Jan 3, 2018

చేనేత కులాలు బలప్రదర్శనకు సిద్ధం!


ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు
విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన
రాజకీయ అధికారం కోసం పోరాటం
         రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి రాష్ట్రంలోని చేనేత కులాలన్నీ ఏకమతువున్నాయి. తమ బలం ప్రదర్శించి, గర్జన వినిపించడానికి సిద్ధమయ్యాయి. రాజకీయంగా వారు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. చేనేతకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహంలేకపోవడంతో చేనేత పరిశ్రమ కుంటుపడిపోయింది. దాంతో మరో పని చేయడం చేతకాని చేనేత కార్మికులు అప్పులపాలై, అధిక వడ్డీలు చెల్లించలేక, ఆత్మగౌరవం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వారికి ఉపాధి భద్రతలేదు.  రాష్ట్రంలో 75 లక్షలకుపైబడి చేనేత వర్గాల వారు ఉన్నారు. వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. అటువంటి రంగానికి రాజకీయ వారసులు కరువయ్యారు. భారతదేశమంటేనే కులవృత్తుల సమాహార సమాజం. సమస్త ఉత్పత్తులకు సహస్ర కులవృత్తులే కారణం. అందులో చేనేత వృత్తి ఒకటి. మానవాళికి వస్త్రాలు అందించడమేకాక  చలి, ఎండల నుంచి రక్షణ కల్పించిన శ్రమజీవులు వాళ్ళు. ఆదిమ  దశలో మానవులు ఆకులు కప్పుకున్నారు. ఆ తరువాత నార బట్టలు ధరించి  తమ శరీర అవయవాలు కనపడ కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్రమంగా చేనేత ప్రారంభం అయింది. క్రీ.పూ.4000 సంవత్సరం నుంచి నూలు వకుతున్నారు. క్రీ.పూ.500లో చక్రం కనిపెట్టారు. ఈ చక్రం ప్రపంచ మానవ జీవిత గమనాన్నే మార్చేసింది. అలాగే చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడిందిపద్మశాలీలు, దేవాంగులు మొదలైన చేనేత కులాల వారు మంచి నాణ్యమైన బట్టలు తయారు చేసేవారు. బ్రిటీష్ వారు ఇండియాను వదిలిపెట్టి పోయే సమయానికే అగ్గిపెట్టెలో పెట్టే చీరను నేశారంటే వారు ఎంతటి  నైపుణ్యం కలిగినవారో అర్ధం చేసుకోవచ్చు.
జాతీయ ఉద్యమంలో 1905 ఆగస్టు 7 కలకత్తాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేయడంతో విదేశీ వస్తు బహిష్కరణ ప్రారంభమైందిరాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో గాంధీజీ చేర్చారు. తకిలి అనే కదురు రూపొందించి అందరు దూదితో నూలు వడకాలని, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకువచ్చారు. గాంధీజీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్స వంగా కేంద్రం ప్రకటించిందిగాంధీజీ కృషివల్ల ఖాదీ బట్టలకు గొప్ప గౌరవం దక్కింది. పట్టు బట్టలవలె వాటికి గౌరవం లభిస్తోంది. వర్షాకాలంలో చేనేత పని సాగదు. దాంతో వారికి ఆ కాలంలో కడుపు నిండా తిండి కూడా లభించని పరిస్థితి. అందువల్ల మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చినవిధంగా చేనేత కార్మికులకు కూడా చేనేత విరామ భృతి ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని చేనేత కూడా వర్తింపచేయాలని వారు కోరుతున్నారు. చేనేత వస్త్రాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక సబ్సిడీ 365 రోజులు కొనసాగించడంతోపాటు రైల్వే, టెలిఫోన్, ఆర్టీసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారానికి కనీసం ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించడాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి కోట్లాది మందికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది.
