Oct 28, 2023

అంతర్జాతీయ చిత్రకళా రంగంలో తెలుగు సంతకం ఎస్వీ


మన తెలంగాణ 28.10.2023

ఆదాబ్ హైదరాబాద్ 25.10.2023

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 1న విజయవాడలో ఎస్వీ రామారావుకు వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023 అందజేస్తున్న సందర్భంగా)

డాక్టర్ ఎస్వీ రామారావు పరిచయం అక్కరలేని ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు. ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన  మన తెలుగువాడు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళా విమర్శకుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. తైలవర్ణంలో  ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం.రంగులు, ఆ రంగుల గీతల భాష తెలిసిన మేథావి. దానికితోడు పుస్తక పఠనంతో మేథోశక్తిని పొందారు.  తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకున్నారు. వీటన్నిటి మేళవింపుతో రూపొందించినందునే ఎస్వీ చిత్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఆయన మద్రాస్ లో ఉన్న సమయంలో  భారతి, మురళి,ఆంధ్రమహిళ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలకు చిత్రకళతోపాటు వివిధ అంశాలపై  వ్యాసాలు రాసేవారు. 
ఎస్వీ రామారావు 1936లో కృష్ణా జిల్లా గుడివాడలో  శిరందాసు గంగయ్య, లక్ష్మయ్యలకు జన్మించారు.ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు.12 ఏళ్ల వయసులోనే ఆయనకు చిత్రకళపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రాలు గీయడం పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్వీని చూసి తండ్రి ఆందోళన చెందారు. తండ్రి కోరికమేరకు 1954లో  బీకాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో బీఏ డిగ్రీ పూర్తిచేశారు.  1955 నాటికి చిత్రకళలో నాలుగు డిప్లొమాలు సంపాదించారు. కలకత్తాలోని శాంతినికేతన్ లో శిక్షణ పొందాలనుకున్నారు గానీ, అది సాధ్యంకాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి గంగయ్య చివరకు మద్రాస్  లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా చేర్పించారు.  సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల  గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఎంట్రన్స్ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్ అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అదే ఆయన జీవితంలో ఓ పెద్ద మలుపు. అక్కడ ఆయన నిష్ణాతులైనవారి వద్ద వివిధ రీతుల చిత్రకళలలో మెళకువలు నేర్చుకున్నారు. వాటర్ , ఆయిల్, టెంపేరా కలర్స్ లో  చిత్రాలు గీసేవారు.పెద్దలతో పోటీపడిమరీ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. దేశంలో చాలా మ్యూజియంలవారు ఎస్వీ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సాహిత్యంలో, చిత్రకళలో పెన్ నేమ్ వాడటం ఫ్యాషన్ గా ఉండేది. ఆ ప్రభావంతో ఎస్వీ కూడా ‘ఆర్యదేవ’ పేరుతో చిత్రాలు గీసేవారు. ఆయన భారత్ లో ఉన్నంత కాలం ఆ పేరుతోనే చిత్రీకరించారు. మద్రాస్ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలలో ఆయన చిత్రాలు  ఆర్యదేవ పేరుతోనే ఉన్నాయి. 

కామన్ వెల్త్ దేశాల చిత్రకారులతో పోటీపడి  కామన్ వెల్త్ ఫెలోషిప్ సాధించారు. అన్ని దేశాలకు కలిపి ఇచ్చే ఒకే ఒక ఫెలోషిప్  పొంది ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో   ఎస్వీ రామారావు లండన్ వెళ్లారు.  అక్కడ లండన్ యూనివర్సిటీకి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో  1965లో కోర్సు పూర్తి చేశారు. లితోగ్రఫీ ఆర్ట్ లో ఎస్వీ దిట్ట. అందులో కొత్తపుంతలు తొక్కారు. లితోగ్రఫీ ఆర్ట్ లో  మాస్టర్ గా  లండన్ లో పేరుగడించారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. ఎస్వీని  ‘గాడ్ గివెన్ కలరిస్ట్’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్ టైమ్స్ కూడా రాసింది. లండన్ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు.  ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది.  1965లో   కామన్ వెల్త్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు, 2001లో పద్మశ్రీ వంటి జాతీయ అవార్డు  అందుకున్నారు. ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన  వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. ఒక చిత్రాన్ని ఒకేసారి గీస్తారు. ఒకేసారి అమ్ముతారు. దానిని ప్రింట్లు తీసి అమ్మరు. అదే ఆయన ప్రత్యేకత.  50 ఏళ్లుగా అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు. కుటుంబం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన తరచూ భారత్ వస్తుంటారు. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఉంటుంటారు.  ఒక్కోసారి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి చిత్రాలు గీస్తుంటారు. 2008 నుంచి 2015 వరకు ఢిల్లీలోనే ఉండి, అనేక బొమ్మలు గీశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా తదితర నగరాలలో తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.  శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్య భగవానుడంటే ఆయనకు నమ్మకం ఎక్కువ. భారత్ వచ్చిన ప్రతిసారీ అక్కడకు వెళ్లి వస్తుంటారు. 
 మొదట అమెరికాలోని  ఒహాయో రాష్ట్రం  సిన్సనాటిలో  యూనివర్సిటీ ఆఫ్ సిన్స నాటిలో టీచింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్ గ్రీన్ లోని  వెస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ ఆఫ్ ఆర్ట్ గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్ సిటీలోని వేండర్ బిల్ట్ యూనివర్సిటీలో  లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చి, ఆయనతో ఆ కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆ రోజంతా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆయనతోనే గడిపారు. రాష్ట్రపతి భవన్ ను తనే దగ్గరుండి చూపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో ఆయన గురించి రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ఎస్వీకి దక్కిన గొప్పగౌరవం.అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడని ఎస్వీ రామారావు చెప్పారు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు  ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తానన్నారు. నవ్యచిత్రకళ  విశ్వజనీనం అని,  ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం అని వివరించారు.  చిత్ర విచిత్రమైన  రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం అందులోని  విలక్షణత. నవ్య చిత్రకళ  వాస్తవ వాదానికి చెందదని, సహజరూపాన్ని  బ్రద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించటమే ఇందులోని ప్రధాన లక్షణం  అని ఎస్వీ రామారావు చెబుతారు. చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయనకు ఈ అవార్డు అందజేస్తారు.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Oct 18, 2023

