May 17, 2017

సిమెంట్ బస్తా రూ.310లకే విక్రయించాలి

మంత్రి మండలి ఉప సంఘం  అదేశం
అంగీకరించిన ఉత్పత్తిదారులు
             సచివాలయం, మే17: రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ.310 లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను  అదేశించింది. సచివాలయం 2వ బ్లాకులో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం  సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు మూడు అంశాలపై సమావేశమయ్యారు.  వారు ఆయా శాఖ మంత్రులు నారా లోకేష్,  కొల్లు రవీంద్ర, అమర్నాధ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఉన్నతాధికారులు, ఆయా రంగాలకు చెందినవారితో చర్చించారు.  తొలుత ఫెర్రో ఎల్లాయిస్ రంగంపైన, ఆ తరువాత నిరుద్యోగ భృతి, సిమెంట్ ధరల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులు సమావేశాల వివరాలను మీడియాకు వివరించారు. సామాన్య ప్రజలు ఇబ్బందిపడకుండా సిమెంట్ బస్తా ధర రూ.310 లకు విక్రయించాలని ఉప సంఘం అదేశించిందని, అందుకు ఉత్పత్తిదారులు అంగీకరించినట్లు చెప్పారు. రేపటి నుంచే ఈ ధర అమలు చేస్తారన్నారు. గత నెలలో ఉత్పత్తిదారులతో జరిగిన సమావేశం తరువాత ధరలు కొంత తగ్గినట్లు చెప్పారు. వారం, పది రోజుల తరువాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. ఒక వేళ వాళ్లు చెప్పిన ధరకంటే ఎక్కువ అమ్మితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు.  ప్రభుత్వ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.  మైనింగ్, పవర్ సరఫరా, ప్రభుత్వ చెల్లింపులు వంటివాటిని ఆపివేస్తామన్నారు. పరిశ్రమలవారిని ఇబ్బందిపెట్టే ఉద్దేశం తమకులేదని వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. 
కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లింపు
ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటుకు సంబంధించిన డీడీలను కాంట్రాక్టర్లతో సంబంధంలేకుండా ప్రభుత్వమే చెల్లించేవిధంగా నిర్ణయం తీసుకున్నట్లు  మంత్రులు చెప్పారు. హౌసింగ్, ఆర్అండ్ బి, పోలవరం ప్రాజెక్టు, పంచాయతీరాజ్ శాఖల పనులకు ఎక్కువగా సిమెంట్ అవసరం ఉంటుందని తెలిపారు. సమయానికి సిమెంట్ సరఫరా చేయకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతున్నట్లు చెప్పారు. అందువల్ల ఏ శాఖకు ఎంత సిమెంట్ కావాలో వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆ వివరాలను కంపెనీలకు పంపి సరఫరాలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది రాయితీ ఇవ్వడానికి సిఫారసు
రాష్ట్రంలోని ఫెర్రోఎల్లాయిస్ పరిశ్రమకు ప్రస్తుతం ఇచ్చే విద్యుత్ రాయితీని మరో ఏడాది పొడిగించడానికి  ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రి మండలి ఉప సంఘం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో 35 ఫెర్రోఎల్లాయిస్ కంపెనీలు ఉన్నాయని, పవర్ టారిఫ్ పెరగడం వల్ల అప్పట్లో 30 కంపెనీలు మూతపడ్డాయని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఏడాది క్రితం విద్యుత్ ఛార్జీలను రూపాయిన్నర తగ్గించి రెండు ఏళ్లు ఇవ్వాలని ఆలోచన చేసి, ఒక ఏడాదికి అనుమతి ఇచ్చినట్లు వివరించారు.  ఏప్రిల్ తో సంవత్సరం అయిపోయిందని,  2వ సంవత్సరం కూడా రాయితీ పొడిగించమని ఆ పరిశ్రమ వర్గాలు అడిగినట్లు తెలిపారు. గత ఏడాది రాయితీ ఇవ్వడం వల్ల 25 కంపెనీలు తెరిచారని చెప్పారు.  పది వేల మందికి ఉపాధిక కల్పించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయని, అయితే 6,800 మందికి ఉపాధి కల్పించినట్లు పరిశ్రమల శాఖ వారు తెలిపారని వివరించారు. ఈ నేపధ్యంలో పీఆర్సీ చైర్మన్ కూడా వారికి ఒక ఏడాది రాయితీ ఇవ్వమని సిఫారసు చేశారని చెప్పారు. దాంతో  ఫెర్రోఎల్లాయిస్ కంపెనీల వారితో మాట్లాడి తాము కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పామని, అంతేకాకుండా  ఇదే చివరి అవకాశమని వారికి తెలిపినట్లు మంత్రులు చెప్పారు. అయితే వారికి రాయితీ మరో ఏడాది ఇవ్వమని మంత్రి మండలికి సిఫారసు చేయాలని మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి మండలి నిర్ణయం తరువాత వారికి రాయితీ కొనసాగిస్తారని మంత్రులు కామినేని, అచ్చెన్నాయుడులు చెప్పారు.
నిరుద్యోగ భృతిపై జూలైలో తుది నిర్ణయం
నిరుద్యోగులకు భృతి ఇచ్చే అంశంపై మంత్రి మండలి ఉపసంఘం చర్చించినట్లు  మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రలో 12 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే ఆ సంఖ్యను స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం యువతకు  న్యాయం చేస్తామని చెప్పారు. వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకొని, మన రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. నిధులకు కొరతలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో రూ.1000 నుంచి రూ.1500 ఇస్తున్నారని, కొన్ని రాష్ట్రాల్లో వంద, రెండొందలు ఇస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుని అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ విషయమై జూన్ లో సమావేశమై చర్చిస్తామన్నారు. జూలై నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.