చేనేత అనేది దేశ వారసత్వ సంపద. దానిని కాపాడుకోవడానికి ఏ ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలేదు. బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించకపోగా కోత విధిస్తున్నారు. అదేమని అడగడానికి చట్ట సభలలో చేనేత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కరువయ్యారు.  దాంతో వారి సమస్యలను చట్టసభల్లో వినిపించడానికి అవకాశం లేకుండా పోయింది.  అటు పార్లమెంట్ లోగానీ, ఇటు ఏపీ శాసనసభలో గానీ చేనేత వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. చట్ట సభలలో చేనేత గళం విప్పడానికి ఈ వర్గానికి రాజకీయ వారసత్వం కరువైంది.  చేనేత ఓటర్లు గణనీయంగా ఉన్నా ఏపీ శాసనసభలో 175 మందిలో  ఆ వర్గానికి చెందిన ఒక్కరు కూడా లేరు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప లోక్ సభకు ఎన్నికయ్యారు. శాసనమండలిలో ఇటీవల ఈ వర్గానికి చెందిన పోతుల సునీతకు అవకాశం కల్పించారు. జనాభా ప్రకారం రాష్ట్రంలో 18 వరకు శాసనసభ స్థానాలు  చేనేత కులాలకు దక్కాలికనీసం 15 మంది చేనేత కులాల నుంచి ఎమ్మెల్యేలుగా వస్తేనే చేనేతలకు నిజమైన న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు.
               దేశంలో చేనేతకు సంబంధించిన కులాలు పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలిసేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియకరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాలకుర్ని, ఖత్రినీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్,  సాలివన్, నెస్సి మొదలైన కులాలు ఉన్నాయి. దాదాపు 19 కులాల వారు ఏపీ ఉన్నారు.  వాటిలో అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. వీరికి తోడు కొన్ని జిల్లాల్లో మాలలు కూడా చేనేత వృత్తిపై జీవిస్తున్నారు. ఇప్పటికే చేనేతకు, చేనేత కుటుంబాలకు ఎంతో నష్టం జరిగిందని తెలుసుకున్నారు. తక్కువ జనాభా కలిగిన కులాలకు కార్పోరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నారని, ఇంత మంది జనాభా ఉన్నా చేనేత కార్పోరేషన్ ఏర్పాటు చేయకపోవడానికి కారణం తమలో ఐక్యతలేకపోవడమేనన్న భావన వారిలో ఉంది. అన్ని కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చేనేతకు ప్రాధాన్యత తగ్గిందని, చేనేత కులాలు, ఉప కులాలన్న వ్యత్యాసం వదిలివేసి రాష్ట్రంలోని చేనేత కులాల వారందరూ ఏకమై ఒక్క తాటిపై నిలబడి సమస్యలు పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. చేనేత గళం వినిపించాలంటే చట్ట సభలలో స్థానం సంపాదించాలి.  అలాగే అందరూ కలసి బలీయమైన శక్తిగా ఏర్పడి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి వచ్చే ఎన్నికల్లో  ఎక్కువ శాసనసభ స్థానాలు గెలుచుకోవాలన్న  గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎక్కువ స్థానాలు కేటాయించిన పార్టీకే తమ మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. అంతేకాకుండా అందరూ కలసి బలప్రదర్శన చేస్తేనే రాజకీయ పార్టీలు కూడా గుర్తిస్తాయన్న అభిప్రాయానికి వారు వచ్చారు. దాంతో భారీ స్థాయిలో లక్ష మందితో విజయవాడలో ఒక ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నారు. చేనేత కులాలలో ఏ నియోజకవర్గంలో ఏ కులం వారు ఎక్కువ ఉంటే వారిని పోటీకి నిలబెట్టాలని చేనేత పెద్దలు నిర్ణయించారు. చేనేత కార్మికులునందరినీ మగ్గం దండు పేరుతో ఒకరు ఏకం చేస్తుంటే, అన్ని చేనేత కుల సంఘాల పెద్దలను కలిసి ఏకంచేసే పనిలో  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ (చేనేత ఐక్యవేదిక) ఉంది. అందరిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి, ప్రభుత్వ సహకారంతో చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కృషి చేస్తోంది. భారీ బహిరంగ సభకు కావలసిన నిధుల సమీకరణలో ఫ్రంట్ నిమగ్నమై ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Jan 1, 2018

అమరావతిలో పీఆర్ఎస్ఐ ఛాప్టర్ ప్రారంభం