కాశీ యాత్ర ఎలా చేయాలి?

కాశీ లేదా వారాణసిలోని వింతలు, విశేషాలు ఏంటి ?


కాశీలో దిగుతూనే  ముందుగా  గంగా దర్శనం.  గంగా స్నానం. 

కాలభైరవుని దర్శనం. కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం

 డుంఠి గణపతి దర్శనం.

 కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది]

 అన్నపూర్ణ దర్శనం..  భాస్కరాచార్య ప్రతిష్ఠిత

 శ్రీచక్ర లింగ దర్శనం.(అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది)

కాశీ విశాలాక్షి దర్శనం.

 వారాహి మాత గుడి (ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది...  లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.  లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి.  ఎవరిని అడిగినా చెపుతారు).  

మణికర్ణికా ఘట్టంలో స్నానం.(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) 

గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)...

కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం..

చింతామణి గణపతి దర్శనం...

అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ  లోలార్కఈశ్వరుని దర్శనం...  

దుర్గా మందిరము... 

గవ్వలమ్మ గుడి...  

తులసీ మానస మందిరము... 

సంకట మోచన హనుమాన్ మందిరం.... 

తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం....

తిలాభాండేశ్వర దర్శనం వీలైతే 

సారనాధ్ స్థూపం  బుద్ధ మందిరం - ఇది కొంత దూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్. 

గంగా నదీ ఘట్టాల దర్శనం... - అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు... 

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.  ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.  గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.... లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు....

బిందు మాధవుని గుడి - ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.... 

ఓంకాళేశ్వర దర్శనం -  మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి. రిక్షా అయితే మంచిది.   ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు  మకారేశ్వరుడు  చిన్నగా ఉంటాయి కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు. 

కృత్తివాసేశ్వర లింగం - ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలాల లోను చల్లగా ఉంటుంది.  స్వయంభూ లింగం. కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే 

మహా మృత్యుమ్జయ లింగం దర్షించుకోవాలి...

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన 

విశ్వనాథ, దుర్గా  లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు 

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున... 

దశాశ్వమేధ ఘాట్ వద్ద  మo గళేశ్వరుడు -.. 

శంక్తా ఘాట్   ఆత్మ విశ్వేశ్వరుడు - 

శంక్తా ఘాట్    కుక్కుటేశ్వరుడు - 

దుర్గా కుండ్   త్రి పరమేశ్వరుడు - 

దుర్గా కుండ్  కాల మాధవుడు - కథ్ కీ హవేలీ    

ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

కాశేశ్వరుడు - త్రిలోచన్    శ్రీ మహా మృత్యుంజయుడు - 

మైదాగిన్  శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు

ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు 

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

కాశీ లో ఉన్న..ఈ తిలభాండేశ్వరుడు ఒక సజీవ లింగం. ప్రతిరోజూ ఒక తిల (నువ్వు గింజ) పరిమాణం పెరుగుతూ ఉంటాడట. అందుకే ఈ లింగం చాలా పెద్దగా ఉంటుంది.

మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్ కుక్కుటేశ్వరుడు- 

దుర్గా కుండ్  త్రి పరమేశ్వరుడు -

దుర్గా కుండ్  కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

కాశేశ్వరుడు - త్రిలోచన్

శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాహీ దేవి

వారాహీ దేవి ఆలయం వుంది. ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో వుంటుంది. నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.

భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.

వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

అన్నపూర్ణామందిరం

కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.

