May 19, 2019


  అవసరమైతే అదనపు బలగాలు

కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ
  
       సచివాలయం, మే 19: రీపోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గుమిగూడకుండా చూడాలని, అవసరమైతే అదనపు బలగాలను పంపాలని కేంద్ర ప్రత్యేక పరిశీలకులు వినోద్ జట్షీ ఎన్నికల అధికారులకు చెప్పారు.  సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆదివారం ఉదయం ఆయన సందర్శించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాలను ఆన్ లైన్ లో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట పరిస్థితులను గమనించారు. ఒక కేంద్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండటాన్ని గమనించిన ఆయన ఓటర్లు ఎక్కువ మంది కేంద్రం లోపల ఉండకుండా చూడాలన్నారు. అవసరమైతే రిజర్వు పోలీస్ బలగాలను తీసుకోమని చెప్పారు.  ఏడు కేంద్రాలలో ఎక్కడ నుంచైనా ఫిర్యాదు ఫోన్స్ ఏమైనా వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఒక పోలింగ్ స్టేషన్ బయట టీడీపీ, వైసీపీ ఏజంట్లు గొడవ పడినట్లు జాయింట్ సీఈఓ నాగమణి తెలిపారు. ఏ విధమైన ఫిర్యాదులు అందలేదని చెప్పారు.  11 గంటలు దాటిన తరువాత ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్లు చెప్పారు. 11 గంటల సమయం వరకు ఏప్రిల్ 11 జరిగిన పోలింగ్ శాతానికి, ఇప్పుడు జరిగిన పోలింగ్ శాతానికి వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు.
              ఆ తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది, అదనపు సీఈఓ సుజాత శర్మలతో మధ్యాహ్నం వరకు కౌంటింగ్ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఓట్ల లెక్కింపు రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, తరువాత ఈవీఎంలు లెక్కించాలని, చివరగా వీవీప్యాట్స్ లెక్కించాలని వినోద్ జట్షీ చెప్పారు. 175 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్స్ ని తీసుకోవాలన్నారు. ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్స్ ఓట్లకు వ్యత్యాసం ఉంటే వి వీవీప్యాట్స్ ఓట్ల లెక్కింపునే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తుది ఫలితాలు వెల్లడించే ముందు ఓట్ల వివరాల షీట్ పైన రిటర్నింగ్ అధికారి తప్పనిసరిగా సంతకం చేయాలని వినోద్ జట్షీ చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు టీవీలు, కంప్యూటర్లు కండిషన్ లో ఉండేలా, టీవీలను తగిన ప్రదేశంలో అమర్చాలని గోపాల కృష్ణ ద్వివేది ఐటీ అధికారులను ఆదేశించారు.

ఆన్ లైన్ లో రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఈఓ

       సచివాలయం, మే 19: సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల లోపల సిబ్బంది పనితీరుని, బయట ఓటర్లు బారులు తీరి ఉండటాన్ని ఆయన గమనించారు. పోలింగ్ కేంద్రం లోపలకు ఇతరులు ఎవరూ రావడానికి వీలులేదని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలింగ్ అధికారికి ఫోన్ చేసి కనుక్కోమని కంట్రోల్ రూమ్ లోని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు తెలియజేయమని చెప్పారు. ఏజంట్లు అందరూ ఉన్నారో లేరో కూడా గమనించమని వారికి చెప్పారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారికి ఫోన్ చేసి అడుగుతున్నామని, 7 కేంద్రాలలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు  జాయింట్ సీఈఓ నాగమణి సీఈఓకి వివరించారు. ఆ తరువాత అదనపు సీఈఓ సుజాత శర్మ కూడా కంట్రోల్ రూమ్ కు వచ్చి పోలింగ్ జరుగుతున్న తీరుని ఆన్ లైన్ లో పరిశీలించారు.
ఈవీఎం, వీవీప్యాట్ల కథా కమామిషు!
          






          ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడంతో ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అయితే ఈ ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైన వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ట్యాంపరింగ్ (దురుద్దేశంతో పాడుచేయడం) వంటి వివాదాలు చెలరేగుతున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు వంటివారితోపాటు దేశంలోని 22 జాతీయ, ప్రాంతాయ పార్టీలు  కూడా వీటిని వ్యతిరేకించడం ఆలోచనలకు తావిస్తోంది. ప్రపంచం వ్యాప్తంగా 120 దేశాల్లో వీటిని వినియోగించడంలేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ రాజకీయ పక్షాలు ఈవీఎంలను విశ్వసించడంలేదు. వాటి నిర్వహణ,  వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టాలన్న ఆలోచన  భారత ఎన్నికల సంఘా(ఈసీఐ)నికి 1977లో వచ్చింది. వీటిని తయారు చేసే బాధ్యతను హైదరాబాద్ లోని భారత ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ సంస్థ(ఈసీఐఎల్)కు అప్పగించింది. పలు దశల తరువాత ఈసీఐఎల్, బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ కార్పోరేషన్(బీఈఎల్)లు కలిసి సంయుక్తంగా ఈవీఎంలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈవీఎంలను దేశంలో మొట్టమొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పారూర్ శాసనసభ నియోజకవర్గంలోని 50 పోలింగ్ కేంద్రాలలో ప్రవేశపెట్టారు. అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటి వినియోగానికి సంబంధించి నిర్ధిష్టమైన చట్టంలేదని ఆ ఎన్నికను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ తరువాత వాటిని వినియోగించలేదు. 1989 ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విధంగా 1988 డిసెంబర్ లో ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి  సవరణ చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలలో జరిగిన 25 నియోజకవర్గాల్లో వినియోగించారు. దాంతో వాటి గురించి ప్రజలకు బాగా తెలిసింది. ఆ తరువాత 1999లో 45 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 2000లో హర్యానాలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో, 2001లో తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ లలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. 2004లో లోక్ సభ సాధారణ ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పది లక్షలకుపైగా ఈవీఎంలను వినియోగించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలకు తావులేదని ఈసీఐ పేర్కొంది. 2010లో నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు  తెలిపింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కానేకాదని స్పష్టం చేసింది.

         కాల క్రమంలో ఈవీఎంల ఆకృతిలో మార్పులు తీసుకువచ్చారు. వీటి వినయోగానికి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన మార్గదర్శకాలను, సూచనలను ఇస్తూ వస్తోంది. ఈవీఎంల జీవిత కాలపరిమితి 15 ఏళ్లు. 1989-90లో తయారు చేసిన ఈవీఎంలు అన్నింటిని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. నిపుణులు రూపొందించిన నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేస్తారు. 2010 అక్టోబర్ 4న జరిగిన అఖిల పక్షాల సమావేశంలో ఈవీఎంల వాడకంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటి) వ్యవస్థ గురించి చర్చకు వచ్చింది. ఆ తరువాత సాంకేతిక నిపుణుల కమిటీ పలుసార్లు సమావేశమై ఈవీఎంలతోపాటు వీవీపీఏటీ వ్యవస్థకు రూపకల్పన చేశాయి. బీఈఎల్, ఈసీఐఎల్ వాటిని తయారు చేశాయి. 2011లో జమ్మూ, కాశ్మీర్ లోని లడఖ్, కేరళలోని తిరువనంతపురం, మేఘాలయలోని చిరపుంజి, తూర్పు ఢిల్లీలో, రాజస్థాన్ లోని జైసల్మేర్ లలో వీవీపీఏటీ వ్యవస్థ క్షేత్రస్థాయి పరీక్ష కోసం నమూనా ఎన్నికలు నిర్వహించారు. రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, పౌరసమాజ సభ్యులు, నిపుణుల సూచనలు, సలహాల మేరకు ఈ వ్యవస్థ రెండవ వెర్షన్ తయారు చేశారు. ఎన్నికల సంఘం ఈవీఎంలతోపాటు వీవీపీఏటీలను వాడటానికి వీలుగా 2013లో ఎన్నికల నిర్వహణా నియమాలు-1961కి సవరణ చేశారు.
ఓటర్లు తమ ఓటు తాము వేయాలనుకున్నఅభ్యర్థికి పడిందా, లేదా అనేది సరిపోల్చుకోవడానికి ఈ వీవీప్యాట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రింటర్, డిస్ప్లే యూనిట్ ఉంటాయి. ఓటరు ఓటు వేసినప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తుని వీవీపిఏటీ ఒక పేపరు స్లిప్ పై ముద్రిస్తుంది. స్క్రీన్ పైన ఆ స్లిప్ 7 సెకండ్లు కనిపిస్తుంది. ఆ తరువాత ఆ స్లిప్ కట్ అయి సీలువేసిన డ్రాప్ బాక్స్ లో పడుతుంది. నాగాలాండ్ లోని నోక్సేన్ శాసనసభ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను వినియోగించారు. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో, 2019లో దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వీటిని వినియోగించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో ర్యాండమ్ గా ఒక పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన  వీవీప్యాట్ స్లిప్ లను తప్పనిసరిగా లెక్కించాలన్న నిబంధన ఉంది.