May 15, 2017

ఎమ్మెల్సీలుగా శత్రుచర్ల, వాకాటి ప్రమాణ స్వీకారం

సచివాలయం, మే15: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామ రాజు, వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ఉదయం వెలగపూడి శాసనసభ ప్రాంగణంలోని మండలి అధ్యక్షుని చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి అధ్యక్షుడు డాక్టర్ చక్రపాణి వారిచేత ప్రమాణం చేయించారు. శత్రుచర్ల విజయరామ రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి, వాకాటి నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.  

May 14, 2017

ఏపీలో నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావానికి శిక్షణ

Ø ఏపీ ప్రభుత్వం-బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒప్పందం
Ø శిక్షణతో లక్ష మంది నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావం
Ø 17 లక్షల మందికి ఆంగ్ల భాష నేర్పే ప్రాజెక్ట్

            రాష్ట్రంలోని యువత అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా, వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఙానం పెంపొందించేందుకు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఓ ప్రాజెక్టును చేపట్టింది. లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో  బ్రిటిష్ కౌన్సిల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో, కళాశాలల్లో చదువుకునే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ ప్రాజెక్టు ద్వారా వారి ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని మెరుగుపరుస్తారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ ద్వారా వారికి భాషలో మెళకువలు నేర్పుతారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి కూడా వారు పనిచేసే చోట భాషా కౌశల్యం ప్రదర్శించేవిధంగా శిక్షణ ఇస్తారు.

