Sep 26, 2017

అమరావతి డిక్లరేషన్ పై 27న సమావేశం


సచివాలయం, సెప్టెంబర్ 26: జాతీయ మహిళా పార్లమెంట్ తుది అమరావతి  ప్రకటన విడుదలకు సంబంధించి ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఈ నెల 27 ఉదయం 11.30 గంటలకు వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో  సమావేశం ఏర్పాటు చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డాక్టర్ కోడెల ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ప్రకటనరూపొందించారు. మహిళా సాధికారితకు కావలసిన అన్ని అంశాలను, గ్రామీణ మహిళ మొదలుకొని పట్టణ మురికివాడలలో నివసించే మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్య,ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని అంశాలు  ఆమూలాగ్రం చర్చించి దీనిని సిద్ధం చేశారు. తుది ప్రకటన విడుదల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్ డీపీఎస్) డైరెక్టర్ వి.ప్రతిమ, సీనియర్ అసోసియేట్ అలెన్ జాన్, రోడ్లు భవనాల శాఖ కన్సల్టెంట్ నీరజ్ ఆద్యయునిసిఫ్ ఏ అండ్ సి స్పెషలిస్ట్ ప్రొసూన్ సేన్, టెక్నికల్ కన్సల్టెంట్ చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత పాల్గొంటారు.

జర్నలిస్టులందరికీ ఇళ్లు


సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు

సచివాలయం, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉందని సమాచార,పౌరసంబంధాల శాఖ, గృహనిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం ఉదయం ఆయన  జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల సేపు వారి సమస్యలు విన్నారు. తాను కూడా 14 ఏళ్లు స్టాఫ్ రిపోర్టర్ గా, డెస్క్ జర్నలిస్ట్ గా పని చేశానని, అందరి సాదకబాధలు తెలుసని చెప్పారు. జర్నలిస్టులు, వారి కుటుంబాల సమస్యలు సాధ్యమైనంతవరకు  పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తాన్నారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్లు నిర్మిస్తామని, ఎవరికీ ఎటువంటి అపోహలు వద్దన్నారు. సీఆర్డీఏ వద్ద భూమి తీసుకొని ప్రభుత్వ సబ్సిడీతో జర్నలిస్టుల భాగస్వామ్యంతో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు.  ప్రభుత్వం పేదలకు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మిస్తున్న మాదిరిగా, జర్నలిస్టులకు అదనపు చదరపు అడుగులు, అదనపు సబ్సిడీతో ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం అమరావతిలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఆధర్యంలో ఒక కమిటీ రూపొందిస్తుందని తెలిపారు. ఈ ఇళ్లు ఎన్ని చదరపు అడుగులు ఉండాలి? ఎంత సబ్సిడీ ఇవ్వాలి? వంటి వాటికి సంబంధించి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నామని, అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.  మండల, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాజధాని అమరావతి మొత్తం 3 కేటగిరీలలో ఇళ్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. గుంటూరు, విజయవాడ, రాజధాని అమరావతిలలో పని చేసే జర్నలిస్టులకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంచుకునే అవకాశం ఇస్తామన్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరిలలోని స్థానికులకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో స్థలం ఉండి, ప్రభుత్వం వద్ద స్థలం తీసుకొని ఇళ్లు నిర్మించుకునేవారికి ఈ పథకం పరిధిలో సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిపారు. అందరికంటే ఫొటో జర్నలిస్టులు ఎక్కువగా శ్రమపడతారని, తరచూ పోలీసుల తోపులాటలకు గురవుతుంటారని వారి కష్టం తనకు తెలసునని మంత్రి కాలవ చెప్పారు.
      వివిధ జర్నలిస్ట్ యూనియన్ల నాయకులు మాట్లాడుతూ అక్రిడేషన్ తో సంబంధంలేకుడా జర్నలిస్టులు అందరికీ అవకాశం ఉన్నచోట స్థలాలు లేని చోట గ్రూప్ ఇళ్లు, అపార్ట్ మెంట్లు నిర్మించాలని కోరారు. అమరావతిలో కనీసం వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ నిర్మించాలన్నారు. జర్నలిస్టుల జీతాలు, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో 70 నుంచి 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ఈ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. కాల పరిమితి నిర్ణయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతి యూనియన్ కు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వివాదాలు, ఆటంకాలు, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరారు. మరొకరితో కలపకుండా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించాలన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఏపీ కోసం పని చేసే జర్నలిస్టులకు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సాధ్యపడనందున, వారికి సమీపంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మించాలని చెప్పారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.   ప్రధానంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులను కార్పోరేట్ ఆస్పత్రుల వారు ఆమోదించడంలేదని, ఇది సక్రమంగా అమలుకావడానికి ఒక కమిటీని నియమించి నెలకు ఒకసారి సమీక్షించాలన్నారు. తమిళనాడు, కేరళ, అస్సాంలో మాదిరి మన రాష్ట్రంలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ మల్లాది కృష్ణానంద్, జాయింట్ డైరెక్టర్ పోతుల కిరణ్, యూనియన్ నాయకులు ఉప్పల లక్ష్మణ్, ఐవి సుబ్బారావు, నల్లి ధర్మారావు, చెవుల కృష్ణాంజనేయులు, జీ.ఆంజనేయులు, అమరయ్య, తిలక్, చందు జనార్ధన్, రాజా రమేష్, నిమ్మరాజు చలపతి రావు, బడే ప్రభాకర్, పున్నమరాజు, ఆనంద్, విజయభాస్కర్, సాంబశివనాయుడు, రమణారెడ్డి, సుబ్బారావు, రంగసాయి, సింహాద్రి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భారత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి


         
 భారత దేశం మొదటి నుంచి శాస్త్ర సాంకేతిక అంశాలలో ప్రపంచంతో పోటీపడుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయి పరిశోధకులుగా ఎదిగారు. శాస్త్ర సంపదకు కానీ, నిష్ణాతులైన శాస్త్రవేత్తలకు కానీ మన దేశంలో కొదవలేదు. శుశ్రుతుడు, చరకుడు, కణాదుడు, ఆర్యభట, భాస్కర, శ్రీనివాస రామానుజం, సి.వి.రామన్, జహంగీర్ బాబా, జగదీస్ చంద్రబోస్, విక్రమ్ సారా బాయ్, సూరి భగవంతం, హరగోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, అరవింద్ భట్నాగర్, .పి.జె. అబ్దుల్ కలామ్, ఉప్పుగుండూరి అశ్వథనారాయణ,ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి వంటి మహామహులు ఎందరో మన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతో సుసంపన్నం చేశారు. భారతీయ అంతరిక్ష పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతిని గడించింది. గొప్ప, గొప్ప దేశాలు సైతం మనకు సాటిరాలేని స్థితికి దేశంలో ఖగోళ శాస్త్ర విజ్ఙానం చేరింది. దేశం ఎన్నోరంగాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించి అద్భుత ఫలితాలు సాధిస్తోంది.   1946 లోనే భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి కమిటీ దేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడానికి నాలుగు ఉన్నత టెక్నాలజీ సంస్థలను నెలకొల్పాలని ప్రతిపాదించింది. 1958లో జాతీయ సైన్స్ విధానం ప్రకటించి సైన్స్ విద్యను ప్రోత్సహిస్తోంది.
జాతీయ సైన్స్ విధానం -1958
       దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతి ఎంతో అవసరం. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1958లో జాతీయ సైన్స్ విధాన తీర్మానాన్ని(సైంటిఫిక్ పాలసీ రిజోల్యూషన్ ఆఫ్ 1958) ప్రకటించింది. సైన్స్ విద్యను ప్రోత్సహించింది. ఉన్నత ప్రమాణాలు గల శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అనేక అవకాశాలు కల్పించింది. అత్యాధునిక సాంకేతిక అంశాలలో మానవ వనరులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. వ్యవసాయ సంరక్షణకు నడుం బిగించింది. దేశాభివృద్ధికి అనేక లక్ష్యాలను నిర్ధేశించుకొని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించింది. పారిశ్రామిక రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత పెరిగింది. అయితే వర్షాధార ప్రాంతాలలో విద్యుత్ శక్తి ఆవస్యకతను ప్రభుత్వం గుర్తించింది. దాంతో పునర్వినియోగ వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. ఇదే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొటూ పర్యావరణ పరిరక్షణ చర్యలు మొదలు పెట్టింది. ఆ తరువాత కాల క్రమంలో అవసరానికి అనుగుణంగా, శాస్త్ర, సాంకేతిక అంశాలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అనేక మార్పులు చేశారు. 1961లో భారత పార్లమెంటు ఐఐటీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లను ముఖ్యమైన జాతీయ సంస్థలుగా గుర్తించింది.
1983 -  టెక్నాలజీ పాలసీ స్టేట్ మెంట్
జాతీయ వనరులు, ప్రాధాన్యతలకు తగిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని,  సంప్రదాయ విజ్ఙానాన్ని, దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో 1983 జనవరిలో కొత్తగా టెక్నాలజీ పాలసీ స్టేట్ మెంట్ ను ప్రకటించింది. తక్కువ పెట్టుబడితో అధిక అభివృద్ధిని సాధించే టెక్నాలజీ రూపొందడానికి రూపకల్పన జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి వనరుల అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేశారు. ఇన్ శాట్(ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్), ఐఆర్ ఎస్(ఇండియన్ రిమోట్ సెన్సింగ్) వ్యవస్థలను అభివృద్ధి పరిచారు. కరువు నివారణ, పర్యావరణ పరిరక్షణకు చట్టాలు రూపొందించారు.
టెక్నాలజీ మిషన్ -1986