66.శాంక్తా మందిరం

సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో 67.నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

దుర్గా మందిరం

వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. 68. రెండవది  "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు

సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, 69.భారతమాత ఆలయం, 70.బిర్లా మందిరం , 71.కాలభైరవ మందిరం, 72.కవళీ మాత  మందిరం తప్పక దర్శించవాల్సినవి .

 గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

 గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

కాశీ ఈ పేరు పలికితే చాలు శరీరం లో మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతతా , ఆధ్యాత్మిక భావం కలుగుతుంది . ఆ ముక్కంటి దర్శనం మానసికంగా చేస్తాము . అన్ని బంధాలను వదలి ఈశ్వర నివే దిక్కు , పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడినైతి రోజురోజుకి ఏవేవో కోరికలు సంసార పరమైన బాధ్యతలు .. ఒకటి తీరితే మరోకటి ఆపైన ఇంకోటి అవసరాలు పుడుతూనే ఉన్నాయ్ . ఎక్కడని ఆపాను , నా తరమా స్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోక ముందే, మనసారా..  నా కళ్ళార నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్య ఈశ్వర , నా తండ్రి శివ వస్తున్నాను నీ పైనే భారం వేసి బయలుదేరుతున్నా తండ్రి తండ్రి అనుకుంటూ పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర చేసేవారు .

ఆ రోజుల్లో కాశి యాత్ర అంటే కాటికి వెళ్ళడమే . రవాణ సౌకర్యాలు ఏమి లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారు .

కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . సాక్షాత్తు కైలాసవాసి స్వయంగా వారణాశి లో కోలువై యున్నాడు .  వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని మనవాళ్ళు నమ్ముతారు . మరణించిన వార్కి పరమశివుడే తారక మంత్రం చెప్తున్నాడు అని శ్రీ రామకృష్ణ పరమహంస ధ్యానం లోంచి చూసి మరీ చెప్పారు . 

కాశీ క్షేత్రం లో ఉన్న విశ్వేశ్వర లింగం  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి . కాశీ లో గంగ స్నానం కాశీ యాత్ర లో ముఖ్యమైనది . శివుని తలను తాకిన శివగంగ ఇక్కడ ఉత్తరముఖంగా పయనిస్తుంది . కాశీ క్షేత్రం ఎప్పుడు భక్తులతో కిటకిట లాడుతూ నిత్యం శివః నమః తో మరోమోగుతుంది .

గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి

వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో షుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.

ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి" లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు  ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.

కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. 

వారణాసి కాశీ వైభవం.!

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. 

సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం:

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. 

ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. 

కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, 

సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.స్వయంగా శివుడు నివాసముండె నగరం.

ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, 

కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది.

పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు.

కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు 

విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి 

దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది 

ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, 

గోవులు పొడవవు, 

బల్లులు అరవవు, 

శవాలు వాసన పట్టవు, 

కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని 

విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ 

పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీ లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు .

కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి 

పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; 

పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి 

నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన 

అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. 

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో 

అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు.


----------------------

కాశీ యాత్ర చేసే వారికి అన్ని కులాల వారికి వసతి శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం నామ మాత్రం రుసుముతో కల్పిస్తుంది.బ్రాహ్మణులకు మాత్రమే కరివెని సత్రం వసతి కల్పిస్తుంది.అలాగే వైశ్యులకు కూడా విడిగా సత్రాము కలదు.శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం కేదార ఘాట్ దగ్గరలొ ఉంటుంది.ఇక్కడ ఆంధ్ర భోజనం లభిస్తూంది.ఈ చుట్టుపక్కల కూడా ఆంధ్ర టిఫిన్ ఇడ్లీ,వడ,దోస etc లభిస్తాయి.కాశీ విశ్వేశ్వర గుడి ప్రక్కనే శ్రీ అన్నపూర్ణ మందిరం/గుడి ఉంటుంది.ఈ అన్నపూర్ణ ట్రస్టు వారు ఉదయం 9.30 నుండి సాయంత్రం 5గంటల వరకు ఆంధ్ర భోజనం ఉచితం గా అందిస్టారు.క్యు కూడా ఎక్కువే ఉంటుంది.

గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ కాశీ విశ్వనాథ మందిర వారు కూడా ఉచిత భోజన పధకం అమలు చెస్టున్నారు.కాశీ ప్రయాణం చేసే మహిళలు ఒంటి మీద బంగారం ధరించక పొవటం ఉత్తమం.దొంగతనాలు జరిగే ప్రమాదం ఉంది. కాశీ విశ్వనాథ ఆలయం లొ  సంచులు,పెన్,మోబైల్ ఫోను,అగ్గిపెట్టి ,గాజు సీసాలు etc తీసుకుని పోకూడదు.పోలీస్ సెక్యురిటీ వారు అనుమతించరు.