         బ్రిటిష్ కౌన్సిల్ అనేది యూకెకు చెందిన అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు, విద్యా అవకాశాలు మెరుగుపరిచే సంస్థ. 1934లో ప్రారంభించిన ఈ సంస్థకు 18 శాతం నిధులను బ్రిటిష్ ప్రభుత్వం సమకూరుస్తుంది.   ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలతో కలసి అక్కడి సంస్కృతి, కళలు, ఆంగ్లభాష, విద్య, సామాజిక రంగాల్లో కలసి పని చేస్తుంది. యూకే, ఆయా దేశాల మధ్య స్నేహపూర్వక విజ్ఞానాన్ని, ప్రజల మధ్య అవగాహనను పెంపొందిస్తుంది. ఆంగ్ల భాషలో శిక్షణకు సహకరిస్తోంది. తమ దేశానికి చెందిన సాంస్కృతిక వనరులను వినియోగించుకొని అక్కడి ప్రజల జీవితాల్లో మార్పునకు సహకరిస్తూ, విశ్వాసాన్ని కలిగిస్తూ, సంబంధాలను మెరుగుపరుస్తుంది. కౌన్సిల్ ప్రతినిధులు ప్రతి ఏటా రెండు కోట్ల మందికి పైగా ప్రజలను ఆన్ లైన్ లో కలుసుకుంటారు. యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ 2017లో భాగంగా బ్రిటిష్ కౌన్సిల్ అనుబంధ సంస్థ బీసీఈఈఎస్ఐపీఎల్ (బ్రిటిష్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంగ్లీష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఏపీతో తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ ఏడాది పొడవునా అనే కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుపుతారు.  ఆ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కని ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉండటంతో ఈ సంస్థ ఇక్కడ వ్యవస్థీకృత, సుస్థిరమైన ఓ పైలెట్ ప్రాజెక్టుని నిర్వహిస్తోంది. ఏపీలోని కళాశాలల్లో నాణ్యమైన, ఉత్తమ ఇంగ్లీష్ బోధన జరుగుతోంది. దీని ద్వారా 17 లక్షల మంది విద్యార్థులు తరగతి గదిలోనే ఆంగ్ల భాష సంభాషణా చాతుర్యం మెరుగుపరుచుకొని, ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడానికి, విద్యా, ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు 15 నెలల పాటు కొనసాగుతుంది. ఆంగ్ల భాషను బోధించే అధ్యాపకులు తమ బోధన విధాలనాలను మెరుగుపరుచుకుంటారు. ఆ విధంగా వారు ఉత్తమ రీతిలో సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించే విధంగా శిక్షకులు తయారవడానికి అవకాశం ఉంటుందిమాస్టర్ ట్రైనర్లను కూడా అభివృద్ధి పరచుకోవడానికి వీలుకలుగుతుంది. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయకులకు నిరంతరం వృత్తిపరమైన శిక్షణ ఇస్తారువిద్యార్థులు ముఖాముఖి, ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందుతారు.
విస్తృతమైన పరిశోధనల ఆధారంగా భాష నేర్చుకునేవారికి అనుకూలంగా ఈ బ్రిటిష్ కౌన్సిల్ కొన్ని విధానాలను రూపొందించింది. అత్యుత్తమ బోధనా వాతావరణాన్ని సృష్టించేవిధంగా, డిజిటల్ కార్యక్రమాలను కూడా తయారు చేశారు. ఆ ప్రకారం నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అధ్యాపకులకు కూడా శిక్షణ ఇస్తారు. వారిలో కూడా పోటీ తత్వం ప్రోత్సహిస్తారు. తమ వద్ద నేర్చుకునే విద్యార్థులకు వారు మద్దతుగా నిలిచి, వారు అత్యుత్తమ స్థాయికి ఎదిగేవిధంగా తీర్చిదిద్దుతారు. ఆ విధంగా విద్య పూర్తి చేసుకొని విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి బయటకు వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
           
  విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసి, వృద్ధి రేటు వేగంగా పెరిగేవిధంగా కృషి చేయాలన్న పట్టుదలతో ఏపీ సీఎం ఉన్నారు. లక్ష మందికి ఉపాధి నైపుణ్య శిక్షణ ఇప్పించాలన్న ఉద్దేశం ఆయనది. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలవడానికి బ్రిటిష్ కౌన్సిల్బీసీఈఈఎస్ఐపీఎల్ ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, స్పోకెన్ ఇంగ్లీష్ స్థాయిని వృద్ధి చేసి రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన యువశక్తిని రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆంగ్ల భాషలో శిక్షణ పొందడం ద్వారా లక్ష మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వారు ఆధునిక శిక్షణ పద్దతుల ద్వారా ఆంగ్ల భాష అభ్యాసం, సంభాషణా చాతుర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. 21వ శతాబ్ధపు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయి పని వాతావరణానికి అలవాటుపడతారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ పొందుతారు. ఈ శిక్షణ ద్వారా ఇక్కడి యువత రాష్ట్రంలో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాక దేశవిదేశాల్లో ఉపాధి పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే అత్యధిక అవకాశాలు రావాలన్నది ప్రభుత్వం లక్ష్యం. వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను ఇక్కడే సమకూర్చాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది దోహదపడుతుంది. మౌలిక సదుపాయాలతోపాటు  నైపుణ్యత గలిగిన మానవవనరులు ఇక్కడే లభిస్తే పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడి యువతలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెందితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

పవర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

·       స్టోరేజ్‌తో రెండో దశ సోలార్ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం
·       విద్యుత్ ధరలు తగ్గించే ఆలోచన
·       రెండు కీలక ఒప్పందాలు
·       రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారం
·       త్వరలో ప్రజలు ఫస్ట్’  అమలు
·       ఏపీలో మెగా సీడ్ పార్కులు

