Aug 3, 2020

తెలుగులో విక్టోరియా మహారాణి బంగారు పతకం



ఇది కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి గారికి విక్టోరియా మహారాణి ఇంగ్లాండులో చేయించి పంపిన బంగారు తెలుగు పతకం. దీనికి వెనుకవైపు తెలుగు అక్షరాలు, తెలుగు అంకెలున్నాయి. ఈ అక్షరాలు చాలా స్పష్టంగా చక్కగా చదవటానికి రాశారు. "1866 (౧౮౬౬) సంవత్సరములో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా వుండిన తన స్వదేశస్థుల పట్ల జరిగించిన వుత్కృష్టమయిన ఔదార్యమునకు గాను హర్ మెజస్టీ రాణి గారి వల్ల చేయబడిన శ్రేష్ఠమయిన గణ్యతకు ఆనవాలుగా బుడ్డావెంగళరెడ్డి గారికి బహుమానము ఇయ్యబడ్డది."అని ఉంది. తెలుగు అక్షరాలతో బంగారు పతకం లండన్ లో చేయించి ఆంగ్ల పాలకులు ఇవ్వటం అద్భుతమే.
పతకం మన పూర్ణకుంభాన్ని పోలి ఉంది. మన రాజులు ఏర్పరచుకున్న రాజముద్రలు, పూర్ణకుంభాల రూపాలను కూడా బ్రిటీష్ పాలకులు అంత్యంత నిశితంగా గమనించి ఆయా ప్రాంతాల ప్రజల భాషలతోపాటు సంస్కృతీ చిహ్నాలను కూడా స్వీకరించి వాటి రూపాలలోనే పతకాలు కూడా ప్రదానం చేశారు.  పాలనలో తెలుగు అమలు చేసిన విషయంలో మన వాళ్ళకంటే బ్రిటీష్ పాలకులే కొంత నయమనిపించారు.




Jul 1, 2020

ద‌ప్పిల‌మ్మ త‌ల్లి



Goddess Dappilamma thalli statue at Nakkalagandi  village,  Yathirajupally - 516227, Balveer Mandalam in Kadapa district, Andhra Pradesh in India. Here is a  festival on the name of the  Goddess Dappilamma in every year on January 19th . It is famous festival in the area.

Jun 9, 2020

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

 సామాజిక అంశాలు, వ్యక్తిత్వాలు, మానవసంబంధాల సమాహారం


తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం అత్యున్నత స్థానంలో నిలుస్తుంది. అత్యధిక మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆసక్తి చూపుతారు. దానికి ప్రధాన కారణం సీనియర్ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎన్నుకునే వ్యక్తులు, ఇంటర్వ్యూ నిర్వహించే విధానం, శైలి.  ఈ కార్యక్రమం చరిత్ర, ఉన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలు, మానవసంబంధాలు, సామాజిక అంశాలు, తెలుగు నేల నాలు చెరుగుల గల సంప్రదాయాల సమాహారం. రాజకీయం, విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, శాస్త్ర, సాంకేతిక ... ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన మహోన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను ఇందులో ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ వ్యక్తులతోపాటు ట్రాన్స్ జండర్‌, ఇతర రాష్ట్రాల, ఇతర భాషల వారిని  కూడా ఇంటర్వ్యూ చేసి వారి జీవన విధానాన్ని, వారి అంతరంగాన్ని  ఆవిష్కరించారు.  సమకాలీన సమాజంలోని మూడు తరాల వారిని, అలాగే ఒకే కుటుంబంలో మూడు తరాలవారిని కూడా  ఇంటర్వ్యూ చేశారు. బాధ్యతలు తెలిసి, విలువలు కలిగిన ఎంతోమంది మహోన్నత వ్యక్తుల అంతరంగాలను మనకు చాలా దగ్గరగా చూపించారు. స్వాతంత్ర్య పోరాటం, మానవ జీవితంలో వడిదుడుకులు,  సాధారణ స్థాయి నుంచి ఓ వ్యక్తి ఉన్నత శిఖరాలకు అధిరోహించడం, వ్యాపార లావాదేవీలు, వ్యక్తుల ఉద్ధాన పతనాలు, వ్యవసాయం, వ్యాపారం, సినిమా ఒకటేమిటి అన్ని రంగాలలో వచ్చిన, వస్తున్న మార్పులకు ప్రత్యక్ష సాక్షులు మనకి వివరిస్తారు.  
జర్నలిస్టు విలువలను కాపాడుతూ  ప్రతి ఒక్కరిని నొప్పించకుండా ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా, సౌమ్యంగా, సన్నిహితంగా తనదైన శైలిలో  ప్రశ్నిస్తూ వారి మనసులను ఆవిష్కరించడం ఆర్కే ప్రత్యేకత.

