Sep 18, 2022

దటీజ్ బాలకృష్ణ!



నందమూరి అందగాడు, నటరత్న, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కుమారుడు, నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినా బాలకృష్ణ   తన నటనా ప్రతిభతో నటుడిగా ఉన్నత శిఖరాలధిరోహించారు. తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన యువరత్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అనేక వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఆయన పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి 106 చిత్రాలలో  నటించారు.నట సింహంగా పేరు పొందిన బాలకృష్ణను కుటుంబ సభ్యులు,అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు.

 ఫ్యాక్షన్ డైలాగులు చెప్పడంలో దిట్టగా పేరొందిన బాలయ్య 1960లో జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు జన్మించారు. చెన్నై టీనగర్ బజుల్లా రోడ్డులోని హాస్యనటుడు శివరావు ఇంటిని 1953లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో ఉండగానే బాలకృష్ణ జన్మించారు. ఎన్టీఆర్, బసవతారకం  దంపతులకు 12 మంది సంతానం. ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆరవ కుమారుడైన బాలక‌ృష్ణ తల్లిదండ్రుల చెప్పుచేతల్లో ఎంతో క్రమశిక్షణగా పెరిగారు. బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది. ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే నటుడు కావాలని ఆయన అనుకున్నారు. అయితే,  కనీసం డిగ్రీ  పూర్తి చేయాలన్న  తండ్రి కోరిక మేరకు హైదరాబాద్ నిజాం కళాశాలలో బీఏ చదివారు.

 1982 డిసెంబరు 8న బాలకృష్ణ   వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు బ్రాహ్మణి, తేజస్విని, ఒక కుమారుడు  తారకరామ తేజ మోక్షజ్ఞ. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులోనే 1974లో  తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో  కలిసి ఎక్కువ చిత్రాలలో నటించారు. బాలక‌ృష్ణ  తండ్రి దర్శకత్వం వహించిన  తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలలో నటించారు. తండ్రి ద్వారా అపారమైన నటనానుభవాన్ని గఢించారు. 


దానవీరశూర కర్ణ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు దర్శకుడైన ఎన్టీఆర్ హరిక‌‌ృష్ణ, బాలకృష్ణల చేతకూడా సెట్ పనులు చేయించారు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ సెట్ లో బాయిస్ తో పనిచేయిస్తూ ఎన్టీఆర్ కు కనిపించారు. అది చూసి ఆయన సెట్ లో పనులు చేయించడమేకాదు, మనం కూడా చేయాలని అని చెప్పారు. ఒక్క సెట్ వర్కే కాదు, లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్, కాస్ట్యూమ్ తదితర పనులు చేసే అందరితోపాటు సినీ పరిశ్రమలోని అందరినీ గౌరవించాలి.  మన ఎదుగుదలలో అందరి కృషి ఉంటుందన్నారు. అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. చెప్పిన సమయం కంటే ముందే సెట్ కు రావాలని కూడా చెప్పారు. అప్పటి నుంచి బాలకృష్ణ తండ్రి మాటలను శిరోధార్యంగా భావించారు. అందరినీ గౌరవించేవారు. 

దాన వీర శూర కర్ణ సినిమాలో హరికృష్ణ కుమారుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ‘రామ్ రహీమ్’ చిత్రంలో నటించారు.1984లో రూపొందించిన సాహసమేజీవితం చిత్రంతో బాలయ్య కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మొదలైంది. అక్కడ నుంచి కమర్షియల్ చిత్రాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఆ తరువాత యాక్షన్, ఫ్యాక్షన్ చిత్రాలలో నటించి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. కత్తి పట్టి, డైలాగ్ చెప్పి, కంటి చూపుతో  కలెక్షన్లలో రికార్డులు సృష్టించారు.యాక్షన్, డ్యాన్సులు, ఫైట్స్, హావభావాల ప్రదర్శన,డైలాగ్స్ చెప్పడంలో  తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రంతో ఫాక్షన్ చిత్రాలకు ఓ ఊపు తెచ్చారు. అప్పటి నుంచి బాలయ్యలోని నటసింహం జూలు దులిపింది. బాలయ్య తొడకొట్టినా, మీసం తిప్పినా రచ్చరచ్చే.బాలకృష్ణ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్లు హౌస్ ఫుల్. కలెక్షన్ల వర్షం.

 1974లో తాతమ్మ కలలో బాలయ్యకు తాతమ్మగా నటించిన విలక్షణ నటి భానుమతి, మళ్లీ  పది సంవత్సరాల తరువాత 1984లో మంగమ్మగారి మనవడు చిత్రంలో నానమ్మగా నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.బాలయ్యకు మంచిపేరు తెచ్చిపెట్టంది. బాలయ్య సినీజీవితంలో గొప్ప మలుపు అది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. ఆ తరువాత కథానాయకుడు,భార్యాభర్తల బంధం,నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వసహోదరులు, భార్గవరాముడు,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు,నారీనారీ నడుమ మురారి, లారీడ్రైవర్, ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బిలి సింహం,శ్రీకృష్ణార్జున విజయం, ముద్దుల మొగుడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు,  లక్ష్మీ నరసింహా, సింహా,శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్రశాతకర్ణి,  రూలర్ వంటి చిత్రాలలో నటించారు. బాలయ్య 106వ చిత్రం అఖండ భారీ కలెక్షన్లతో  ఘన విజయం సాధించింది. 

బాలక‌ృష్ణ నటనతోపాటు నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు. ‘సుల్తాన్, బాల గోపాలుడు, ‘అల్లరి పిడుగు, ప్రాణానికి ప్రాణం సినిమాలకు సమర్ఫకుడిగా వ్యవహరించిన బాలకృష్ణ  తండ్రి జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారడమే కాకుండా, ఆ చిత్రాలలో తానే  హీరోగా నటించారు. నందమూరి వారసుడిగా సినిమా రంగంలో తండ్రి ఎన్టీఆర్ నటించిన  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక,చారిత్రక పాత్రలను పోషించారు. మెప్పించారు. ఒక రకంగా అది బాలకృష్ణకు అదృష్టంగా భావించవచ్చు. సినిమా రంగంలో తండ్రి పేరు చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ఎదుగుతూ వచ్చారు. అందంలో తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఉంటారు. అందువల్లే బాలయ్యను అభిమానులు  నందమూరి అందగాడు అని పిలుచుకుంటారు. 

 ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో  ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడిగా, బాలయ్య హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో తండ్రి కొడుకులు  ద్విపాత్రాభినయం చేయడం ఒక ప్రత్యేకత. అది ఒక రికార్డు. 

 హీరోయిన్ విజయశాంతితో అత్యధికంగా 17 చిత్రాల్లో బాలక‌ృష్ణ హీరోగా నటించారు.వెండితెరపై ఈ జంటకు మంచిపేరొచ్చింది.ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో బాలయ్య హీరోగా నటించారు.  అందులో 9 చిత్రాలు హిట్టయ్యాయి. బాలయ్య 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’కి కోదండరామిరెడ్డే దర్శకులు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో  7 చిత్రాల్లో నటించారు. 1987లో ఒకే సంవత్సరంలో బాలకృష్ణ    నటించిన 8 సినిమాలు విడుదలవడం విశేషం.బాలయ్య సినీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ  కుంగిపోలేదు. అలాగే, ఘనవిజయాలు సాధించినప్పటికీ  పొంగిపోలేదు. 

   బాలకృష్ణకు తను నటించిన చిత్రాలలో సమర సింహారెడ్డి అంటే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే రజనీకాంత్ ముత్తు, అమితాబచ్చన్ అగ్నిపథ్, చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి అంటే బాలయ్యకు ఇష్టం.బాలకృష్ణ పైసావసూల్  సినిమా కోసం మొదటిసారి పాట పాడారు.  పాండురంగడు చిత్రంలో మాతృదేవోభవా అన్న సూక్తి మరిచాను అనే పాటలో పశ్చాత్తాప  పడిన కొడుకు  పాత్రలో   బాలకృష్ణ జీవించారు. ఈ పాటకి   థియేటర్లలో  ప్రేక్షకులు కన్నీటిపర్యంతమయ్యారు. 

తెలుగులో  తొలి టైమ్ మిషన్ నేపథ్యం గల సినిమా ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటన అమోఘం.ఈచిత్రాన్ని ఇండియన్ ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 

 మొత్తం 15 చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో తాతా,తండ్రి,మనవడుగా మూడు పాత్రల్లో నటించారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో  మూడు సినిమాలు ‘భార్యభర్తల అనుబంధం, ‘గాండీవం’, శ్రీరామరాజ్యంలలో నటించారు. బాలయ్య   కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి సుల్తాన్ చిత్రంలో నటించారు. బాలకృష్ణ అతిథి పాత్రలో ఒకే ఒక చిత్రం ‘త్రిమూర్తులు’లో నటించారు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు,చిరంజీవి, నాగార్జున కూడా అతిథి పాత్రలలో నటించారు. 

 బాలయ్య  స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ‘నర్తనశాల’ సినిమా నిర్మాణం సౌందర్య మరణంతో ఆగిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దాదాపు 80 శాతం షూటింట్ పూర్తి అయిన  ‘విక్రమ సింహ భూపతి’ సినిమా  వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేదు.  బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జై బాలయ్య అని పేరు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా దీని టీజర్ విడుదల చేశారు. అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. బాలయ్య ఆగస్టు 30, 2022 నాటికి  తన నటప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 

బాలయ్య బాబు ఆహా టీవీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రొగ్రామ్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. తన స్టైల్లో పంచ్ మీద పంచ్ వేస్తూ  హాస్యం పండిస్తూ సరదా సరదాగా నడిపారు. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడతారని, ఓపెన్ గా ఉంటారని,బాలయ్యది చిన్న పిల్లవాడి మనస్తత్వం అని అతని సన్నిహితులు చెబుతారు.  సినిమా సెట్ లోకి రాగానే  చిత్ర బృందంలోని వారందరికి విష్ చేయడం బాలయ్య బాబుకు

అలవాటు.తండ్రి మాదిరిగానే బాలయ్య తెల్లవారు జామున 3.30 గంటలకే నిద్రలేస్తారు. యోగా,వ్యాయామం చేస్తారు.  సేవారంగంలో కూడా బాలయ్య ముందున్నారు.హైదరాబాద్ లోని వారి తల్లిగారి పేరుతో  అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రికి  చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బసవతారకం-రామారావు మెమోరియల్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ పాలకమండలి ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రిని లాభాపేక్షలేకుండా  నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు తక్కువ ఖర్చుతో  వైద్యం అందిస్తున్నారు. పేదలకు నాణ్య‌మైన వైద్య సేవ‌లందిస్తోన్న ఆస్పత్రిగా నీతి అయోగ్  కూడా దీనిని గుర్తించింది. 

 అన్ని విషయాలలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. తండ్రి  మూడుసార్లు గెలిచిన అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచే  బాలయ్య   2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

బాలకృష్ణ  2001లో నరసింహానాయుడు, 2010లో సింహా, 2014లో  లెజెండ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  నంది అవార్డులు మూడు  అందుకున్నారు. 1994లో భైరవద్వీపం చిత్రానికి  ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, పాండు రంగడు చిత్రానికి  సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు,  సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు  ఉత్తమ నటుడిగా భరతముని అవార్డులు,లెజెండ్ చిత్రానికి  ఉత్తమ కథానాయకునిగా దక్షిణ భారత సినిమాటోగ్రాఫర్స్ అవార్డు అందుకున్నారు. 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో బాలయ్యను సత్కరించారు. ఇంకా సంతోషం, సీమా, సిని‘మా’, టీఎస్ఆర్ నేషనల్ అవార్డులు వంటివి అనేకం అందుకున్నారు. 

ఇప్పటి వరకూ ఒక్క వ్యాపార ప్రకటనలో కూడా నటించకపోవడం బాలయ్య ప్రత్యేకత. నాకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. వారిచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం ఉపయోగించకోకూడదన్నదే నాన్న ఎన్టీఆర్ గారి అభిప్రాయం. ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించలేదని చెప్పారు. దటీజ్  బాలకృష్ణ. 


                                                                    -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Aug 24, 2022

స్టాక్‌మార్కెట్ దిగ్గజం బిగ్‌బుల్ ఝున్‌ఝున్ వాలా


రూ.5వేల నుంచి రూ.43వేల కోట్లకు ఎగబాకిన  ఝున్ ఝున్ వాలా ఎవరు?