         సచివాలయం, మే 13: పవర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 7 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయంలోని 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన అమెరికా పర్యటన సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌కు దోహదపడిందని చెప్పారు. ఈ పర్యటన ద్వారా తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఒక సీఎం అప్ డేట్ అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులను, సాధారణ పౌరులను పట్టి పీడిస్తున్న వ్యవసాయం, విద్యుత్ రెండు ప్రధాన సమస్యలకు ఈ పర్యటనలో ఒక పరిష్కారం  లభించిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పాదనకు కూడా జరుగుతున్నట్లు తెలిపారు.  సోలార్, విండ్ ఎనర్జీపైన ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.  సోలార్ విద్యుత్‌ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లా కంపెనీతో  సంప్రదించినట్లు చెప్పారు.  మన  ఇంటిపైనే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు అవసరమైన  ఇంధనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని  టెస్లా అందిస్తోందని వివరించారు.  రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు రూ.14 లున్న సోలార్ విద్యుత్ యూనిట్ ధర ఇప్పుడు రూ.3.15లకు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రూ.2.45లకు లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సోలార్ స్టోరేజ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.  తొలిదశలో వ్యవసాయ  పంపుసెట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు.  సోలార్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండో దశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.  గ్రామ స్థాయి, ఫీడర్ స్థాయి విద్యుత్ గ్రిడ్లను రూపొందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీలో వారితో మాట్లాడిన తరువాత ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన  చేసినట్లు చెప్పారు.  భారతదేశ విద్యుత్ రంగాన్ని సమూలంగా మార్చబోతున్న నిర్ణయమన్నారు.  ఇది ఒక విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో  విద్యుత్ ఉత్పత్తి పెంచి ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారతదేశం ఒక ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే తన తపనగా సీఎం పేర్కొన్నారు.

నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అనినాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు.  రాష్ట్రం సమైక్యంగా వున్నప్పుడు ఏ  సెక్టారులో కృషి చేస్తే మనకు ఫలితాలు వస్తాయని ఆలోచించి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ కోసం ప్రయత్నించామని,   అందులో భాగంగానే  రాష్ట్రంలోని 30 ఇంజనీరింగ్ కళాశాలను 350కి పెంచినట్లు వివరించారు. ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి నలుగురిలో  ఒకరు భారతీయుడు ఉంటాడని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువాడు ఉంటాడని చెప్పారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయంతో తెలుగు వారు ముందున్నరన్నారు. ప్రొఫెషనల్స్‌గా సంతృప్తి పడరాదని, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని వారికి సలహా ఇచ్చినట్లు చెప్పారు.  కేపీఎంజీ సంస్థ ద్వారా తెలుగువాళ్లు ఎలా ఎదగాలనే అంశంపై అధ్యయనం చేయించినట్లు చెప్పారు.  ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో తెలుగువారు వుండాలనేది తన కోరిక అన్నారు.
              తన అమెరికా పర్యటనలో రెండవ కీలక ఒప్పందం అయోవా యూనివర్శిటీతో జరిగిందన్నారు. అది ఏపీలో  మెగా సీడ్ పార్కు ఏర్పాటు అని తెలిపారు. ఐయోవా యూనివర్విటీ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్విటీ అని చెప్పారు. వ్యవసాయంలో వ్యూహాలను మార్చి హార్టీకల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టిపెట్టినట్లు తెలిపారు.  రెయిన్ గన్స్, నదుల అనుసంధానం, మొబైల్ లిఫ్టులు వంటి వినూత్న  కార్యక్రమాలను అమలుచేస్తున్నామని చెప్పారు.  ప్రపంచంలో వున్న  బెస్టు టెక్నాలజీని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి నెదర్లాండ్ యూనివర్సిటీ సహకారాన్ని కూడా  తీసుకుంటున్నట్లు తెలిపారు.  ఈ రెండు యూనివర్విటీల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.
          