సచివాలయం, జనవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం 1వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో సోమవారం మధ్యాహ్నం  పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) అమరావతి ఛాప్టర్ ని ఆవిష్కరించారు. ఛాప్టర్ ఫలకం, బ్రోచర్ తోపాటు, ఫ్లెక్సీపై సంతకం చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను జనబాహుళ్యంలోకి తీసుకువెళుతున్న రాష్ట్ర పౌరసంబంధాల అధికారుల(పీఆర్ఓల) పాత్రను కొనియాడారు. నూతన రాజధానిలో ఏర్పాటు చేస్తున్న పీఆర్ఎస్ఐ కొత్త ఛాప్టర్ అందుకు కృషి చేయాలన్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్, అమరావతి ఛాప్టర్ చైర్మన్ వీఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ దేశంలో పీఆర్ఎస్ఐ ఛాప్టర్లు 25 ఉన్నాయని, ఇది 26వదని తెలిపారు. ఛాప్టర్ ఆవిష్కరించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పని చేసే పీఆర్ఓలు అందరూ ఛాప్టర్ లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. అమరావతిలో ఛాప్టర్ కార్యాలయం ఏర్పాటుకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాప్టర్ సభ్యులు పీఎన్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వండి


జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
మార్చి లోపల అన్ని లక్ష్యాలను పూర్తి చేయాలి

            సచివాలయం, డిసెంబర్ 30: గృహ నిర్మాణ పథకాలను ముఖ్యమైనవిగా భావించి లక్ష్యాల మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో గృహనిర్మాణ పథకాలు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా), సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్ వాడీ భవనాల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు, రోడ్ల సౌకర్యం, వ్యర్ధాల నుంచి ఇంధన ఉత్పత్తి, ప్రణాళికా శాఖకు అందించే డేటా,  గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం, వాటర్ షెడ్, మొక్కలు నాటే కార్యక్రమాలు తదితర పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హౌసింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉమ్మడి బాధ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణంలో వెనుకబడిన జిల్లా కలెక్టర్లను గట్టిగా అడిగారు. పనులలో వేగం పెంచాలని చెప్పారు.  గృహ నిర్మాణ శాఖ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, పని పట్ల అశ్రద్ధ చూపినా వారిపై నివేదిక ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు మార్చినాటికి పూర్తి చేస్తామని చెప్పారు.  నెల్లూరు జిల్లాలో పనులు బాగా జరుగుతున్నాయని ఆ జిల్లా కలెక్టర్ ని సీఎస్  అభినందించారు. కర్నూలు జిల్లాలో పనులు ఆలస్యంగా మొదలుపెట్టిన విషయం ప్రస్తావిస్తూ బ్యాటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టారేమిటని ఓ ఛలోక్తి విసిరారు. నంద్యాల ఎన్నికల వల్ల అని ఆ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పారు. పట్టణ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఏలూరు, ధర్మవరం వంటి కొన్ని చోట్ల స్థల సమస్యలు ఉన్నాయని, వాటిని వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని కొందరు కలెక్టర్లు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు వెనుకబడి ఉన్నట్లు తెలుసుకొని పనులలో వేగం పెంచమని ఆదేశించారు.  నరేగాకు సంబంధించి సీసీ రోడ్లు, అంగన్ వాడీ భవనాల నిర్మాణం, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, శ్మశానవాటికల నిర్మాణం, మొక్కలు నాటడం వంటి పలు పనులను సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం నింపడంలో భాగంగా కలెక్టర్లు శ్రద్ధ వహించి బాధ్యతగా మొక్కలు నాటించాలన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత(ఓపెన్ డెఫెకెషన్ ఫ్రీ-ఓడీఎఫ్)కార్యక్రమాలను కూడా సమీక్షించారు. నరేగా పనులకు సంబంధించి నిబంధనల ప్రకారం ముందుగా డబ్బు చెల్లించడానికి అవకాశం లేదన్న విషయాన్ని సంబంధిత అధికారి కలెక్టర్లకు గుర్తు చేశారు. అంగన్ వాడీ భవనాలకు సంబంధించి పూర్తి అయిన, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లు సీఎస్ కు