Feb 16, 2018

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు

          
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. ఆయన విదేశీ పర్యటలన్నీ విజయవంతమవుతున్నాయి. మంచి ఫలితాలనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి పేర్లు దశదిశలా మారుమ్రోగుతున్నాయి. ఓ రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, సీఎంగా  కంప్యూటర్, సమాచార టెక్నాలజీలో ఆయన పరిజ్ఞానం అమోఘం. ముందు చూపుతో ఆయన చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు భావితరాలకు బంగారు బాట వేస్తుంది. రాజకీయవేత్తగా ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థల సీఈఓలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిపిన దక్షిణ కొరియా, లండన్, దావోస్ పర్యటనలతోపాటు ఈ నెల 8న జరిపిన దుబాయ్ పర్యటన కూడా విజయవంతమయింది. పరిపాలనలో ఆయన సమర్థత, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అభివృద్ది చూసి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేకమందిత దిగ్గజ సంస్థల అధినేతలను, పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. సీఎం సమక్షంలో పలు ఎంఓయులు జరిగాయి. ఉక్రేయిన్, మరికొన్ని ఇతర దేశాలలో పెద్దఎత్తున భూకమతాలు కలిగివున్నఫీనిక్స్ గ్రూపు ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ గౌరవ్ థావన్, గ్రూపు ఫైనాన్స్ కంట్రోలర్ నితిన్ నావన్ థీర్ తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో వ్యవసాయరంగంలో అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి వారికి వివరించారు. ఏపీలో భారీ రైస్ మిల్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని గతంలో మాటిచ్చిన ప్రకారం ఏప్రిల్ నుంచి  ప్లాంట్ పనులు ప్రారంభించనున్నట్లు వారు సీఎంకు చెప్పారు. ఉక్రేయిన్‌లో అమెరికాకు చెందిన కొన్ని సంస్థల సహకారంతో ఫీనిక్స్ నెలకొల్పుతున్న ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందని, దీని తరువాత భారత్ మార్కెట్‌పై దృష్టి సారిస్తామన్నారు. తమ రాష్ట్రంలోని అనంతపురము ప్రాంతంలో వేరుశెనగ సాగు చేపట్టేందుకు గల అవకాశాలు పరిశీలించాలని, వేరుశెనగ నుంచి బటర్ తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పాలని సీఎం వారికి సూచించారు. షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫుద్దీన్ మొహమ్మద్ హుస్సేన్ షరాఫ్ ఆధ్వర్యంలో ఆ గ్రూప్ ఎగ్జిక్యూటీవ్ బృందం సీఎంతో సమావేశమైంది.   ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. భూముల కొనుగోలు ప్రయత్నంలో ఉన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కోసం ఈ సంస్థ ఎదురు చూస్తోంది. భారత్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఫరాఫ్ గ్రూపు పూనే, లుథియానాలో వ్యాపారం కేంద్రీకరించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రవాణా సదుపాయాలు ఉండాలని వారు అభ్యర్థిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో భూమిని సమకూర్చుకుంది. భూముల సంబంధిత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని, వెంటనే తమ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరపమని సీఎం వారికి సూచించారు. అనేక అంశాలలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని హుస్సేన్ ప్రశంసించారు. త్వరలో తమ సంస్థ అత్యున్నతస్థాయి బృందాన్ని ఏపీకి పంపిస్తామని చెప్పారు. దుబాయ్‌లో తన ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరుకావాలని షరాఫ్   సీఎంను ఆహ్వానించారు.