బిగ్ బుల్ ఆఫ్ ఇండియా రాకేష్ ఝున్ ఝున్ వాలా 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టి  43వేల కోట్ల రూపాయలకు పైగా గడించారు. బిగ్  కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్  రాకేష్ ఝున్ ఝున్ వాలా  భారతీయుల్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు.  భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో బిలియనీయర్.  స్టాక్ మార్కెట్ లో ప్రముఖ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝున్ ఝున్ వాలా  రాధేశ్యామ్, ఊర్మిళ దంపతులకు  జూలై 5, 1960 సంవత్సరంలో హైదరాబాదులో  జన్మించారు.  రాజస్థాన్ లోని ఝున్ ఝున్ గ్రామానికి చెందిన ఆయన తండ్రి  రాధేశ్యామ్ ఝుున్ ఝున్ వాలా ముంబైలో  ఆదాయపు పన్ను కమిషనర్‌గా  పనిచేశారు.  దాంతో వారి కుటుంబం ముంబైలో  స్థిరపడింది. తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైలో ఉన్నందున ఝున్ ఝున్ వాలా అక్కడే పెరిగారు. చిన్నతనంలో ఆయన తండ్రి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు. స్టాక్ మార్కెట్ గురించి  ఆయన తండ్రి తన స్నేహితులతో చర్చించేవారు. దాంతో రాకేష్ ఝున్ ఝున్ వాలాకు స్టాక్ మార్కెట్ పై ఆసక్తి కలిగింది. ఒక రోజు ఆయన తన తండ్రిని స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరల హెచ్చుతగ్గుల గురించి అడిగారు. వార్తలను, షేర్లను పరిశీలిస్తే అర్థమవుతుందని తండ్రి చెప్పారు. 12, 13 ఏళ్ల వయసు నుంచే షేర్ మార్కెట్, షేర్ల ధరలలో మార్పులు, వార్తల గురించి అధ్యయనంచేయడం మొదలుపెట్టారు. 


సిడెన్ హమ్  కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బికాం డిగ్రీ పూర్తి చేశారు.  ఆ తరువాత ట్రేడింగ్ నే కెరీర్ గా ఎంచుకుంటానని తండ్రితో చెప్పారు. దానికి ఆయన  ‘‘నీ ఇష్టాన్ని కాదనను, కాకపోతే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్ తో కూడుకున్నది. నువ్వక్కడ నిలదొక్కుకోలేకపోతే భవిష్యత్ ఏంటనేది ఆలోచించాలి’’ అని  చెప్పారు. ముందు సీఏ పూర్తి చేయమని తండ్రి  చెప్పారు. షేర్ల వ్యాపారమంటే పెళ్లి చేసుకోవడానికి పిల్లని కూడా ఎవరూ ఇవ్వరు అని తల్లి  చెప్పారు. తల్లిదండ్రుల సూచన మేరకు  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. సిఏ పూర్తి చేసిన తరువాత 1985లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే, షేర్లు కొనడానికి ఆయన వద్ద డబ్బులేదు.   కొంత డబ్బు ఇవ్వమని తన తండ్రిని అడిగారు.  ‘‘నీకు నచ్చినన్ని సంవత్సరాలు పైసా ఇవ్వకుండా ఇంట్లోనే  ఉండు.  డబ్బు మాత్రం ఇవ్వను’’ అని తండ్రి  చెప్పారు.   ఆ రోజు నుంచి తల్లితండ్రి  జీవించి ఉన్నంత వరకు వారితో కలిసే ఉన్నారు. 

తండ్రి కాదనడంతో  సీఏగా ప్రాక్టీస్  చేస్తున్న అన్నయ్య రాజేష్ వద్ద 5వేల రూపాయలు అప్పుగా తీసుకుని ట్రేడింగ్ మొదలు పెట్టారు. అప్పటి స్టాక్  మార్కెట్ సూచీ 150 పాయింట్లు. మొట్టమొదటిసారి ఆయన టాటాపవర్, టాటా టీ షేర్లు కొన్నారు. టాటా టీ షేర్లలో మూడు నెలల్లోపే మూడు రెట్లు లాభం వచ్చింది.  వచ్చిన లాభంతో  సెసా గోవాలో నాలుగు లక్షల షేర్లు కొన్నారు. సంవత్సరం తరువాత నాలుగో వంతు వాటా ఉంచుకొని, మిగతావి అమ్మేశారు.  వచ్చిన డబ్బుని వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. వాటిలో టైటాన్ షేర్ల ద్వారా అధిక లాభాలు వచ్చాయి. 1987 ఫిబ్రవరి 22న  ఝున్ ఝున్ వాలా రేఖను వివాహం చేసుకున్నారు. వారికి ఒక అమ్మాయి నిష్ఠ, ఇద్దరు మగ పిల్లలు కవలలు  ఆర్యమాన్, ఆర్యవీర్.ఒకవైపు ట్రేడింగ్ చేస్తూనే, భార్యాభర్తల పేర్లు కలిసివచ్చేవిధంగా  రేర్ ఎంటర్ ప్రైజస్ అనే పేరుతో బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు.  తరువాత సినిమా రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. నిర్మాతగా ఇంగ్లీష్ - వింగ్లీష్, షమితాబ్, కీ అండ్ కా చిత్రాలను నిర్మించారు.  అనతి కాలంలోనే   వ్యాపార దిగ్గజంగా పెరిగి, వేల కోట్ల  రూపాయల ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే, అన్ని సందర్భాలలో ఆయనకు లాభాలు రాలేదు. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చాయి. అయితే, ఎక్కువ శాతం ఆయన ట్రేడింగ్  లాభాల బాటలో నడిచింది.  ఆయన కొనే షేర్ల విలువ ఖచ్చితంగా పెరుగుతుందని పెట్టుబడిదారుల నమ్మకం. అనుకోకుండా ఒక రోజు మాటల సందర్భంలో   తండ్రి  ‘‘నీ సంపాదనలో  నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నా ఆదాయం నాకు సరిపోతుంది. నువ్వు సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి’’ అని 

ఝున్ ఝున్ వాలాతో అన్నారు.   అప్పటి నుంచీ   ఆయన స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం చేస్తూ వచ్చారు. 2008లో తండ్రి మరణించిన తరువాత ఆయన మాటను గౌరవించి  అగస్త్య ఇంటర్నేషనల్ షౌండేషన్ కు ఆర్థిక సహాయం అందించేవారు. విద్య, వైద్య రంగాలకు సైతం ఎంతో సహాయం చేశారు. శంకర్ ఐ కేర్ వైద్య సంస్థతో కలిసి ముంబైలో ‘ఆర్.ఝున్ ఝున్ వాలా శంకర్ ఐ హాస్పటల్’ ను నిర్మించారు. భారతీయుల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఝున్ ఝున్  వాలా ఆప్‌టెక్, హంగామా డిజిటల్ మీడియా సంస్థలకు   చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా,  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌,  ప్రైమ్ ఫోకస్, బిల్‌కేర్ లిమిటెడ్,   మిడ్ డే మల్టీమీడియా, నాగార్జున కన్ స్ట్రక్షన్స్ వంటి అనేక సంస్థలలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ‘ఆకాశ ఎయిర్’ సంస్థ ద్వారా  విమానయాన రంగంలో కూడా అడుగు పెట్టారు.   2022 ఆగస్టు 7న ‘ఆకాశ ఎయిర్’ తొలి విమానంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత వారం రోజులకే ఆయన మరణించారు. 