వివరించారు. కర్నూలు జిల్లాలో 118, శ్రీకాకుళంలో 168, విజయనగరంలో 159, గుంటూరులో 185 భవనాల నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన వాటిని మార్చి 31 లోపల పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చాలా వరకు పూర్తి అయిందని, మిగిలిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్లు చెప్పారు. రోడ్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎస్ ఆర్థిక సంవత్సరం చివరినాటికి లక్ష్యం పూర్తి అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌ జలసిరి-2లో భాగంగా 35 వేల బోర్‌వెల్స్‌ తవ్వాలని లక్ష్యం కాగా, జిల్లాల వారీగా పూర్తి చేసిన బోర్ వెల్స్ వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లు సీఎస్ కు తెలిపారు. కృష్ణా జిల్లాలో 2500 బోర్లకు 389 మాత్రమే పూర్తి చేసినట్లు తెలుసుకొని పనులలో వేగం పెంచాలని ఆదేశించారుముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి చివరికి 17,591 బోర్ వెల్స్ తవ్వించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారువ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తికి సంబంధించి రాజమండ్రి, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు తదితర చోట్ల జిందాల్, ఎస్ ఎల్ గ్రూప్ ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు, కొన్ని పనులు 2018లో, మరి కొన్ని పనులు 2019లో పూర్తి అవుతాయని,   ఏడు మున్సిపాలిటీలలో స్థల సమస్యలు ఉన్నట్లు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కరికాల వలవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ కు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు, రోడ్ల సౌకర్యాల సమీక్ష సందర్భంగా 1057 పనులు మంజూరైనట్లు, వాటిలో 286 పూర్తి చేసినట్లు, 701 పనులు జరుగుతున్నట్లు, 286 నివాస ప్రాంతాలకు త్రాగునీరు అందజేస్తున్నట్లు  గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రామ్ ప్రకాష్ సిసోడియా వివరించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పనులు జరుగుతున్న తీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 33 పనులకు రూ.5.62 కోట్లు, జాతీయ గ్రామీణ త్రాగునీటి కార్యక్రమం(ఎన్ఆర్డీడబ్ల్యూపి) కింద 325 పనులకు రూ.44.62 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద సీఎం నిధుల నుంచి 699 పనులకు రూ. 104.99 కోట్లు మంజూరైనట్లు వివరించారు. 2623 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.808.46 కోట్లతో 1398 పనులు మంజూరైనట్లు, వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు వివిధ దశలలో జరుగుతున్నట్లు తెలిపారు. పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం  గిరిజన ప్రాంత అభివృద్ధి సంస్థల ప్రాజెక్ట్ అధికారులతో కూడా  సీఎస్ మాట్లాడి ఆయా ప్రాంతాల పనులను  సమీక్షించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంజనీర్లతో సమావేశమై నిర్ణయించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో పనులు చేయించాలన్నారు. విశాఖ నగరంతోపాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆ జిల్లా కలెక్టర్ కు చెప్పారు. ప్లానింగ్ విభానికి సంబంధించిన పలు అంశాలను కూడా సమీక్షించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, మీ సేవా కేంద్రాలు, ఇమ్యునైజేషన్, విద్య తదితర అంశాలన్ని ప్రస్తావనకు వచ్చాయి. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు పలు సమస్యలను వివరించగా, వాటికి పరిష్కార మార్గాలను చెప్పారు. చివరిగా సీఎస్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి, గ్రీనరీకి, ఎన్టీఆర్ జలసిరి, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రణాళికా విభాగానికి సంబంధించి డేటా విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సీఎస్ దినేష్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సంజయ్ గుప్తా, గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.