 ఎమిరేట్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఆ గ్రూప్ చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సయీద్ అల్ మక్దూమ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఆ గ్రూప్ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్  తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్ గ్రూపు ముందుకొచ్చింది. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని సైతం నెలకొల్పనుంది. దీంతో పాటు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఆర్) సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ( ఏపీఈడీబీ)తో ఎమిరేట్స్ గ్రూపు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎమిరేట్స్ గ్రూపు, ఏపీఈడీబీ కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తాయి. ఏరోస్పేస్ సంబంధిత మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ఎమిరేట్స్పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను ఈ వర్కింగ్ గ్రూపులు పరిశీలిస్తాయి. అలాగే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపులోనూ ఎమిరేట్స్’, ఏపీఈడీబీ సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చితే రాష్ట్రానికి కొత్తగా రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు ఫ్రీ జోన్ అథారిటీ డైరెక్టర్ జనరల్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ అథారిటీ వైస్ చైర్మన్, దుబాయ్ ఎయిరో స్పేస్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అహ్మద్ అల్ ఝరూనీతో కూడా సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి ఎయిరోసిటీ ఏర్పాటు సన్నాహాల్లో వున్నామని, ఇందుకోసం సౌదీ అరేబియా పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తున్నామని ఝురానీ వెల్లడించారు. కేపీఎంజీ సహకారంతో మరో మూడు నెలల్లో దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ బస్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, నాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విశాఖలో జరిగే సీఐఐ-భాగస్వామ్య సదస్సుకు హాజరవుతానని ఝురానీ మాటివ్వగా, అప్పటికి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరు ఖండాలు, 40 దేశాల్లోని నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్‌లాండ్  టెర్మినళ్లను కలిగి, సప్లయ్ చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయండంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్ సుల్తాన్ బీన్ సులేయమ్‌, గ్రూపు డిప్యూటీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజ్ జిత్ సింగ్ వాలియా, కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ ఖన్నాలను సీఎం కలిసినప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ అంశాలలో కలిసి పనిచేసేందుకు  ఏపీ, డీపీ వరల్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యబృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఏపీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, డీపీవరల్డ్ సీఈవో యువరాజ్ ఉన్నారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తృతికి వెంటనే ఒక బృందాన్ని పంపించేందుకు సుల్తాన్ అంగీకారం తెలిపారు. 
బిజినెస్ లీడర్స్ ఫోరం యూఏఈ ఆధ్వర్యంలో ఏర్పాటైన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు- ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటా మంతీఅనే ఇతివృత్తంతో ఏర్పాటైన ఈ రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపన అంశాలకు తాను భరోసాగా ఉంటానని, ఆ బాధ్యత తనదని స్పష్టం చేశారు.  తమది అందమైన, ఆహ్లాద రాష్ట్రం అని,  పెట్టుబడులకు  చక్కని గమ్యస్థానంగా ఎంచుకోండని పిలుపు ఇచ్చారు. విశాఖ మహానగరంలో లులూ గ్రూపు ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ ఆకృతులు ఆ సంస్థ ప్రతినిధులు సీఎం బృందానికి చూపించారు. విశాఖలో ఈనెల 26న లులూ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సీఎం  శంకుస్థాపన చేసే అవకాశం వుంది. ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ ఉన్నారు. యుఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి కూడా ఈ బృందం వెంట ఉన్నారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 15, 2018