రాజకీయాలలో కురువృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు వందేళ్ల యడ్లపాటి వెంకట్రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, జయపాల్ రెడ్డి,  జేడీ లక్ష్మీనారాయణ, చెన్నమనేని రాజేశ్వరరావు, కొడుకు రమేష్, సోదరుడు విద్యాసాగర్ రావు, గాలి జనార్ధన రెడ్డి, ఏకె పాల్, డి.శ్రీనివాస్, అసదుద్దీన్ ఓవైసీ, అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణ,  భూమా నాగిరెడ్డి, ఆనం సోదరులు,  భూమన కరుణాకర రెడ్డి, దేవినేని నెహ్రూ, సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు,  అప్పటి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ చివుకుల ఉపేంద్ర, సినిమా రంగం నుంచి  దగ్గుబాటి రామానాయుడు, కొడుకు సురేష్, మనవడు రానా, అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, అమల, కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు, అశ్వనీదత్, బాపయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అనంత శ్రీరామ్, అలనాటి నటీమణులు కేఆర్ విజయ, వాణిశ్రీ, గీతాంజలి,  నేటి తరం హీరోలు, హీరోయిన్స్ అనుష్క, కమెడియన్ ఆలీ, డాక్టర్ సమరం, కంచ ఐలయ్య, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, హైదరాబాద్ యూనివర్శిటీ వీసీ అప్పారావు, ఏసీబీ డీజీ ప్రసాద రావు, మాజీ డీజీపీ అరవిందరావు, ఇన్ఫోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బివిఆర్‌ మోహన్‌ రెడ్డి,  శాంతా బయోటెక్ కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, బిజినెస్‌ స్టాండర్డ్‌ ఎడిటర్‌ సంజయ్‌ బారు,  విజ్ఞాన్ రత్తయ్య, హోమియోపతి వైద్యులు పావులూరి కృష్ట చౌదరి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ, యండమూరి వీరేంద్రనాథ్, నేరెళ్ల వేణుమాధవ్, శోభానాయుడు, వీరంగంశ్యామల, వంగపండు ప్రసాద రావు,  డాక్టర్ గురవారెడ్డి .. ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని ఇంటర్వ్యూ చేశారు.

ఉస్మానియాలో హానరీ పోస్టులో నెలకు రూపాయి జీతానికి పని చేసిన నిమ్స్ కు డైరెక్టర్ (డాక్టర్ కాకర్ల సుబ్బారావు) కావడం, అమెరికాలో ఎన్టీఆర్ కు పరేషన్ చేసినవారందరూ ఇండియన్సే, మరో జన్మంటూ ఉంటే ఐపీఎస్‌గానే పుడతా(ఏకే మహంతి), తండ్రీ కొడుకులు ఐపీఎస్ లే, సైన్స్‌ లాంటివి ఇంగ్లీషులో చెప్పి,సోషల్‌ లాంటివి తెలుగులో చెప్పాలి(అరవింద్ రావు), సిద్ధాంతాలను నిజంగా నమ్మితే వాళ్లను ఏ పరిస్థితులూ చెడగొట్టవు- ఎన్టీఆర్‌ సుప్రీం. చిరంజీవి మీద చాలా ప్రభావాలున్నాయి(డాక్టర్ మిత్రా),

తెలుగు మాట్లాడలేకపోవడం పెద్ద లోపం. తెలుగు నేర్చుకోవడం కోసం ఒక ట్యూటర్‌ను పెట్టుకున్నాను(అసదుద్దీన్ ఓవైసీ), ప్రపంచ బ్యాంకు నుంచి అత్యంత ఎక్కువ అప్పు తీసుకున్న దేశం అమెరికాయే(2013), శృంగారం చూపించకుండా ఏ కళా లేదు(స్వాతీ సోమనాథ్), నవ్వించడం ఒక భోగం,నవ్వడం ఒక యోగం,నవ్వలేకపోవడం ఒక రోగం. చాలామంది డాక్టర్లు ఆ రోగం తెచ్చిపెట్టుకుంటారు(డాక్టర్ గురవారెడ్డి), గ్రంథి మల్లికార్జున రావు.