 2022 జూలై నాటికి ఆయన ఆస్తుల విలువ 43 వేల 653 కోట్ల రూపాయలకు పెరిగింది.  ఎన్ని వేల కోట్లు ఆస్తులు గడించినప్పటికీ ఆయన నిరాడంబరంగానే  జీవించారు. పిల్లలకు కూడా ఆయన మధ్యతరగతి జీవితాన్నే అలవాటు చేశారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం   భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో   ఆయన  36వ  వ్యక్తిగా నిలిచారు.  అమెరికన్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ తో   ఆయనను పోల్చుతారు. రేసులు,  సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి.  2022 ఆగస్టు 14న  రాకేష్ ఝున్ ఝున్ వాలా   గుండె పోటుతో కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేస్తూ  ఆర్థిక వ్యవస్థకు, దేశ పురోగతికి ఝున్ ఝున్ వాలా కృషి చేశారని  కొనియాడారు.  ఆయన మరణం స్టాక్ మార్కెట్ రంగానికి తీరనిలోటు. స్టాక్ మార్కెట్ చరిత్రలో  బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అధ్యాయం ముగిసింది. 

                                                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 94402









Aug 21, 2022

అమ్మ కొడుకు ఓ విజయం



లక్ష్యం, తపన, పట్టుదల, కృషి ఉంటే పెళ్లి, పిల్లలు, వయసు ఇవి ఏవీ లక్ష్యసాధనకు అడ్డుకావని నిరూపించింది ఓ వనిత. కన్న కొడుకుతోపాటు యువతరంతో పోటీపడి ఓ తల్లి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అరుదైన సంఘటన కేరళలో జరిగింది. కేరళ రాష్ట్రం మలప్పురం పట్టణానికి చెందిన 42 సంవత్సరాల వయసు ఉన్న బిందు అనే మహిళ, ఆమె కుమారుడు వివేక్‌తోపాటు పోటీపరీక్షలలో శిక్షణ పొంది  పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షలు రాశారు. తల్లీకొడుకు ఇద్దరూ ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించారు.  42 ఏళ్ల అమ్మ,  24 ఏళ్ల కొడుకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. ఇటీవల జరిగిన ఈ సంఘటన కేరళలోనే కాకుండా దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ వార్తతోపాటు తల్లీకొడుకుల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  వివేక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విశేషం ఏమీలేదు. కానీ,  కొడుకుతోపాటు తల్లి కూడా అదే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో వారు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.

 బిందు  కేరళలోని మలప్పురం పట్టణానికి చెందిన వ్యక్తి.  ఆమె  భర్త  చంద్రన్  మలప్పురం జిల్లాలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఎడప్పల్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు వివేక్ ఒట్టుపర, కుమార్తె   హృద్య ఉన్నారు.  బిందుకు చిన్న వయసులోనే పెళ్లైంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె ఎంతోకాలంగా కలలు కంటోంది. అయితే, పిల్లలు పుట్టడం, వారి ఆలనాపాలనా చూసుకోవడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం ఆమెకు సాధ్యంకాలేదు. దాంతో ఆమె కల నెరవేరలేదు.  మలప్పురం జిల్లాలోని ఆరీకోడ్‌లో ఆమె గత 11 ఏళ్లుగా  అంగన్‌వాడీ టీచర్‌‌గా పని చేస్తున్నారు.  2019-20లో బిందు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. అయితే,  ఆమె అంతటితో    ఆగిపోలేదు. ఉన్నత స్థానానికి ఎదగటం కోసం తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు.  మరోపక్క పిల్లలు  కూడా పెద్దవాళ్లయ్యారు.  కొడుకు వివేక్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ  పరీక్షలు రాస్తున్నాడు. బిందు కూడా అంగన్ వాడీ టీచర్ పోస్టుతో సంతృప్తి చెందలేదు.  ఇప్పటి వరకూ ఆమె రెండు సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు.  ఐసీడీసీ సూపరింటెండెంట్ పోస్టుకు  పోటీ పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. 

ఇదే క్రమంలో ఆమె కొడుకు వివేక్ కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్యాలని అనుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసిన బిందు కూడా కొడుకుతోపాటు మరోసారి  ఆ పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డారు. తియ్య కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వేషన్ ఉండటంతో ఆమెకు 42 ఏళ్లు వచ్చినా కేరళ పబ్లిక్ సర్వీస్  కమిషన్ లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టుకు అర్హురాలు కావడంతో  ఆమె అప్లై చేశారు. అయితే, ఇంతకు ముందులా కాకుండా  గట్టిపట్టుదలతో ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. తల్లీకొడుకులు  ఇద్దరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్ లో చేరారు.  ప్రతిరోజూ కలిసే క్లాసులకు హాజరయ్యేవారు. ఇంటి దగ్గర కూడా ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేశారు. తల్లీకొడుకుల పట్టుదల, వారు ప్రిపేర్ అయ్యేతీరును గమనించిన కోచింగ్ సెంటర్‌లోని అధ్యాపకులు కూడా వారిని  ప్రోత్సహించారు. చంద్రన్ కూడా భర్తగా, తండ్రిగా వారిద్దరినీ ప్రోత్సహించారు.