----------------

దీపావళి పండగ కి ఒక రోజు ముందు నుండి 3రోజులు మాత్రమే అంటే దీపావళి పండగ మరునాడు వరకు బంగారం తో చేయబడిన అన్నపూర్ణ విగ్రహం దర్శనం ఉచితంగా, ఉదయం 5గంటలు నుండి సాయంత్రం 7or 8గంటల వరకు  కలిపిస్టారు అన్నపూర్ణ మందిరం వారు. 


అన్ని రోజులలో అన్నపూర్ణ దేవి మూలవిరాట దర్శనం అన్నపూర్ణ మందిరం లొ కలిపిస్టారు ఉచితం గా. అన్నపూర్ణ మందిరం లొ అమ్మవారి అభిషేకం ఫీసు రు.2500 (ఇప్పుడు పెంచారెమో తెలియదు) చెల్లించితే అభిషేకం లొ పాల్గొనవచ్చు. అలాగే సుమారు  500రూపాయలు చెల్లించి  కుంకుమ పూజ చేయించుకొ వచ్చు.కాశీ విశ్వనాథ ఆలయం లొ పూజలన్ని online లొ బుక్ చేసుకోవచ్చు వారి website లొ.

Oct 6, 2023

చాట్‌ జీపీటీలో సంపూర్ణ కచ్చితత్వం అసాధ్యం

చాట్‌ జీపీటీ ఒక పరిశీలన

చాట్‌ జీపీటీ వల్ల ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదంలేదు

ఇప్పుడు ప్రపంచం అంతా చాట్‌ జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్)పైనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. నేడు ఎంతో మంది చాట్ జీపీటీపైనే ఆధారపడుతున్నారు. ఏఐతో ఎన్నో అద్భు తాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ చాట్ బోట్ మనిషి చేసే చాలా పనులను చేస్తుంది. పలు కంపెనీలు ఏఐతో పనులు చేస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని,  దీని ఉపయోగం పెరిగేకొద్దీ అదే స్థాయిలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని అత్యధిక మంది భయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చాట్‌ జీపీటీ వల్ల ఆశించినంత ప్రయోజనంలేదని, ఈ ఓపెన్‌ ఏఐను స్థాపించిన సంస్థ (అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రీసెర్చ్ లేబరేటరీ) సంక్షోభంలో ఉందని, అది వచ్చే ఏడాదికి దివాళాతీస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ రెండు వాదనలు సరైనవి కావు.  ఏఐ వల్ల కొంత ప్రయోజనం ఉన్నమాట నిజమే. అయితే, దాని వల్ల ఉద్యోగాలు భారీ స్థాయిలో కోల్పోయే మాట వాస్తవం కాదు. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే, నష్టాలు కూడా ఉన్నాయి. 



చాట్‌ జీపీటీ అంటే రెండు ముక్కల్లో తెలుసుకుందాం. ఇది గూగుల్ కు ప్రత్యామ్నాయం, దానిని అభివృద్ధి పరిచినట్లుగా భావించవచ్చు. ఉదాహరణకు మనకు ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే,  దానికి సంబంధించి వివిధ వెబ్ సైట్లలో ఉండే సమాచారం చూపుతుంది. వాటిలో నుంచి మనకు కావలసిన సమాచారం తీసుకోవాలి. చాట్‌ జీపీటీలో అయితే, మనకు కావలసిన అంశానికి సంబంధించిన సమాచారం గుత్తగా ఒకేచోట లభిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ లేక అమరావతి అని ఎంటర్ చేస్తే, గూగుల్ లో వాటికి సంబంధించిన చాలా రకాల సమాచారం వస్తుంది. చాట్‌ జీపీటీలో అయితే,హైదరాబాద్ లేక అమరావతి సమాచారం ఒకేచోట లభిస్తుంది. ఆ సౌలభ్యం ఇందులో ఉంది. ఇందులో అపారమైన సమాచారం ఉంటుంది. టెక్స్ట్ రూపంలో ఏ ప్రశ్న అడిగినా టెక్స్ట్ రూపంలో  సమాధానం ఇస్తుంది. అయితే,   ఇందులో ఈ సమాచారం మ్యాజిక్ ద్వారా ఏమీ రాదు. దానిని ఉద్యోగులే సేకరించి, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. అయినా, ఆ సమాచారంలో చాలా లోపాలు ఉంటుంటాయి. ఆ లోపాలను ఉద్యోగులే సరిదిద్దాలి.  అందువల్ల కొన్నిచోట్ల ఉద్యోగాలు పోతే, మరికొన్నిచోట్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.  ఇందుకు సంబంధించి పరిశోధనా ఫలితాలను పరిశీలిద్ధాం. అకౌంటింగ్‌ పరీక్షలో చాట్‌ జీపీటీ కంటే విద్యార్థులే మెరుగైన ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల సరాసరి స్కోర్ 76.7 శాతం ఉండగా,  చాట్‌ జీపీటీ స్కోర్‌ 47.4 శాతం మాత్రమే ఉంది. అమెరికాలో బ్రింగ్‌హ్యామ్‌ యంగ్‌ యూనివర్సిటీ(బీవైయూ)తోపాటు మరో 186 ఇతర యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అకౌంటింగ్‌ పరీక్షల్లో చాట్‌జీపీటీ ఎలా పని చేస్తుందో విస్తృత స్థాయిలో పరిశీలించారు. వారు తెలుసుకున్న విషయాలను అకౌంటింగ్‌ ఎడ్యుకేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు. చాట్‌ జీపీటీ కంటే విద్యార్థులే తెలివైనవారని తేల్చారు. అయితే 11.3 శాతం ప్రశ్నల విషయంలో చాట్‌ జీపీటీ స్కోర్‌ మెరుగ్గా ఉందని తేలింది. అకౌంటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆడిటింగ్‌లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ట్యాక్స్‌, ఫైనాన్షియల్‌, మేనేజరియల్‌ అసెస్‌మెంట్‌లో  ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నాయి. మేథమెటికల్‌ ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురైనట్లు గమనించారు. 