 ప్రపంచంలో అతిపెద్ద ఉత్తమమైన ప్రైవేటు ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి అని తెలిపారు. పేషెంట్ ఫస్ట్అనే ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యసేవలతో పాటు వైద్యరంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోందన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవేంద్ర గౌడ్ ను పరామర్శించినట్లు తెలిపారు. అక్కడి క్రమశిక్షణ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు.  మయో స్ఫూర్తితో ప్రభుత్వం త్వరలో పీపుల్స్ ఫస్ట్అనే నినాదాన్ని  తీసుకుందని, త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీనిపై ప్రకటన చేస్తానని చెప్పారు.  ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, రెవిన్యూ కార్యాలయం ఎక్కడైనా ప్రజలు  ఫస్ట్ అని చెప్పారు.
       సిలికానాంధ్ర యూనివర్శిటీలో మనబడి వంటి కార్యక్రమాలు బాగున్నాయన్నారు.  దాన్ని అభివృద్ది చేయడానికి రూ.6 కోట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు.  ఈ వర్శిటీ ద్వారా మన సంస్కృతికి ప్రాధాన్య కల్పిస్తామని చెప్పారు. ఈ పర్యటనలో ప్రవాస తెలుగువారికి సంబంధించిన 55 సంఘాల సభ్యులతో సమావేశమైనట్లు తెలిపారు. తెలుగు  ప్రతిష్ట కోసం వారందరిని కలసికట్టుగా ఉండమని, సేవ చేయడంలో పోటీపడమని వారికి చెప్పినట్లు తెలిపారు.  యుఎస్ఐబీసీ ట్రాన్స్‌ఫార్మేటీవ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డును ఇస్తుంటే దాన్ని రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసే ఉద్దేశంతోనే అంగీకరించినట్లు తెలిపారు.  గతంలో ఎన్ని వర్శిటీలు డాక్టరేట్లు ఇస్తానన్నా వద్దన్నానని చెప్పారు.  తన పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనల సీఈఓలను కలసినట్లు తెలిపారు.  సిస్కోలో రియల్ టైమ్ కమ్యూనికేషన్ మెకానిజం గమనించాననిరియల్ టైమ్‌లో ప్రపంచంలోని వివిధ దేశాలలో వున్న తమ సంస్థల పెర్ఫామెన్స్  రిపోర్టులు తెలుసుకునే అవకాశం సిస్కో కార్యస్థానంలో ఉన్నట్లు వివరించారు.  గూగుల్ ఎక్స్ కేంద్రంలో డ్రైవర్ లెస్ కార్, బెలూన్స్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రయోగాలు చూశానన్నారు.  ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ప్రయోగం  చేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చిందని చెప్పారు.  గూగుల్ ఎక్స్ తన ప్రయోగాలన్నింటికీ ఎపీని  పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ఒప్పించినట్లు తెలిపారు.  యాపిల్ సీఈవో విలియమ్స్‌ను కలిశాననిఇండియా బిగ్గెస్ట్ మార్కెట్ అని వారికి వివరించి చెప్పానన్నారు.  ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఫిన్ టెక్  రంగంలో అగ్రగామి అని, విశాఖను ఫైనాన్సియల్ సిటీగా అభివృద్ది చేయడానికి ఆసక్తి చూపిందని చెప్పారు.
సిస్కో హెడ్ జాన్ ఛాంబర్స్ 1998లో తనతో కలిపి తీసుకున్న ఫోటో చూపించారని తెలిపారు.  క్లౌడ్ మేనేజ్మెంట్‌లో సహకరించేందుకు న్యూటనిక్స్ ముందుకొచ్చిందనిఒక నెలలో రోడ్ మ్యాప్ తీసుకొస్తామని చెప్పారు.  గూగుల్ ఎక్స్, యాపిల్, టెస్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సిస్కో, ఫ్లెక్స్‌ట్రాన్సిక్స్, ఎఆర్‌ఎం హోల్డింగ్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో సమావేశాల్లో పాల్గొన్నట్లుఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లాతో మాట్లాడినట్లు చెప్పారు.  ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నామనితమకు ఏపీ బాగా నచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ జెన్నిఫర్ జాన్సన్‌ నాతో చెప్పారు. పలు కంపెనీలు రాష్ట్రం పట్ల ఆసక్తి చూపించాయన్నారు.  ఈవీఎక్స్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌లతో కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి వేల ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారు.  ఇల్లినాయిస్‌ 7వ డిస్ట్రిక్ట్‌ అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి డేని కె. డెవిస్‌ చేతుల మీదుగా లైట్‌ ఆఫ్‌ ద లైఫ్‌ 2017అవార్డు స్వీకరించినట్లు తెలిపారు.

