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిందన్నారు. ఇ-ఆఫీస్ నిర్వహణలో కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ కృషిని అందరూ ప్రశంసించారు. కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు.
         సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ డి.సాంబశివరావు, నీరబ్ కుమార్ ప్రసాద్, జెఎస్వీ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్, జి.అనంతరామ్, ముఖ్యకార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్, కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆర్.కరికాల వళవన్, బి.ఉదయలక్ష్మి,  కార్యదర్శులు రామాంజనేయులు, శశిభూషణ్ కుమార్, పియూష్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా, నాగులాపల్లి శ్రీకాంత్, కాంతిలాల్ దండే, సోలమన్ అరోకియా రాజ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Jan 17, 2019

నాలెడ్జికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్

ఐనవోలులో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన


                సచివాలయంజనవరి 17: భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలెడ్జికి చిరునామాగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోని ఐనవోలు వద్ద గురువారం మధ్యాహ్నం దేశంలోని బి-స్కూల్స్ లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్-ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఎక్స్ఎల్ఆర్ఐ దక్షిణ భారతదేశంలో మొదటి క్యాంపస్ ని అమరావతిలో నెలకొల్పుతోందనిదాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఈ రోజు చాలా మంచి రోజన్నారు. 1949లో ప్రారంభమైన ఈ సంస్థకు జంషెడ్ పూర్భువనేశ్వర్ లలో క్యాంపస్ లు ఉన్నాయని తెలిపారు. మనం 50 ఎకరాల భూమి ఇస్తే రూ.235 కోట్లతో ఇక్కడ క్యాంపస్ నిర్మిస్తున్నారని చెప్పారు. దేశంలో అత్యున్నత విద్యా సంస్థగా ఈ క్యాంపస్ ఎదగాలన్నా ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యున్నత పరిశోధనా సంస్థలతో ఈ సంస్థ అవగాహనా ఒప్పందాలు చేసుకుంటుదని తెలిపారు. ఈ సంస్థ నిర్మించబోయే అంతర్జాతీయ పాఠశాలకు 8 ఎకరాల భూమి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  దేశంలోని టాప్ 20 విద్యా సంస్థలలో కనీసం పది సంస్థలకు ఇక్కడకు రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విట్ఎస్ఆర్ఎంఅమృత వంటి సంస్థలు వచ్చాయనిఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ కూడా వచ్చిందన్నారు. భవిష్యత్ లో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలన్నీ ఇక్కడే కొలువవుతాయని చెప్పారు.  నాలెడ్జిపై పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాజధాని అమరావతి నాలెడ్జి ఎకనామికీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నాలెడ్జి ద్వారానే అన్ని రంగాల్లో సమర్థవంతమైన నాయకత్వం పెంపొందుతుందన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఆస్తి అన్నారు. అటువంటి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల చొరవత్యాగం రాష్ట్రం మరువదని చెప్పారు. ఇప్పటి వరకు చదువులుఉద్యోగాల కోసం మనం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేవారమనిఇక ముందు ప్రపంచమే మన వద్దకు వస్తుందన్నారు.

                  రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం ఐఐటిఐఐఎంవ్యవసాయ విశ్వవిద్యలయంఏఐఎంఎస్ .. వంటి 11 విద్యాసంస్థలను ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు. వాటి కోసం 2,912 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. అంతే కాకుండా వాటి కాంపౌండ్ వాల్స్ కోసం రూ.132 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలోని వంద టాప్ విశ్వవిద్యాలయాలలో ఆరు మన రాష్ట్రంలోనే ఉన్నట్లు తెలిపారు. 30 దేశాలు 679 మంది విద్యార్థులను ఎంపిక చేస్తే వారిలో 258 మంది ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నట్లు చెప్పారు. ఎవరు అడ్డుకున్నా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదనిఅనుకున్న లక్ష్యానికి అన్నీ పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపన చేసిన రోజే దాని ప్రారంభోత్సవ తేది నిర్ణయిస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియా మోటార్స్ తొలి కారు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 29న రోడ్డెక్కనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంస్థ కూడా 8 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా డక్ట్ ద్వారా గ్యాస్మంచినీరుసమాచార కేబుల్స్,మురుగు నీరు పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే రాజధాని మొత్తానికి ఒకేచోట ఏసీ యూనిట్ ఏర్పాటు చేసి కావలసిన ఇంటికి పంపించే వ్యవస్థ గురించి పరిశీలించమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా అమరావతిలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. మొక్కలు ఎక్కవగా నాటి చెట్లను పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ప్రకృతి సేద్యం ద్వారా మంచి ఆహారంమంచి గాలితోపాటు కృష్ణా నది నుంచి మంచినీరు  అందిస్తే వందేళ్లకుపైగా బతకడానికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతిని ఆనందనగరంగా,  దేవతల రాజధానిగా అభివర్ణించారు. ఎక్స్ఎల్ఆర్ఐకు ప్రభుత్వంసీఆర్డీఏ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయనినిర్మాణాలు వేగంగా పూర్తి అవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.

             ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నారాయణతాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్స్ సీ టాచర్  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవిజిల్లా కలెక్టర్ కోన శశిధర్సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్గుంటూరు బిషప్ ఫాదర్ బి చిన్నబత్తినివిజయవాడ బిషప్ ఫాదర్ టీ జోసెఫ్ రాజారావుఆంధ్ర జోసూట్ ప్రావిన్స్ప్రావిన్సియల్ ఫాదర్ పీఎస్ అమల్ రాజుఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్ పూర్ డైరెక్టర్ ఫాదర్ ఈ.అబ్రహంఅడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డీన్ ఫాదర్ జెరోమ్ కుటిన్హాఅకడమిక్ డీన్ డాక్టర్ అశీష్ కె పాణిఅమరావతి చీఫ్ అడ్మినిస్ట్రేటిల్ ఆఫీసర్ ఫాదర్ కె.ఎస్.కాసిమర్ తదితరులు పాల్గొన్నారు.