చాట్‌ జీపీటీపై ఓ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిద్ధాం. మానవ మేధస్సును చాట్‌జీపీటీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ వ్యాఖ్యానించారు. చాట్‌జీపీటీ ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవన్నారు. తీర్పు ఇవ్వడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. ఇలాంటి చాట్‌బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉందన్నారు. అందువల్ల అవగాహన కోసం మాత్రం దీనిని ఉపయోగించుకోవచ్చని వివరించారు. చాట్ జీపీటీ డేటా ఊహాజనితమని,ఇందులో కచ్చితత్వం లేదని ఆయన అన్నారు. 

కాగా, చాట్‌ జీపీటీ వేదిక ఓపెన్‌ ఏఐ అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుందని అనలిటిక్స్ ఇండియా సర్వే పేర్కొంది.  2024 చివరికి ఆ కంపెనీ దివాలా తీయవచ్చని అనలిటిక్స్‌ ఇండియా మేగజైన్‌ తన నివేదికలో వెల్లడించింది.  ఈ  ఓపెన్‌ ఏఐ సంస్థను  సామ్‌ ఆల్ట్‌మన్‌ 2022 నవంబర్ లో స్థాపించారు. జీపీటీ -3.5, జీపీటీ-4 వాడుకొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ సంస్థ సరిపడా ఆదాయం సమకూర్చుకోలేకపోతోంది. ఇప్పట్లో  బ్రేక్‌ ఈవెన్‌ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఓపెన్‌ ఏఐని నడిపించేందుకు ప్రతి రోజూ 7 లక్షల డాలర్లు (రూ.5.8 కోట్లు) ఖర్చవుతోందని అంచనా. ఆ స్థాయిలో ఆదాయం మాత్రం రావడంలేదు.మొదట్లో దీనిని అత్యధికమంది ఉపయోగించేవారు. క్రమంగా వారి సంఖ్య తగ్గుతోంది. జూన్‌లో 170 కోట్ల మంది  చాట్‌ జీపీటీని ఉపయోగించుకోగా,  జులై నాటికి వారి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతం పడిపోయింది. దాంతో సంస్థ నష్టాల్లో ఉంది. అయితే, 2023 చివరికి  200 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్‌ ఏఐ అంచనా వేస్తోంది. 2024 నాటికి బిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరిస్తుందని పేర్కొంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు  ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా  చాట్ జీపీటీ-4 అప్ డేట్ వెర్షన్ ను తీసుకొచ్చింది. ఇది దాదాపు మనిషిలాగే పనిచేస్తుందని సంస్థ తెలిపింది.ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని ఓపెన్ ఏఐ తన బ్లాగ్‍లో పేర్కొంది. క్లిష్టమైన ప్రశ్నలు, సమస్యలకు కూడా కచ్చితమైన సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. భవిష్యత్ లో ఇమేజ్ ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా చాట్ జీపీటీ 4ను రూపొందించారు. ఉదాహరణకు ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) లోపలి భాగాన్ని ఫొటో తీసి జీపీటీ-4లో అప్ లోడ్ చేస్తే, అందులో ఉన్న పదార్థాలతో ఏయే వంటలు చేయొచ్చు. ఎన్నిరకాల వంటలు, ఎలా చేయొచ్చో వివరిస్తుంది. ఆ వివరాలన్నిటినీ ఉద్యోగులే అప్ లోడ్ చేస్తారు. అయితే, అన్ని సందర్భాలలో కచ్చితత్వం సాధ్యంకాదు. చివరకు ఉద్యోగులే దాని కచ్చితత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అందువల్ల చాట్‌ జీపీటీ అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆయా సంస్థలు ఉద్యోగాల సంఖ్యను భారీగా తగ్గించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


In Chat GPT..absolute accuracy is impossible

Sep 30, 2023

చేనేత సహకార సంఘాల ప్రక్షాళన అవసరం

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.   వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో,  అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో  దాదాపు 3 లక్షల మంది వరకు చేనేత రంగం ద్వారా  ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం,  ఆసు తోడటం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, దోనెలు, లాకలు, డిజైన్ డాబీలు,  రాట్నాలు, నాడెలు, కదుళ్లు, పన్నెలు, పన్నెల్లో ఉపయోగించే ఇత్తడి ఈనెలు వంటివాటిని తయారుచేయడంతోపాటు అత్యాధునిక డిజైన్స్ రూపకల్పన ద్వారా ఉపాధి పొందడం. ఇంతమంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగంపై ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ వహించడంలేదు. దాంతో చేనేత రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.  