గ్రామీణుల తలసరి ఆదాయం పెరిగేవిధంగా బడ్జెట్


ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో అధికారులకు మంత్రి యనమల సూచన
             సచివాలయం, ఫిబ్రవరి 15: గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెరిగేవిధంగా బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం వ్యవసాయం దాని అనుబంధ శాఖలు, మార్కెటింగ్,పశుసంవర్ధక, సహకార శాఖలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో  గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి గ్రామీణ ప్రజల ఆదాయం పెరగాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించేవిధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలోపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ వాటాకు అన్ని శాఖల వారు ప్రధాన్యత ఇవ్వాలన్నారు.అలాగే ఇంటింటికి, జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులకు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి శాఖలో రెవెన్యూ వ్యయం తగ్గించుకొని, స్థిరాస్థి వ్యయం పెంచుకోవాలన్నారు. చాలా శాఖల వారు ఇచ్చిన బడ్జెట్ ఖర్చు చేయకుండా అదనపు బడ్జెట్ అడగటం మొదలుపెట్టారని, ఇది బడ్జెట్ మేనేజ్ మెంట్ కు విరుద్దమని పేర్కొన్నారు. ముందు ఇచ్చినది ఖర్చు చేసిన తరువాత అదనపు బడ్జెట్ అడిగితే ఇస్తామన్నారు. ప్రతి శాఖలో ప్రాధాన్యతను బట్టి కేటాయింపులను ఇతర పథకాలకు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించామని, ఆ విధంగా నిధులు వినియోగించుకోవాలని సూచించారు.ప్రతి శాఖలోని సిబ్బందిని హేతుబద్దీకరించుకొని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వారితో పని చేయించుకోవాలన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకానికి తగినన్ని నిధులు కేటాయించాలని సూచించారు.రొయ్యల చెరువులను, వ్యవసాయ భూములను జోన్లుగా విభజించాలని మంత్రి యనమల ఆదేశించారు.
        వ్యవసాయానికి ప్రత్యేక ప్రధాన్యత ఇవ్వాలని ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కోరారు. ఈ రంగంలో ఆధునిక పద్దతులు, యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మార్కెటింగ్, పశుసంవర్ధక, సహకార శాఖల మంత్రి సీహెచ్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు రూ.500 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయమని కోరారు. వెటర్నరీ డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పట్టణ గృహనిర్మాణం పథకం, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ వంటి 41 ప్రాజెక్టులు ఉన్నందున తమ శాఖకు అదనపు నిధులు కేటాయించమని  మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ కోరారు.
       పౌరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన చెల్లింపులన్నిటినీ ఆన్ లైన్, నగదు రూపంలో చెల్లించే నూతన సాఫ్ట్ వేర్ ను ప్రణాళికా శాఖ వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి  చూపించారు. ఈ విధానంలో చెల్లింపులు ఆన్ లైన్ తోపాటు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లలో చెల్లించే అవకాశం ఉంది. వ్యవసాయ, ఉద్యానవన,మత్స్యశాఖలలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వ్యవసాయ రంగంలో జలవనరులు అందుబాటులోకి రావడంతో ఉత్పాదకత పెరిగిందని,  ఉద్యానవన పంటలు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. నిల్వ సామర్థ్యం పెరగడంతో కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొరత తగ్గిందని చెప్పారు. ఆప్ కాబ్ డిపాజిట్లు, వడ్డీ రాయితీ గురించి ఆ బ్యాంకు అధికారి వివరించారు. పశుసంవర్థక శాఖలో వృద్ధి రేటును ఆ శాఖ అధికారులు తెలిపారు. పది వేల గ్రామాల్లో 26 వేల ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నట్లు వివరించారు.తద్వారా 15 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. మత్స్య శాఖలో వృద్దిరేటుని, మెరైన్, ఇన్ ల్యాండ్ ఉత్పత్తులను, ఆక్వా కల్చర్ లో ప్రవేశపెట్టిన ఆధుని పద్దతులను అధికారులు మంత్రికి వివరించారు.మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు స్మార్ట్ సిటీలు, ఎకనామిక్ సిటీ, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, సాధికార మిత్ర, వడ్డీలేని రుణాలు, అమరావతి మెట్రో రైలు, అన్న క్యాంటిన్లు, పట్టణ గృహ నిర్మాణం,మున్సిపల్ పాఠశాలలు, శ్మశానవాటికల అభివృద్ధి, ఓడీఎప్ ప్లస్ తదితర అంశాలను వివరించారు. రైతు రుణ మాఫీ, రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్ల పంపిణీ, వ్యవసాయ రంగంలో ఖర్చులు తగ్గించవలసి అవసరం,రొయ్యాల చెరువులు, పాడిపశువులు, గొర్రెల కొనుగోలు, వ్యవసాయంలో యాత్రీకరణ, పట్టణీకరణ, కౌలు రైతులకు రుణాలు, ప్రకృతి వ్యవసాయం, సూక్ష నీటిపారుదల, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి, ఫిషరీస్ యూనివర్సిటీ, బోట్లకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ తదితర అంశాలను చర్చించారు.
       ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వలవన్, మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్,ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి,   పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ పీడీ కొండలరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