 కార్యక్రమ ప్రాధాన్యత, ఆర్కే ప్రశ్నించే తీరు, ఆయా వ్యక్తుల నిజాయితీ వల్ల గానీ 90 శాతానికిపైగా వ్యక్తులు తమ అంతరంగాలను ఆవిష్కరించారు. మనసులోని భావాలను బాహాటంగా, ధైర్యంగా, స్పష్టంగా చెప్పారు. మనసు విప్పి నిజాయితీగా మాట్లాడారు. బహిరంగంగా చెప్పదగినవి, చెప్పకూడానివి కూడా చెప్పారు. అయితే  లక్ష్మీ పార్వతి, మంచు లక్ష్మి మాత్రం చాలా కృత్రిమంగా, నాటకీయంగా మాట్లాడినట్లనిపించింది.  

 భవిష్యత్‌లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంశం తీసుకొని విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తారు. జర్నలిజం, చరిత్ర, ఎలక్ట్రానిక్ మీడియా ... తదితర విభాగాలలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. వివిధ రంగాలలో నిష్ణాతులైన మహోన్నత వ్యక్తుల  ఇంటర్వ్యూలన్నిటినీ భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు నిక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో అరుదుగా దొరికే  ఇటువంటి వాటిని విశ్వవిద్యాలయాలు బాధ్యత తీసుకొని భద్రపరుస్తాయి. ఆ విధంగా మన దేశంలో కూడా చేస్తారని ఆశిద్ధాం.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

 

Jun 5, 2020

నా జీవితం యువ‌తకు ఆద‌ర్శం

శ్రీమ‌తి కోమ‌ల్, ఐఏఎస్‌

              మాది గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న సమర్ కుండ్ల. నాన్న టీచర్ . ఆ ప్రాంతంలో అమ్మాయిలపట్లవివక్ష ఉన్నా మా నాన్న మాత్రం బాగా చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన టీచర్ కావడంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో నేనెప్పుడూ చదువులో ముందుండే దాన్ని. పదో తరగతి, ఇంటర్ గుజరాతీ మాధ్యమంలో పూర్తి చేశాక రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివా. ఆ తరవాత మూడు వేర్వేరు యూనివర్సిటీల నుంచీ సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో బీఏ లిటరేచర్ పూర్తిచేశా. ప్రైమరీ టీచర్ ట్రైనిం!గ్ సర్టిఫికెట్ కూడా పొందా. అప్పటికే నాకు ఇరవై ఐదేళ్లు నిండాయి. మా బంధువులూ, ఇరుగుపొరుగు వారూ ‘ఇంకాఎన్నాళ్ళుచదివిస్తారు... మీ అమ్మాయికి #పెళ్ళిచేస్తారాఅసలు’ అని వెటకారంగా మాట్లాడేవారు. నేను పట్టించుకోకుండా సివిల్స్ పైన దృష్టి పెట్టా. ఇంతలో మ్యారేజ్ బ్యూరో ద్వారా రాజ్ కోట్ నుంచి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి #న్యూజిలాండ్ లో ఉద్యోగం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తులూ ఉన్నాయి. ‘నాకూతురువిదేశాల్లోస్థిరపడుతుంది’ అనుకున్నారు నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. నేనూ న్యూజిలాండ్ జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అక్కడకు వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే- తమకిచ్చిన కట్నం_చాలదనీ అదనంగా మరికొంత కట్నం డబ్బూ, బైకూ, కారూ తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. ‘నాన్నది చాలీచాలని జీతం. అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేద’ంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మానాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధ పడతారని చెప్పేదాన్ని కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా వాళ్లడిగినవి తేకుండా ఉండటంతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఒక రోజు రాత్రి... నన్ను ఇంటి బయట పడుకోమని, నేను నిద్రపోయాక కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకుని నా భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.

అతడిని_శిక్షించాలని...