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది వృత్తి కళాకారులు, కార్మికులు మాదిరిగానే  సహకార వ్యవస్థ ద్వారా చేనేత కార్మికులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. చేనేత సహకార సంఘాల ద్వారా వడ్డీ, సబ్సిడీలు వంటి అనేక రాయితీలు అందుకుంటున్నారు. అలాగే, ఈ సంఘాల ద్వారా చేనేత కార్మికులు ఉపాధితోపాటు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దానిని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో  దాదాపు 1282 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైగా చేనేత సహకార సంఘాలు బోగస్ వే ఉన్నాయి. అంటే ఈ సొసైటీలలో చేనేత కార్మికులు ఉండరు. మగ్గాలు ఉండవు. రికార్డులలో మాత్రం అన్నీ ఉన్నట్లు రాసి, నాబార్డ్ రుణాలు, ప్రభుత్వ  రాయితీలన్నీ కొందరు వ్యక్తులు స్వాహా చేస్తున్నారు. చేనేత సొసైటీల ప్రక్షాళనకు సహకార శాఖ ఓ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. సంఘాలన్నిటినీ తనిఖీ చేయాలి. జమా,ఖర్చులు, రుణాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలతోపాటు  మగ్గాలను కూడా పరిశీలించాలి.  చేనేత కార్మికులు ఉండారో లేదో గమనించాలి. ఆ క్రమంలో బోగస్ గా తేలినవాటిని రద్దు చేయాలి. సొసైటీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేవాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. నిజమైన చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించాలి. ఈ విధంగా చేనేత సహకార రంగంలో సంస్కరణలు చేస్తే నిజమైన చేనేత కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. వారు ఆర్థికంగా ఎదుగుతారు. 
  కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలలో  సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది.  అక్కడ చేనేత కార్మికులకు  పీఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. ఆ రకంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో  ఏపీలోని సహకార శాఖ వారు ముందు బోగస్ సొసైటీలను రద్దు చేయాలి. సహకార సంఘాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సంఘాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నిజమైన సొసైటీలను, నిజంగా పనిచేసే చేనేత కార్మికులను గుర్తించి, వారికి ఉపాధి కల్పించడంతోపాటు సహకార సంఘాల ద్వారా వచ్చే రాయితీలు నేరుగా వారికి అందే ఏర్పాటు చేయాలి. వ్యవసాయమైనా, చేనేత.. ఏ రంగమైనా మార్కెటింగ్ ముఖ్యం. దళారులులేని మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటే చేనేత కార్మికులకు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల విస్తృత స్థాయిలో సహకార సంఘాల నెట్ వర్క్ ఏర్పాటు చేసి, చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే చేనేత కార్మికుల కళానైపుణ్యానికి తగిన గుర్తింపుతోపాటు ఉపాధి మెరుగుపడి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914 



Aug 15, 2023

టీటీడీ పాలకమండలి నియామకంపై వివాదాలు

రాజకీయం

భూమన కరుణాకరరెడ్డి నియామకంపై వివాదం

వివాదాలకు నిలయంగా టీటీడీ పాలకమండలి నియామకాలు

ఆధ్యాత్మిక అంశాలకు తగ్గిపోతున్న ప్రధాన్యం

టీటీడీ నియామకాల్లో కులం, మతం, రాజకీయ వివాదాలు

శ్రీవారి అత్తింటివారికి అవకాశం ఇచ్చే ఆలోచన!


తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకాల విషయంలో ఒక దశాబ్దకాలంగా వివాదాలు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు తగిన నియమనిబంధనలు పాటించకపోవడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా  చైర్మన్, సభ్యులను నియమించడం వివాదాలకు దారి తీస్తున్నాయి. పాండిత్యం, నడవడిక, భక్తిభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందు వెనక ఆలోచనలేకుండా ఎవరినిబడితే వారిని నియమించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయ పాలనాబాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో  పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది.  1951లో చేసిన హిందూమత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చారు. టీటీడీ  ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి, దానికి అధ్యక్షుడిని నియమించారు. మొదట్లో హిందు ధర్మంపట్ల అచంచల విశ్వాసం కలిగిన భక్తులను మాత్రమే ఈ పాలక మండలిలో నియమించేవారు.  ప్రపంచంలోని ప్రతి హిందువు కులాలతో సంబంధంలేకుండా  ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యాత్మికంగా, ఆలోచన, నడవడిక పరంగా ఉత్తమోత్తములై ఉండాలని భక్తులు ఆశిస్తారు. అటువంటి కమిటీ నియామకంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటు జరిగినా  అది సమాజంపైనే కాకుండా ప్రభుత్వంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నియామకాలు కులాలు, రాజకీయ ప్రాతిపదికన జరిగినప్పటికీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.