ఇద్దరూ కలిసి ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. కేరళ పబ్లిక్ సర్వీస్  కమిషన్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో వివేక్‌కు 38వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో  బిందుకు 92వ ర్యాంక్ వచ్చింది. దాంతో ఆ తల్లీకొడుకుల ఆనందానికి అవధులు లేవు. చిరకాల వాంఛ నెరవేరినందుకు,  కొడుకుతోపాటు తనకూ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు  బిందు  సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  కేరళ రాష్ట్రమంతా ఇప్పుడు వీరిద్దరివైపే చూస్తోంది.  వారి ఇంటర్వ్యూల వీడియోలు వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా కూడా వారి గురించి చర్చించుకుంటున్నారు. బిందు మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక  భార్యగా, గృహిణిగా, తల్లిగా తన వంతు బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా ఆత్మ విశ్వాసంతో ఉంటే  ఆశయ సాధన అసాధ్యం కాదని, స్త్రీలు తలుచుకుంటే  ఏదైనా సాధించగలరని బిందు నిరూపించారు. మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.  అమెకు మనస్ఫూరిగా అభినందనలు తెలియజేద్దాం.

                                                                  - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914







Aug 16, 2022

చిరంజీవి ఓ సంచలనం



చిరంజీవి ఆ పేరే  తెలుగుసినిమా రంగంలో ఓ పెను సంచలనం. ఓ మెరుపు.  తుఫానులా దూసుకువచ్చారు. తిరుగులేని మెగాస్టార్ లా ఎదిగారు. అద్వితీయమైన డ్యాన్సులు, అమోఘమైన నటనతో యువత గుండెల్లో తిష్టవేశాడు. డ్యాన్స్ చేయడంలో తన శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పగలిగేవిధంగా సాధన చేశాడు. మెరుపు వేగంతో డ్యాన్సులు చేసి హీరోగా విజయం సాధించారు. తన బ్రేక్ డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు.  అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. తన నటన, డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. మెరిసే కళ్లతో, హావభావాలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల  మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించారు.  

ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నిర్మాతల్లోనూ, దర్శకుల్లోనూ సుస్థిర స్థానం పొందగలిగారు. దానికితోడు అతని నటన శిఖరాగ్రానికి చేరుకోవడానికి వీలుగా  కథా బలం ఉన్న పాత్రలు లభించాయి. తిరిగి చూసుకునే పనిలేకుండా తెలుగు చిత్రజగత్తులో దూసుకుపోయారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లిచేసుకోవడం కూడా అతనికి అన్ని విధాలా కలిసివచ్చింది. ఆమె సోదరుడు అల్లు అరవింద్ ఆయనకు కొండంత అండగా నిలిచారు. చిరంజీవి సోదరులు  నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా అన్నకు తగ్గ తమ్ముళ్లుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన అండతో ఎదుగుతూ తమ తమ ప్రత్యేకతలు చాటుకున్నారు. అన్న పేరును కూడా నిలుపుతున్నారు. వారికి చిరంజీవి లాంటి అన్న దొరకడం ఎంత అద‌ృష్టమో, చిరంజీవికి నాగబాబు, పవన్ కల్యాణ్ లాంటి తమ్ముళ్లు  దొరకడం కూడా అంతే అదృష్టం. చిరంజీవికి మరో అదృష్టం రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా తండ్రి పేరును నిలిపే విధంగా తన సత్తా చాటుతూ  ఎదుగుతున్నారు. 

నటనలో శిఖరాగ్రానికి చేరుకున్న చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో కొంతమేర ఫలితాలు సాధించినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై, కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా  నిస్వార్థంగా సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటన ద్వారా తెలుగు సినీజగత్తులో ఉన్నత శిఖరాలకు చేరిన చిరంజీవి ఏ రంగంలో ఉన్నా నిజాయితీగా వ్యవహరించడం వల్ల మంచి మనిషిగా గుర్తింపు పొందారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో కూడా ముందున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి నేత్ర, రక్తనిధి,



ఆక్సిజన్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా తన అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.   దేశం మొత్తంలో   మూడు వేలకు పైగా చిరంజీవి అభిమాన సంఘాలున్నాయి. అభిమానులు కూడా రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అభిమానులకు నిజమైన హీరోగా నిలిచి వారినీ ఉత్తమ మార్గంలో నడిపిస్తున్నారు.

ఈ మెగా హీరో అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.  పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు  1955 ఆగస్టు 22న  చిరంజీవి జన్మించారు. తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగి కావడంతో తరచూ పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేవారు. దాంతో చిరంజీవి ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో కొనసాగింది.ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, నరసాపురం శ్రీ వై.ఎన్. కళాశాలలో బీకాం పూర్తి చేశారు.   1976లో చెన్నైలోని  మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు. 1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి- సురేఖల వివాహం జరిగింది. వారికి సుస్మిత, శ్రీజ ఇద్దరు కుమార్తెలు.  ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ.

1978లో పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నట ప్రస్థానం మొదలైంది. అయితే, ప్రాణంఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది.  సినిమా రంగంలో చిరంజీవి అందుకున్న మొదటి పారితోషికం వెయ్యి నూట పదహార్లు. నటజీవితం ప్రారంభంలో హీరోగానే కాకుండా విలన్ గా, ఇతర ప్రాముఖ్యత గల పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని తనదైన గుర్తింపు పొందారు.  తెలుగు సినీరంగ దిగ్గజాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి ఉద్ధండుల హవా కొనసాగే సమయంలో చిరంజీవి తన బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లతో కొత్త ట్రెండ్ ను సృష్టించి వారితో పోటీపడ్డారు. ఆ తరువాత హీరోగా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అయినా, ఎంత పేరుప్రఖ్యాతులు వచ్చినా క్రమశిక్షణ, శ్రమించే స్వభావాన్ని, హుందా తనాన్ని వదిలిపెట్టలేదు. అవే ఆయనకు శ్రీరామరక్షగా నిలిచాయి. 

మనవూరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన తరువాత  ‘ఖైదీ’ చిత్రం చిరంజీవిని స్టార్‌ హీరోగా నిలబెట్టింది. ‘ఖైదీ’ సాధించిన సక్సెస్‌తో చిరంజీవి సుప్రీమ్‌ హీరో అయ్యారు. ఈ సినిమా కలెక్షన్స్‌ లో ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించింది.  ఖైదీ తెలుగు సినిమా పోకడను మార్చింది. దాంతో  స్పీడ్ పెరిగింది. దాంతో చిరంజీవి ఓ కొత్త  ట్రెండ్‌కు నాంది పలికాడు.  ‘మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్‌, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, దొంగ’ వంటి పక్కా కమర్షియల్‌ చిత్రాలతో విజయపరంపర కొనసాగింది.   ఆయన రేంజ్‌ ఓ స్థాయిలో పెరిగిపోయింది.  ‘అడవి దొంగ’ ఘన విజయంతో చిరంజీవి పెద్ద స్టార్‌ హీరోగా మారిపోయారు.  ‘విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చంటబ్బాయ్‌, రాక్షసుడు, దొంగమొగుడు’ చిత్రాలు చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ని ఇంకాఇంకా పెంచేశాయి.  ‘పసివాడి ప్రాణం’ సంచలన విజయం సాధించింది.  ‘స్వయంకృషి’తో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.  స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమైంది.  మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దానిని ప్రదర్శించారు. 