చాణుక్యుడు లాంటి బాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు


మంత్రులు సోమిరెడ్డి, అచ్చన్నాయుడు, ఆనందబాబు
అమరావతి, ఫిబ్రవరి 14: రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కేంద్రం తత్సారం చేస్తున్నందున చాణుక్యుడు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కింజరాపు అచ్చన్నాయుడు, నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేస్తుందని తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని, ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే అప్పుడు సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏం చేయాలో అది చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఢిల్లీలో పోరాటం చేస్తోందన్నారు. సీఎం ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో పక్క తమ మంత్రులు, ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్న విషయం ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాకు సమానంగా 5 ఏళ్లపాటు ప్రయోజనాలు, రాయితీలు ఇస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారని, ప్రత్యేక హోదాను త్యాగం చేయలేదని, ఇస్తామన్న ప్యాకేజీని అమలు చేయమేని డిమాండ్ చేస్తున్నామన్నారు.
 ప్రతి పక్షనేతగా వైఎస్ జగన్మోహన రెడ్డి బడ్జెట్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, వాళ్ల ఎంపీలు మాత్రం బడ్జెట్ బాగుందని చెప్పారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా అనేది ఓ డ్రామా అని, ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పారు, 2016లో రాజీనామా చేస్తామన్నారు, ఆ తరువాత 2017, 2018 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.  చేశారా అని ప్రశ్నించారు.  రాజీనామాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. ఏడాది ముందు చేస్తే మళ్లీ ఎన్నికలు రావు, అందువల్ల ఏప్రిల్ తరువాత అంటున్నారు, అమోఘమైన తెలివితేటలు అని విమర్శించారు.  లోక్ సభ జరిగేటప్పుడు రాజీనామాలు చేయకుండా, ఏప్రిల్ 6 తరువాత లోక్ సభ సమావేశాలు జరగనప్పుడు రాజీనామాలు చేయడం అర్ధమేమిటని అడిగారు. జగన్మోహన రెడ్డి నిర్దోషేమీ కాదని, 14 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చారన్నారు. ఆయనపైనే కేసులు ఉన్నాయని, ప్రధాని మోడీకి భయపడవలసిన అవసరం తమనేత చంద్రబాబుకు లేదన్నారు. ఆయనపై ఏవిధమైన కేసులు లేవని చెప్పారు. బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అభ్యర్థులను ప్రకటించక ముందే, వారు కోరకుండానే  మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఆ పార్టీకిగానీ, నాయకునిగా జగన్మోహన రెడ్డి గానీ గుర్తింపులేదన్నారు. వాళ్ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
మిత్రపక్షంగా తామే పార్లమెంటులో ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే టీడీపీ పోరాడుతోందన్నారు. తమ తీరుని చూసి జగన్మోహన రెడ్డి భయంతో పాత నాటకానికి తెరతీశారని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. ఏ1 ముద్దాయి రోడ్డుమీద ముద్దులు పెడుతుంటే, ఏ2 ముద్దాయి ఢిల్లీలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం గానీ, ప్యాకేజీ కోసం గానీ జగన్మోహన రెడ్డి ఢిల్లీలో ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పార్లమెంటును ఉపయోగించుకుంటున్నామని, ఆయన శాసనసభ సమావేశాలకు రాకుండా రోడ్డుమీద ముద్దులుపెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం మంత్రి సుజనా చౌదరి మాట్లాడితే అతనిపై పీఎంకు ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.
తమకు మంత్రి పదవులు ముఖ్యంకాదని, గతంలో తమ పార్టీ నుంచి 29 మంది ఎంపీలు గెలిచినప్పుడు అప్పటి ప్రధాని  వాజ్ పాయ్ మంత్రి పదవులు ఇస్తామంటే తిరస్కరించిన విషయం గుర్తు చేశారు. జగన్మోహన రెడ్డికి ప్రతిపక్షం పాత్ర పోషించే దమ్ములేదన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం తామే, ప్రతిపక్షం తామేనన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా తలసరి ఆదాయం వచ్చే వరకు సహాయం చేయమని కోరుతున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు.