సెమీకండక్టర్, డిస్ ప్లే ఎక్విప్‌మెంట్ తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ  అప్లయిడ్ మెటీరియల్స్ కంపెనీ సీఈవో గ్యారీ డికెరన్తోతో మాట్లాడినట్లు చెప్పారు. అప్లయిడ్ మెటీరియల్స్‌ కంపెనీని ఏపీతో ఎలా భాగస్వామిని చేయాలన్న అంశంపై త్వరలో రోడ్‌మ్యాప్‌ సిద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు న్యుటనిక్స్ కంపెనీ ముందుకొచ్చిందని చెప్పారు. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తామని న్యుటనిక్స్ సీఈఓ ధీరజ్ పాండే చెప్పినట్లు తెలిపారు. 
ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.  ఐటీ దిగ్గజం జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తనను కలిశారని, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన, ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న  అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు.  ఇల్లినాయిస్‌ ఎనిమిదో డిస్ట్రిక్ట్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి రాజా కృష్ణమూర్తితో చికాగోలో సమావేశం జరిగినట్లు తెలిపారు.  ఒకసారి అమరావతిని సందర్శించాలని ఆయనను కోరగా వస్తానని చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యాననిమాతృభూమికి ఎన్నడూ దూరం కావొద్దని, పుట్టిన గడ్డతో నిరంతరం సంబంధాలు నెరపాలని సూచించినట్లు చెప్పారు. అలాగే స్థానికులతో అవగాహనతో ఉండి, వారి క్షేమానికి కూడా కొంత ఖర్చు చేయాలని చెప్పినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనదని , దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.  టెక్నాలజీని వినియోగించుకోకుండా వదిలిపెట్టలేం. అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ అవసరం అని,   కళాశాలల్లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చెప్పారు.  సమావేశంలో సీఎం పక్కన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూర్చున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికైన వాకాటి సస్పెన్షన్
 నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన  వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విచారణ తరువాత ఆయనపై ఆరోపణలు నిజం కాదని తేలితే సస్పెన్షన్ తొలగిస్తామన్నారు.