 


హిందూ దేవాలయాలలో విశిష్టత కలిగిన దేవాలయంగా టీటీడీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల పదవికి విపరీతమైన పోటీ పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపార ప్రముఖుల దృష్టి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కమిటీలో స్థానం పొందాలని ఆశిస్తుంటారు. దాంతో కాలక్రమంలో ఇవి పూర్తీగా రాజకీయ నియామకాలుగా మారిపోయాయి. వివాదాలు చెలరేగిన సందర్భాలలో  భక్తుల ఆందోళనను దృష్టిలోపెట్టుకుని కొన్ని ప్రభుత్వాలు మార్పులు,చేర్పులు చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు భక్తుల ఆందోళనలను పరిగనణలోకి తీసుకోవడంలేదు. మరి కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు ఆయా పదవులను స్వీకరించడంలేదు. ఈ నియామకాల సందర్భంలో ఎక్కువగా ఆయా వ్యక్తులు క్రైస్తవ మతం పుచ్చుకున్నారని, క్రైస్తవ సభల్లో పాల్గొంటున్నారని, వారి వద్ద ఎప్పుడూ బైబిల్ ఉంటుందని, క్రైస్తవ మతాచారాలు పాటిస్తుంటారని, హిందూ దేవుళ్లపై నమ్మకంలేని వారని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఆ కమిటీ చైర్మన్ పదవి ఓ యాదవుడికి ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం చెప్పరు. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు. అందువల్ల యాదవులకు ఆ రకమైన గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ సుధాకర్‌ యాదవ్‌ ను ఆ పదవికి ఎంపిక చేసినప్పుడే అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొంటారని విమర్శలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవ మతస్థులని, భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తె వివాహం క్రైస్తవ మత పద్దతిలో చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. 

 వాస్తవానికి సుధాకర్‌ యాదవ్‌ క్రైస్తవ సభలలో పాల్గొనడం తప్పేమీకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజిక పరంగా అది మంచిపనే. అలాగే, భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తెను ఒక క్రైస్తవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారు వారి మత పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా తప్పుకాదు.మతాంతర వివాహం చేసినందుకు సామాజికంగా ఆయనను అభినందించాలి. కరుణాకరరెడ్డి పక్కా హిందువు. వారి అబ్బాయి వివాహం కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే చేశారు. కాకపోతే గతంలో, అంటే ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కమ్యునిస్టు, నాస్థికుడు. తర్వాత ఆయన భక్తుడిగా మారారు. ఇంతకు ముందు  2006 నుంచి 2008 వరకు ఆయన టీటీడీ చైర్మన్‌గా పని చేశారు. అప్పుడు కూడా భూమన కరుణాకర రెడ్డి నాస్తికుడని, ఆయన వెంకటేశ్వర స్వామిని నమ్మరని, ఆయనను దైవ సంబంధమైన  కమిటీలో ఎలా నియమిస్తారని విమర్శలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి తాను క్రైస్తవుడిని కాదని, హిందువునేనని చెప్పారు.  కమిటీ సభ్యురాలిగా గతంలో అప్పటి పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. అంతకు ముందు  స్వయంగా ఆమే తన కారులో, తన బ్యాగ్ లో  తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్ధించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటువంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటువంటివాటిని అంగీకరించరు. చివరకు 

అనిత  గౌరవంగా తనంతట తానే తప్పుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని తన నియామకాన్ని రద్దు చేయమని అప్పట్లో ఆమె కోరడం అభినందనీయం.  ఇటువంటి విమర్శలు, వివాదాల వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటుంటాయి. వాటిని కూడా మనం కాదనలేం. అయితే, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే టీటీడీ అనేది హిందూ మతవిశ్వాసాలు బలంగా నాటుకుపోయిన సంస్థ. దానికి చైర్మన్ గానీ, సభ్యులుగా గానీ ఉండేవారు హిందూమతానికి చెందిన పరమ భక్తులై ఉండాలి. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. సామాజిక అంశాలు, మత విశ్వాసాలు వేరు వేరు. ఏ మతమైనా  మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. అన్ని ప్రభుత్వాలు కూడా అలానే చేస్తున్నాయి. కానీ, అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తుతుంటాయి.  ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్‌ యాదవ్‌, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వంటి వ్యక్తులకు  ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇవ్వవచ్చు.  టీటీడీ చైర్మన్ గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం కూడా తీవ్రవివాదానికి, విమర్శలకు దారి తీసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం 52 మంది నియామకాలను నిలిపివేసింది. అలా చేయడం సంతోషకర విషయమే.   