‘మంచిదొంగ’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాలతో  కొత్త రికార్డులు సృష్టించారు. ‘రుద్రవీణ’ సినిమాని సొంతంగా నిర్మించి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నారు. ‘ఖైదీ నెంబర్‌ 786‘, ‘మరణ మృదంగం’తో మెగాస్టార్‌ అయ్యారు. 100వ చిత్రం ‘త్రినేత్రుడు’ ఆ తరువాత ‘స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ’ వంటి వరుసగా విజయవంతమైన చిత్రాలతో అభిమానుల ఆనందానికి అవధులులేవు.  ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’  అద్వితీయమైన విజయంతో  రికార్డులను తిరగరాసింది.  గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు’ ఇలా ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి.  ‘ఘరానా మొగుడు’ అత్యధిక  వసూళ్లను సాధించింది.  ఆ తరువాత హిందీలో   ప్రతిబంద్‌,  ఆజ్‌కాగూండారాజ్‌ చిత్రాలలో నటించి భారతీయ ప్రేక్షకులను అలరించారు.  ఆ తరువాత ‘హిట్లర్‌’ వంటి  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించారు.  మాస్టర్‌, బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, శ్రీమంజునాథ’ వంటి వరుస మెగా హిట్స్‌తో పరిశ్రమని ఒక ఊపు ఊపారు.  ‘ఇంద్ర’తో తన రికార్డులను తానే తిరగరాసి తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచారు. చిరంజీవి నటసార్వభౌమ నందమూరి తారక రామారావుతో తిరుగులేని మనిషిలో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో మెకానిక్ అల్లుడులో,  సూపర్ స్టార్ కృష్ణతో తోడుదొంగలు, కొత్తపేటరౌడీ,  ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో మోసగాడు, కృష్ణంరాజుతో మనఊరి పాండవులు, ప్రేమతరంగాలు, పులిబెబ్బులి వంటి చిత్రాలలో నటించారు. 

 ‘శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌’తో నవ్వులు పండించి  భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. ‘స్టాలిన్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తర్వాత రాజీయ రంగ ప్రవేశం చేశారు.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత దాదాపు పది సంవత్సరాలు సినీ జీవితానికి విరామం ప్రకటించారు. తరువాత 150వ చిత్రంగా  ఖైదీనంబర్‌ 150లో నటించారు.  మళ్లీ వరుసగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నారు. నటనలో అత్యంత ప్రతిభను కనపరిచి మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్  బహుమతులు గెలుచుకున్నారు.  చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 2006 లో కేంద్రం నుంచి పద్మభూషణ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ఘరానా మొగుడు చిత్రాన్ని 1993   భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శించారు.  ఈ సినిమాతో చిరంజీవి దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు.  ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే వంటి పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌తో  పోల్చి  ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అని కొనియాడాయి.  చిరంజీవిని ‘ద వీక్’ పత్రిక  ‘ద న్యూ మనీ మెషీన్’ గా పేర్కొంది.  

1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు  దేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం 1.25 కోట్ల రూపాయలు అందుకున్నారు.   1999-2000 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా  సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు.   చిరంజీవిని భారతీయ సినిమాను ప్రభావితం చేసిన ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకడిగా 2013లో  ఐబీఎన్ లైవ్  పేర్కొంది.తగ్గేదేలే అన్నరీతిలో  చిరంజీవి ప్రస్తుతం కూడా దూసుకుపోతూనే ఉన్నారు. కథ ఎంపికలో చిరంజీవి  తీసుకునే  సమయం, జాగ్రత్తలు అందరికీ తెలిసినవే. నటనే ఆయనకు సర్వస్వం. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా రాజకీయాలను పూర్తిగా వదిలివేశారు. వాటికి స్వస్తిచెప్పారు.  నటనకే అంకితమయ్యారు. ఇప్పుడు కూడా ఎవగ్రీన్ హీరోలా ఈ తరం వారితో  పోటీపడుతూ  కొత్త లుక్ తో సంచలనాలు సృష్టించబోతున్నారు.  ఎప్పటికప్పుడు అప్ డేట్ అవడం చిరంజీవి ప్రత్యేకత.  అందుకు గాడ్‌ఫాదర్‌లోని ఈ కొత్త స్టిల్సే నిదర్శనం.  ఇదే కాకుండా భోళా శంకర్, పేరు ప్రకటించని మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. మంచి ఫిట్‌నెస్‌తో, తాజా లుక్‌తో యంగ్ హీరోలా అభిమానులను అలరించనున్నారు. మళ్లీ కొత్త రికార్డులు సృష్టిస్తారని ఆశిద్ధాం.  కొండంత అండగా ఆయనకు అభిమానులు ఉండగా, చిరంజీవికి రికార్డులకు కొదవేముంటుంది.


 - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


May 31, 2022

కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం

తమిళనాడులో మూడున్నరేళ్ల చిన్నారికి ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’జారీ చేసింది ప్రభుత్వం. తమిళనాడులో ఇటువంటి సర్టిఫికెట్ జారీ చేయటం తొలిసారి కావటం విశేషం.భారతదేశం విభన్న మతాల కలయిక..అందుకే భారత్ ను భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం గల దేశం అంటారు. అటువంటి భారత్ లో ఓ చిన్నారిని స్కూల్లో చేర్పించాలంటే కులానికి, మతానికి సంబంధించి కాలమ్‌ పూర్తి చేయాలి.ఆ చిన్నారి తల్లిదండ్రులు  కులానికి మతానికి సంబంధించి కాలం నింపేదిలేదని, పాపకు సీట్ ఇవ్వాలని అడిగారు. కానీ సదరు స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ పాపకు సీట్ ఇవ్వటానికి నిరాకరించింది.అలా మరికొన్ని స్కూళ్లకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది వారికి. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నారు. తమిళనాడులో తొలిసారిగా ఆ పాపకు కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ జారీ చేశారు.తమిళనాడు కేకే పుదూర్‌కు చెందిన ఎస్‌ నరేష్‌ కార్తీక్‌-గాయత్రి దంపతులు తమ మూడున్నరేళ్ల పాప  విల్మ కు ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’ పొందారు. ఫలితంగా ఆ చిన్నారి ఏ కులానికి, మతానికి చెందిన మనిషికానట్లే.

సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన 33 ఏళ్ల నరేష్ మాట్లాడుతూ.. కులమతాల పేరుతో తమ బిడ్డ ‘విల్మ’ను నిర్బంధించడం ఇష్టం లేక తన పేరున కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు. నిజానికి 1973లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పిల్లలను స్కూల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదు. ఈ విషయం వారికి తెలియదు. స్కూళ్లలో కూడా ఈ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. 1973, 2000వ సంత్సరంలో తమిళనాడు విద్యా శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. ‘కులం లేదు, మతం లేదు’ అని తల్లిదండ్రులు చెబితే కనుక ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టేందుకు ప్రజలను అనుమతించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్‌ను ఆదేశించింది.కానీ స్కూళ్లు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి.మతం, కులం కాలాన్ని నింపకుండా స్కూల్‌లో చేర్చుకోబోమని స్కూల్ యాజమాన్యాలు అవి నింపటం కచ్చితం అని తేల్చి చెప్పడంతో నరేష్ దంపతులు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్‌ను సంప్రదించారు. ఆయన కోయంబత్తూరు తహశీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారి సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడంతో కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి ‘నో రిలిజియన్-నో క్యాస్ట్’ సర్టిఫికెట్ జారీ చేశారు.

 కాగా, కుల, మత రహిత సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు తమ కుమార్తె అనర్హురాలిగా మారుతుందని తమకు తెలుసని ఆ అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు.తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. ‘మతం లేదు, కులం లేదు’ అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదని, ఇటువంటి ధ్రువీకరణ పత్రాన్ని పొందటానికి మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నానని నరేష్ తెలిపారు.

Jan 25, 2022

ఏపీలోని 26 జిల్లాలు

1. శ్రీకాకుళం – శ్రీకాకుళం

2. విజయనగరం – విజయనగరం

3. మన్యం జిల్లా – పార్వతీపురం

4. అల్లూరి సీతారామరాజు – పాడేరు

5. విశాఖపట్టణం – విశాఖపట్టణం

6. అనకాపల్లి – అనకాపల్లి

7. తూర్పుగోదావరి – కాకినాడ

8. కోనసీమ – అమలాపురం

9. రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం

10. నరసాపురం – భీమవరం

11. పశ్చిమ గోదావరి – ఏలూరు

12. కృష్ణా – మచిలీపట్నం

13. ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ

14. గుంటూరు – గుంటూరు

15. బాపట్ల – బాపట్ల

16. పల్నాడు – నరసరావుపేట

17.ప్రకాశం – ఒంగోలు

18. ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు

19. కర్నూలు – కర్నూలు

20.నంద్యాల – నంద్యాల

21. అనంతపురం – అనంతపురం

22.శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి

23.వైఎస్సార్ కడప – కడప

24.అన్నమయ్య జిల్లా – రాయచోటి

25.చిత్తూరు – చిత్తూరు

26. శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి

Nov 1, 2021

రైతన్నకు బాసటగా ‘సమరభేరి’