కాళ్ల పారాణి ఆరకముందే... పెళ్లైన పదిహేను రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి చేరాల్సి వచ్చింది. నేను ఒంటరిగా వెళ్లడం చూసి బెంగతో వచ్చాననుకున్నారు అమ్మానాన్నలు. నేను చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. నా భర్త మనసు మార్చుకుని తిరిగి వచ్చాడేమోనని మధ్య మధ్యలో మా అత్తారింటికి వెళ్లి చూసి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండ్ లో అతడి వివరాలు తెలియలేదు. అతడు నన్ను అంత అవమానకరంగా వదిలేసి వెళ్లిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. కట్నం కోసం, కారు కోసం నన్ను వదిలేశాడనే బాధకంటే మోసం చేశాడనే కసే నాలో పెరిగింది. ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని మ్యారేజీ బ్యూరోని సంప్రదించా. ‘పెళ్లి కుదర్చడం వరకే మా పని’ అంటూ వారు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని అమ్మ గోల చేసింది. చివరికి న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మెయిల్ కూడా పెట్టా. నెలలు గడిచినా ఎవరూ స్పందించకపోయేసరికి గవర్నర్ జనరల్ కు లేఖ రాశా. ‘అతనెవరో తెలుసుకుంటాం’ అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్యా తీసుకోలేదు. నా నిస్సహాయ స్థితికి బాధేసింది. దాదాపు ఆరునెలలపాటు తిండీ, నిద్రా మరచి జీవచ్ఛవంలా బతికా. ఏడ్చీ ఏడ్చీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. రోజులు గడిచే కొద్దీ నాకు నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టా. అటకెక్కిన పుస్తకాలు బయటకు తీశా. చదువు గురించి తప్ప మరో ఆలోచన చేయదల్చుకోలేదు. కానీ నేను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. భర్త మోసం చేయడంతో పుట్టింటికి తిరిగొచ్చిన కూతుర్ని ఆదరించడం తమ బాధ్యతని అమ్మానాన్నలు అనుకున్నా మా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. నా వల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతోందని సాధించేది. ఇరుగుపొరుగు వాళ్లూ రకరకాలుగా మాట్లాడేవారు. ఎంత పట్టించుకోవద్దనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు మనసును నలిపేసేవి. ఆత్మాభిమానం చంపుకుని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది.

అందరికీ_దూరంగా...

నా కాళ్ళమీద నేను నిలబడాలని టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మా సొంతూరుకు యాభై కిలోమీటర్ల దూరంలోని భావ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా ఉద్యోగమొచ్చింది. ఒంటరిదాన్ని కావడంతో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఓ స్టూడెంట్ తల్లిదండ్రులకు నా గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకి ఇప్పించమని అడిగా. వాళ్లింట్లోనే ఓ గది అద్దెకిచ్చారు. పగలంతా టీచర్ గా పని చేస్తూ సివిల్స్ సాధన మొదలుపెట్టా. కానీ ఆ పల్లెటూళ్ళో ఇంటర్నెట్ , స్మార్ట్ ఫోన్లూ, ఇంగ్లిష్ పత్రికలూ, ల్యాప్ టాపులూ... ఏవీ అందుబాటులో ఉండేవి కాదు. నాకు టీచర్ గా వచ్చేది ఐదు వేల రూపాయల జీతం. అది నెల గడవడానికి తప్ప పుస్తకాలు కొనుక్కోడానికి సరిపోయేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసినవాళ్లు అహ్మదాబాద్ లో ప్రభుత్వం సివిల్స్ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్ పటేల్ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళితే వారాంతంలోనూ శిక్షణ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శనీ, ఆదివారాలు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని చేరిపోయా. కానీ భావ్ నగర్ నుంచి నాలుగు బస్సులు మారి నూట డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యేది. ఊళ్ళో చాలామంది ‘ఈ అమ్మాయి చదువుకే వెళుతుందో ఇంక దేనికన్నా వెళుతుందో’ అంటూ సూటిపోటి మాటలనేవారు. ఉబికివచ్చే కన్నీళ్ళను గుండెల్లోనే అదిమిపట్టి చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. నా జీవితమే ఇలా ఎందుకైందని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. మానసికంగా శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక నాల్రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కానీ ఒక్కపూట స్కూలు మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూలుకెళ్లడం కానీ, కోచింగుకు వెళ్ళడం కానీ మానలేదు.

నాలుగుప్రయత్నాలుచేసి...