May 12, 2017

ఆర్థిక నేరాలపై విస్తృత స్థాయిలో చర్చ

సచివాలయంలో ఎస్ఎస్ సీసీ 11 వ సమావేశం
·       ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయం
·       ఈ నెల 26న స్వయంసేవక గ్రూపు మహిళలకు శిక్షణ
            సచివాలయం, మే 11: రాష్ట్రంలో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న ఆర్థిక నేరాలపై స్టేట్ లెవల్ కోఆర్డినేషన్ (ఎస్ఎల్ సీసీ) విస్తృత స్థాయిలో చర్చించింది. సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక శాఖ సమావేశ మందిరంలో ఎస్ఎల్ సీసీ 11వ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా డిపాజిట్ల పేరుతో జరుగుతున్న మోసాలు, వాటికి సంబంధించిన కేసులను ఆర్బీఐ, రాష్ట్ర ఆర్థిక, హోం శాఖల ఉన్నతాధికారులు సమీక్షించారు. చిట్ ఫడ్ కంపెనీలు, కోపరేటివ్ సొసైటీలు, రియల్ ఎస్టేట్, బిల్డర్స్, డెవలపర్స్, కాల్ మనీ, ఎర్రచందనం మొక్కల పెంపకం... వంటి పేర్లతో జరిగే మోసాలు చర్చకు వచ్చాయి. అనేక రకాలుగా జరిగే ఆర్థిక నేరాలు, వాటికి సంబంధించిన వివిధ సివిల్, క్రిమినల్ కేసులను సమీక్షించారు. నల్లధనం అరికట్టడానికి చేపట్టిన సంస్కరణలు ఆర్బీఐ అధికారులు వివరించారు. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, కార్పోరేట్ జూయలరీ సంస్థలు సేకరించే డిపాజిట్లు, ఉద్యోగాల పేరుతో వసూలు చేసే ఫీజులు,  మజుమ అఫిషిలియేట్ ఎక్సపెర్టైజ్ లిమిటెడ్, చెరుకూరి గ్రూప్(హైదరాబాద్), అవని గ్రూప్(ఒంగోలు, హైదరాబాదు), ప్రగతి గ్రామీణ వికాస(విజయవాడ), వెబ్ వర్క్.ఇన్(కాన్పూర్),చిట్ మాక్స్(హైదరాబాద్), ఇందూరు డెవలపర్ అండ్ ఏజన్సీ(విజయవాడ), కపిల్ చిట్స్ గ్రూప్, యూనిక్ గోల్డ్ ఇండియా, విశ్వమిత్ర ఇండియా పరివార్(ఉత్తభారతం), గోల్కొండ, హవాలా ... వంటి కేసులు ప్రస్తావనకు వచ్చాయి. ఇదీ అది అని కాకుండా బ్యాంకులు, కేవైసీ, హవాలా నేరాలు, చట్టవ్యతిరేకంగా జరిగే నగదు లావాదేవీలు, వాటిని అరికట్టడానికి తీసుకోవలసి చర్యలు అన్నిటిపై చర్చించారు. చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే, మోసం చేసిన కంపెనీలపై వచ్చిన ఫిర్యాలు, తీసుకుంటున్న చర్యలు,  లీగల్ కేసులను గురించి పోలీస్ అధికారులు వివరించారు.  చట్ట వ్యతిరేకంగా జరిగే ఆర్థిక నేరాలన్నిటినీ, అవి జరిగే తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను సమగ్రంగా చర్చించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే సంస్థలు, అధిక వడ్డీ ఇస్తామని చట్టవ్యతిరేకంగా డిపాజిట్లు  సేకరించే సంస్థలపై, వెబ్ సైట్ల ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉన్నతాధికారులు మాట్లాడారు. ఏఏ కేసులు కోర్టు విచారణలో ఉన్నయో, కొన్ని కేసులు ఏఏ స్థాయిల్లో విచారణ దశలో ఉన్నయో కొందరు అధికారులు వివరించారు.  ముఖ్యంగా ఇటువంటి ఆర్థిక నేరస్తుల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, వారికి అవగాహన కల్పించడానికి ఆచరాణాత్మకమైన కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలు ఎక్కడబడితే అక్కడ డబ్బు డిపాజిట్ చేయకుండా, ఏ విధంగా మోసాలు జరుగుతాయో వారికి వివరించి చెప్పే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. చిల్లర వ్యాపారులు, చిన్న వ్యాపారులు, మార్కెట్లలోనూ, బజార్ల వెంట తిరుగుతూ కూరగాయలు అమ్ముకునేవారు ఎక్కవ వడ్డీకి డబ్బుతీసుకునే అంశాలను, వారిని ఆదుకునే మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఎవరినిబడితే వారిని నమ్మి చట్టవ్యతిరేకంగా డిపాజిట్లు చేయకుండా, అధిక వడ్డీలకు నగదు తీసుకొని నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉన్న స్వయంసేవక గ్రూపుల మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదట ఈ నెల 26న రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వంద మంది స్వయంసేవక సంఘాల ముఖ్యులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.  వారు ఆయా జిల్లాల్లోని గ్రూపు సభ్యులకు అవగాహన కల్పిస్తారు.  ఎంపిక చేసి వారికి రిజర్వు బ్యాంకు, పోలీసు శాఖ, ఆర్థిక శాఖల అధికారులు శిక్షణ ఇస్తారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.రవిచంద్ర, సెక్రటరీ కె.సునీత, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. అనురాధ, సీఐడీ ఐజీ అమిత్ గార్గ్, సీఐడీ అడిషనల్ డీజీ తిరుమల రావు, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ ఆర్.సుబ్రమణియన్, జనరల్ మేనేజర్ సువెందు పాటి పాల్గొన్నారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి. 


పెట్టుబడులకు ఆంధ్రా అనుకూలం: చైనా ప్రతినిధి బృందం

బంధాలు పఠిష్టతకు సందర్శన ఉపయుక్తం
రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు వివరించిన అధికారులు

            సచివాలయం, మే: 10: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో అన్నారు. చైనా ప్రభుత్వ  సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు బుధవారం ఉదయం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్,వ్యవసాయ ఉత్పత్తల వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి అమరనాథరెడ్డి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(ఏడీబీ) సీనియర్ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం చైనా, ఏపి బృందాల మధ్య జరిగిన సమావేశంలో ఏపీ  అధికారులు రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాల గురించి వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సముద్ర తీరం, అపారంగా ఉన్న వనరులు, ఖనిజసంపద, నైపుణ్యత గల మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులు వల్ల  పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం 12 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2029 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం  ప్రైవేటు పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇ-గవర్నెస్ లో రాష్ట్ర ప్రగతిని వివరించారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన 39 రకాల అనుమతులు 21 రోజుల్లో పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు.  అలాగే రాష్ట్రంలో ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, పెట్రోకెమికల్, లెథర్ టెక్నాలజీ, టెక్సటైల్స్, ఎనర్జీ, లైఫ్ సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వివిధ రంగా అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన పాలసీల గురించి వివరించారు. ప్రాంతాలవారీగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలను వివరిస్తూ రూపొందించిన మ్యాప్ ను ప్రదర్శించారు. రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని, మరో ఆరు విమానాశ్రయాల నిర్మాణం ప్రతిపాదనలో ఉన్నట్లు వివరించారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక జోన్లు, వాటి మధ్య పారిశ్రామిక మండళ్లు గురించి సవివరంగా తెలిపారు. సముద్ర తీరంవెంట లభించే ఖనిజవనరులు, అందుబాటులో ఉన్న పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల గురించి వివరించారు. రాష్ట్రాన్ని వ్యవసాయ ఉత్సత్తుల ఎగుమతి జోన్ గా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను తెలిపారు. వివిధ రకాల ఖనిజ సంపద, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 17 వందలకుపైగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపించినట్లు వివరంచారు. విశాఖలో పెట్రోలియం రిఫైనరీ, పవర్ సెక్టార్ లో చేపట్టిన సంస్కరణలు, పొందిన అవార్డులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు నెలకొల్పనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు పది జిల్లాల్లో స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, స్థాపించనున్న విద్యా సంస్థల గురించి వివరిస్తూ  నాలెడ్జి స్టేట్ గా, విద్యా హబ్ గా రూపొందనున్నట్లు తెలిపారు.