టీటీడీ మత సంబంధ సంస్థ అయినందున అత్యంత భక్తిశ్రద్ధలతో  శ్రీవారి సేవలో తరించే కొన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది.  శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం దక్కడంలేదని పద్మశాలీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలీయులు  సిరికి పుట్టింటివారు, హరికి అత్తింటివారని,  శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మశాలీయుల అల్లుడని తామ్ర శాసన ఆధారాలతో నిరూపణ అయింది. స్వామివారి జీవిత భాగస్వామి పద్మావతిదేవి పద్మశాలీయుల ఆడపడుచుగా తిరుమల బ్రహ్మాత్సవాలలో వారికి ఆ గౌరవం దక్కుతోంది. అయితే, కమిటీలో సభ్యత్వం లేదన్నదే వారి  బాధ. పద్మావతీదేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి ఒకరికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కమిటీలో పద్మశాలి కులస్తులకు ప్రధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మంది ఆధారపడే  చేనేత రంగానికి సంబంధించిన కులాలను సంతృప్తిపరచినట్లు అవుతుందన్న భావన కూడా ఉంది.

 అలాగే, ఇతర కులాల పరంగా కూడా ఆలోచన చేస్తే స్వామివారి సేవ, ఇతర భక్తిపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే విశ్వబ్రాహ్మణ, యాదవ, నాయిబ్రాహ్మణ, బ్రాహ్మణ కులాల వారికి కూడా  ప్రతి కమిటీలో స్థానం కల్పించవలసిన అవసరం ఉంది. కమిటీ సభ్యులుగా  ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కూడా నియమిస్తే మంచిదని పలవురు అభిప్రాయపడుతున్నారు. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత అందరిపై ఉంది. వారిని ఆ విధంగా గౌరవించిన నాడు తమను తక్కువగా చూస్తున్నారన్న భావన వారిలో తొలగిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన సభ్యులను ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చిన ఇతర కులాల వారి నుంచి, వ్యాపార, పారిశ్రామికవేత్తల నుంచి   తీసుకోవచ్చు. అయితే, ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారి నడవడి, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో చైర్మన్ నియామకంలో వివాదాలు, విమర్శలకు  రాజకీయాలు, మతంతోపాటు  కులం కూడా ఒక కారణం. వరుసగా ఒకే సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వడం, అలాగే వారు ఇద్దరూ ముఖ్యమంత్రికి అతి సమీప బంధువులు అవడం విమర్శలకు అవకాశం ఇచ్చినట్లైంది. 

తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని, ఉద్యోగులలో కొందరు క్రైస్తవులు ఉన్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు.   ఈ నేపథ్యంలో వివాదాలకు దారితీసే వారిని నియమించడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇటువంటి చర్యలు వేల సంవత్సరాలుగా హిందువులలో జీర్ణించుకుపోయిన మనోభావాలను దెబ్బతీస్తాయి. మనది లౌకక రాజ్యమైనా ఇటువంటి నియామకాల్లో మతపరమైన ఆనవాయితీలను గౌరవించకతప్పదు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తిమీద సాములాంటివి.  మతపరమైన అంశాలతోపాటు అనేక సమాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించి అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు, పారిశ్రామికవేత్తలు  పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టనివారు కూడా ఇటువంటి సందర్భాలను తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరుగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

              - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Aug 6, 2023

ఆధునిక పోకడలను తట్టుకుని నిలుస్తున్న చేనేత వస్త్రాలు


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణ్ పేట్, గద్వాల్ వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దే కార్మికుల నైపుణ్యం వల్ల  ఆ రంగులలో నాణ్యత ఉంటుంది. ఆయా రంగుల వల్ల కూడా ఆయా ప్రాంతాల చేనేత వస్త్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో  


దాదాపు 14 శాతం తెలంగాణ వస్త్రాలే ఉంటాయి.  అంటే ఇక్కడి చేనేత వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన  తిరుమల తిరుపతిలోని పద్మావతి దేవికి సమర్పించారు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశారు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించారు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఈ చీరల పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 47 అంగుళాలు ఉంటాయి. ఆయనే దబ్బళం మొనలో దూరే 5.5 అడుగుల చీరలను కూడా తయారుచేసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. హరి నైపుణ్యాన్ని ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు.  హరి ఇప్పుడు ఓ కొత్త చీరను తయారు చేస్తున్నారు. అది రాజన్న సిరిసిల్ల ప్రత్యేకం. ఆ చీరపై  సిరిసిల్ల  కమాన్ తో పాటు రాట్నం వడికే మహిళ కూడా ఉంటుంది. ఈ చీరను జాతీయ చేనేత  దినోత్సవం రోజు  ప్రభుత్వానికి అందచేస్తానని హరి చెప్పారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ఏపీలోని ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

( ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా )

Aug 5, 2023

ఆధునిక వస్త్రాలకు దీటుగా.. చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో తెలుగు రాష్ట్రాలదే సింహ భాగం అంటే ఇక్కడి వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 

 అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో  చేనేత వర్గాల జనాభా దాదాపు 15 శాతం వరకు ఉంటుందని అంచనా. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914