Feb 13, 2018

పరిశ్రమలకు భూముల కేటాయింపుల్లో జాగ్రత్త వహించండి


ఎస్ఐపీసీ సమావేశంలో సీఎస్
          సచివాలయం, ఫిబ్రవరి 12: పరిశ్రమలకు భూములు కేటాయించే సందర్భంలో నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎస్ఐపీసీ) పనితీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమికి తగిన భద్రతకల్పించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే విధానం, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, ఉపాధి కల్పన, విద్యుత్,నీటి సరఫరా, శిక్షణ, ఎస్జీఎస్టీ తదితర  రాయితీలకు సంబంధించిన అంశాలు చర్చించారు. వివిధ సంస్థలకు  ఇచ్చిన భూములు, ఆ సంస్థలు పెట్టే పెట్టుబడులు, ఎంతమందికి ఉపాధి కల్పించేది తదితర అంశాలను అధికారులు సీఎస్ కు వివరించారు. ఎంఓయులోనే నిబంధనలు అన్నీ పొందుపరుస్తున్నట్లు చెప్పారు. కియోమోటార్స్ కార్పోరేషన్, అరవింద్ లిమిటెడ్ వంటి సంస్థలకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానం, ఉద్యోగ కల్పన సబ్సిడీపై లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు, ఏపీ ట్రాన్స్ కో ఎండీ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు., పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్  తదితరులు పాల్గొన్నారు.

సాగరమాల ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష


        సచివాలయం, ఫిబ్రవరి 12: సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సోమవారం సాయంత్రం  సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు సీఎస్ కు వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్టుల పనులు నిర్ణయించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పలు అంశాలను లోతుగా చర్చించడంతోపాటు అధికారులు చెప్పిన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన, కేటాయించవలసిన భూములుడీపీఆర్(ప్రాజెక్ట్ పై సమగ్ర సమాచార నివేదిక)కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టులుపోర్టుల నుంచి రోడ్డు, రైలు మార్గాల అనుసంధాన ప్రాజెక్టులు, కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు, కాకినాడ-రాజమండ్రి వయా సామర్లకోట రోడ్డు, భావనపాడుకు రోడ్డు, రైలు మార్గం, విజయవాడ-మచిలీపట్నం రైల్లేలైన్ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన, నూతన రాజధాని అమరావతి ఏర్పడిన నేపధ్యంలో శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణికుల  సంఖ్య పెరిగిందనిఈ మార్గాల్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అన్నారు. ఆ మార్గాల్లో కొత్త రైళ్లు కావాలన్న ప్రతిపాదనలను రైల్వే శాఖకే పంపమని రైల్వే అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు., మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్పోర్ట్స్ డైరెక్టర్ కోయ ప్రవీణ్నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజుగంగవరం పోర్ట్ డైరెక్టర్ డీటీ నాయక్, పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా, ఎన్ హెచ్ఏఐ, రైల్వే, నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీఆర్డీ సమావేశంలో కీలక నిర్ణయాలు