ఇదిలా ఉండగా, దేశంలోని 22 రాజకీయ పార్టీలు ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంల ఓట్లతోపాటు కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. వీవీపాట్ లో 7 సెకండ్లు కనిపించవలసిన గుర్తు మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  వీవీపాట్ స్లిప్ లను 50 శాతం లెక్కించాలంటే ఆరు రోజులు సమయం పడుతుందని, అందుకు భారీగా అదనపు సిబ్బంది కావాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది.   బ్యాలెట్‌ విధానంలో ఒక నియోజకవర్గంలో ఓట్లు లెక్కించేందుకు 16 గంటల సమయం పడుతుందని వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఆరు రోజులు సమయం ఎందుకు అన్న సందేహాన్ని  ప్రతిపక్షాలు  లేవనెత్తాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకొని 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు మే 7న  తిరస్కరించింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్ 8న తీర్పు ఇచ్చింది.  ఆ ప్రకారం ప్రతి శాసనసభ నియోజక వర్గంలో  ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ర్యాండమ్ గా 5 పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసి, అక్కడి వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. వీవీ ప్యాట్‌ స్లిప్ ల లెక్కింపునే పరిగణనలోకి తీసుకుంటారు. 5 పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీ ప్యాట్‌ స్లిప్పులకు ఈవీఎంలలోని ఓట్లకు తేడా ఉంటే,  అప్పుడు ఆ శాసనసభ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లోని వీవీప్యాట్‌ స్లిప్ లను లెక్కిస్తారు. ఈసీఐ చెబుతున్న ప్రకారం ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు తేడా రావడానికి అవకాశం లేదు. అందువల్ల ఈవీఎం ఓట్లతోనే ఫలితాలలో స్సష్టత వస్తుంది. పటిష్టమైన సమాచార, మీడియా వ్యవస్థ ఉన్నందున మే 23వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే, మధ్యాహ్నానికి అనధికారికంగా ఫలితాలు వెల్లడవుతాయి. అయిదు బూత్‌ల్లోని  వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించి, అధికారికంగా ఫలితాలు ప్రకటించడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 13, 2019

14న మంత్రి మండలి సమావేశం



          సచివాలయం, మే 13: ఈ నెల 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మండలి రెవిన్యూ విభాగం, ఆర్టీజీఎస్ లకు సంబంధించిన ఫని తుఫాను ఉపశమన కార్యక్రమాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి రాష్ట్రంలో త్రాగునీటి పరిస్థితి, వ్యసాయం, సహకార, ఉద్యానవన, పశుసంవర్ధక, డెయిరీ, మత్స్య, రెవెన్యూ శాఖలకు సంబంధించి కరువు, రుతువులలో వచ్చే మార్పుల పరిస్థితులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఉపాధి అవకాశాలు తదితర అంశాలను సమీక్షిస్తారని వివరించారు.

May 10, 2019


‘సువిధ’లో ఎంటర్ చేసిన తరువాతే ఫలితాల వెల్లడి

వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల సంఘం ఐసీటీ డైరెక్టర్

రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాల ప్రకటన చేస్తారు

                    సచివాలయం, మే 10: ఎన్నికల సంఘం వెబ్ సైట్ ‘సువిధ’ (suvidha.eci.gov.in)లో ఎంటర్ చేసిన తరువాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారుల(ఆర్ఓ)కు భారత ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) డైరెక్టర్ కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ నెల 23న కౌంటింగ్ సందర్భంగా, అంతకు ముందు ఆర్వోలు, ఏఆర్వోలు సాంకేతికంగా, డేటా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలు ప్రజలందరూ తెలుసుకోవడానికి రిజల్ట్స్(results.eci.gov.in)అనే వెబ్ సైట్ ఉంటుందని, అలాగే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా సువిధ యాప్ ఉంటుందని తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలు తీసుకోవలసిన జాగ్రత్తలు సులభమైన విధానాలతో నాలుగు అంచలుగా ఉంటాయని చెప్పారు. రౌండ్ల వారీగా డేటాని ‘సువిధ’లో ఆర్వోలు, ఏర్వోలు మాత్రమే ఎంటర్ చేయాలన్నారు. డేటాని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలని చెప్పారు. డేటాని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట ఫలితాల వెల్లడికి డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి 5 నిమిషాలకు డేటాని అప్ డేట్ చేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారి మాత్రమే ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

           ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆర్వోలు, ఏర్వోలు ఎంతమంది ఉంటే అన్ని చక్కగా పని చేసే కంప్యూటర్లు ఉండాలని చెప్పారు. వాటిలో లైసెన్ పొందిన యాంటి వైరస్ ని అప్ డేట్ చేసుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ దృష్ట్యా  పెన్ డ్రైవ్ లు, సీడీలు వాడకూడదని చెప్పారు.  ప్రతి కంప్యూటర్ కనీసం 8 ఎంబిపీఎస్ స్సీడుతో ఉండాలని, అంతకంటే ఎక్కవ స్పీడ్ ఉంటే మంచిదన్నారు. ప్రతి కంప్యూటర్ కు ప్రత్యేక ఐపీ అడ్రస్ ఉండాలని చెప్పారు. ఎక్సెల్ లో ప్రావీణ్యం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ని అక్కడ నియమించాలన్నారు.  ప్రింటర్, స్కానర్, ఇతర స్టేషనరీని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్ నెట్ కనెక్షన్ ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అందుబాటులో లేని చోట అందుబాటులో ఉన్న ఏ నెట్ వర్క్ నైనా వాడుకోవచ్చని తెలిపారు. 8 గంటల పవర్ జనరేటర్ ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
          ఈ నెల 9 నుంచి 15 తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, స్త్రీ, పురుషులు, ఇతరులు, మొత్తం ఓటర్ల వివరాలు, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల సంఖ్యలో మార్పులు ఉంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని మాత్రమే మార్చాలన్నారు. మే 23న ఓట్ల లెక్కంపు జరుగనున్నందున, 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య రిహార్సల్ చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఎన్ని రౌండ్లు లెక్కించాలో నిర్ధారించుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లను రౌండ్ల వారీగా వెబ్ సైట్ లో  ఎంటర్ చేయాలని, ప్రతి రౌండ్ ఒక ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓట్లు, పోలైన వాటిలో అర్హత కలిగిన ఓట్లు, నోటా, తిరస్కరించిన, టెండర్డ్ ఓట్ల వివరాలు, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఉన్న ఫామ్ 21ఇ పైన ఆర్వో తప్పనిసరిగా సంతకం చేయాలని కుశాల్ పాఠక్ చెప్పారు. ఎన్నికల సిబ్బంది వ్యక్తం చేసిన పలు అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు సీఈఓ సుజాత శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



May 8, 2019

13న కలెక్టర్ కార్యాలయాల వద్ద బీసీల ధర్నా



ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన పిలుపు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలి

విజయవాడ, మే 8: త్వరలో రాష్ట్రంలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మాదిరిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  ఈ నెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని రాష్ట్రంలోని బీసీలకు, కుల సంఘాలకు బీసీ సంక్షేమ సంఘం పిలుపు ఇచ్చింది. ఆ రోజు సోమవారం గ్రీవెన్స్  డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ఈ సంఘం నిర్ణయించింది. విజయవాడ లబ్బీపేట శ్యామ్ నగర్ కాలనీలో బీసీ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు మాట్లాడారు. రిజర్వేషన్లను మొత్తం 50 శాతం మించకుండా బీసీల రిజర్వేషన్లను 27 శాతానికి కుదిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తెలిపారని, ఈ విధానం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. బీసీల ఆర్థిక, సాంఘీక స్థితిగతుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఆ వివరాలు అందజేస్తే బీసీలకు రిజర్వేషన్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉమ్మడి ప్రభుత్వం గానీ, ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గానీ ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలు సుప్రీం కోర్టుకు అందజేయలేదన్నారు. ఎన్నికల సమయంలో  రాజకీయ పార్టీల నేతలు  బీసీల ఓట్ల కోసం జయహో బీసీ, బీసీ అధ్యయన కమిటీలు, సామాజిక న్యాయం అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు పోటీపడి మరీ ఊకదంపుడు ఉపన్యాలు చేస్తుంటారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2018లోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవలసి ఉందని, అయితే బీసీల రిజర్వేషన్ కు కోత పడితే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని, ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని, ఆ ఎన్నికల తరువాత నిర్వహిస్తున్నారని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలన్న ఉద్దేశం వారికి లేదని, ఏ కాడకీ వారి సీట్లు పెంచుకోవడానికే వారు ప్రధాన్యత ఇస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని 1994 పంచాయతీరాజ్, మున్సిపల్  చట్టంలో పొందుపరిచిన ప్రకారం 3వ వంతు స్థానాలు బీసీలకు రిజర్వు చేసిన విధంగా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలలోని బీసీ నేతలు నోరుమెదపకుండా ఉండటం క్షమించరాని విషయం అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ స్థానాలను మాత్రమే కేటాయిస్తాయి, రిజర్వు కాని స్థానాలను కేటాయించడం కల్ల అన్నారు. బీసీ నాయకులు కదలాలని ఆయన పిలుపు ఇచ్చారు. హక్కుల కోసం ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. బీసీలకు న్యాయంగా రావలసిన సీట్లు కేటాయించకుండా, బీసీలకు ద్రోహం చేసే రాజకీయ పార్టీలలో కొనసాగే బీసీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శంకరరావు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కమ్మరి క్రాంతి కుమార్, ఎన్.కనకారావు, కేశవరావు, అప్పారావు, సూరిబాబు, యు.గోపి, ఎం.రవి కిరణ్, సతీష్, మహిళా నాయకురాలు రమణి తదితరులు పాల్గొన్నారు.

May 7, 2019



ప్రతి ఓటు లెక్కించండి - పక్కాగా, సిద్ధంగా ఉండండి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది

సచివాలయం, మే 7: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఓటు లెక్కించాలని, అందుకు తగ్గ పక్కా ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కలెక్టర్స్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు,  మాస్టర్ శిక్షకులు, ఇతర అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియని సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. దేశం మొత్తం మీద అత్యధిక మంది దివ్యాంగులు మన రాష్ట్రంలో ఓటు వేశారని తెలిపారు. 18-25 సంవత్సరాల వయసు గల యువత ఓటింగ్ శాతంలో కూడా మూడు శాతం వృద్ధి కనిపించిందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కూడా ఒక్క సంఘటన కూడా జరుగలేదని చెప్పారు. అందరూ బాగా పని చేశారని ప్రశంసించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సమర్ధవంతంగా పూర్తి చేయవలసి ఉందన్నారు.