గోలి మధు పుస్తక సమీక్ష

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల అన్నదాతల పోరాటం మొదలై పది నెలలు దాటింది. పోరాటంలో ఎంతోమంది రైతులు అసువులుబాశారు. ఈ నెలలో కూడా లఖింపూర్ ఖేరిలో  శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులను ప్రభుత్వాలకు అనుకూల వర్గానికి  చెందిన రాక్షసమూక వాహనాలతో తొక్కించి నలుగురు రైతులతోపాటు ఓ జర్నలిస్టును, మరో ముగ్గురు సామాన్య వ్యక్తులను మొత్తం ఎనిమిదిమందిని హత్య చేసింది. ఈ హింసాత్మక ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా, అతని అనుచరులు నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. రైతుల ఆందోళనకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ కవి గోలి మధు కవితా సమరంతో సంఘీభావం ప్రకటించారు. రైతులు ఎంత ఆవేశంతో, ఆవేదనతో ఉద్యమం కొనసాగిస్తున్నారో అంతే తీవ్రస్థాయిలో ఉద్యమం మొదలైన తొలిరోజుల్లో మధు 25 రోజుల్లో 58 కవితలు రాశారు. రైతు సమరభేరి పేరుతో వాటిని పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. ఆ తరువాత కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలు రద్దు కాలేదు. ఉద్యమం ఉధృతమైంది. మధు కవిత్వ శైలి కూడా పదునెక్కి అదేరీతిలో కొనసాగుతోంది. మళ్లీ మరో 55 కవితలు రాశారు. మొత్తం 113 కవితలతో రెండో ముద్రణ కూడా తీసుకువచ్చారు. ఇటీవల మంగళగిరిలో ‘రైతు సమరభేరి’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. 2020 సెప్టెంబరు 15 ఒక బిల్లు, 17న రెండు బిల్లులు లోక్ సభలో ఆమోదం పొంది చట్టాలయ్యాయి. ఈ మూడు వ్యవసాయ చట్టాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టేచలిని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు దాదాపు పది నెలలుగాచేస్తున్న పోరాటం చరిత్ర సృష్టించింది. ఏ ప్రభుత్వమైనా రైతులకు లబ్ధిచేకూరేవిధంగా, పండిన పంటకు గిట్టుబాటుధర లభించే విధంగా వారికి రక్షణగాచట్టాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారికి సర్వవిధాల లబ్ధి చేకూరేవిధంగా, వారికిరక్షణగా, అండగా నిలిచే చట్టాలను రూపొందించింది. రైతులకు ఆదాయ పెంచడం, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఈ మూడు చట్టాలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. అయితే, చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణాధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. ఈ చట్టాలు రైతులకు మేలు చేసేవిలా కనిపించినా, బహుళజాతి సంస్థల చేతిలో రైతులు చిక్కుకునే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన. వీటి వల్ల చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని, రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతాయని వారి భయం. కార్పొరేట్  సంస్థలకు మేలు చేసేవిధంగా వీటిని చేశారని ప్రతిపక్షాల ఆరోపణ.అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి  వెళతాయన్నది వారి వాదన. ఆచరణలో వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉండదని  చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు  చట్టబద్దతలేదు. కనీస మద్దతు ధర అమలుకాకపోతే కోర్టును ఆశ్రయించే  అవకాశం కూడాలేదు. ఈ నేపథ్యంలో రైతుల పోరాటాన్ని, పోరాటంలో  మృతి చెందిన రైతులను చూసి గోలి మధు చలించిపోయారు. సామాజిక స్ప హతో తన  వంతుగా స్పందించి కవితా సమరం కొనసాగిస్తున్నారు. రైతులు అక్కడ సమరభేరి మోగిస్తే, మధు ఇక్కడ కవితా సమరభేరి మోగించారు. తన కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడానికి నడుం బిగించారు. రైతు శ్రమని అర్ధం చేసుకొని  రైతాంగం ఉద్యమానికి తన వంతు అండగా నిలిచారు. రైతుకు సేద్యం, స్వేదం చిందించమే తెలుసు, కార్పొరేట్ శక్తుల వలే మోసం చేయడం తెలియదని తన కవితల ద్వారా ఎలుగెత్తి చాటారు. మధు వృత్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో వర్క్ ఇనస్పెక్టర్, ప్రవత్తి మాత్రం సామాజిక  స్ప హతో రచనలు చేయడం. ముఖ్యంగా కవిత్వం రాయడం. ఈ మధ్య కాలంలో రైతు ఉద్యమంపై కనీసం ఓ కవితన్నా రాయనిదే మధుకు నిద్రపట్టదు. చట్టాల నిర్మూలనే లక్ష్యమని, అప్పటివరకు పోరు ఆగేదిలేదని రైతుబాంధవులు వేస్తున్న అడుగులు విశ్వానికి వెలుగు రేఖలని... కలుపు మీద చేసే  పోరు స్ఫూర్తిగా పురుగుపుట్రపై చూపే తెగువే ఆయుధంగా... హస్తినలో తిరగబడ్డాడు రైతు ... నేను సైతం అని గోలి మధు తన కవితలతో కదంతొక్కారు. బతుకు చిత్రం తిరగబడి, రైతు జీవన చిత్రం ఛిద్రమౌతుంటే రైతు పేరిట సొమ్ముచేసుకున్న విశ్వాసమైనాలేక సంఘీభావమే కరువాయే... అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతకు మూడు వ్యవసాయ బిల్లుల బాణాలు గుచ్చుకుని విలవిలలాడుతుంటే వారి ఓట్లతో అధికారం చేపట్టిన వారికి రైతుల పట్ల దయలేదని, ఆకలి తీర్చేది రైతు, ఆకలి తీర్చుకుని అణగదొక్కేది పాలకవర్గం అని  ఆక్రోశం వెళ్లగక్కారు. ధర్మాగ్రహానికి దుర్మార్గం తలవంచక తప్పదులే అన్న భావనతో మధు ఉన్నారు. చైతన్యం ప్రవాహమై గడ్డకట్టే చలిలో కూడా నిలిచిన రైతు బాంధవులకు శిరసాభివందనం చేశారు. నల్లచట్టాల నిర్మూలనకై ఉపక్రమించిన పరాక్రమానికి అక్రమార్కుల విధ్వంసంపై ధ్వజమెత్తిన రైతు పిలుపు చరిత్రలో మరో మలుపని చాటారు. ముదనష్టపు మూడు వ్యవసాయ బిల్లులు అమలైతే కనిపించే అవసరాలకు కార్పొరేట్ దిక్కైతే పులినోట చిక్కే బతుకే రైతు బతుకు అని అద్వితీయంగా రాశారు. ఈ బిల్లులు అమలైతే రైతుకే కాదు మానవాళికీ పగులుతుంది మాడు అని హెచ్చరించారు. గజగజ వణికించే చలిలో గిజగిజలాడుతూ అన్నదాతలేమో ఊపిరి వదులుతూ ఉద్యమాల బాటలో వెలిగిపోతోంది భారతావని అని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలితో చెలిమి చేస్తూ... సమరం చేస్తున్న రైతుకు ఒక్కొక్క సంఘీభావపు పలకరింత వారికి పులకరింతై మదగజాన్ని తరిమివేసే శక్తినిస్తుందని కవితీకరించారు. హస్తినలో బిగిసిన పిడికిలి ఎర్రకోటను ఉక్కిరిబిక్కిరిచేయక మానదని ముందేచెప్పారు. కార్పొరేట్ల చెరలోకి నెట్టివేయబడుతున్నది ఒక్క రైతే కాదుదేశభవిత కూడా అని హెచ్చరించారు. మొన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఆ తరువాత  రైల్వే ఒక్కొక్కటి వడివడిగా కార్పొరేట్ల కౌగిలిలో ఒదిగిపోతుందని  ఆందోళన వ్యక్తం చేశారు. అపార వనరులు కార్పొరేట్లపరమై ప్రభుత్వ సంస్థలన్నీ బడాబాబుల సంకల్లోకి దూరుతున్నాయన్న వాస్తవాలను  తెలియజెబుతూ జనంలో చైతన్యాన్ని నింపుతున్నారు. పుడమి పుత్రుల ప్రాణత్యాగాలకు, సంకల్పబలానికి ప్రపంచమే నివ్వెరపోతుందన్నారు. ఆవేదన అగ్నికణమై, ఆలోచన అంకుశమై పాలకుల్ని నిలువరించేదే.. అదే అదే హస్తినలోని అన్నదాత హోరన్నారు. దేశద్రోహలంతా దేశభక్తులై అధర్మాన్ని పరాకాష్టకు చేర్చారని, చావులెన్నైనా సడలని పోరు, మిషన్ గన్నులు లేవు,పాలకుల అండదండలులేవు, ఐనా మానవాళికి దిశానిర్దేశం చేసే దిశగా సాగుతున్న పోరని విశ్లేషించారు. చలిలో పెద్దపులులై పోరాడుతూ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రైతన్నల త్యాగాలకు సలాం సలాం లాల్ సలాం అని కొనియాడారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలపని, సంఘీభావం ప్రకటించని నటచక్రవర్తులకు, సినీ పెద్దలకు, చివరకు మీడియానుకూడా వదలకుండా అందరికీ మధు తనదైన శైలిలో చురకలంటించారు. రైతు సమరభేరికి  చేయూతగా నిలవాలని, కళ్లు తెరవండి తరలిరండి రైతు పోరుకు బాసటగా నిలవండి  భరతమాత పుత్రులారా రండి అని పిలుపునిచ్చారు మధు.

- ఎస్.భరత్