వెల్లడించిన మంత్రి డాక్టర్ పి.నారాయణ
         సచివాలయం, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీసీఆర్ డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సర్వే పూర్తి అయిందని, దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 97.5 కిలోమీటర్లు నిర్మించే ఈ రోడ్డుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సీఆర్డీఏ విడుదల చేస్తుందని చెప్పారు. ఈ రోడ్డుకు, అమరావతి లోపలి ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసే రోడ్లకు కలిపి 8వేల ఎకరాలు సమీకరించవలసి ఉందన్నారు. ఈ భూములను కూడా పూలింగ్ పద్దతిలో తీసుకుంటామని, అందుకు ఇష్టపడనివారు ఉంటే వారి వద్ద నుంచి భూ సేకరణ విధానం ద్వారా సేకరిస్తామని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డును నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తుందని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం ఎస్బీఐ ద్వారా రూ.500 కోట్లకు మసాలా బాండ్స్ విడుదల చేయాలని, 5.5 ఎకరాల్లో రూ.284 కోట్ల వ్యయంతో ఐటీ టవర్ నిర్మించాలని నిర్ణయించినట్లు వివరించారు. అమరావతిలోని 400 కెవి, 220 కెవి విద్యుత్ లైన్లను మార్చాలని నిర్ణయించామని, అందుకు రూ.1370 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అమరావతిలో హైకోర్టు భవనాలు నిర్మించే ప్రాంతంలో లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ప్లాన్ ప్రకారం తొలుత సిటీ సివిల్ కోర్టు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.108 కోట్లతో లక్షా 96వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం 8 నెలలో పూర్తి చేయిస్తామని చెప్పారు. ఇందులో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలిపారు.
ఏప్రిల్ లో విజయవాడ ఏ1 కన్వెన్షన్ హాల్ లో హాపీసిటీ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారుకాంప్రహెన్సివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ని అధ్యయనం చేయమని సీఎం చెప్పారన్నారు. మార్చి 19 నుంచి 23 వరకు వాషింగ్టన్ లో జరిగే ప్రపంచ పేదరిక సదస్సుకు ప్రభుత్వ తరపున ప్రతినిధులను పంపించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా పాల్గొన్నారు

Feb 9, 2018

12 నుంచి జలసంరక్షణ ఉత్సవం


నీరు-ప్రగతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ
116 రోజులు నీరుప్రగతి-జలసంరక్షణ  ఉద్యమం
జూన్ లో నీటి సంఘాలకు ఎన్నికలు
            సచివాలయం, ఫిబ్రవరి 9: ఈ నెల 12 నుంచి జూన్ 7వ తేదీ వరకు 116 రోజులు నీరుప్రగతి-జలసంరక్షణ రెండవ విడత ఉద్యమ కార్యక్రమం ఓ ఉత్సవంలాగా నిర్వహించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన నీరు-ప్రగతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నీరు-చెట్టు పనుల ప్రగతిని సమీక్షించారు. వచ్చే ఏడాదికి రూపొందించిన పనుల  ప్రణాళికపైన, జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే పనులపైన చర్చించారు. చేపట్టిన పనులను, పూర్తి చేసిన పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లు పనుల విషయమై శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడారు. నీటి సంఘాల భాగస్వామ్యంతో జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే చెరువుల మరమ్మతులు, చెరువుల అనుసంధానం, కాలువల్లో పూడిక తొలగింపు, చెక్ డ్యామ్ ల నిర్మాణం, ఊట గుంటల నిర్మాణం, నేలలో తేమ పెంపు పనులు, వాననీటి సంరక్షణ, కాంటూర్ కందకాలు, రాక్ ఫిల్ డ్యామ్స్, అటవీ సరిహద్దు కందకాలు, భూగర్భజలాల పెంపు, ఊరూరా జలగణన, ఇతర జల సంరక్షణ నిర్మాణాలపై చర్చించారు. వర్షాలు పడిన వెంటనే నీరు భూమిలో ఇంకే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. పెరిగిన భూముల సాగు,  పంటల విస్తీర్ణం,  సాగు నీరు, నివాస ప్రాంతాలకు త్రాగునీరు, వనసంరక్షణ సమితులు, ఫారంఫాండ్స్, బోర్ వెల్స్ రీఛార్జి, చెరువులలో నీటి నిల్వ, వాటర్ షెడ్ల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయవలసిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.  కడప జిల్లాలో చెక్ డ్యామ్ ల నిర్మాణం బాగుందని ప్రశంసించారు. అక్కడ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అక్కడ అభివృద్ధిని పరిశీలించమని అధికారులకు చెప్పారు. జూన్ లో నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరులు, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, అటవీ, ఆంధ్రప్రదేశ్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, గ్రామీణ నీటిసరఫరా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.