          ఇక్కడ పొందిన శిక్షణను జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సిబ్బందికి కూడా శిక్షణా తరగతులు నిర్వహించి అన్ని విషయాలు తెలియజేయాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఓట్ల లెక్కింపు నిష్పక్షపాతంగా,  ఖచ్చితత్వంతో  జరగాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది మధ్య పరస్పర సమాచార మార్పిడి అవసరం అన్నారు. ఓటింగ్ లో, ఓట్ల లెక్కింపులో సాంకేతిక అంశాల వల్ల కొంత ఇబ్బంది ఉంటుందని, దానిని ఎంతో జాగరూకతతో అధిగమించాలన్నారు. ఈవీఎంలతో ఓటింగ్ ఫలితాలను తెలియజేసిన అనుభవం ఉందని, అయితే తొలిసారి అందుకు అదనంగా ఈవీపాట్స్ ని లెక్కించడం ఇదే మొదటిసారని చెప్పారు. అన్ని సందర్భాలలో ఒకే రకమైన నిర్ణయం తీసుకుంటే సమస్యలు తలెత్తవన్నారు. వాతావరణం వేడిగా ఉందని, దానికి ఎన్నికల వేడి తోడైందని పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకొని అందరూ జాగ్రత్తగా పని చేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే పరిష్కారాన్ని కనుగొనాలని, అటువంటి వాటిని వాయిదా వేయడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుదన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పదేపదే కోరుతున్నామని చెప్పారు.  కొందరు పోలింగ్ ఏజంట్లు కూడా అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని, అధికారులు  జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈసీఐ నియమావళిని సమగ్రంగా చదవాలని, సందేహాలను నివృత్తి చేసుకొని, కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేసుకోమని సలహా ఇచ్చారు. కౌంటింగ్ ఏజంట్ల గురించి పోలీస్ శాఖ సమాచారం సేకరిస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వివేది చెప్పారు. కౌంటింగ్ విధులలో పాల్గొనే సిబ్బంది ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతామని, ఏ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తారో 24 గంటల ముందు తెలుస్తుందని, ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో మే 23 ఉదయం 5 గంటలకు వారికి తెలియజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ర్యాండమైజేషన్ ప్రక్రియలో చేపడతామని చెప్పారు. వివిపాట్ ఓట్ల  లెక్కింపులో ఒక నియోజకవర్గ పరిదిలో ర్యాండమ్ గా అయిదు కేంద్రాలను ఎంపిక చేస్తారని తెలిపారు. దీనిని ఎన్నికల పరిశీలకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించవలసి ఉందన్నారు.
గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వీ రాజశేఖర బాబు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొలి అంచె వంద మీటర్ల పరిధి వరకు ఉంటుందని, ఇక్కడ జిల్లా పోలీస్  వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండవ అంచె కౌంటింగ్ కేంద్రం భవన సముదాయ ప్రాంగణం పరిధిలో  రాష్ట్ర ఆర్మ్ డ్ పోలీస్ వ్యవస్థ ఉంటుందన్నారు.  మూడవ అంచె కౌంటింగ్ జరిగే హాలు అని, అక్కడ సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్ లను, ఆయుధాలను, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించం అని తెలిపారు. ఈసీఐ అనుమతించిన అధికారులకు మాత్రమే కౌంటింగ్ హాలులో సెల్ ఫోన్ లు అనుమతిస్తామని చెప్పారు. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు ఎన్నికల పరిశీలకులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత ఇతర అధికారులు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, అందులో తేదీ, సమయంతో రికార్డు కావాలని చెప్పారు. ప్రతి ఏజంట్ కు ఐడీ కార్డు ఇవ్వాలన్నారు.  సెల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వాదనలకు దిగడం వంటి సంఘటలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. రౌండ్ల వారీ ఫలితాలను వెల్లడించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం అధికారిక విధుల్లో ఉన్న సిబ్బంది, డ్యూటీ పాస్ లు పొందిన మీడియా ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. లోక్ సభ, శాసనసభలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలన్నారు.
డిప్యూటి సీఈఓ టి.చిరంజీవి మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నియమావళికి సంబంధించి అంశాల వారీగా న్యాయసంబంధమైన వివరాలను తెలియజేశారు. మౌలిక వసతులు, కౌంటింగ్ సిబ్బంది నియామకం, కౌంటింగ్ కేంద్రాలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల అధికారిక ఏజంట్లకు ఏర్పాటు చేసే వివిధ అంశాలను, మార్గదర్శకాలను వివరించారు.
సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇందు కోసం ఇప్పటికే సంబంధిత మీడియా యూనిట్ల నుంచి వివరాలు సేకరించి ఈసీఐ అధికారిక లేఖలను విలేకరులకు అందిస్తున్నట్లు తెలిపారు.  మీడియా పాయింట్ లో నోటీస్ బోర్డులు, టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని చెప్పారు. సమాచార శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికారి ఈసీఐ మార్గదర్శకాల మేరకు చిన్న గ్రూపుల వారీగా విలేకరులను ఆయా కౌంటింగ్ కేంద్రాల లోపలకు తీసుకువెళ్లి, తీసుకువస్తారని వివరించారు.
వివి ప్యాట్ ల పనితీరు, ఓట్ల లెక్కింపు, ఫలితా వెల్లడి వంటి అంశాలపై మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయ భాస్కర్, పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓట్ల లెక్కింపుపై తహశీల్దార్ బీజీఎస్ ప్రసాద రావు, టెక్నికల్ అంశాలపై ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ వి మల్లికార్జున రెడ్డి, నివేదికలు అందించే విషయంపై, న్యూ సువిధ యాప్ పై ఓఎస్డీ వెంకటేశ్వర రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల  అధికారి వివేక యాదవ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి డి మార్కండేయులు,  పలువురు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసీ అధికారుల, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.