          చైనా, బ్రిటన్, సింగపూర్, జపాన్, డెన్మార్క్ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 29 గ్రామాలను కలుపుతూ  217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించే నూతన రాజధాని అమరావతి గురించి వివరించారు. అంతర్గతంగా నిర్మించే 9 నగరాల గురించి కూడా తెలిపారు. ఇక్కడ హైటెక్, ఫ్యాషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2015లో సీఎం ఆరు రోజుల పాటు చైనాలో పర్యటించి వివిధ అంశాలకు సంబంధించి 29 ఒప్పొందాలు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సోలార్ విద్యుత్ యూనిట్ స్థాపనకు కూడా ఒక ఒప్పొందం జరిగినట్లు చెప్పారు. ఇప్పటికే చైనాకు చెందిన సంస్థలు పెట్టిన పెట్టుబడుల గురించి తెలిపారు.

              చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో మాట్లాడుతూ షెన్సాంగ్ సిటీ అభివృద్ధి క్రమం వివరించారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని వాతావరణం తమకు నచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ దేశానికి చెందిన సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తమ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత పటిష్టమవుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.

పట్టణాభివృద్ధి అధికారులతో సమావేశం
         చైనా బృందం పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమైంది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వరవన్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పెట్టుబడులకు అవకాశాలు వివరించారు. వీడియో ప్రదర్శన ద్వారా కూడా పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు స్మార్ట్ సిటీలు,  విశాఖ, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం వంటి చోట్ల సౌకర్యాలు వివరించారు. విశాఖ, విజయవాడల మెట్రో రైల్ ప్రాజెక్టులు, స్వచ్ఛాంధ్ర, ఇ-గవర్నెస్ వంటి అంశాలను తెలిపారు. వంద పట్టణాలను ఆర్థిక నగరాలుగా అభివృద్ధి చేసే క్రమం, అక్కడ కల్పించే విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు ...వంటి సౌకర్యాల కల్పన గురించి వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు.

చైనా-భారత్ ఉమ్మడి వెంచర్ గా పౌల్టీ ఫీడ్స్ ఉత్పత్తి
        చైనాకు చెందిన వెల్ హోప్, భారత్ కు చెందిన నెక్సస్ ఫీడ్స్ సంస్థలు ఉమ్మడి వెంచర్ భారత్ లో ఇప్పటికే పౌల్టీ ఫీడ్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీలలో ఉత్పత్తి ప్రారంభించినట్లు నెక్సెస్ ఫీడ్ ఎండి సత్యనారాయణ రెడ్డి చెప్పారు. వ్యవసాయ రంగంలో పైలెట్ ప్రాజెక్టుని చేపట్టే ప్రయత్నంలో తెలిపారు. ప్రస్తుతం ఆక్వాఫీడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కూడా ఉమ్మడిగా ఉత్పత్తులు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు ఆయన చెప్పారు. .

రెండు విడతలుగా జరిగిన సమావేశాల్లో మంత్రి అమరనాధ్ రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వరవన్, షెన్సాంగ్ సిటీ చైర్మన్  పాన్ లింగ్, చైనా వ్యాపార వేత్త వెల్ హోప్ ఎండీ ఎలెక్స్, నెక్సస్ ఫీడ్ ఎండి సత్యనారాయణ రెడ్డి, చైనా, ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులు, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు  పాల్గొన్నారు.

 జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.