.       సాంకేతికాభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలని, దేశంలోని అన్ని ప్రాంతాలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని భారత ప్రభుత్వం 1986లో టెక్నాలజీ మిషన్ ని రూపొందించింది. అప్పటి నుంచి దీనిని సమర్థవంతంగా అమలు చేస్తోందికాలక్రమంలో వచ్చిన మార్పులను, సవాళ్లను ఎదుర్కొంటూ టెక్నాలజీ మిషన్ లో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. అత్యాధునిక ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నత సాంకేతిక విద్యా ప్రమాణాలు రూపొందించింది.
టెక్నాలజీ మిషన్ ప్రధాన లక్ష్యాలు:
·        నానో టెక్నాలజీ పరిశోధనలను ప్రోత్సహించడం
·        నిర్మాణం, విద్యుత్ శక్తి రంగాలలో అత్యాధునిక టెక్నాలజీ గల పరికరాలను అందుబాటులోకి తీసురావడం
·        దేశవ్యాప్తంగా అక్షరాశ్యత శాతం పెంచడం
·        దేశలో నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం
·        వ్యవసాయ రంగంలో ఆధునిక సేద్యపు పద్దతులతో, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం
·        అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వృద్ధి చేయడం
·        కూరగాయలు, ఫలాలు, పువ్వుల ఉత్పత్తిని పెంచి ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేయడం
·        ఐటీ రంగంలో విద్యాప్రమాణాలు, శిక్షణా సౌకర్యాల పెంపు
·        గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం
·        గ్రామీణ ప్రాంత ఆరోత్య భద్రత పెంపొందించడం. ఇందు కోసం ప్రాథమిక వైద్య కేంద్రాలు, వైద్య వాలంటీర్లు, మొబైల్ మెడికల్ యూనిట్స్, టీకాలు, శిశు వైద్యం వంటివి గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరింపజేయడం.
·        విద్యుత్ శక్తి యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం పెంపొందించడం. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం. సౌరవిద్యుత్ ని అభివృద్ధి చేయడం.
·        శీతోష్ణస్థితి మార్పుల వల్ల తలెత్తే వ్యవసాయ, తాగునీటి, ఆరోగ్య రంగ సవాళ్లకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి, అమలు చేయడం.
సైన్స్ విధానం-2003
మేథోసంపత్తి హక్కుల ప్రాధాన్యతను కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2003లో కొత్త సైన్స్ విధానాన్ని ప్రకటించింది. సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే సైన్స్ విధానాల రూపకల్పనలో దేశంలోని ప్రధాన పరిశోధనా సంస్థలను, కేంద్రాలకు భాగస్వామ్యం కల్పించాలన్నది ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో శాస్త్రవేత్తలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించడానికి పలు కార్యక్రమాలు రూపొందించారు. విశ్వవిద్యాలయాలు, ఆర్ అండ్ డీ(రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్) యూనిట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి, వాటికి స్వయంప్రతిపత్తిని కల్పించాలని నిర్ధేశించారుఈ రంగంలో వస్తున్న మార్పులకు, అవకాశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన విధానాలను రూపొందించాలని నిర్ణయించారు. సైన్స్ ఆధారిత విభాగాలన్ని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సాంకేతిక సలహా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రంగం అభివృద్ధికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తున్నారు. పారిశ్రామిక రంగం కూడా ఆర్ అండ్ డీ విభాగంలో పెట్టుబడులు పెంచే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
నానో మిషన్ - 2007
 దేశాఅభివృద్ధికి అన్ని విధాల ఉపయోగపడే నానో టెక్నాలజీ అభివృద్ధిని కూడా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2007 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నానో-సైన్స్, టెక్నాలజీ మిషన్ ను ప్రారంభించింది.
నానో మిషన్ ప్రధాన లక్ష్యాలు:
·        నానో టెక్నాలజీ నిపుణులను అందుబాటులోకి తేవడం
·        నానో టెక్నాలజీ అభివృద్ధికి పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్యం) పద్దతిని ప్రోత్సహించడం
·        పదార్ధాన్ని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకొని నానో మీటర్ స్థాయిలో దాన్ని వినియోగించేందుకు కృషి చేయడం
·        నానో టెక్నాలజీకి కావలసిన ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్(టీఈఎం), స్కానింగ్ ప్రోబ్ మైక్రోస్కోప్(ఎస్.పీ.ఎం.), ఆప్టిమల్ ట్వీజర్ వంటి పరికరాలను అభివృద్ధి చేయడం.
·        నానో క్రిస్టల్, నానో ట్యూబ్స్ ని అభివృద్ధి పరచడం.
నానో టెక్నాలజీ అభివృద్ధిలో ఎన్ఎస్ఏజీ(నానో సైన్స్, టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్), ఎన్ఏటీఏజీ(నానో అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్)లు కీలక పాత్ర వహిస్తున్నాయి. చెన్నైలో ఎన్ఎఫ్ఎంటీసీ(నానో ఫంక్షనల్ మెటీరియల్ టెక్నాలజీ సెంటర్) ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, మొహాలిలలో ఐఎన్ఎస్ టీ(ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ)లను స్థాపించారు.  నానో టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి రష్యా, అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి ముఖ్యమైన దేశాలతో సహకార కార్యక్రమాలు ప్రారంభించారు. సెరామిక్స్ ఉత్పాదనలో ఉపయోగించే నానో క్రిస్టలైన్ ఆక్సైడ్ పౌడర్, కార్బన్ నానో ట్యూబ్స్ ను అభివృద్ధి చేశారు. టైర్ ఇంజనీరింగ్ లో ఉపయోగపడే హైపర్ ఫార్మేన్స్ రబ్బర్ నానో కాంపోజిట్స్ ని అభివృద్ధి చేశారు.
2013-ఎస్ టీఐ
అన్ని అంశాలలో శాస్త్రవేత్తలను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2013లో సైన్స్, టెక్నాలజీ, ఇన్నొవేషన్(ఎస్.టీ..) విధాన్ని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఇన్నొవేషన్ విధానానికి ఇదే ప్రేరణ. అయిదేళ్ల కాలంలో దేశంలోని శాస్త్రవేత్తలను 66 శాతానికి పెంచాలన్నది ఎస్టీఐ ప్రధాన లక్ష్యం. ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగాలలో 2020 నాటికి తొలి అయిదు దేశాలలో ఒకటిగా భారత్ ని నిటబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ-గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో పరిశోధనల అభివృద్ధి వ్యయాలన్ని రెండు శాతానికి పెంచారు.
జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్ - 2014
        దేశవ్యాప్తంగా డిజిటల్ అక్షరాశ్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్ 21న డిజిటల్ సాక్షరత అభియాన్(డీఐఎస్ హెచ్ఏ) పేరుతో జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్ ను ప్రారంభించారు. సమాచార, సాంకేతిక విప్లవం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ అక్షరాశ్యతను విస్తరింపజేయడం, గ్రామాల్లో సాధికారత సాధించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇందు కోసం అంగన్ వాడీ, ఆశా వాలంటీర్లు, రేషన్ డీలర్లతోపాటు 52.5 లక్షల మందికి ఐటీలో శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా 14 నుంచి 60 సంవత్సరాల లోపు డిజిటల్ నిరక్షరాశ్యులు ఈ కార్యక్రమం కింద శిక్షణ పొందే అవకాశం కల్పించారు. డిజిటల్ లిటరసీ మిషన్ లో అందించే శిక్షణకు కావలసిన శిక్షణ సామాగ్రిని  నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సెర్వీసెస్ కంపెనీస్) అభివృద్ధి చేసింది. ఈ శిక్షణలో ఇంటర్నెట్, పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్, -మెయిల్, సోషల్ మీడియా, ప్రభుత్వం, -కామర్స్, ఐటీ సెక్యూరిటీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్రిజెంట్ వంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయి.

-        శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914