2009లో మొదటిసారి యూపీఎస్ సీ ప్రవేశ పరీక్ష రాశా. ఉద్యోగం, ట్రైనింగ్ కోసం ప్రయాణాల వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయింది కానీ నేను నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకున్నా. రెండోసారి మాత్రం పట్టుదలతో రాశా. ర్యాంకు వస్తుందని ఆశపడ్డా. కానీ మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధనిపించింది. పైగా నా గురించి తెలిసిన వాళ్లు ఫలితాలొచ్చిన ప్రతిసారీ ‘ఐఏఎస్ అంటే అంత ఈజీనా... నీకు ఎప్పుడు రావాలీ...’ అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకి బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయా. అమ్మ ఒళ్లో తల పెట్టుకుని ఏడవాలనిపించింది. కానీ, ఓడిపోయి కన్నీళ్లతో ఆ గుమ్మం తొక్కి నలుగురిలో పలచన కాకూడదని నన్ను నేనే సముదాయించుకున్నా. చివరి ప్రయత్నంగా మరొక్కసారి పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. మూడు ప్రయత్నాల్లో చేసిన తప్పులేంటో విశ్లేషించుకున్నా. ప్రిపరేషన్ పరంగా బలాలూ, బలహీనతల్ని జాబితాగా రాసుకున్నా. బలాలు మరింత పెంచుకుంటూ బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేశా. కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు ఆ కాస్త నిద్ర కూడా పట్టేది కాదు. పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఒక యుద్ధమే చేశా. 2012లో పరీక్ష రాశా. ఈసారి అంచనా తప్పలేదు. 591వ ర్యాంకు వచ్చింది. ఐదేళ్ళపాటు నేను పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్ళు ఓ పట్టాన ఆగలేదు.
ర్యాంకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది...
అమ్మానాన్నా ఇంటికి రమ్మన్నారుగానీ నేను అట్నుంచి అటే ముస్సోరీ శిక్షణ కేంద్రానికి వెళ్లా. ఆ శిక్షణ పూర్తిచేసుకున్నాకే- ఐదేళ్ల తర్వాత- అమ్మావాళ్లింటికి వెళ్లా. నా గురించి తెలిసి మా ఊళ్లో వాళ్లంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వారే మా పిల్లలకి నువ్వే ఆదర్శమంటూ తెగ మెచ్చుకున్నారు. అప్పటి వరకూ భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్స్ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. శిక్షణ అయ్యాక దిల్లీలో డీఆర్ డీవో(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ )లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం డీఆర్ డీవో డైరెక్టర్ హోదాలో ఉన్నా. ఈ ఆరేళ్లలో అమ్మానాన్నల అప్పులన్నీ తీర్చా. అన్నయ్య మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూశా. కుటుంబమంతటినీ విమానంలో దేశవిదేశాలన్నీ తిప్పా. అంతేకాదు సివిల్స్ సాధించాక మా అత్తింటి వాళ్లు రాజ్ కోట్ వచ్చారని తెలిసి అక్కడికి వెళ్లా. ‘జరిగిందేదో జరిగిపోయింది మమ్మల్ని క్షమించు’ అంటూ మా అత్తగారు నా కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది. నాకు మాత్రం వాళ్లని వదిలిపెట్టాలనిపించలేదు. కానీ మా నాన్న ‘గౌరవమైన హోదాలో ఉన్నావు. కేసులూ, గొడవలని మనసు పాడుచేసుకోకు. విడాకులిచ్చెయ్ ’ అని చెప్పారు. అలానే చేశా. నాలుగేళ్ల క్రితం ఓ ఉన్నతస్థాయి వ్యక్తి నన్ను ఏరి కోరి పెళ్లాడాడు. మా పాపకిప్పుడు రెండున్నరేళ్లు. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించే వారికి నేను చెప్పేది ఒక్కటే- నన్నూ నేను పడిన కష్టాల్నీ సాధించిన విజయాల్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనీ, ధైర్యంగా అడుగు ముందుకు వేయమనీ...

ఐదేళ్లుఇంటిముఖంచూడలేదు!
పరీక్షలు తప్పితే... ప్రేమలో విఫలమైతే... కాపురంలో మనస్పర్ధలొస్తే...ఆత్మహత్యే పరిష్కారమనుకుంటారు చాలామంది. ఒక్క కారణం చూపి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు కానీ, ధైర్యంగా బతికి చూపడానికి వందల దారులుంటాయని మర్చిపోతారు. కోమల్ గనత్ర మాత్రం అలా చేయలేదు.కష్టాలు దాటుకుని సివిల్స్ ర్యాంకు సాధించి గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకుని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్ ఎందరికో ఆదర్శం.
నాకు రోజుకి కనీసం ఓ ఇరవై ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటిలో ‘మా కాలేజీకి లేదా స్కూల్ కి మోటివేషనల్ స్పీకరుగా వచ్చి మీ జీవితపాఠం చెబుతారా’ అని అడిగే కాల్స్ పదైనా ఉంటాయి. సమయం కుదిరితే తప్పకుండా వెళ్లి నా గురించి చెప్పొస్తుంటా. ఇలా రోజూ నాకు ఫోన్లు రావడానికి కారణం నేను ఆరేడు నెలల క్రితం ‘జోష్ టాక్స్ ’ అనే యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే. అది చూసి వివిధ పత్రికలు నా గురించి రాశాయి. ఫలితమే- పలు విద్యాసంస్థలూ సివిల్స్ కోచింగ్ సెంటర్లూ మోటివేషనల్ స్పీకరుగా నన్ను ఆహ్వానించడం. ఈ మధ్యనే గాంధీనగర్ , బొంబే ఐఐటీల నుంచీ పిలుపొచ్చింది. త్వరలోనే ఆ విద్యార్థులకీ నా గురించి చెప్పబోతున్నా....
నేను చెప్పేది.
========
1.మహిళలను తక్కువగా చూడొద్దు
2.విదేశాల సంబంధాలు అని మురిసిపోవద్దు
3.ఓటమికి నిరుత్సాహ ప‌డ‌వ‌ద్దు
4.ఇరుగుపొరుగు  మాటలు అసలు పట్టించుకోవద్దు.

May 1, 2020

కొన్ని పదాలు

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) : వాస్తవాధీన రేఖ

లద్దాఖ్

లఖనువా

బిహార్

పరేడ్

అఫ్ఘానిస్థాన్

ట్విటర్

ట్వీట్

గ్రీన్ ఛాలెంజ్

ఛేదించడం

చత్తీస్ గఢ్

విద్యుత్తు

పుణె

పట్నా

హరియాణ

భవిష్యత్తు

ప్రాధాన్యం

కట్టడి ప్రాంతాలు

చార్జీలు

జార్ఖండ్

అసోం

చైర్మన్

శశిధర్ రెడ్డి

ట్వీట్

ట్విటర్

హయాత్ నగర్

వెబినార్

బిహార్

పశు సంవర్థక శాఖ

రబీ  - యాసంగి

కొహెడా

మేఘా ఇంజనీర్్స

దుబాయ్

ఇన్ ఫెక్సస్ డిసీజెస్

అర్ణబ్ గోస్వామి

తబ్లీగీ జమాత్

ఒడిశా

నాగ్ పూర్







Apr 21, 2020

క‌రోనా వైర‌స్ - జ‌ర్న‌లిస్టుల‌పై ప్ర‌భావం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి సంద‌ర్భంగా దేశంలో 24 గంట‌లూ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేసేవారు  వైద్య‌, పారిశుద్ధ్య‌, పోలీస్‌, మిడియా సిబ్బంది. వీరితోపాటు విద్యుత్, గ్యాస్ స‌ర‌ఫ‌రా, ఇత‌ర డెలివ‌రీ సిబ్బంది కూడా సాధార‌ణ ప‌నివేళ‌ల్లో ప‌ని చేస్తున్నారు.  కానీ వీరంద‌రిలో తీవ్రంగా న‌ష్టపోతున్న‌ది జ‌ర్న‌లిస్టులే. వీరు 24 గంట‌లూ అటెన్ష‌న్‌లో ఉండాలి. నిద్ర‌పోతున్నా లేచి ప‌రిగెత్తాలి. కొన్ని సంద‌ర్భాల‌లో వీరి ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంటుంది.  వీరు త‌మ బాధ‌లు మ‌రొక‌రికి చెప్పుకోలేరు. చెప్పినా తీర్చేవారు లేరు. ఇది నా అనుభ‌వంతో చెబుతున్నాను. సామాజిక బాధ్య‌త‌కు, వృత్తి ధ‌ర్మానికి నిబ‌ద్ధులు వీరు. అంద‌రినీ హైలెట్ చేస్తారు. వీరిని హైలెట్ చేసేవారు లేరు. వీరి ఆర్థిక ప‌రిస్థితులు మెరుగుప‌డే మార్గం క‌నిపించ‌డంలేదు.  క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితుల ప్ర‌భావం వీరిపై తీవ్రంగా ప‌డే ప్ర‌మాదం ఉంది.
- శిరందాసు నాగార్జున‌

Apr 1, 2020

కన్నీటి కెరటాల వెన్నెల

- తాడి ప్రకాష్

 మనశ్శాంతిలేని రోజులివి. దినపత్రికలు మనల్ని భయకంపితుల్ని చేస్తాయి. వ్యాస్ శవాన్నీ, నెత్తురోడే శంకర్ శవాన్నీ పొద్దున్నే మనింటికి మోసుకొస్తాయి. డిస్టర్బ్ చేస్తాయి. చల్లని ఉదయాన ఆలోచనల్ని పదునైన బ్లేళ్లతో చీరేస్తాయి. కొందరు డాక్టర్లు ఆపరేషన్ చేసి పొట్టలో సూదులో, గాజుగుడ్డలో మరిచిపోతారు. కొందరు దగుల్బాజీలు రేప్ చేసిన ఒక పిచ్చితల్లి.. గర్భవతై రోడ్లపై రికామీగా తిరుగుతుంటుంది. కోడల్ని కిరోసిన్ పోసి తగలబెట్టిన హంతకులు రెండో కట్నం కోసం పెళ్లి చేసుకుంటున్న సుపుత్రుణ్ణి చిర్నవ్వుతో ఆశీర్వదిస్తుంటారు. కూరగాయలు కొనుక్కోవడానికెళ్లిన ఒక మధ్య తరగతి జంటని మతం పేరు చెప్పి కొందరు కత్తులతో కుమ్ముతారు. సోమాలియాలో ఆకలి ఆకలి అంటూ రోజుకో యాభై మంది చొప్పున నేలరాలిపోతుంటారు. ఒక జర్నలిస్టుని కాల్చి చంపి, ‘‘వాడు నక్సలైట్’’ అని పోలీసులు వెకిలిగా నవ్వుతారు. లాకప్ లో రిక్షావాణ్ణి కొట్టి చంపి ‘‘వాడు పాత కేడీ’’ అంటారు. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న దేశంలో ఒక సగటు సినిమా నటుడు సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటాడు. వడ్డాది పాపయ్యలాంటి కళాకారుడు దిక్కూమొక్కూ లేకుండా ఓ పూరింట్లో ప్రాణాలు విడుస్తాడు. హృదయంలేని సమాజంలో ఇమడలేక బంగోరేలాంటి నిండైన మనిషి ఎక్కడో సట్లెజ్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. జయలలితకి జ్వరం వచ్చిందంటే ఒక వెర్రిబాగుల తమిళ సోదరుడు ఆత్మాహుతి చేసుకుంటాడు.

హింస! హింస!!
సిటీ బస్సు ఎక్కడమూ హింసే!
ఎల్.కే.జీ సీటు సాధించడమూ హింసే!
సినిమాలూ, ఉద్యోగాలూ, పెళ్లిళ్లు, సంసారాలు, విప్లవం, సాహిత్యం అంతా హింసే!
బతుకునిండా నిండిపోయింది హింస!
ఇంత వత్తిడీ, ఉద్రిక్తతా, సంఘర్షణావున్నా... ‘‘కులాసాగా వుండటానికి అలస్కా దాకా అవకాశం ఉంది’’ అన్న దేవరకొండ బాలగంగాధర తిలక్ మాటలు మధ్య తరగతి వాడి భుజం తడతాయి. ఇంత వినోదం కోసం ఓ తెలుగు సినిమాకు వెళతాడు. బయట కొచ్చేసరికి అతని కాళ్లకు గిట్టలు మొలుస్తాయి. నెత్తికి కొమ్ములు వస్తాయి. ఇల్లు చేరితే టీవీలో తెలుగు సీరియల్ వస్తూ వుంటుంది. దాంతో ఈ పిరికి, మురికి బతుకు మీద జాలిపడే సహనమూ నశిస్తుంది. ఆ క్షణంలో ఆత్మహత్యలు చేసుకొనే ధైర్యవంతులను చూస్తే ఈర్ష్య కలుగుతుంది.
ఇంత దుర్భర, దుస్సహ, దుర్మార్గ జీవనంలోనూ ఓ చమత్కారం ఉంది. ఒకింత ఆనందాన్ని ఒడిసిపట్టుకొనే దారి వుంది. ఒక హాయియైన నవ్వు్కీ, సంతోషానికీ, నిశ్చింతకీ... అయ్యయ్యో తిలక్ చెప్పినంత అవకాశం వుంది. దీని కోసం హిప్నటిస్టుల్నీ, హిచ్ కాకుల్నీ కలవాల్సిన అవసరం లేదు.
వణికించే ఉదయాన విడిపోయే తెలిమంచు తెరల సౌందర్యాన్ని తనివి తీరా చూశారా? పొద్దున్న నిద్ర లేవగానే కుమార గంధర్వ గానాన్ని హృదయం ఇచ్చి విన్నారా ఎప్పుడన్నా? ‘ఆనా కెరినినా’ పుస్తకం చివరి పేజీలు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారా? గిరిజన వీరుడు ‘బిర్సాముండా’ డాక్యుమెంటరీ చూసి కదిలిపోయారా? రే ‘పథేర్ పాంచాలి’లో ఆ ఇద్దరు పసి బిడ్డలూ రైలును చూడ్డం కోసం పొలాలకు అడ్డంపడి పరిగెత్తడంలోని అందాన్ని అనుభవించారా? ‘హమ్ జీకే క్యా కరేంగే’ అనే సైగల్ గొంతులోని విషాద మాధుర్యాన్ని గుండెలో నింపుకున్నారా? ‘నాలో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ ప్రజాసేవ చేస్తాను’ అని ఎన్టీఆర్ ఎప్పట్లాగే మాట్లాడితే, వళ్లు మండిన ఒక జర్నలిస్టు ఆ వార్తకి ‘యావజ్జీవ ప్రజాసేవ’ అని శీర్షిక పెట్టడంలో ప్రొటెస్ట్ నీ, వ్యంగ్యాన్నీ ఎంజాయ్ చేశారా? పొరపాట్న ఒక్క రోజు తాగడం మానేసి, టైంకి ఇల్లు చేరుకున్నప్పుడు ఆ వెర్రి ఇల్లాలి కళ్లల్లో సంతృప్తీ, వెలుగూ చూసి సిగ్గుపడ్డారా? ‘బాధలన్ని తీసి మీరు బాకులు సెయ్యండిరో’’ అని వంగపండో, గద్దరో పాడితే విని ఉత్తేజంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారా? తిరుమల కొండమీద తెల్లవారుజామున ఎమ్మెస్ సుప్రభాతాన్ని మోసుకొచ్చే చల్లగాలి పరిమళాన్ని ఆస్వాదించారా? అల్లరిగా తిరుగుతూ గూడుకట్టే పిచికల్నీ, తల్లి రెక్కల కిందికి పారిపోయే కోడిపిల్లల్నీ, పాదాలు తాకుతూ తిరిగే చిన్నారి కుక్కపిల్లల్నీ చూడ్డంలోని మహదానందం మీకు ఎరుకేనా? ఎప్పుడన్నా చేలో రాత్రిపూట వెన్నెల్లో మంచె మీద పడుకున్నారా? వేరుశెనగ చేను గట్ల మీద మిత్రులతో కబుర్లు చెప్పుకున్నారా? చలికాలం అమ్మ పాత చీరని నాలుగు మడతలు పెట్టి కప్పినపుడు కళ్లు అప్రయత్నంగా చెమర్చడం మీకు తెలుసా? బాధతో కావలించుకొని ఏడ్చిన మిత్రుణ్ణి తలనిమిరి ఓదార్చే విలాసం మీకు కలిగిందా? ముష్ఠి యాభై రూపాయలకే నెలంతా నీ ఇంట్లో చాకిరీ చేసే పదేళ్ల పిల్లకి కొత్త గౌను కొనిచ్చే సాహసం ఎప్పుడన్నా చేశారా? ఆ దీనమైన కళ్లలో విభ్రాంతినీ, సంబరాన్నీ చూడాలనిపించిందా?
ఇదంతా బతుకే.
కమ్ముకున్న చిక్కని విషాదం తెరల మధ్య వెన్నెల రుతువులాంటి బతుకు. నానాటికీ నిస్సారమైపోతున్న ఆధునిక నాగరిక యాంత్రిక జీవనంలో కన్నీటి చెమలచుట్టూ చిర్నవ్వుల పూలు పూయించుకోగిలిగినప్పుడే బతుకు ధన్యమౌతుంది.
- తాడి ప్రకాష్
(ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సంపాదకీయం- 31, జనవరి 1993)